సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

ఆ కోర్టు తీర్పు సాయి మహిమకు కైమోడ్పు


ఆ రోజుల్లో శిరిడీ గ్రామం పార్టీ తగాదాలతో అట్టుడికి పోతుండేది. ఒక వర్గం వారు తమ ప్రత్యర్థి వర్గానికి చెందిన ఆరుమంది వ్యక్తులపై ఒక మార్వాడీ మహిళను మానభంగం చెయ్యబోయారని కేసు బనాయించారు. ప్రత్యక్ష సాక్షులతో పకడ్బందీగా కేసు పెట్టబడటంతో, ఆ ఆరుగురిని అరెస్టు చేసి, 6 నెలల జైలు శిక్ష విధించారు. ఆ ఆరుమందిలో బాబా సేవకుడైన రఘు కూడా వున్నాడు. రెండవ వర్గానికి బాబాకు అత్యంత సన్నిహిత భక్తుడు తాత్యాకోతే పాటిల్ ఒక నాయకుడు. అతనికి సన్నిహితుడనే కారణంగా, అకారణంగా రఘు కూడా ఆ అబద్దపు కేసులో ఇరికించబడ్డాడు. రఘు తదితరులను విడిపించుకోవడానికి తాత్యా విశ్వప్రయత్నాలు చేసాడు. కానీ లాభం లేకపోయింది. అప్పీలు కోసం సాయిభక్తులు, దిగ్దంతురుల వంటి ప్రఖ్యాత న్యాయవాదులైన శ్రీ జి.యస్. ఖపర్డే, శ్రీహెచ్.యస్. దీక్షిత్ మొ||న వారిని, మేజిస్ట్రేటులుగా పనిచేసి ఉండిన శ్రీహెచ్.వి సాఠే వంటి ఉన్నతాధికారులను కలిసాడు. అప్పీలువల్ల ఏమీ లాభం లేదని పెదవి విరిచారు. జైలులో ఉన్న రఘు బాబాను తలుచుకొని పెద్దగా ఏడ్చాడు. అప్పుడతనికి అక్కడే స్పష్టంగా బాబా కనిపించి, “ఏడవకు! నిన్ను నేను విడుదల చేయిస్తాను” అన్నారు. దాంతో రఘు కొద్దిగా ఊరట చెందాడు.

ఆ మరుసటిరోజు తాత్యా సీనియర్ లాయర్లనందరినీ సంప్రదించి, అప్పీలు వల్ల ఫలితం లేదని తెలుసుకొని నిస్పృహతో శిరిడీ చేరి మౌనంగా ఆ కేసు కాగితాలు బాబా పాదాల వద్ద ఉంచి దిగులుగా కూర్చున్నాడు. బాబా అతనితో “ఈ కాగితాలు భావు దగ్గరికి తీసికెళ్లి ఇవ్వు!” అన్నారు. నాసిక్ లో  న్యాయవాదియైన శ్రీయస్.బి. ధూమల్ ను బాబా 'భావు' అనేవారు. తాత్యా ఆ కేసు పేపర్స్ తీసికొని వెంటనే నాసిక్ వెళ్ళి శ్రీ ధూమల్ ను కలిసాడు. శ్రీధూమల్ అప్పటికి అంత ప్రఖ్యాత న్యాయవాదికాదు. అతను కేసు పరిశీలించి, “కేసు చాలా బలమైంది. నాకంటే కూడా ఈ కేసును అహ్మద్ నగర్ లోనో, బొంబాయిలోనో ఉన్న ఎవరైనా పెద్ద లాయర్లకు అప్పగిస్తే మంచిది. అదీగాక అప్పీలు 'ఫైలు' చెయ్యాల్సిందికూడా నగర్ లోనే  కదా?” అన్నాడు. కానీ తాత్యా అది బాబా ఆదేశమని తాను ఇంకో లాయర్ దగ్గరకు పొయ్యే ప్రసక్తి లేదని చెప్పాడు. శ్రీధూమల్ కూడా అది బాబా ఆదేశం గనుక ఇక తన ఇష్టాయిష్టాలతో సంబంధం లేదని భావించి, నిర్ణయం బాబాదైనపుడు కేసు గెలిపించే బాధ్యత కూడా ఆయనదేనని తాను కేవలం నిమిత్త మాత్రుడని గ్రహించి. కేసు తీసికొన్నాడు. 

ఆ మరుసటి రోజు అప్పీలు తయారు చేసికొని శ్రీధూమల్ అహ్మద్ నగర్ వెళ్ళి, జిల్లా మేజిస్ట్రేటును కలిసాడు. ఆ జిల్లా మేజిస్ట్రేటు ఒక సీనియర్ ఆంగ్లేయ అధికారి. ఆయన కేసు గురించి విని, “కేసు బలంగా ఉంది. ఆరుగురు ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు! అన్నాడు. దానికి శ్రీధూమల్ “ఆరుగురేం ఖర్మ యువర్ ఆనర్, పార్టీ తగాదాలతో కొట్టుకు చస్తున్న శిరిడీ వంటి గ్రామంలో అరవైమంది ప్రత్యక్షసాక్షులు కూడా దొరుకుతారు!” అన్నాడు. “మీరు నిజంగా అలా అనుకుంటున్నారా?” అన్నాడు మేజిస్ట్రేట్. “అనుకోవడమా మిలార్డ్, అది నాకు ఖచ్చితంగా తెలుసు” అన్నాడు ధూమల్ దృఢంగా. ఆ మేజిస్ట్రేటుకు ఎందుకు అలా బుద్ది పుట్టిందో గానీ వెంటనే “అయితే, మీ అప్పిలెంట్లనందరినీ విడుదల చేస్తున్నాను!” అన్నాడు. ఆయన కేసు పేపర్లు తెప్పించి కూడా చూడలేదు. ఊరకే "ఆ అప్పీలు మెమొ ఇలా ఇచ్చి మీకు తెలిసిన నిజాలు చెప్పండి!” అన్నాడు. ధూమల్ చెప్పినవి వ్రాసుకొని, వెంటనే విడుదల ఉత్తర్వు వ్రాసి సంతకం చేసాడు. ఖచ్చితమైన నియమనిబంధనలకు పెట్టింది పేరయిన బ్రిటిష్ న్యాయవ్యవస్థలో ఒక సీనియర్ ఆంగ్లేయ అధికారి ఆ విధంగా ఉత్తర్వులు జారీ చేయడం అపూర్వమైన విషయం. 

దీనిలో బాబా మహిమ ఉన్నదని, ధూమల్ ప్రతిభేమీకాదని తెలుపడానికా అన్నట్లు ఆ మేజిస్ట్రేట్ విడుదల ఉత్తర్వులపై సంతకం చేసిన వెంటనే యథాలాపంగా అడిగిన మొదటి ప్రశ్న! “మీ సాయిబాబా హిందువా? ముస్లిమా? అని. దానికి శ్రీధూమల్, “ఆయన రెండూ కాదు. రెండింటికీ అతీతుడు!” అని జవాబిచ్చాడు. “ఆయనేమి చెప్తారు?” అని మళ్ళీ అడిగాడు మేజిస్ట్రేట్. “అది స్వయంగా తమరే తెలుసుకుంటే మంచిది, మిలార్డ్!” అన్నాడు ధూమల్. “మేము కలుసుకోవచ్చునా?” అని అడిగాడు మేజిస్ట్రేట్. “తప్పకుండా!” అన్నాడు ధూమల్. అయితే ఆ మేజిస్ట్రేటు బాబాను దర్శించనే లేదు. అది వేరే సంగతి.

ఎవరిదా తీర్పు మరింకెవరిదా నేర్పు?

శ్రీధూమల్ ఖైదీలను విడిపించుకొని, వారిని వెంట బెట్టుకొని శిరిడీ బయలుదేరాడు. శిరిడీలో కాకాసాహెబ్ దీక్షిత్ కుమార్తె అంత్యక్రియలకు వెళ్ళబోతున్న కొందరు భక్తులను బాబా పిలిచి, “కాసేపు ఆగి వెళ్లండి! మీకో చమత్కారం చూపిస్తాను!” అన్నారు. మరికొద్దిసేపటికి రఘు తదితరులను వెంటబెట్టుకొని శ్రీధూమల్ అక్కడికి వచ్చాడు.

అవతలి వారి వైపు వాదన వినకుండా, కనీసం కేసుకు సంబంధించిన వివరాల పత్రాలు కూడా పరిశీలించకుండా ఆంగ్లేయుడైన జిల్లా మేజిస్ట్రేటు ఉత్తర్వులు జారీ చేసిన వైనం తెలుసుకొని, అందరూ దిగ్బ్రాంతి  చెందారు.

సోర్సు : సాయిపథం వాల్యూం - 3 

4 comments:

  1. జయదేవ జయదేవ గురుదేవా దత్తా
    ఓ సాయి అవధూత జయదేవ జయదేవ
    🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏

    ReplyDelete
  2. Sai eeroju kudhirella cheyi thandri neve karunichali thandri Om Sai Ram

    ReplyDelete
  3. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo