సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 140వ భాగం...


ఈరోజు భాగంలో అనుభవం:
  • మా మనసెరిగిన బాబా - మమ్మల్ని అనుగ్రహవర్షంలో తడిపేశారు

భక్తుల మనసెరిగిన దైవం శ్రీసాయిబాబా. ఎలా చేస్తే తన భక్తులకు మేలు జరుగుతుందో, ఆనందం కలుగుతుందో ఆయనకు బాగా తెలుసు. అందుకు తగ్గట్టే ఆయన మనకన్నీ అనుగ్రహిస్తారు. అవన్నీ మనకు అర్థంకాక, ఇలా జరిగితే బాగుంటుంది, అలా జరిగితే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటాం. అనుకున్నట్లు జరగకపోతే దిగులుపడుతూ ఉంటాం. కానీ తగిన సమయం వచ్చినప్పుడు ఆయన అనుగ్రహం ఎంత గొప్పగా ఉంటుందో మనకు అర్థమవుతుంది. అందుకు నిదర్శనమైన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

నేను, చక్రి, సుమన్ ముగ్గురం సాయిస్నేహితులం. 2019, జనవరి నుండి నాకు, నా స్నేహితుడు చక్రికి శిరిడీ వెళ్లాలని చాలా ఆరాటంగా ఉండేది. అయితే అప్పటికి మేము(నేను, చక్రి, సుమన్) శిరిడీ వెళ్ళొచ్చి కేవలం మూడునెలలే అయింది. మళ్ళీ అంత తక్కువ వ్యవధిలో వెళ్తామంటే ఇంట్లో ఒప్పుకోరు. కాబట్టి  మేము బాబా పిలుపు కోసం మౌనంగా ఎదురుచూశాము. మార్చి నెల వచ్చాక ఒకరోజు నేను, "బాబా! శిరిడీ రావాలని మాకెంతో తపనగా ఉంది. మీ పిలుపు లేకుండా మేము రాలేము. సుమన్ కి ఇంకా ఉద్యోగం రాక ఖాళీగా ఉన్నాడు. తనకు ఉద్యోగం వస్తే మాతో కలిసి శిరిడీ వచ్చే అవకాశం తనకి అంతగా ఉండదు. కాబట్టి తనకి వీలున్న ఈ సమయంలోనే మేము శిరిడీ వచ్చేందుకు మీ అనుమతి ఇవ్వవచ్చు కదా! మీకు ఇష్టమైతే మీ అనుమతిని సుమన్ ద్వారా ఇవ్వండి బాబా!" అని అనుకున్నాను. సరిగ్గా అలా అనుకున్న నాలుగైదు రోజుల్లో ఏదో విషయంగా నేను ఫోన్ చేసి సుమన్ తో మాట్లాడాను. నేను ఫోన్ పెట్టేసిన వెంటనే తను మళ్ళీ ఫోన్ చేసి, "శిరిడి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? అమ్మా వాళ్ళు వెళ్దామని అంటున్నారు. ఈ విషయం చాలారోజుల నుండి మా ఇంట్లో అంటున్నారు. కానీ, మీకు వీలు కాదేమోనని ఆగాను.  వీలైతే పది, పదిహేను రోజుల్లో వెళ్దాం" అన్నాడు. ఆ మాటలు వింటూనే నా మనస్సు ఆనందంతో నిండిపోయింది. కానీ, "ఇంత తక్కువ సమయంలో అంటే కష్టమేమో! రిజర్వేషన్స్ ఉంటాయో లేదో" అన్నాను. అందుకతను, "సరే చూడు. గురువుగారికి ఇష్టమైతే వెళ్దాం" అన్నాడు. ఈ విషయం చక్రికి ఫోన్ చేసి చెప్పాను. తను కూడా సంతోషించాడు కానీ, "కొంచెం టైం ఇవ్వు, చెప్తాను" అన్నాడు. తరువాత నేను మాట్లాడుతూ, "నేను అనుకున్నట్లుగానే సుమన్ నోటినుండి బాబా పిలుపు వచ్చింది" అని అంటూనే, "అది నిజంగా బాబా పిలుపో, కాదో!" అని సందేహాన్ని వ్యక్తపరిచాను. మనుషులం కదా! బాబా అంత స్పష్టంగా అనుభవమిచ్చాక కూడా మనసు ఊగిసలాడుతుంటుంది. అయితే సర్వాంతర్యామి అయిన బాబా మనకు వచ్చిన సందేహాన్ని తీర్చకుండా ఉంటారా? ఒక చిన్న లీల చేశారు. మరుసటిరోజు ఉదయం హైదరాబాదులో ఉంటున్న నాకు తెలిసిన ఒక సాయిబంధువు, "సాయీ, శిరిడీ ఎప్పుడు వెళ్తున్నావు?" అని మెసేజ్ పెట్టారు. నేను శిరిడీ వెళ్ళొచ్చి ఇంకా ఆరు నెలలు కూడా కాలేదని, మళ్ళీ అంత త్వరగా వెళ్ళలేనని ఆవిడకి కూడా తెలుసు. అలాంటిది ఆవిడే అలా అడగడం నాకు ఆశ్చర్యంగా అనిపించింది. నేను, "ఎందుకు సాయి అలా అడిగారు?" అని అడిగాను. అందుకావిడ, "ఎందుకో తెలియదు సాయి, హఠాత్తుగా నాకలా అడగాలనిపించింది" అన్నారు. దానితో బాబా మమ్మల్ని శిరిడీకి పిలుస్తున్నారని పూర్తిగా నిర్ధారణ అయింది. 

ఇక మా శిరిడీ ప్రయాణం బాబా ప్రణాళిక అయినప్పుడు రిజర్వేషన్లు లేకుండా ఎలా ఉంటాయి? సరిగ్గా ఏప్రిల్ 6 నుండి 13 వరకు ఉన్న వారం రోజుల్లో రిజర్వేషన్లు అందుబాటులో ఉన్నాయి. నిజానికి ఇంతకుముందెప్పుడూ అంత తక్కువ వ్యవధిలో చూస్తే రిజర్వేషన్లు ఉండేవి కావు. ఒకవేళ హైదరాబాదు నుండి శిరిడీకి ఉన్నా, శ్రీకాకుళం నుండి హైదరాబాదుకు ఉండేవి కావు. అలాంటిది ఈసారి ఉన్నాయంటే అది బాబా అనుగ్రహమే. తరువాత మేమంతా ఏ తేదీలలో రిజర్వేషన్ చేసుకుందామని మాట్లాడుకుంటుండగా, “14, 15 శ్రీరామనవమి ఉంది కదా, ఆరోజు శిరిడీలో ఉంటే అక్కడ జరిగే ఉత్సవాలు కూడా చూడొచ్చు. కానీ రిజర్వేషన్ లేవ”ని కాస్త బాధపడ్డాము. (నిజానికి పండుగరోజుల్లో రద్దీ వలన ఎక్కువ దర్శనాలు చేసుకోలేమనే ఉద్దేశ్యంతో మేమెప్పుడూ అలాంటి సమయాలలో శిరిడీ వెళ్ళడానికి ఇష్టపడం. అలాంటిది ఎందుకో ఆ సమయంలో అలా అనిపించింది.) మా ఆలోచనలు ఏవైనా బాబా ప్రణాళిక అద్భుతమైనది. అది మాకు శిరిడీ నుండి వచ్చాక అనుభవమైంది. మేము ఏప్రిల్ 8 నుండి 11 వరకు శిరిడీలో ఉండేలా రిజర్వేషన్లు చేసుకున్నాము. కానీ ఒక సమస్య వచ్చిపడింది. అదేమిటంటే, సీనియర్ సిటిజన్ కోటా కింద సుమన్ వాళ్ళ పేరెంట్స్ కి రిజర్వేషన్లు చేసినప్పటికీ వాళ్ళకి మిడిల్ బెర్తులు వచ్చాయి. ట్రైనులో ఎవరినైనా రిక్వెస్ట్ చేసి బెర్తులు మార్చుకోవచ్చని అనుకున్నాము. కానీ ఎంత ప్రయత్నించినా సర్దుబాటు కాలేదు. ఆంటీ ఎలాగో మిడిల్ బెర్తులో సర్దుబాటు అయ్యారు. కానీ అసలు సమస్య, మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న అంకుల్ పైబెర్తుకి ఎక్కలేరు. ఏమి చేయాలో అర్థంకాక నేను బాధతో "ఇప్పుడెలా బాబా?" అని అనుకున్నాను. అప్పటికి సైడ్ లోయర్ బెర్తు ఒకటి ఖాళీగా ఉంటే ఎవరైనా వచ్చేవరకు అంకుల్‍‍ని అక్కడ పడుకోమన్నాము. తన బిడ్డల యోగక్షేమాలు చూసుకునే సాయి కృపవలన శిరిడీ చేరేవరకు ఆ బెర్త్ వాళ్ళెవరూ రాలేదు.

ఉదయం 11.30 గంటలకి శిరిడీ చేరుకుని ముందుగా ధూళి దర్శనం చేసుకున్నాం. తరువాత రూముకి వెళ్ళే దారిలో పెరుగు తీసుకుందామని మావాళ్లు చాలా షాపులలో అడిగారు. కానీ, ఏ షాపులోనూ పెరుగు దొరకలేదు. రూముకి వెళ్ళాక స్నానం చేసి నేను 'సాయిపథా'నికి వెళ్లి గురువుగారి దర్శనం చేసుకుని నమస్కరించుకున్నాను. కాసేపు అక్కడ గడిపి ద్వారకామాయికి వెళ్దామని బయలుదేరాను. రోడ్డు మీదకు వస్తూనే ఒక షాపు కనిపిస్తే, పెరుగు ఉందేమో అడగాలనిపించింది. ఆ షాపులో పెరుగు ఉండటంతో తీసుకుని ద్వారకామాయికి వెళ్తుంటే, "బాబా! మావాళ్ళు అన్ని షాపుల్లో అడిగితే దొరకని పెరుగు నేను అడిగిన ఒక్క షాపులో దొరకడం ఏమిటి? ఒట్టి చేతులతో కాకుండా పెరుగుతో నన్ను మీ వద్దకు రప్పించుకుంటున్నారా?" అని అనుకున్నాను. తరువాత, "ఈ మండువేసవిలో మిట్టమిధ్యాహ్నంవేళ బాబాకు ఈ పెరుగే సమర్పించుకుందాం, ఆయనకు చలవ చేస్తుంద"న్న చిన్న ఆలోచనకు నా మనసంతా ఆనందంతో నిండిపోయింది. ఆ ఆనందంతో ద్వారకామాయికి వెళ్లి బాబా దర్శనం చేసుకుని, పెరుగు సమర్పించుకున్నాను. ఎందుకో తెలియదు, చిన్న విషయమే అయినా పెరుగు బాబాకు అర్పించడం నాకు మహదానందంగా అనిపించింది.

తరువాత రూముకి వెళ్లి భోజనం చేశాక సుమన్, నేను 'ఇప్పటికే రోజులో సగభాగం గడిచిపోయింది, ఒక్క దర్శనమైనా చేసుకోలేద"ని అనుకుని ఇంక ఆలస్యం చేయక బాబా దర్శనానికి బయలుదేరాం. దర్శనానికి ఎంత సమయం పడుతుందో, ఏమో అనుకుంటూ ఇద్దరం వెళ్లి టోకెన్స్ తీసుకున్నాము. ఇక బాబా అనుగ్రహవర్షం మొదలైంది. క్యూ  కాంప్లెక్స్ అంతా ఖాళీగా ఉంది. నేరుగా వెళ్లి క్షణాల్లో బాబా ముందున్నాము. ఆనందస్వరూపుడైన సాయి మమ్మల్ని ఆనందంలో ముంచేశారు. 20 నిముషాలపాటు తృప్తిగా బాబా దర్శనం చేసుకుని బయటకు వచ్చాము. ఆ ఆనందంలో మళ్ళీ టోకెన్లు తీసుకుని మళ్ళీ దర్శనానికి వెళ్ళాం. అలా వెంటవెంటనే మూడుసార్లు బాబా దర్శనం చేసుకున్నాం. రూమ్ నుండి బయలుదేరేముందు ఇంకా ఒక్క దర్శనం కూడా చేసుకోలేదని మేము బాధపడితే, 'మీకెందుకు దిగులు? నేనున్నానుగా' అన్నట్లు కేవలం గంటా పది నిముషాల్లో మూడు దర్శనాలను అనుగ్రహించారు బాబా. బాబా మాపై కురిపించిన అనుగ్రహవర్షానికి పట్టలేని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయిపోయాము. సాయంత్రం ఆంటీకి, అంకుల్ కి సీనియర్ సిటిజన్ దర్శనానికి మార్గం చూపించాము. అప్పటినుండి వాళ్ళ మటుకు వాళ్ళు, మా మటుకు మేము దర్శనానికి వెళ్తుండేవాళ్ళం. ఆ సాయంత్రం ద్వారకామాయిలో సంధ్య ఆరతికి హాజరయ్యాము. 

తరువాత రాత్రి భోజనం చేసి కాకడ ఆరతి కోసం టోకెన్ కౌంటరుకి వెళ్ళాం. అక్కడ క్యూలో ఉన్నప్పుడు, "బాబా! ఇంతకుముందు వచ్చినప్పుడు కాకడ ఆరతి మిస్సయ్యాను, ఈసారైనా నన్ను అనుగ్రహించి ఆరతి సమయంలో మీకు దగ్గరగా ఉండే భాగ్యాన్ని కల్పించండి" అని పదేపదే బాబాను వేడుకున్నాను.  టోకెన్స్ వేశాక క్యూ కాంప్లెక్స్‌లోకి మమ్మల్ని పంపించారు. అక్కడే అందరూ పడుకున్నారు. నేను సుమారు 2 గంటలవరకు బాబా ధ్యాసలో గడిపి అప్పుడు పడుకున్నాను. ఉదయాన 4 గంటలకి సమాధిమందిరంలోకి మమ్మల్ని పంపించారు. నా భాగ్యమేమని చెప్పను? బాబా నా ప్రార్థన విన్నారు. బాబా నుండి కేవలం 10, 15 అడుగుల దూరంలో నిలుచునే అవకాశం నాకు లభించింది.  అప్పటినుండి కాకడ ఆరతి, మంగళస్నానం పూర్తయ్యేవరకు అంటే 5.10 వరకు గంటా పది నిమిషాల సమయం బాబా ఎదురుగా ఆయనను చూస్తూ ఉండటం మరచిపోలేని అనుభూతి. "చాలా చాలా ధన్యవాదాలు. శతకోటి ప్రణామాలు బాబా!" అలా మొదటిరోజు మొదలైన బాబా అనుగ్రహవర్షం రెండవరోజు కాకడ ఆరతితో మొదలై ఆ రోజంతా  కొనసాగింది.  ఆరోజు చాలాసార్లు బాబా దర్శనానికి వెళ్ళాము.

ఆరోజు రాత్రి నేను ఒక్కడినే శేజ్ ఆరతికని వెళ్ళాను. అప్పుడు నాకెందుకో ముందుగా ఒకసారి దర్శనం చేసుకుని తరువాత మళ్ళీ వెళ్లి ఆరతి క్యూలో నిలుచుందామని అనిపించింది. అయితే అప్పటికే సమయం సుమారు పది గంటలైంది. క్యూ కాంప్లెక్సులో చూస్తే ఆరతి కోసం కొంతమంది వేరుగా క్యూ కట్టి ఉన్నారు. వాళ్ళని చూశాక, 'నేను దర్శనానికి వెళ్లి వచ్చేసరికి ఈ క్యూ పెరిగిపోతుందేమో!' అని అనిపించింది. కానీ, 'బాబా చూసుకుంటారులే! ఆరతి సమయంలో నాకెక్కడ స్థానం ఇవ్వాలో ఆయనకు తెలుసు' అని అనుకుని దర్శనానికి వెళ్ళాను. పది నిమిషాల్లో దర్శనం చేసుకుని మళ్ళీ క్యూలోకి వెళ్ళాను. అప్పటికి ఆరతి క్యూ మరి కొంచెం పెరిగింది. వెళ్లి వెనుక నిల్చున్నాను. తరువాత లోపలికి పంపించాక హాలులో తమకి ఎదురుగా ముందువరుసలో నాకు చోటు దక్కేలా అనుగ్రహించారు బాబా. ఆయన నాపై కురిపిస్తున్న ప్రేమకు ఆనందంతో పరవశించిపోయాను. 

మూడవరోజు కూడా బాబా అనుగ్రహవర్షం ద్వారకామాయిలోని కాకడ ఆరతితో మొదలైంది. ఆరోజు కూడా చాలాసార్లు బాబా దర్శనం చేసుకున్నాం. ఆరోజు ఉదయం 6 గంటలకి రావాల్సిన మా స్నేహితుడు చక్రి ట్రైన్ ఆలస్యమై మధ్యాహ్నం 12 తరువాత వచ్చాడు. నేను మనసులో, "బాబా! మేమెప్పుడూ శిరిడీలో మూడురోజులున్నా తృప్తిపడలేము. అలాంటిది చక్రి ఇంత ఆలస్యంగా వచ్చాడు. రేపు మళ్ళీ మేము వెళ్ళిపోవాలి. కాబట్టి తనకి చక్కటి దర్శనాన్ని అనుగ్రహించి తన మనసును తృప్తిపరచండి" అని బాబాకు చెప్పుకున్నాను. బాబా ఎంతటి ప్రేమమూర్తి! మొదటి దర్శనంతోనే చక్రిని చాలావరకు తృప్తిపరిచారు. వెంటనే మరో దర్శనానికి కూడా వెళ్ళాము. దానితో తను "ఆలస్యమైపోయింది, చాలా తక్కువ సమయం బాబా నాకిచ్చారు అని బాధపడ్డాను. కానీ బాబా మొదటి రెండు దర్శనాలే చాలా అద్భుతంగా ఇచ్చారు. ఇది చాలు" అన్నాడు. నేను మనసులోనే బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఆరోజు సంధ్య ఆరతికి, శేజారతికి సమాధిమందిరంలో ఉండే అవకాశం లభించింది. చివరిరోజు గురువారం రద్దీ పెరగడంతో రెండుసార్లు మాత్రమే దర్శనానికి వెళ్ళాము. 

మొత్తం మూడున్నర రోజుల్లో బాబా అనుగ్రహవర్షం మాపై కుండపోతగా కురిసి ఆయన అనుగ్రహధారలలో తడిసి ముద్దయ్యాము. ముఖ్యంగా మేము వెళ్లిన ప్రతిసారీ బాబా కృపవలన జనం తక్కువగా ఉండటంతో ఎక్కువసార్లు దర్శనం చేసుకునే అవకాశం లభించింది. దర్శనాలేకాక దాదాపు అన్ని ఆరతులకు హాజరయ్యాము. సమాధిమందిరం, ద్వారకామాయి, చావడి ఇలా ఎక్కడ వీలయితే అక్కడ ఆరతులకు హాజరయ్యాము. అలా ఎక్కువ సమయం మందిర ప్రాంగణంలోనే గడిచింది.

హైదరాబాద్ వచ్చాక మాటల సందర్భంలో, 'ఎన్నిసార్లు దర్శనానికి వెళ్ళాం' అని లెక్కించుకుంటే, మేము ఆశ్చర్యపోయాం. మొత్తం మూడున్నర రోజుల్లో 22 దర్శనాలు చేసుకున్నాము. ప్రతి దర్శనం 15-20 నిమిషాలకు తగ్గలేదు. కొన్నిసార్లైతే 30నిమిషాలు పైనే. ఇంతకుముందు 5, 6 రోజులు శిరిడీలో ఉన్నప్పుడు కూడా  నాకు అన్ని దర్శనాలు కాలేదు. అప్పటికి అత్యధికంగా 16 సార్లు దర్శించుకున్నాను. అదే మేము శ్రీరామనవమి రోజు శిరిడీలో ఉండివుంటే అన్ని దర్శనాలు కాకపోయేవి. ఆయన దర్శనాలతోనే మా మనసుకెంతో తృప్తి అని బాబాకు తెలుసు. అందుకే మా మనసెరిగిన బాబా మాకు సంతృప్తి కలిగే విధంగా మా ప్రయాణాన్ని మలచి, అన్ని దర్శనాలతో మమ్మల్ని అనుగ్రహవర్షంలో తడిపేశారు. మరో ముఖ్య విషయం - ఆంటీకి, అంకుల్ కి కొన్ని అనారోగ్య  సమస్యలున్నాయి. ఆ కారణంగా 'శిరిడీలో ఆహారం సమస్య అవుతుందేమో' అని మా ప్రయాణానికి ముందు అనుకున్నాం. కానీ బాబా మాకు ఎటువంటి ఇబ్బందీ రానివ్వలేదు. శిరిడీ చేరుకున్న తొలిరోజే చక్కని భోజనం దొరికే చోటు చూపించి, తిరిగి ఇల్లు చేరుకునేవరకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా బాబా చూసుకున్నారు. ఆయన సన్నిధిలో ఎవరికీ కష్టం ఉండదు. తల్లి ఒడిలో ఏ బిడ్డకైనా కష్టం ఉంటుందా? "థాంక్యూ సో మచ్ బాబా! అద్భుతమైన శిరిడీ యాత్రను అనుగ్రహించారు". అందరికీ సాయి ఆశీస్సులు సదా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. 

No comments:

Post a Comment

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo