ఈ భాగంలో అనుభవాలు:
1. సాయితండ్రి దయ
2. 'నేను నీతో ఉన్నాను కాబట్టి, అంతా సవ్యంగానే ఉంటుంది'
సాయితండ్రి దయ
ఓం శ్రీ సాయినాథాయ నమః. నేను ఒక సాయి భక్తురాలిని. సాయిబాబా దయవలన మా బాబు సీఏ పూర్తి చేశాడు. తర్వాత తనకి మంచి ఉద్యోగం ఇవ్వమని నేను ప్రతిరోజూ సాయినాథుని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. బాబు మొదటిసారి తన స్నేహితులతో కలిసి ఇంటర్వ్యూ కోసం చెన్నై వెళ్లొచ్చాడు. ఆ తర్వాత ఆన్లైన్ ఇంటర్వ్యూలకి అటెండ్ అవుతుండేవాడు. సాయితండ్రి దయవలన తను ఇంటర్వ్యూలో అన్ని ప్రశ్నలకి సమాధానం చేయగలుగుతుండేవాడు. ఒక కంపెనీవాళ్ళు తనని సెలక్ట్ చేసామన్నారు. కానీ అది చిన్న కంపెనీ కావడంతో పెద్ద కంపెనీలు ఇచ్చే జీతం ఇస్తామన్నప్పటికీ ఆ కంపెనీలో పనిచేయడం వలన అభివృద్ధి అంతగా ఉండదని బాబు అన్నాడు. నేను తనతో, "ఆ కంపెనీలో జాయిన్ అవ్వద్దు. సాయిబాబా నీకు ఖచ్చితంగా మంచి ఉద్యోగం ఇస్తారు" అని అన్నాను. కానీ కోరుకున్న ఉద్యోగం రాక, చేతివరకు వచ్చి చేజారిపోతుండటం వల్ల తనెప్పుడూ నిరాశపడుతూ ఉండేవాడు. తను అలా నిరుత్సాహంగా ఉన్నప్పుడల్లా నేను తనతో అలాగే అనేదాన్ని. నేను ఎప్పుడు బాబాని బాబు ఉద్యోగ విషయంగా అడిగినా ఆయన నుండి సానుకూల సమాధానాలు వస్తుండేవి. నేను బాబుకి ఉద్యోగమొస్తే మొదటి నెల జీతం సాయినాథుని సమర్పించుకుంటానని అనుకున్నాను(అది బాబా పెట్టిన భిక్షే కదా! ఒక నెల జీతం ఆయనకి ఇవ్వడం గొప్పేమీ కాదు). తర్వాత ఒకరోజు బాబుకి 'ఒకతను నాకు పెద్ద మామిడి పళ్ళు ఇచ్చినట్లు, నేను వాటిని సాయితండ్రి కూర్చుని ఉన్నట్టు ఉన్న ఒక సంచిలో పెట్టినట్లు' కల వచ్చింది. మరుసటిరోజు బాబు నాకు ఆ కల గురించి చెపితే, నాకు చాలా సంతోషమేసింది. ఎందుకంటే, నేను మొదట నెల జీతం బాబాకు ఇస్తాననుకున్నాను కదా! అందుకే ఆయన ఉన్న సంచిలో పెట్టినట్లుగా కల వచ్చిందని నాకనిపించి బాబుతో, "సాయితండ్రి నీకు మంచి ఉద్యోగం ఉంచాడు. కాకపోతే సమయం రావాలి. అందుకే కొంచెం ఆలస్యం అవుతుంద"ని సాయిబాబాపై పూర్తి విశ్వాసంతో అనేదాన్ని. అదే నిజమై ఇప్పుడు మా బాబుకి పెద్ద కంపెనీలో ఉద్యోగం వచ్చింది. మొదట ఆ పెద్ద కంపెనీవాళ్ళు ఇంటర్వ్యూ చేసినప్పుడు అన్ని రౌండ్లలోనూ మా బాబుని సెలెక్ట్ చేసి, రెండు రోజుల్లో జాయిన్ అవ్వండి అని చెప్తే మేము చాలా సంతోషించాము. కానీ తర్వాత వాళ్ళు, 'ఇంకొంతమందిని ఇంటర్వ్యూ చేసి ఏ విషయమూ చెప్తామ'ని మెసేజ్ చేసారు. దాంతో మా బాబు చాలా అంటే చాలా కలత చెంది, "అమ్మా! ఎలా జరిగింది ఏంటమ్మా? నోటి వరకు పెట్టి ఇలా వెనక్కి లాగేసారేంటి?" అని చాలా బాధపడ్డాడు. నేను ఒకటే అన్నాను, "మనకు సాయిబాబా ఉన్నారు. అది నీకు సరైనది కాదేమో! అందుకే అలా చేయించారు. అది నీకు సరైనధైతే వాళ్లచేత రమ్మని చెప్పిస్తారు. ఇంకా కొంతమందిని ఇంటర్వ్యూ చేశాక చెబుతామన్నారంటే, నీ టాలెంట్ ఏమిటో వాళ్లకి తెలియజేయడానికి(అది కూడా బాబా పెట్టిన బిక్షే!) అయ్యుంటుంది. నువ్వేమీ టెన్షన్ పడకు. బాబా ఉన్నారు. ఖచ్చితంగా మంచే చేస్తారు. కొంత ఆలస్యం అయితే అవుతుంది కానీ, అది 'వీళ్ళు ఎంతవరకు నాపై విశ్వాసంతో ఉంటారో' అని మనల్ని పరీక్షించడానికే. అంతేగాని అన్యాయమైతేమటుకు జరగదు" అని ధైర్యం చెప్పాను. వారం తర్వాత కంపెనీనుండి 'ఫైనల్ ఇంటర్వ్యూ చేస్తామ'ని మెసేజ్ వచ్చింది. కానీ వాళ్ళు మొదట అలా చేసినందుకు మా బాబుకి ఆసక్తి పోయింది. నేను, మా పాప "మనమేమీ అడగలేదు. వాళ్లే మెసేజ్ పెట్టారు. నువ్వు ఇంటర్వ్యూకి హాజరవ్వు. అందులో సెలెక్ట్ అయినా నీకు ఇష్టమైతేనే జాయిన్ అవుదువు గాని" అని చెప్పాము. బాబు అలాగేనని ఇంటర్వ్యూకి వెళ్ళాడు. అందులో వాడు సెలెక్ట్ అయ్యాడు. కంపెనీవాళ్ళు మంచిగా మాట్లాడేసరికి బాబు ఆ కంపెనీలో జాయిన్ అయ్యాడు. సాయితండ్రి దయవల్ల అంతా బాగానే ఉంది. శిరిడీ వెళ్లి సాయితండ్రిని దర్శించుకుని మొదటి నెల జీతం సాయిబాబాకు సమర్పించాలని ఎదురుచూస్తున్నాను. "మీకు ఎన్ని కోట్ల ధన్యవాదాలు చెప్పినా తక్కువే తండ్రి. నువ్వు అండగా ఉండబట్టే ఈరోజు ఇలా ఉన్నాం. చల్లగా చూడు తండ్రి. పాప, బాబు ఉద్యోగ విషయంలో ఇంకొక కోరిక కోరాను కదా తండ్రీ. అది నెరవేటట్లు చేయండి తండ్రి".
సాయినాథ్ మహారాజ్ కీ జై.
'నేను నీతో ఉన్నాను కాబట్టి, అంతా సవ్యంగానే ఉంటుంది'
నా పేరు మాధవి. మేము యూఎస్ఏలో ఉంటాము. మా అమ్మానాన్న ఇండియాలో ఉంటారు. మా నాన్నకి 59 ఏళ్ల వయసు. ఆయనకి బీపీ, షుగర్ ఉన్నాయి. ఒకరోజు హఠాత్తుగా ఆయనకి కళ్ళు తిరిగాయి. అనుమానమొచ్చి బీపీ చెక్ చేసుకుంటే 160 ఉంది. ఆ విషయం చెప్పగానే నాకు చాలా భయమేసింది. మందులు వాడుతున్నప్పటికీ బీపీ అంత ఎక్కువ ఎందుకు చూపించిందో నాకు అర్థం కాలేదు. నాకు బాధ వచ్చినా, సంతోషమొచ్చినా అన్నీ బాబాతో చెప్పుకోవడం అలవాటు. ఆ అలవాటు ప్రకారం నాన్న బీపీ విషయం బాబాతో చెప్పుకొని, ఆయన తమ సందేశం ద్వారా అభయం ఇస్తారేమోననని ఫేస్బుక్ చూస్తుంటే, ఒక మెసేజ్ కనిపించింది. దానిలో ఏమి వ్రాసుందంటే, "దీన్ని చదువుతుంటే గనక నా వాగ్దానాన్ని గుర్తుపెట్టుకో! నేను నీతో ఉన్నాను కాబట్టి, అంతా సవ్యంగానే ఉంటుంది" అని. అలా ఆ మెసేజ్ చూడగానే, 'బాబా నాకే చెప్తున్నార'ని అనిపించి వెంటనే నా మనసులో బాబాకి ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఇంకా నాకు టెన్షన్ అనిపించలేదు. "రేపటికి నాన్న బీపీ నార్మల్ అవ్వాలి బాబా" అని బాబాని వేడుకొని పడుకున్నాను. అంతే! మరుసటిరోజు నాన్న బీపీ నార్మల్ అయింది. అంతా బాబా దయ. "ధన్యవాదాలు బాబా. అమ్మానాన్న ఎప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి తండ్రీ. ఒక్కోసారి ఆలోచిస్తే భయంగా ఉంటుంది. పరిస్థితులన్నీ మీకు తెలుసు. అన్నీ సెట్ అయ్యేలా చూడండి తండ్రీ".
సాయి స్మరణం - శంకట హరణం.
