ఈ భాగంలో అనుభవాలు:
1. ఊదీ పరమ ఔషధం
2. అమెరికా విజిటర్ వీసాలు ప్రసాదించిన బాబా
ఊదీ పరమ ఔషధం
సాయిబంధువులకు నా నమస్కారాలు. నా పేరు రమాదేవి. ఒకరోజు నా ఫోన్ కింద పడి డిస్ప్లే పాడైపోయింది. షాపులో చూపిస్తే, "ఒరిజినల్ డిస్ప్లే అందుబాటులో లేదు. తెప్పించడానికి 3 రోజులు పడుతుంది" అన్నారు. నాకు ఫోన్ అవసరం ఉండటం వలన, "త్వరగా కావాలి" అని చెప్తే, "అందుబాటులో ఉన్న స్క్రీన్ వేస్తాము కానీ, ఎన్ని రోజులు పని చేస్తుందో తెలియదు" అని చెప్పారు. సరేనని, మావారు వాళ్ళ దగ్గరున్న స్క్రీన్ వేయించారు. సరిగ్గా నెల రోజులయ్యేసరికి 2026, నవంబర్ 12న ఫోన్ పని చేయడం మానేసింది. ఫోన్లో ఒక్క ఆప్షన్ కూడా పని చేయలేదు. చివరికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడానికి కూడా రాలేదు. ఇంకా అప్పుడు వేరే వాళ్ళ ఫోన్ తీసుకొని మావారికి ఫోన్ చేస్తే, "సాయంత్రం కొత్త మొబైల్ తీసుకో" అన్నారు. నాకు బాధగా అనిపించి, 'ఫోన్ కొని 2 సంవత్సరాలు కూడా కాలేదు. మళ్ళీ కొత్త ఫోన్ అంటే ఎలా బాబా?' అనుకున్నాను. తర్వాత ఆన్లైన్లో చెక్ చేస్తే, కొత్త మొబైల్ 25,000 రూపాయలకు పైన ఉంది. అప్పుడు, "ఈ ఫోన్ కొంతకాలం పని చేస్తే బాగుంటుంది బాబా" అని బాబాకి చెప్పుకొని ఊదీ ఫోన్‌కి పెట్టాను. తర్వాత చాలాసేపు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడానికి ప్రయత్నించాను కానీ, ఆఫ్ అవలేదు. ఇంకా వదిలేసి నా పనిలో పడ్డాను. సరిగ్గా 3 గంటల తర్వాత మరోసారి గట్టిగా నొక్కితే, ఫోన్ స్విచ్ ఆఫ్ అయి, ఆన్ అయి మామూలుగా పని చేసింది. నాకు చాలా సంతోషంగా అనిపించింది. అంత బాబా ఊదీ మహిమ. "చాలా కృతజ్ఞతలు బాబా".
అలాంటి అనుభవం నా కారు విషయంలో కూడా జరిగింది. నా కారు కొని 3 సంవత్సరాలయ్యాక 2026, అక్టోబర్ నెల మొదట్లో ఒకరోజు కారు స్టార్ట్ చేసినప్పుడు డాష్ బోర్డు మీద ఏదో వార్నింగ్ సింబల్ రాసాగింది. దాని గురించి నెట్లో చెక్ చేస్తే, 'ఇంజన్ ప్రాబ్లం అయుంటుంది. తొందరగా సర్వీస్ సెంటర్లో చూపెట్టాలి' అని తెలిసింది. వెంటనే సర్వీస్ సెంటర్లో చూపెడితే, చెక్ చేసి. "అంత బాగానే ఉంది. ప్రాబ్లం ఏంటో తెలియడం లేదు. ఇంకోసారి ఇలాంటి వార్నింగ్ సింబల్ కనిపిస్తే, వెంటనే గ్యారేజ్‌కి తీసుకొచ్చి రెండు, మూడు రోజులు ఉంచితే, మొత్తం చెక్ చేస్తాం" అని చెప్పారు పైగా, "శని, ఆదివారాలు కుదరదు, సోమవారం నుండి శుక్రవారం వరకు మాత్రమే చెక్ చేస్తాం" అని చెప్పారు. అయితే ఆఫీసు ఉండే రోజుల్లో ఆఫీ సుకి వెళ్ళడానికి నాకు కారు అవసరం. కారు లేకపోతే నాకస్సలు కుదరదు. వరుసగా మూడు రోజులు సెలవులు దొరకడం కూడా కష్టం. అందువల్ల నేను బాబాకి నమస్కరించి, "బాబా నా పరిస్థితి మీకు తెలుసు. ఇంకా అంత నువ్వే చూసుకో" అని చెప్పుకొని కారు తీసుకొచ్చి డాష్ బోర్డుకి ఊదీ పెట్టి ఊరుకున్నాను. బాబా దయతో నెల రోజులైనా ఏ ప్రాబ్లం లేకుండా కారు బాగానే నడుస్తుంది. ఊదీ పరమ ఔషధం.
"థాంక్స్ బాబా".
అమెరికా విజిటర్ వీసాలు ప్రసాదించిన బాబా
నా పేరు వెంకట్ దుగ్గినేని. నేను అమెరికాలో ఉంటాను. నేను నా తల్లిదండ్రుల కోసం హైదరాబాద్‌లో వీసా అపాయింట్మెంట్లు బుక్ చేశాను. అయితే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, హైదరాబాద్‌లో వాళ్ళకి తెలిసినవారు కూడా ఎవరూ లేరు. అందువల్ల వాళ్ళు అక్కడ ఎక్కడ ఉంటారు? వీసా ఇంటర్వ్యూకి వాళ్ళని ఎవరు తీసుకెళ్తారనే ఆందోళన నన్ను వెంటాడింది. ఆ సమయంలో బాబాను మనస్ఫూర్తిగా, "బాబా! నా తల్లిదండ్రులకు సహాయం చేయండి. హైదరాబాద్‌లో వాళ్ళు ఉండటానికి ఒక మంచి ఆశ్రయం కల్పించండి. వాళ్ళని వీసా ఇంటర్వ్యూకి తీసుకెళ్లడానికి ఎవరినైనా చూపించండి" అని వేడుకున్నాను. బాబా నా ప్రార్థన విన్నారు. మా వదినవాళ్ళ బంధువుల రూపంలో సహాయం అందింది. వాళ్ళు నా తల్లిదండ్రులను ఎంతో ఆప్యాయంగా తమ ఇంట్లో ఉంచుకోవడమే కాకుండా, స్వయంగా వీసా ఇంటర్వ్యూకి కూడా తీసుకెళ్లారు. ఇకపోతే, ఈమధ్య కొంతమంది తల్లిదం డ్రుల వీసాలు తిరస్కరణకు గురవుతున్నాయని నాకు తెలిసి నా తల్లిదండ్రుల వీసాలు కూడా తిరస్కరణకు గురవుతాయేమోనని నేను చాలా భయపడ్డాను. ఇంగ్లీష్ రాకపోవడం వల్ల వాళ్ళు ఇంటర్వ్యూలో ఎలా సమాధానాలు చెబుతారో అని మరింత ఆందోళనచెందాను. కానీ బాబా మరోసారి తన కృపను చూపించారు. ఇంటర్వ్యూ సమయంలో తెలుగు అనువాదకులు వచ్చి వాళ్లకి సహాయం చేశారు. నా తల్లిదండ్రులు తమకు తెలిసిన భాషలో సమాధానాలు చెప్పారు. చివరికి వాళ్ళ అమెరికా విజిటర్ వీసాలు ఆమోదం పొందాయి. నేను బాబాను ఏవిధంగా సహాయం చేయమని ప్రార్థించానో, ఆయన అదే విధంగా సరైన సమయంలో సరైన వ్యక్తులను మా తల్లిదండ్రులకు తోడుగా పంపి సమస్యను పరిష్కరించారు. "బాబా! నా తల్లిదండ్రులకు ఆశ్రయం కల్పించి, ఇంటర్వ్యూకి తోడుగా నిలిచిన వ్యక్తులను చూపించినందుకు,
వీసాలు ఆమోదం పొందేలా చేసినందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ దయ, కరుణ ఎల్లప్పుడూ మా కుటుంబంపై ఉండాలని కోరుకుంటున్నాను.
సర్వం శ్రీసాయినాథార్పణమస్తు

