సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

గణేష్ పాండురంగ్ వేంద్రే



శ్రీసాయిబాబా సశరీరులుగా ఉండగా వారిని అనేకసార్లు దర్శించిన భక్తుడు గణేష్ పాండురంగ వేంద్రే. అంధేరి నివాసి శ్రీరామచంద్ర సీతారాం దేవ్ ప్రేరణ వలన ఇతని మనసులో శ్రీసమర్థ సాయిబాబా దర్శనం చేసుకోవాలనే కోరిక కలిగింది. దాంతో అతను 1911లో మొదటిసారి శిరిడీ వెళ్లి బాబాను దర్శించాడు. అప్పుడు అతను బాబాను, “మీ దర్శనం నాకు ఎల్లప్పుడూ లభించాల”ని కోరుకున్నాడు. బాబా, "వెళ్ళు, నీ మనస్సుకు నచ్చినట్లే జరుగుతుంది" అని అన్నారు. ఆ విధంగానే జరిగింది. బాబా సశరీరులుగా ఉండగా అతను సంవత్సరానికి మూడుసార్లు శిరిడీ వెళ్లి, వారిని దర్శించుకుంటూ ఉండేవాడు. బాబా అతనికి అనేక రకాల అనుభవాలను ప్రసాదించారు, కలలలో కూడా దర్శనమిస్తూ ఉండేవారు. ఆ స్వప్న అనుభవాలను అతను అందరికీ చెప్తూ ఉండేవాడు. ఒక రోజు అతను మసీదులో కూర్చుని ఉన్నప్పుడు, బాబా అతన్ని దగ్గరకు పిలిచి, "అనవసరంగా ఎవరు పడితే వాళ్ల దగ్గర ఎందుకు వాగుతూ ఉంటావు? అలా వాగకూడదు” అని అన్నారు. అప్పుడు అతను, ‘కలలలోని విషయాలను నేను ఎవరితో పడితే వాళ్లతో చెప్తున్నందువల్లే బాబా ఉద్దేశపూర్వకంగా ఈ విధంగా నాతో చెప్పారని’ గ్రహించి అప్పటినుండి తన అనుభవాలను ఎవరికీ చెప్పేవాడు కాదు, మాస పత్రికలలో ప్రచురించడానికి కూడా ఇవ్వలేదు. ఇలా ఉండగా 1925వ సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాల సమయంలో అతను శిరిడీ వెళ్ళాడు. మసీదులో దర్శనానంతరం అతను, దేవ్ తదితర భక్తులు కూర్చుని ఉండగా శ్రీఅణ్ణాసాహెబ్ దాభోల్కర్ దర్శనం కోసం వచ్చారు. అతను దర్శనం చేసుకున్న తర్వాత వేంద్రే, దేవ్‌లను చూసి, "మీరు బాబా అనుభవాలను ఇస్తామన్నారు కదా, అవి ఇంకా మీ నుండి రాలేదు" అని అన్నారు. అప్పుడు వేంద్రే మనసుకి, ‘బాబానే నన్ను అనుభవాల గురించి అడిగేలా అతన్ని ప్రేరేపించారని’ నమ్మకం కలగడం వల్ల, ఈ అనుభవాలను అప్పట్లో సాయిలీల పత్రికకు సంపాడుకుడుగా ఉన్న దబోల్కర్‌కి పంపించాడు. 


ఒకసారి వేంద్రేకి బాబా పాదుకలకు నిత్యం పూజ చేసుకోవాలనిపించింది. అందుచేత అతను వెండి పాదుకలు చేయించి, వాటిని తీసుకొని శిరిడీ వెళ్లాడు. సాయిబాబా చేతుల మీదుగా ఆ పాదకులు అందుకొని, పూజించుకోవాలనేది అతని కోరిక. అతను పాదుకలను బాబాకివ్వమని మసీదులో ఉన్న కాకాసాహెబ్ దీక్షిత్ చేతిలో పెట్టాడు. దీక్షిత్ వాటిని బాబాకి ఇవ్వబోతే, ఆయన వాటిని తమ చేతుల్లోకి తీసుకోకుండానే, “వాటిని తిరిగి అతనికి ఇచ్చేయి” అని అతనితో చెప్పి, ఆపై వేంద్రేతో “వెళ్ళిపో” అని చెప్పారు. దాంతో అతను పాదుకలు తీసుకుని దీక్షిత్ వాడాకి వెళ్ళిపోయాడు. కానీ బాబా చేతుల మీదుగా పాదుకలు లభించలేదని ఆందోళన చెందాడు. వారి చేతుల మీదుగా అవి నాకు ఎలాగైనా లభించాలనే బలమైన కోరికతో మళ్లీ మధ్యాహ్నం పాదుకలు తీసుకుని మసీదుకు వెళ్లాడు. ఆ సమయంలో మాధవరావు దేశ్పాండే అక్కడ ఉన్నాడు. వేంద్రే పాదుకలు బాబాకివ్వమని అతనికి ఇచ్చాడు. అతను వాటిని సమర్థుల(బాబా) దగ్గర పెట్టాడు. బాబా వేంద్రేను దగ్గరకు పిలిచి, చిలుము తాగడానికి ఇచ్చారు, తర్వాత అతని చేతుల్లో పాదుకలు పెట్టి, ఒక కొబ్బరికాయ కూడా ఇచ్చారు. అప్పుడు అతని మనసుకి, ‘బాబా నా మనసెరిగి, నా చేతుల్లో పాదుకలు, కొబ్బరికాయ ఉంచారని’ చాలా ప్రశాంతంగా అనిపించింది. 


ఒకసారి వేంద్రే మనసులో గుందివాలీ గ్రామ నివాస ప్రాంతంలో ఒక ఖాళీ స్థలం తీసుకుని, అక్కడ ఇల్లు కట్టుకొని నివాసముండాలని కోరిక కలిగింది. అయితే బాబా అనుమతిస్తేనే ఇల్లు కట్టాలని అతను నిశ్చయించుకొని ఆ విషయం బాబాని అడగమని శిరిడీలో ఉన్న అణ్ణాచించణీకర్‌కి ఉత్తరం వ్రాసాడు. ఆ ఉత్తరం అందుకున్న అణ్ణాచించణీకర్ దాన్ని చదివి బాబాకి వినిపించాడు. అప్పుడు బాబా, “ఇల్లు కట్టుకో"మని తమ అనుమతి ఇచ్చారు. అదే విషయం తెలియజేస్తూ అణ్ణాచించణీకర్, ‘బాబాకి ఉత్తరం చదివి వినిపించాను. వారు ఇల్లు కట్టుకోమని చెప్పారు. ఏమీ అభ్యంతరం లేదు’ అని అతనికి లేఖ పంపాడు. దాంతో అతను ఆ స్థలాన్ని తీసుకుని ఇంటి నిర్మాణం మొదలుపెట్టాడు. పునాది వేయడం పూర్తైన తర్వాత అతను శిరిడీ వెళ్లి, బాబా దర్శనం చేసుకున్నాడు. మసీదులో అతనితోపాటు మరో పదిహేను ఇరవై మంది భక్తులు కూర్చుని ఉండగా బాబా అనేక విషయాలు మాట్లాడసాగారు. ఆయన అలా చెప్తూ చెప్తూ, చేత్తో నేలపై గీసి చూపిస్తూ, "చుట్టూ నాలుగు వైపులా మురికి" అని అన్నారు. అతను తన మనస్సులో, ‘బాబా నా ఇంటి ప్లాన్‌నే ఉన్నది ఉన్నట్లు గీసి చూపించారు. వారు చెప్పినట్లే ఆ స్థలానికి నాలుగు వైపులా మురికి ఉంది’ అని అనుకున్నాడు. తర్వాత అతను బాబా చరణాలపై తన శిరస్సునుంచి, "బాబా! మీరు అనుమతి ఇచ్చినందువల్లే ఇంటి నిర్మాణం మొదలుపెట్టాను. పునాదికే చాలా ఖర్చు అయ్యింది, ఇకముందు ఇంటి పని ఎలా సాగుతుంది?" అని అడిగాడు. అప్పుడు బాబా "వెళ్ళు, ఏమీ విచారించకు" అని అన్నారు. సమర్థులు చెప్పిన ప్రకారంగానే, ఎవరి దగ్గర నుండి ఒక్క పైసా కూడా అప్పు తీసుకోకుండా అతని ఇంటి నిర్మాణం పూర్తయింది. నిజానికి అతను చాలా పేదరికంలో ఉన్నందువల్ల తన ఇంటి పని పూర్తవుతుందని అతనికి అస్సలు అనిపించలేదు. కానీ ఒకసారి అతను బాబాకి దక్షిణ సమర్పించినప్పుడు వారు, "ఒకటి ఇస్తే, ఆ ఒక్కటి పదింతలు అవుతుంది" అని అన్నారు. వారి ఆశీర్వాదం వల్ల వృత్తిలో అతనికి మంచి ఖ్యాతి లభించడం మొదలై అతని ఆర్థిక స్థితి క్రమంగా మెరుగుపడనారభించింది.


1918, ఏప్రిల్ నెలలో వేంద్రే బాబా దర్శనార్థం శిరిడీ వెళ్లాడు. అప్పుడు ఒకరోజు మధ్యాహ్నం 3 లేదా 4 గంటల సమయంలో అతను మసీదు లోపలికి వెళ్లగానే బాబా అతనితో, "ఇక్కడ కూర్చోవద్దు. ముందు బూటీ దగ్గరకు వెళ్లి, అతని వద్ద నుండి పది రూపాయలు అడిగి తీసుకురా" అన్నారు. వారు చెప్పినట్లే అతను దీక్షిత్ వాడాలో కూర్చొని ఉన్న బూటీసాహెబ్ దగ్గరకి వెళ్లి, నమస్కరించి, “బాబా! 10 రూపాయలు అడిగార”ని చెప్పాడు. అందుకు బూటీసాహెబ్, "బాబాకి నా నమస్కారాలు చెప్పండి. ఇప్పుడే మా గుమస్తా ఇక్కడ చనిపోయాడు. అతనిని తీసుకువెళ్లే ఏర్పాట్లు జరుగుతున్నాయని బాబాకి చెప్పండి" అని అతనితో అన్నాడు. అతను మసీదుకు తిరిగి వెళ్ళాడు. బాబా చెంత 10, 15 మంది భక్తులు కూర్చుని ఉన్నారు. వేంద్రే మసీదులోకి అడుగుపెడుతూనే బాబా అతన్ని చూసి, "బూటీ ఏం చెప్పాడు?" అని అడిగారు. అప్పుడు బూటీసాహెబ్ చెప్పిన విషయమంతా బాబాకి చెప్పాడు అతను. బాబా అతనితో, "చాలా చెడు జరిగింది, వెళ్ళు. భయపడకూడదు, ధైర్యం వహించాలి. అధైర్యపడకూడదు" అని అన్నారు. అతను తన మనస్సులో, ‘ఇక్కడ 10, 15 మంది భక్తులు కూర్చుని ఉండగా, బాబా నన్నే ఎందుకలా హెచ్చరించారు?’ అని అనుకున్నాడు. మరుసటిరోజు బాబా అతన్ని, “ఇంటికి వెళ్ళు” అన్నారు. ఆ సమయంలో అతను కందివలిలో నివాసం ఉంటున్నాడు. బాబా ఆజ్ఞానుసారం వెంటనే ఇంటికి వెళ్లాడు. తర్వాత ఒకటి రెండు రోజులలో అతని తండ్రికి తీవ్రమైన జ్వరమొచ్చి మరణించాడు. అప్పుడు అతనికి బాబా తనతో చెప్పిన ధైర్యవచనాలు గుర్తొచ్చి, ‘నాపై ఈ ఘోర విపత్తు రాబోతోంది’ అని నాకు తెలియజేయడానికే బాబా నన్ను కావాలనే శ్రీబూటీసాహెబ్ దగ్గరకు పంపించారు అనుకున్నాడు.


1924, డిసెంబర్ నెలలో అత్తవారింట ఉన్న వేంద్రే కుమార్తె చాలా తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఆమెకు జ్వరం తీవ్రంగా ఉండి పదిహేను ఇరవై రోజులు అస్సలు నిద్రపట్టలేదు. కళ్ళు ఎర్రబడిపోయి, శరీరంలోని అన్ని నరాలలో తీవ్రమైన నొప్పి(పోటు)తో ఆమె చాలా ఇబ్బంది పడింది. వైద్యులు ఇచ్చిన మందులు వాడుతున్నా, 2 లేదా 4 ఇంజెక్షన్లు చేసిన, ఇంకా ఏమి చేసినా ఆమెకి నిద్రరాలేదు. చివరకు అదే స్థితిలో ఆమెను అత్తింటివారు వేంద్రే దగ్గరకు తీసుకువచ్చారు. అదే రోజు అతని కుటుంబసభ్యులు శ్రీసాయిబాబా ఊదీ ఆమె నుదుటన పెట్టి, ఊదీ నీళ్లు తాగించారు. ఊదీ ఇచ్చిన కొద్దిసేపటికే ఆమెకు మంచి నిద్ర పట్టి, ఆ తర్వాత ఆమె ఆరోగ్యం చక్కగా కుదుటపడింది.


సోర్స్: సాయిలీల పత్రిక 1925, సంచిక 2,3.


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo