ఈ భాగంలో అనుభవాలు:
1. సాయి మహరాజ్ చేసిన లీల
2. శ్రద్ధ-సబూరీ కలిగి ఉండవలెను
సాయి మహరాజ్ చేసిన లీల
నేను ఒక సాయి భక్తురాలిని. 2024, ఫిబ్రవరి 13 రాత్రి మా పాప ఆడుకుంటూ తను తినే చాక్లెట్ ముక్క చిన్నది తన ముక్కులో పెట్టేసుకుంది. అది ముక్కులోకెళ్ళి తనని చాలా ఇబ్బందిపెట్టింది. దాంతో తనకి చాలా భయమేసి ఏడుస్తూ నా దగ్గరకొచ్చి, "అమ్మా! ముక్కులో చాక్లెట్ పెట్టుకున్నాను" అని చెప్పింది. నేను టార్చిలైట్ వేసి తన ముక్కులో చూస్తే, చాక్లెట్ స్పష్టంగా కనిపించింది. కానీ దాన్ని బయటకి తీయాలంటే నాకు చాలా భయమేసింది. కారణం అది ముక్కులో పైదాకా వెళ్ళిపోయింది. అందుచేత దాన్ని తీసే ప్రయత్నం నేను చేస్తే గనక అది ఎక్కడ అడ్డం పడి పాప శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతుందోననిపించింది. వెంటనే మేము భయంతో ఆ రాత్రివేళ పాపని తీసుకొని నెల్లూరులోని ఆరేడు హాస్పిటళ్ళకి తిరిగాము. ప్రతి హాస్పిటల్లో వాళ్ళు చూసి, "ముక్కులో అడ్డం ఉంది. కానీ దాన్ని తీసే పరికరం ENTవాళ్ళ వద్ద ఉంటుంది. వాళ్ళు ఈ సమయంలో ఉండరు" అని చెప్పారు. ఇక చివరికి మేము అపోలో ఆసుపత్రికి బయలుదేరాం. అక్కడికి వెళ్లే దారిలో మాకు సాయిబాబా మందిరం కనిపించింది. అప్పుడు నేను, "బాబా! అలా కూర్చున్నారేమిటి? తొందరగా రండి. పరుగున వచ్చి మా పాపని కాపాడండి. మీరే 'సాయి మంజరి' ముక్కులో ఉన్న అడ్డాన్ని తొలగించాలి" అని బాబాకు దణ్ణం పెట్టుకున్నాను. తర్వాత మేము అపోలో ఆసుపత్రికి చేరుకొని ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్ళాము. డాక్టర్ వచ్చి టార్చ్‌లైట్ వేసి చూసి, "ముక్కులో ఎటువంటి అడ్డం లేదు" అని చెప్పారు. అది విని నాకు చాలా ఆశ్చర్యమేసి, "అదేమిటి, నేను నా కళ్ళతో చూశాను డాక్టర్. వేరే హాస్పిటల్లో డాక్టర్లు కూడా చూసి చాక్లెట్ ఉందని నిర్ధారించారు" అని అన్నాను. అప్పుడు ఆ డాక్టర్ లైట్ వేసి, "మీరే చూడండమ్మా" అని అన్నారు. చూస్తే, పాప ముక్కులో ఏ అడ్డం కనిపించలేదు. అక్కడున్న డాక్టర్లు చూసి, "మీరు వచ్చే దారిలో పడిపోయినట్టుంది. ఇప్పుడైతే ముక్కులో ఏ అడ్డం కనిపించట్లేదు" అని చెప్పారు. ఒక డాక్టర్ అయితే, "మీ పాప ఊరికే చెప్పి ఉంటుందమ్మా. అక్కడ ఏం అడ్డం లేదు" అని కూడా అన్నారు. కానీ నేను స్వయంగా పాప ముక్కులో ఇరుక్కొని ఉన్న జెల్లీ చాక్లెట్‌ని చూశాను. మరో ఇద్దరు డాక్టర్లు కూడా ఉందని చెప్పారు. అంతేకాదు, మా పాప ఇంట్లో ఉన్నప్పుడు గానీ, బయట వేరే హాస్పిటల్లో గానీ పాప తన ముక్కుని ఎవరినీ అస్సలు తాకనివ్వలేదు. నొప్పితో చాలా బాధపడింది. ముక్కు మీద చేయి వేస్తే తట్టుకోలేక ఏడ్చింది. నేను తన ఏడుపు ఆపించడానికి "ముక్కులో ఏమీ లేదు, చాక్లెట్ వచ్చేసింది" అని అబద్ధం చెప్పాను. కానీ తను ఒప్పుకోక "నా ముక్కులో ఉంది" అని ఏడుస్తూనే ఉండింది. ఒక హాస్పిటల్లో కూడా చాలాసేపు ఏడ్చింది. డాక్టర్ చెక్ చేసినప్పుడు ముక్కు నొప్పిగా ఉందని చెప్పి ముక్కుని అస్సలు తాకనివ్వలేదు. అలాంటిది సాయి మందిరం దాటి అపోలో ఆసుపత్రికి వెళ్లేలోపు దారిలో కుదుపుల వలనో లేక ఇంకే విధంగానో తెలీదు గాని మొత్తానికి సాయిబాబా దయవల్ల పాప ముక్కులో ఉన్న చాక్లెట్ అడ్డం దానికై అది తొలగిపోయింది. ఇది ఖచ్చితంగా సాయి మహరాజ్ చేసిన లీల. ఆయన పాప ముక్కులో ఏ పరికరం పెట్టనివ్వకుండా, తనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా దానికై అది పడిపోయేలా చేసారు. తర్వాత పాప ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు. హాయిగా నిద్రపోయింది. "సాయినాథ్ మహారాజ్ కి జై. మీరు ఎల్లవేళలా మాకు ఇలానే రక్షగా ఉండండి బాబా".
శ్రద్ధ-సబూరీ కలిగి ఉండవలెను
సాయిభక్తులకు వందనం. నా పేరు నరసింహులు. బాబా తమ భక్తులను శ్రద్ధ - సబూరీ అనే రెండు పైసలు అడుగుతారు. ఆ రెండు కలిగి ఉండే ప్రతి ఒక్క సాయి భక్తునికి బాబా దీవెనలు పుష్కలంగా లభిస్తాయన్నది నా అభిప్రాయం. అయితే ఆ రెండింటిలో నాకు శ్రద్ధ మాత్రమే ఉంది. సబూరీ అన్నది చాలా తక్కువ. నేను మహాపారాయణ గ్రూపులో సభ్యుని. ఆ గ్రూపువాళ్ళు 2024, ఫిబ్రవరి 15న నాకు కేటాయించిన అధ్యాయాలు చదివాను. ఆ తర్వాత గ్రూపులోని ఒక సభ్యుని తరుపున మరో రెండు అధ్యయాలు చదివే అవకాశం వస్తే, దాన్ని ఉపయోగించుకొని మరో రెండు అధ్యాయాలు చదివాను. ఆ తర్వాత ఇంకో సభ్యుని తరుపున మరో రెండు అధ్యాయాలు చదవాల్సి వస్తే, చదవడం మొదలుపెట్టాను. కానీ చదివేటప్పుడు 'ఇవి ఎప్పుడు అయిపోతాయబ్బా?' అని అనుకున్నాను. ఎలాగో అవి చదివి ‘పూర్తి చేసాన’ని గ్రూపులో పెట్టాను. ఎవరైతే ఆ అధ్యాయాలు చదవమని పెట్టారో ఆ సభ్యుని నుండి నాకు అభినందనలు కూడా లభించాయి. కానీ నేను చదివిన ఆ అధ్యాయాలను గ్రూపు మేనేజ్మెంట్ ఆమోదించకుండా ఎవరైనా సభ్యులు ఆ అధ్యాయాలను పూర్తి చేయాల్సిందిగా మరో మెసేజ్ ఉంచారు. దాంతో ఇంకో భక్తుడు ఆ అధ్యాయాలు చదివి చదివినట్లు మెసేజ్ పెట్టారు. దానిని గ్రూపు మేనేజ్మెంట్ ఆమోదించింది. అంటే నేను సబూరీని కోల్పోయి అశ్రద్దగా చదివిన అధ్యాయాలను గ్రూపు మేనేజ్మెంట్ ఆమోదించలేదు. కాబట్టి నేను చెప్పేది ఏమంటే, 'సాయి దేవునిపై అపారమైన భక్తివిశ్వాసాలు మనం కలిగి ఉండవలెను'.
ఓం శ్రీసాయి నమః.

