సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1826వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా ఊదీ 'అమృత సంజీవిని'
2. అన్నివేళలా తోడుగా వున్న బాబా

బాబా ఊదీ 'అమృత సంజీవిని'


రాజాధిరాజు యోగిరాజు పరబ్రహ్మ అయిన సాయినాథునికి నా నమస్కారములు. నేను ఒక సాయి భక్తురాలిని. నేను బెంగుళూరు నివాసిని. సాయినాథుని అనుజ్ఞ లేనిదే చిన్న ఆకైనా కదలదు. ప్రతి విషయంలో సాయి అనుగ్రహం లేనిదే మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. అంతలా మనం బాబాపై ఆధారపడి ఉన్నాము. మా చిన్నపాపకి 6 నెలల వయసప్పుడు తనకి రోజూ డైపర్ వేయడం వల్ల రాషెస్ వచ్చి క్రీమ్ వాడినా తగ్గలేదు. డాక్టర్ దగ్గరకు వెళ్ళి, వారు ఇచ్చిన క్రీమ్ వాడాక కాస్త తగ్గింది కానీ, మళ్లీ చాలా ఎక్కువ అయ్యింది. ఎంతలా అంటే ఆ చోట అంతా ఎర్రగా అయిపోయింది. అప్పుడు బాబాను ప్రార్థించి, అలాంటి చోట ఊదీ రాయకూడదని నా మనసు చెబుతున్నా బాబా ఊదీని మించిన గొప్ప ఔషధం వేరే ఏదీ లేదని తప్పనిసరై ఆ చోట అంతా ఊదీ రాశాను. మరుసటిరోజు ఉదయం చూస్తే 50% తగ్గిపోయింది. ఆ రోజు రాత్రి కూడా బాబా ఊదీ రాశాను. మర్నాటికి రషెస్ పూర్తిగా నయం చేసారు బాబా. అలాగే ఒకసారి పాపకు దగ్గు, జలుబు చాలా తీవ్రంగా ఉన్నప్పుడు ఎన్ని మందులు వాడినా తగ్గకపోయేసరికి బాబా ఊదీ పాప నుదుటిపై పెట్టి, అలాగే ఎదకు, వీపుకు పూసి, మరికొంత ఊదీ నోటిలో వేశాను. బాబా దయతో దగ్గు, జలుబు తగ్గుముఖం పట్టాయి.


నాకు వీజింగ్ ప్రాబ్లం(శ్వాస తీసుకునేటప్పుడు, విడిచిపెట్టేటప్పుడు గుర్రుగుర్రుమనే శబ్ధం వచ్చుట) దాదాపుగా రెండు సంవత్సరాల నుంచి ఉండగా 2023, సెప్టెంబర్‌లో చాలా ఎక్కువైంది. హాస్పిటల్‌కెళ్ళి డాక్టరుకి చూపిస్తే కొన్ని మందులు ఇచ్చారు. నేను ఆ మందులతోపాటు బాబా ఊదీ వాడుతుంటే సమస్య అప్పటికి తగ్గి మళ్లీ మొదలయ్యేది. చివరికి నేను మందులు పూర్తిగా వాడటం మానేసి బాబా ఊదీ మాత్రమే వాడుతూ పోయాను. బాబా దయవల్ల 2024, జనవరి నాటికి పూర్తిగా ఆ సమస్య నయమైపోయింది. బాబా ఊదీ నా పాలిటి 'అమృత సంజీవిని'. నేను రోజూ రాత్రి ఊదీ నుదుటన, ఎదపై రాసుకొని, అలాగే కాస్త నోటిలో వేసుకుంటాను. ఒకప్పుడు నాకు ఏదైనా దెబ్బ తగిలితే అమ్మ అనేదాన్ని కానీ ఇప్పుడు 'బాబా' అని అంటున్నాను, నాకు అన్నీ బాబాయే కాబట్టి.  ఆయన గురించి వర్ణించడానికి నాకు మాటలు రావడం లేదు. "ధన్యవాదాలు బాబా.  దయచేసి మా అందరి జీవితాలు అంతమయ్యేవరకు మీరు మాకు తోడుగా ఉండి మంచి మార్గంలో నడిపించండి. మీపై రోజురోజుకు భక్తి పెరిగేలా చేయండి".


అన్నివేళలా తోడుగా వున్న బాబా

నా పేరు నాగవల్లి. నేను ఎప్పటినుండో శిరిడీ వెళదామని అనుకుంటూ ఉండగా బాబా దయవల్ల 2024, మార్చి నెలలో మా స్నేహితులతో కలిసి వెళ్లే అవకాశం వచ్చింది. అప్పుడు నేను బాబా పసుపు రంగు వస్త్రాల్లో దర్శనమివ్వాలని కోరుకున్నాను. నేను కోరుకున్నట్లే బాబా ఆ రంగు వస్త్రాల్లో నాకు దర్శనం ఇచ్చారు. నాకు చాలా సంతోషమేసింది. మేము శిరిడీ నుండి శివరాత్రి రోజున త్రయంబకేశ్వరం వెళ్ళాం. ఆ రోజు చాలాసేపు వేచి వున్నా మాకు దర్శనం అవ్వలేదు. కానీ అక్కడ ఒక సాధువు మా ఆయనకి రుద్రాక్ష ఇచ్చి, వుంచుకోమని వెళ్ళిపోయారు. మావారు ఆ రుద్రాక్షను నాకు ఇచ్చారు. తరువాత ఇంస్టాగ్రామ్‌లో నాకు, 'ప్రియమైన బిడ్డా! నేను నీకు మహాశివరాత్రి రోజున రుద్రాక్ష ఇచ్చాను. దాన్ని రోజూ పూజించు. అది నేరుగా నా ఆశీర్వాదం నీకు' అని ఒక బాబా మెసేజ్ కంటపడింది. అది చూసి నేను షాకయ్యాను. ఆ మెసేజ్ స్క్రీన్ షాట్ కింద ఇస్తున్నాను, మీరూ చూడండి.

మొదట మాకు ద్వారకామాయి దర్శించడం కుదరలేదు. చివరికి తిరుగు ప్రయాణమయ్యేరోజు వెళితే, చాలా జనం ఉన్నారు. అక్కడున్న ఒక ఆమెను, "మేము తొందరగా వెళ్లి రైలు అందుకోవాలి. దర్శనం కుదురుతుందా?" అని అడిగాము. బాబా దయ చూడండి. ఆమె వెంటనే ఒప్పుకుంది. మేము ఆనందంగా లోపలికి వెళ్లి ద్వారకామాయి దర్శించాము. ఇలా బాబా అన్నివేళలా మాకు తోడుగా వున్నారు. చివరిగా ఒక విషయం, "ఈ ట్రిప్‌లో ఏ గొడవలూ మా మధ్య రాకూడదు" అని అనుకున్నాను. బాబా దయవల్ల అందరం సంతోషంగా వెళ్లి, తిరిగి వచ్చాము. "ధన్యవాదాలు బాబా".


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo