సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

గోపాల్ భాస్కర్ దాతార్



గోపాల్ భాస్కర్ దాతార్ సాయిభక్తుడు. 1917వ సంవత్సరంలో అతను అహ్మద్‌నగర్‌లో ఉన్నప్పుడు అతనికి శ్రీసాయిబాబాను దర్శించే అవకాశం వచ్చింది. కానీ, అక్కడి  ప్రజలు, "బాబా తమను దర్శించే భక్తుల వద్ద దక్షిణ రూపంలో పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తారు. అంతేకాదు, తాము స్నానం చేసే నీటిని భక్తులకు త్రాగమని తీర్థంగా ఇస్తారు" అని చెడుగా చెప్పడంతో అతను శిరిడీ వెళ్ళడం మానుకున్నాడు. పూణే సమీపంలోని ఖేడ్‌గాఁవ్‌భేట్‌కు చెందిన శ్రీనారాయణ మహరాజ్‌ను గోపాల్ ఎంతగానో గౌరవించేవాడు. ఒకసారి గోపాల్, మరికొందరు కలిసి శ్రీనారాయణ మహరాజ్‌ దర్శనానికి వెళ్ళినప్పుడు ఆయనకు ఒక రూపాయి దక్షిణ సమర్పించారు. అప్పుడు ఆయన ఆ రూపాయితో పాటు కొంత కలకండ ప్రసాదంగా తిరిగి ఇచ్చారు. ఆ దృష్ట్యా శ్రీసాయిబాబా ప్రవర్తన శ్రీనారాయణ మహరాజ్‌కు పూర్తి విరుద్ధమని గోపాల్ భావించాడు.

తరువాతి కాలంలో గోపాల్ శ్రీఉపాసనీబాబా చరిత్ర చదివి, వారి ఉపన్యాసాలు విన్నాడు. తదుపరి శ్రీఉపాసనీబాబాను ముంబాయిలో కలిసే అవకాశం అతనికి లభించింది. ఆ కలయిక అతను సకోరి ఆశ్రమాన్ని సందర్శించేందుకు దోహదమైంది. 1931వ సంవత్సరంలో అతను ‘ఉపాసనీ లీలామృతం’ పారాయణ చేశాడు. అందులో శ్రీసాయిబాబా గురించి వ్రాసిన విషయాలు అతనిని ఎంతగానో ప్రభావితం చేశాయి. దాంతో అతను ముందుగా సకోరి వెళ్లి, తరువాత శిరిడీ వెళ్ళాడు. అక్కడ ద్వారకామాయిలో కొలువైవున్న చిత్రపటంలోని ప్రకాశవంతమైన బాబా కనులు, ధుని, ద్వారకామాయి అతన్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. అంతేకాదు, ‘సాయిబాబా ఒక సద్గురువు’ అని తనలో తాను అనుకున్నాడు. ఆ తరువాత, ‘శ్రీసాయిలీల’ పత్రికలో 'అనుభవాలు' అన్న శీర్షికన ధారావాహికంగా వెలువడ్డ అన్నాసాహెబ్ దభోల్కర్ రచించిన 'శ్రీసాయి సచ్చరిత్ర'లోని వ్యాసాలు చదివాక అతనికి ‘శ్రీసాయిబాబానే తన గురువు’ అన్న నమ్మకం ఏర్పడింది. అప్పటినుండి అతను శ్రీసాయిబాబాను ఆశ్రయించాడు. కొన్ని అనుభవాలు శ్రీసాయిబాబాపై అతని విశ్వాసాన్ని దృఢపరిచాయి.

1931-1932లో ఒకరోజు గోపాల్ బిగ్గరగా ‘శ్రీసాయి సచ్చరిత్ర’ను చదువుతున్నాడు. అతను చదువుతున్న అధ్యాయంలో పాము నోటపడిన కప్పను శ్రీసాయిబాబా రక్షించడం గురించిన కథనం వచ్చింది. ఆ ఇంట్లో ఒక మహిళ చాలాకాలంగా ఒంటినొప్పులతో బాధపడుతుండేది. అన్ని రకాల మందులు ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఆమె మగతనిద్రలోనే అతను చదువుతున్నది విని, "ఓ సాయిబాబా! బాధలో వున్న కప్పవంటి జీవులపై జాలితో మీ సహాయాన్ని అందిస్తున్నారు. మరి మానవజన్మ ఎత్తిన నాపై మీకు దయలేదా?" అని ప్రార్థించింది. అప్పుడు గోడకున్న కొయ్యమేకు నుండి వెలువడుతునట్లుగా, "దసరా పండగకు నువ్వు నాకు ఐదు రూపాయల దక్షిణ ఇస్తావా?" అనే మాటలు వినిపించాయి. అందుకామె, "నాకు నయమైనట్లయితే తప్పక ఇస్తాన"ని సమాధానం ఇచ్చింది. తరువాత ఆమె పూర్తి మెలకువ స్థితిలోకి వచ్చి తనకు కలిగిన అనుభవం గురించి గోపాల్‌తో చెప్పి, "దసరా ఉత్సవాలకు ఐదు రూపాయల దక్షిణను శిరిడీకి పంపమ"ని చెప్పింది. అతను అలాగే చేశాడు. బాబా అనుగ్రహంతో ఆరోజు సాయంత్రానికల్లా ఆమె బాధలు తగ్గిపోయాయి.

1932లో బాబా తరచూ గోపాల్‌కి స్వప్నదర్శనమిస్తుండేవారు. ఆ కలలో ఆయన చిన్నపిల్లలతో ఆడుకొనే విధంగా గోపాల్‌తో ఆడుకొనేవారు. ఒకసారి కలలో శ్రీఉపాసనీబాబా గోపాల్‌కు సహాయం చేయమని బాబాను అర్థిస్తున్నట్లు, అందుకు బాబా తమ సమ్మతి తెలుపుతున్నట్లు దర్శనమైంది. ఒకసారి గోపాల్ తన క్లయింట్లలో ఒక స్థిరనివాసమంటూ లేక తరచూ ప్రయాణాలలో తిరుగుతూ ఉండే ఒక క్లయింట్‌ని విచారణ నిమిత్తం కోర్టులో హాజరుపరచాల్సి అవసరం వచ్చింది. కానీ ఆ క్లయింట్‌కి సంబంధించిన లేఖను గోపాల్ ఎక్కడో పోగొట్టుకున్నాడు. ఎంత వెతికినా అది కనిపించలేదు. ఎంత ప్రయత్నించినా అతని గురించిన ఆచూకీ తెలియలేదు. చివరికి అతను బాబాను ఆర్తిగా ప్రార్థించాడు. మరునాడే గోపాల్ తన ఆఫీసులో ఏదో వెతుకుతూ అనుకోకుండా బీరువాపై చేయి పెట్టగా ఆ లేఖ దొరికింది. దాంతో అతను ఆ క్లయింట్‌ని అనుకున్న సమయానికి కోర్టులో హాజరుపరచగలిగాడు.

సుమారు 1933-1934లో దూరప్రాతంలో ఉన్న కోర్టువారు ఒక కేసు తాలూకు సాక్షిని విచారించేందుకు గోపాల్‌ని నియమించారు. ఆ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు, విచారణ ఫలితాలు మొదలైన వివరాలున్న ఫైలుని అతనెక్కడో పెట్టి మరచిపోయాడు. దానికోసం అతను అంతటా వెతికినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. అందువల్ల, తన నిర్లక్ష్యాన్ని కోర్టుకు తెలియజేసి, మరలా పేపర్లు పంపించమని అభ్యర్థించాలని అనుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలో పండరియాత్రకు వెళ్తున్న ఒక వార్కరీ (క్రమం తప్పక పండరియాత్ర చేసేవాడు) అతని ఇంటికి వచ్చాడు. కొన్నిరోజులపాటు గోపాల్ అతనిని ఎంతో శ్రద్ధగా సేవించాడు. ఒకరోజు గోపాల్ తన సమస్య గురించి అతనితో చెప్పాడు. అందుకతను, "ఆ ఫైల్ దొరుకుతుంది" అని చెప్పాడు. గోపాల్ ప్రతిరోజూ బాబాను కూడా ప్రార్థిస్తుండేవాడు. ఆ వార్కరీ గోపాల్ ఇంటినుండి వెళ్లిన మరుసటిరోజు, వేరే కేసుకు సంబంధించిన పేపర్ల మధ్య అతను వెతుకుతున్న పేపర్లు దొరికాయి.

సంఘసంస్కరణ భావాల ప్రభావంతో, ‘మరణించినవారికి శ్రాద్ధకర్మలు చేయడం వంటి ఆచారాలన్నీ అర్థరహితమైన మూఢనమ్మకాలు’ అని భావించేవాడు గోపాల్. అతనికి మొదట్లో వాటిపట్ల నమ్మకముండేది కాదు. కానీ అతను బొంబాయిలోని కుర్లా కోర్టులో గుమస్తాగా పనిచేస్తున్న శ్రీనాచ్నే అనే సాయిభక్తుని కలిసిన తరువాత ఆ ఆచారాలపట్ల అతనికి విశ్వాసం పునరుద్ధరింపబడింది. నాచ్నే బాబాకు అత్యంత సన్నిహిత భక్తుడు. బాబా అతనిపై ఎంతో దయను చూపారు. వివరాలలోకి వెళితే...

1929లో నాచ్నే రెండవ భార్య మరణించింది. ఆమె ఆత్మకు సద్గతి చేకూర్చేందుకు అవసరమైనదంతా చేయదలచి, ఆమె అస్థికలను, చితాభస్మాన్ని తీసుకుని నాసిక్ వెళ్లి వాటిని అక్కడి గోదావరినదిలో కలిపి శాస్త్రోక్తంగా శ్రాద్ధకర్మలు జరిపించాలని అనుకున్నాడు నాచ్నే. ఇంతలో అతని తండ్రి అనారోగ్యానికి గురయ్యాడు. భార్య పోయిన దుఃఖంతో పాటు ఆ తరువాత చేయవలసిన కార్యక్రమాల ఏర్పాట్లు, అందుకు అవసరమైన డబ్బులు సమకూర్చుకోవటం వంటి భారాలు తనపై పడటంతో నాచ్నేకు ఏమి చేయాలో తోచలేదు. చివరికి ఎలాగో 80 రూపాయలు సమకూర్చుకుని, 3 సంవత్సరాల తన కొడుకును ఇంట్లోనే విడిచిపెట్టి నాసిక్ వెళ్ళడానికి రైలులో బయలుదేరాడు. విక్టోరియా స్టేషన్‌లో అతనికి తోటి ప్రయాణీకునితో పరిచయం ఏర్పడింది. ఆ ప్రయాణీకుడు నాచ్నే పట్ల ఎంతో ఆదరణ చూపించాడు.

ప్రయాణీకుడు: మీరు ఎక్కడికి వెళ్తున్నారు?

నాచ్నే: నాసిక్.

ప్రయాణీకుడు: మీరెందుకు కంబళి తీసుకుని వెళ్లడం లేదు? అక్కడ రాత్రిళ్ళు చలి అధికంగా ఉంటుంది.

నాచ్నే: అంత అవసరమనిపించలేదు. అయినా అవన్నీ ఆలోచించే స్థితిలో నేను లేను. మూడు సంవత్సరాల బిడ్డను వదిలి ఎనిమిది రోజుల క్రితం నా భార్య చనిపోయింది.

ఈ మాటలు విన్న వెంటనే ఆ ప్రయాణీకుడు నాచ్నేను కాసేపు నిరీక్షించమని చెప్పి, ఒక స్నేహితుని పిలిచి ఒక దుప్పటి, రగ్గు తెప్పించి నాచ్నేకి ఇచ్చాడు.

నాచ్నే: మీరు ఇవన్నీ ఇంత త్వరగా ఎలా తెప్పించగలిగారు?

ప్రయాణీకుడు: ఈ రైల్వేస్టేషనుకి అతి దగ్గరలో ఉన్న బొంబాయి ఆర్ట్ స్కూల్లో నేను నివాసముంటున్నాను. ఈ చుట్టను కాల్చండి. (అంటూ ఒక చుట్ట ఇచ్చాడు.)

నాచ్నే: (ఆ చుట్ట తీసుకుని) మీ పేరేమిటి? మీరు ఏమి చేస్తుంటారు?

ప్రయాణీకుడు: నా పేరు గణపతి శంకర్. నేను ఆ స్కూల్లో ప్యూనుగా పనిచేస్తున్నాను. మీరిక దేని గురించీ చింతించకుండా ప్రశాంతంగా పడుకోండి. నేను కూడా నాసిక్ వెళ్తున్నాను. స్టేషన్ రాగానే మిమ్మల్ని లేపుతాను.

నాచ్నే: మీరు నాసిక్‌ ఎందుకు వెళ్తున్నారు?

ప్రయాణీకుడు: ఊరికే చూడటానికి వెళ్తున్నాను. మా సాహెబ్ సిమ్లా వెళ్లినందున నాసిక్‌ దర్శించే అవకాశం నాకు దొరికింది.

తరువాత నాచ్నే నిద్రకు ఉపక్రమిస్తుండగా అతను, "మీ డబ్బు జాగ్రత్త చేసుకోండి. లేదా నా చేతికిస్తే నా ట్రంకుపెట్టెలో భద్రపరుస్తాను" అని అన్నాడు. అప్పుడు నాచ్నే తన వద్దనున్న 80 రూపాయలు అతనికిచ్చి నిద్రపోయాడు. నాసిక్‌కి సమీపంలో ఉన్న ఘోటి స్టేషన్లో అతను నాచ్నేను నిద్రలేపాడు. ఇద్దరూ ముఖం కడుక్కుని టీ త్రాగారు. ఆ టీ కి డబ్బులు అతనే ఇచ్చాడు. తరువాత వారిద్దరూ నాసిక్‌రోడ్ స్టేషన్లో దిగి బస్సులో నాసిక్ పట్టణానికి చేరుకున్నారు. అప్పుడతను నాచ్నేతో, "మీరు దేనికీ శ్రమపడకండి. మీరు పూజారి(భట్‌జీ) వద్దకు కూడా వెళ్ళవద్దు. అన్నీ నేను చూసుకుంటాను" అని చెప్పాడు.

ఉత్తరక్రియల విషయంలో అతనికి ఉన్న ప్రత్యేక జ్ఞానాన్ని వాటిని నాచ్నే చేత జరిపించడంలో కనబరిచాడు. అతను ఒక పూజారిని ఏర్పాటు చేసి పిండప్రదానం చేయడానికి నాచ్నేను రామ్‌కుండ్ వద్దకు తీసుకెళ్ళమన్నాడు. ఆ పూజారి అశుభకార్యాలకు ముందు విఘ్నేశ్వరపూజ అనవసరమని తలచి, ఆ పూజ చేయకుండానే కార్యాన్ని మొదలుపెడుతుంటే, గణపతి శంకర్ జోక్యం చేసుకుని, అది సరియైన పద్ధతి కాదని చెప్పి, ముందు విఘ్నేశ్వరపూజ చేయమని చెప్పాడు. ఇంకా ఆ బ్రాహ్మణుడు సందేహిస్తుంటే, ఎవరైనా పండితుడిని అడగమని చెప్పాడు. ఒక పండితుని అడిగితే అతడు గణపతి శంకర్ చెప్పిన దానినే సమర్థించాడు. అప్పుడా పూజారి నాచ్నేతో, ‘గణపతి శంకర్ చాలా తెలివిగలవాడని, అతనికెంతో శాస్త్ర పరిజ్ఞానముంద’ని మెచ్చుకున్నాడు. తరువాత రామ్‌కుండ్ దగ్గర ఉన్న గోదావరిలో దిగి ప్రవాహవేగానికి కొట్టుకుని పోకుండా అస్థికలను ప్రత్యేకరీతిలో ఎలా పట్టుకోవాలో నాచ్నేకు వివరించాడు గణపతి శంకర్. అతను చెప్పినట్లే నాచ్నే వాటిని తన చేతులను గుల్లగా ఉండేలా పెట్టుకుని, ఆ మధ్యలో అస్థికలను ఉంచి గట్టిగా పట్టుకున్నాడు. ఆశ్చర్యంగా అవి పంచదార పలుకుల్లా క్షణాల్లో కరిగిపోయాయి.

పన్నెండవరోజున ముంబాయి తిరిగి రావలసిందిగా గణపతి శంకర్‌కు టెలిగ్రామ్ వచ్చింది. అప్పుడతను నాచ్నే నుండి తీసుకున్న డబ్బుకు పైసాతో సహా లెక్కచెప్పాడు. ఆ తరువాత నాసిక్‌లో ఉన్న ప్రధాన దేవాలయాలన్నింటికీ నాచ్నేను తీసుకుని వెళ్లి దర్శనం చేయించాడు. అప్పుడొక దేవాలయంలో ఉన్న ఒక సన్యాసి అతనిని గుర్తుపట్టి పలకరించాడు. అతను ఆ సన్యాసికి తనకొచ్చిన టెలిగ్రామ్‌ను చూపించాడు. తరువాత అతను నాచ్నేకు తన చిరునామా ఇచ్చి, అంధేరీలో మళ్ళీ కలుస్తానని చెప్పి అదేరోజు తిరిగి వెళ్ళిపోయాడు. పన్నెండవరోజు చేసే కర్మకాండ పూర్తయ్యేవరకు ఒక ప్యూనులా నాచ్నే వెంట ఉండి అన్నీ తనే చూసుకున్నాడు గణపతి శంకర్. ఆ తరువాత నాచ్నే కూడా తిరిగి ముంబాయిలోని తన ఇంటికి చేరుకున్నాడు.

కొంతకాలం గడిచాక, తనకు ఎంతో సహాయం చేసిన గణపతి శంకర్ తనను మళ్ళీ కలవకపోవడంతో నాచ్నే స్వయంగా బొంబాయి ఆర్ట్ స్కూలుకి వెళ్ళాడు. అక్కడ విచారిస్తే, ‘గణపతి శంకర్ అనే పేరుగల వారెవరూ ప్యూనుగా ఆ స్కూల్లో పనిచేయడం లేద’ని అక్కడ పనిచేసే ప్యూన్ నుండి ప్రిన్సిపాల్ దాకా అందరూ ధృవీకరించారు. దాంతో నాచ్నే ఆశ్చర్యపోయాడు. "నా నుండి ఏమీ ఆశించకుండా అంత శ్రమ తీసుకుని నా భార్య సద్గతికి సహాయపడిన ఆ 'మనిషి' ఎవరై ఉంటారు? ఆయన మరెవరో కాదు, ఖచ్చితంగా సాయిబాబానే!" అనుకున్నాడు.

ఈ వివరాలన్నీ నాచ్నే ద్వారా తెలుసుకున్న తరువాత గోపాల్ భాస్కర్ దాతార్‌కి, 'సర్వం తెలిసిన సాయిబాబానే తోడుండి శ్రాద్ధకర్మల విషయంలో నాచ్నేకు అంత సహాయం చేశారంటే, అటువంటి కర్మలు తప్పక చేయాలనీ, చేస్తే ఉపయోగముంటుందనీ’ అనిపించింది. అప్పటినుండి అతను ఆ కర్మక్రతువులను చేయసాగాడు.

సోర్స్: http://www.saiamrithadhara.com/mahabhakthas/gopal_bhaskar_datar.html


8 comments:

  1. Very nice story.now only I know it. Variety stories you are giving very nice. Om sai ram❤❤❤
    .

    ReplyDelete
  2. Om Sri Sai Ram ��������

    ReplyDelete
  3. Kothakonda SrinivasJune 6, 2021 at 12:30 PM

    ఓం సాయిరాం!

    ReplyDelete
  4. 🌺🙏🙏🙏🙏🌺 Om SaiRam🌺💮🙏🙏🙏🙏🙏🌺

    ReplyDelete
  5. Om sai ram baba mamalini kapadu thandri

    ReplyDelete
  6. Om Sree Sachidhananda Samarda Sadguru Sree Sai Nadhaya Namaha

    ReplyDelete
  7. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo