సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 816వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

  1. బాబా ఇచ్చిన భరోసా - ప్రసాదించిన ఆరోగ్యం
  2. చెప్పినట్లే, వెంటే ఉంటూ అనుగ్రహించిన బాబా

బాబా ఇచ్చిన భరోసా - ప్రసాదించిన ఆరోగ్యం


ఓం శ్రీ సాయినాథాయ నమః


నా పరాత్పర గురువైన సాయినాథుని పాదపద్మములకు నమస్కరిస్తూ, సాయినాథుడు చూపిన మహత్యాన్ని మీతో పంచుకుంటున్నాను. నా పేరు కృష్ణ. 2021, మే నెల రెండవ  వారంలో మా అమ్మగారి ఒంటికి నీరు పట్టడంతో కొద్దిగా ఆయాసంతో వారం రోజులు బాధపడ్డారు. అదే సమయంలో నా ప్రాణస్నేహితుడు కూడా జ్వరంతో బాధపడుతున్నాడు. నేను కష్టకాలంలో ఉన్నప్పుడు సాయిబాబా నా ప్రాణస్నేహితుని రూపంలో వచ్చి నన్ను ఆదుకున్నారు. నేను వైద్యసంబంధ వృత్తిలో ఉన్నాను. వైద్యుడైన నా మరో స్నేహితుడు మా అమ్మకి, నా ప్రాణస్నేహితునికి వైద్యం చేస్తున్నాడు. నేనెప్పుడూ నా స్నేహితుడు వైద్యం చేస్తున్నాడని అనుకోను, నా స్నేహితుని ద్వారా సాయినాథుడే వైద్యం చేస్తున్నారని ప్రగాఢంగా విశ్వసిస్తాను. అందుకే నేను ఎప్పుడూ మా అమ్మగారితో, “అమ్మా! నువ్వు ముందుగా బాబా ఎదురుగా నిలుచుని నీ సమస్యలను బాబాకు విన్నవించుకుని, ఆ తర్వాత మాత్రమే నా స్నేహితుడితో మాట్లాడు” అని చెప్తాను. ముందుగా బాబాకు అన్ని బాధలూ నివేదించిన తర్వాత, వైద్యుడైన నా స్నేహితుడి ద్వారా బాబానే సరైన ఔషధాన్ని నిర్ణయిస్తారు. ఇది పరమ సత్యం. బాబానే వైద్యం చేస్తారు. ఇకపోతే వారం రోజుల నుండి నాకు ప్రియమైన ఇద్దరూ అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో, ఒకరోజు నాకెందుకో చాలా బాధగానూ, భయంగానూ అనిపించింది. ఆరోజు రాత్రి మా అమ్మగారికి కాళ్ళు నొక్కుతూ సాయి మహరాజ్ సన్నిధి వాట్సాప్ గ్రూప్ చూస్తూ యథాలాపంగా స్క్రోల్ చేశాను. అప్పుడు ఈక్రింది మెసేజ్ కనబడింది: 


🔥సాయి వచనం:- “దయామయుడైన ఈ ఫకీరు నిన్ను తప్పక రక్షించును. నాయందు విశ్వాసముంచుము. భయపడకు, ఆందోళనపడవద్దు”. 


అది బాబా వచనమే అయినప్పటికీ, ‘ఏదో యాదృచ్ఛికంగా కనబడిందిలే’ అనుకుని మళ్లీ స్క్రోల్ చేశాను. విచిత్రంగా మళ్ళీ అదే మెసేజ్ వేరేచోట కనబడింది. దాంతో, బాబా నాకు భరోసా ఇస్తున్నారనిపించి కొంత ధైర్యం వచ్చింది. ఆ మర్నాడు సాయంత్రం నా ప్రార్థన ముగించుకుని నా పనిమీద బయలుదేరాను. వెళ్ళేదారిలో నా చిన్ననాటి మా స్కూల్ మాస్టారు కనపడ్డారు. ఆయన నాతో మామూలుగా మాట్లాడుతూ, “నీకు ఒక మహత్యం చెప్తాను” అన్నారు. ఆ మాస్టారు సాయిబాబా రూపంలో ఉన్న గురువుగారి శిష్యులు కాదు, వేరే రూపంలో ఉన్న గురువుగారి శిష్యుడు. అందువల్ల, ‘తన గురువు గురించిన మహత్యం ఏదో చెప్తారులే’ అనుకున్నాను. కానీ ఆయన చాలా చిత్రంగా మా ఊరి దగ్గరలో ఉన్నటువంటి ఒక గొప్ప సాయిభక్తుడికి జరిగిన యదార్థ సంఘటన చెప్పారు. ఆ ఊరిలో ఆ సాయిభక్తుడు సాయిబాబాను కొలుస్తూ, తన దగ్గరకు వచ్చేవాళ్ళందరికీ కూడా బాబా మహత్యాన్ని వివరిస్తూ, వారినందరినీ కూడా బాబా మార్గంలో నడిపిస్తూ ఉంటారు. ప్రతిరోజూ శ్రద్ధగా పూజచేసి బాబాను కొలుస్తూ ఉంటారు. ఆయనను గురువుగా భావించి ఎంతోమంది ప్రజలు ఆయన దగ్గరకు వచ్చి తమ తమ కష్టాలను చెప్పుకుంటుంటారు. ఆ సాయిభక్తుని ద్వారా బాబా ఆ కష్టాలకు పరిష్కారాలు సూచిస్తారు. 


ఆ సాయిభక్తునికి జరిగిన యదార్థ సంఘటన:


ఆ సాయిభక్తుడు ఒకరోజు బాబాకు పూజ చేస్తూ ఉన్నారు. అప్పుడొక శిష్యుడు పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరకు వచ్చి, “అయ్యా! నా బిడ్డ నూతిలో పడిపోయింది స్వామీ” అని చెప్పారు. ఆ సాయిభక్తుడు బాబాకు పూజ చేస్తూ చేస్తూ మధ్యలో ఒకసారి బాబా వైపు చూసి, "ఈపాటికి నువ్వు కాపాడి ఉంటావులే" అని, తను చేస్తున్న పూజను కొనసాగించసాగారు. ఆ వచ్చినాయన కూడా ఆ సాయిభక్తునిపై ఎంతో నమ్మకంతో పూజ అయ్యేంతవరకు అలాగే కూర్చున్నారు. ఈ సాయిభక్తునికి బాబా మీద ఎంత నమ్మకం! ‘నువ్వు రక్షించి ఉంటావులే’ అని చెప్పి తన పూజ కొనసాగిస్తున్నారు. ఆ వచ్చిన శిష్యునికి ఈయన మీద ఎంత నమ్మకం! ఎలాగైనా తన బిడ్డను ఆయనే కాపాడతారు అని ఎదురుచూస్తూ ఉన్నాడు. పూజ పూర్తయింది. ఆ సాయిభక్తుడు నిదానంగా లేచి బావి దగ్గరకు వెళ్ళారు. అప్పటికే ఆ బావిలో మూలనున్న ఒక రాతి మీద ఆ పాప కూర్చుని ఉంది. ఆ పాపను నిదానంగా బయటకు తీసి, ‘ఏం జరిగింద’ని అడిగారు. “నేను పడిపోగానే బాబా వచ్చి నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు” అని చెప్పింది ఆ పాప. 


ఈ సంఘటన చెప్పిన తరువాత మా స్కూల్ మాస్టారు నాతో, “మీ గురువుగారి మీద నమ్మకం ఉంచు, ఇంకేమీ చేయాల్సిన పనిలేదు” అన్నారు. అసలు మా స్కూల్ మాస్టారికి నేను ఇలా నాకు ప్రియమైనవారికోసం బాధపడుతున్న సంగతిగానీ, భయపడుతున్న సంగతిగానీ తెలీదు. ఏమీ తెలియకుండానే, “మీ గురువు ఖచ్చితంగా రక్షిస్తారు” అని చెప్పారు. 


చాలా చిత్రంగా, ముందురోజు రాత్రి కనిపించిన బాబా మెసేజ్, స్కూల్ మాస్టారు చెప్పిన బాబా మహత్యం – ఈ రెండూ కలిసి నాలో ధైర్యాన్ని నింపాయి. ‘మా అమ్మగారిని, నా ప్రాణస్నేహితుడిని బాబా ఖచ్చితంగా రక్షిస్తారు’ అని నమ్మకం కలిగింది. దాంతో నేను కాస్త ప్రశాంతంగా ఉన్నాను. ఆరోజు నుండి నా ప్రాణస్నేహితుడి ఆరోగ్యం మెల్లమెల్లగా మెరుగవటం ప్రారంభమై, బాబా అనుగ్రహంతో 2021, మే 20 నాటికి తను పూర్తిగా కోలుకున్నాడు. మా అమ్మగారు కూడా కోలుకోవడం మొదలైంది. శ్రీసాయిసచ్చరిత్రలో కూడా ఒకసారి బూటీకి జ్వరం వస్తే బాబాగారు అతనితో, “నువ్వు ఇంటికి వెళ్లి శుభ్రంగా పాయసంలో బాదం, పిస్తా వేసుకుని తిను, తిరుగు, అదే తగ్గిపోతుందిలే” అన్నారు. బూటీ ఇంటికి వెళ్లి బాబా చెప్పినట్లు చేస్తుంటే డాక్టర్ వచ్చి, ‘ఇలా చేస్తే ఇబ్బంది కలుగుతుంది’ అని చెప్పినా సరే, బూటీ మాత్రం బాబా మాట మీద నమ్మకంతో బాబా చెప్పినట్టే చేశాడు. బాబా అనుగ్రహంతో బూటీకి నాలుగు రోజుల్లో జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. అదేవిధంగా, మా అమ్మగారిని బాబా ఖచ్చితంగా కాపాడుతారని నా నమ్మకం. ఇది నా సాయిబాబాపై నాకున్న నమ్మకం. పై రెండు సంఘటనలు చాలా యాదృచ్ఛికంగా జరిగినట్లు అనిపించినప్పటికీ బాబానే ఆయా రూపాల్లో నాకు భరోసానిచ్చారనేది నా అనుభవం. అందుకే బాబాపై భారం వేసి అమ్మకు త్వరగా ఆరోగ్యం చేకూరేలా అనుగ్రహించమని బాబాను ఆర్తిగా ప్రార్థించసాగాను. 


రెండు రోజుల తరువాత, అంటే మే 22న బాబా తమ మహత్యాన్ని చూపించారు. మా అమ్మగారికి ఒంటికి నీరు పట్టి కొద్దిగా ఆయాసంతో ఇబ్బందిపడుతున్నారని చెప్పాను కదా! మా అమ్మగారి ఆరోగ్య పరిస్థితిని చూసి, ‘తనకు లివర్ సమస్యగానీ, కిడ్నీ సమస్యగానీ ఉండవచ్చ’ని నేను, వైద్యుడైన నా స్నేహితుడు అనుకున్నాము. పై అనుభవాల ద్వారా బాబా నాకు భరోసా ఇచ్చారనే ధైర్యంతో నేను మా అమ్మగారికి అన్ని టెస్టులూ చేయించాను. సాయి మహరాజ్ మిరాకిల్ చూపించారు. అమ్మకి కిడ్నీ సమస్యగానీ, లివర్ సమస్యగానీ ఏదీ లేదు. మేజర్ ఆర్గాన్స్ అన్నీ బాగున్నాయి. కేవలం యూరిన్ ఇన్ఫెక్షన్, రక్తహీనత వల్ల మాత్రమే తనకు అలా జరిగిందని రిపోర్టులలో తెలిసింది. ఇది కేవలం సాయిబాబా మహత్యం మాత్రమే! నేను, నా స్నేహితుడు వైద్యసంబంధ వృత్తులలో ఉండటం వల్ల ఈ విషయం నేను ఖచ్చితంగా చెప్పగలను. మా అమ్మకి మేజర్ ఆర్గాన్స్‌కి ఏ నష్టమూ వాటిల్లకుండా చాలా చిన్న సమస్యతో సరిపోయింది. బాబా దయవల్ల మరుసటి గురువారానికి అమ్మకు ఆయాసం పూర్తిగా తగ్గిపోయింది, శరీరంలోని నీరు 50 శాతం వరకు తగ్గింది. ఇంకో వారంలో పూర్తిగా తగ్గిపోతుందని అనుకున్నాం కానీ, ఆ 50 శాతం నీరు అలాగే ఉండిపోయింది. నా స్నేహితుని రూపంలో బాబా వైద్యం చేస్తున్నప్పటికీ నాకు కాస్త భయంగా అనిపించింది. ఒకరోజు బాబాను వేడుకుని సచ్చరిత్ర తెరిచాను. చాలా విచిత్రంగా, అంతకుముందు నేను సాయి మహరాజ్ సన్నిధి వాట్సాప్ గ్రూపులో స్క్రోల్ చేసినప్పుడు ఏ వాక్యమైతే వచ్చిందో అదే వాక్యం - "దయామయుడైన ఈ ఫకీరు నిన్ను తప్పక రక్షించును. నాయందు విశ్వాసముంచుము. భయపడకు, ఆందోళనపడవద్దు" అని సచ్చరిత్ర పుస్తకంలో మళ్ళీ కనిపించింది. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అదే సమయంలో ధైర్యం కూడా కలిగింది. సాయిబాబా ఒక్కసారి అభయమిచ్చిన తర్వాత మనం నమ్మినా, నమ్మకపోయినా ఆయన మనల్ని ఖచ్చితంగా కాపాడి తీరుతారు. కాబట్టి నేను కొంచెం స్థిమితపడి బాబాపై నమ్మకంతో వేచి ఉండసాగాను. మరో వారం గడిచేటప్పటికి అమ్మకి చాలావరకు నార్మల్ అయింది. ప్రస్తుతం అమ్మకి పూర్తిగా ఆరోగ్యం చేకూరింది. కొద్దిపాటి నీరసం మాత్రమే ఉంది. మిగిలిన ఈ చిన్న సమస్య కూడా అతిత్వరలో తగ్గిపోయి మా అమ్మకి సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. బాబా ఖచ్చితంగా తొందరలోనే అమ్మకు పూర్తి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారనే నమ్మకం నాకుంది. అంతా సాయి మహరాజ్ దయ. ఏది ఏమైనా మనల్ని రక్షించేది, కాపాడేది ఆ సాయినాథుడే! ఒకరోజు అటూ ఇటూ కావచ్చు, కానీ కాపాడటం మటుకు పక్కా. మా ఇంటిలోని వారందరినీ ఆ సాయినాథుడు ఎల్లవేళలా అనుక్షణం వెన్నంటి కాపాడుతూ, రక్షిస్తూ, సంపూర్ణ ఆరోగ్యాన్ని చేకూరుస్తున్నారు. మాకు ఆ సాయినాథుడే రక్ష. త్వరలో బాబా అనుగ్రహించిన మరొక లీలా మహత్యాన్ని మీతో పంచుకుంటాను. 


అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ 

తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సాయినాథ!


చెప్పినట్లే, వెంటే ఉంటూ అనుగ్రహించిన బాబా

 

సాయిబంధువులకు నమస్కారం. నా పేరు గీత. నాకు బాబాతో అనుబంధం చిన్నప్పటినుంచి ఉంది. కానీ ఈమధ్య ఆ అనుబంధం చాలా బలపడింది. బాబా నాకు ఎన్నో సమస్యల్లో దారిచూపారు. అందులోనుండి ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను. ఈమధ్య, అనగా 2021, మే 10న మా అమ్మానాన్నలకు జ్వరం వచ్చింది. దాంతోపాటు ఒళ్ళునొప్పులు కూడా ఉన్నాయి. ఫోన్ ద్వారా విషయం తెలుసుకున్న నాకు ఏం చేయాలో తెలియలేదు. ఎందుకంటే, నేను వాళ్లకు చాలా దూరంలో ఉన్నాను. అసలే కరోనా కాలం. అయినా సరే, ధైర్యం చేసి మరుసటిరోజు బయలుదేరి వెళదామని అనుకున్నాను. కానీ అంతలోనే లాక్‌డౌన్ అని తెలిసి చాలా భయపడ్డాను. అయినప్పటికీ 2021, మే 11 మధ్యాహ్నం 4.30 గంటలకు ఇంటినుండి ఆటోలో బయలుదేరాము. నేను నా మనసులో బాబాను తలచుకుంటూ, "మేము బయలుదేరాం బాబా. బస్టాండుకి చేరుకునేలోపు మీరు దర్శనం ఇవ్వండి బాబా" అని అనుకుంటూ ఆటోలో కూర్చున్నాను. వెంటనే, బాబా నాట్యం చేస్తున్న ఫోటో నాకు కనిపించింది. దాంతోపాటు, "నీవు గమ్యస్థానం చేరేలోపు అంతా సర్దివుంచుతా! నేను నీ వెంటే ఉంటాను" అన్న బాబా సందేశం కూడా ఉంది. ఇంక నా ఆనందానికి అంతే లేదు. మేము మూడు బస్సులు మారి మా ప్రయాణం సాగించాము. చెప్పినట్లే, ప్రతి బస్సులోనూ బాబా మాకు దర్శనం ఇచ్చారు. బాబా ఆశీస్సులతో మా ప్రయాణం సౌఖ్యంగా సాగి క్షేమంగా గమ్యం చేరుకున్నాం. మరుసటిరోజు తెల్లవారాక అమ్మానాన్నలకు కోవిడ్ టెస్టు చేయించాము. మా నాన్నకు కొద్దిగా పాజిటివ్ వచ్చినప్పటికీ బాబా దయవలన అమ్మకు నెగిటివ్ వచ్చింది. అమ్మను వారం రోజులు విశ్రాంతి తీసుకోమన్నారు. బాబా దయతో నాన్న కూడా ఇంట్లోనే ఉంటూ వారం రోజులు మందులు వాడారు. ఆ తరువాత టెస్ట్ చేయిస్తే నెగిటివ్ వచ్చింది. కానీ నాన్న బాగా నీరసించిపోయారు. అయినప్పటికీ బాబా దయవల్ల తొందరగానే చాలావరకు కోలుకున్నారు. "బాబా! అమ్మానాన్నలకు తగ్గితే బ్లాగులో పంచుకుంటానని మీతో చెప్పాను, కానీ కొద్దిగా ఆలస్యమైంది. తండ్రీ! నీ చల్లని దృష్టితో మాకు ఎల్లప్పుడూ రక్షణనివ్వు. నేను మిమ్మల్ని కోరుకునేది ఒక్కటే, మమ్మల్ని ఎన్నడూ మీ నుండి దూరం చేయకు తండ్రీ!"


ఓంసాయి శ్రీసాయి జయజయసాయి.


12 comments:

  1. Om sai ram today is my dearest daughter birthday please give her long life with happiness. Bless her sai baba. Be with her this is my desire. Make that come true. Om sai ram❤❤❤ 💕

    ReplyDelete
  2. Happy birthday veni dear. Bless you by baba om sai ram❤❤❤❤

    ReplyDelete
  3. Baba be with her. Give happiness to her.complete her desires in her life. Om sai ram❤❤❤❤

    ReplyDelete
  4. Om Sri Sai Ram ��������

    ReplyDelete
  5. Om Sairam 🙏🕉😊❤🌹🌹📿

    ReplyDelete
  6. Kothakonda SrinivasJune 25, 2021 at 4:30 PM

    ఓం సాయిరాం!

    ReplyDelete
  7. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  8. Om sai ram baba amma arogyam bagundali thandri pleaseeee

    ReplyDelete
  9. Baba ee gadda ni karginchu thandri

    ReplyDelete
  10. Baba santosh Carrier bagundali thandri enka day shifts ravali thandri arogyanga vundali thandri pleaseeee

    ReplyDelete
  11. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo