సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహ సుమాలు - 19 వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 19వ భాగం.

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 16

శంకర్రావ్ క్షీరసాగర్ మామ్లేదార్ ఒకసారి బాబా దర్శనానికై వచ్చినప్పుడు బాబా  దక్షిణ అడిగారు. తాను జేబులోనున్న డబ్బులన్నింటినీ బాబా చేతికి ఇచ్చారు. తాను వాడాకు తిరిగి వచ్చాక ఎవరో తనను “నీవు తిరిగి వెళ్ళడానికి డబ్బులెలా?” అని అడిగారు. అందుకు శంకర్రావ్ “బాబా ఇస్తారు” అని చెప్పారు. అదే రోజు సాయంకాలం రహతాకు చెందిన పోస్ట్ మాస్టర్ తన అతిథితో కలసి శిరిడీకి వచ్చారు. ఆ అతిథికి శంకర్రావు కొన్ని సంవత్సరాల క్రితం రూ. 20/- లను అప్పుగా ఇచ్చారు. తాను ఆ డబ్బులను శంకర్రావు అడగకుండానే తిరిగి ఇచ్చారు. అంటే శంకర్రావు ఖర్చులన్నింటికీ ఆ డబ్బులు సరిపోయాయి.

అనుభవం -17

బాబా తమ దేహాన్ని మంగళవారం అక్టోబర్ 15వ తారీఖు, మూడవ పొద్దులో త్యజించారు. అదే రోజు రాత్రి బాబా లక్ష్మణ్ భట్ స్వప్నంలోకి వచ్చి “బాపూసాహెబ్ జోగ్ నాకు కాకడ ఆరతి చేయడానికి రాడు, కారణం తాను నేను చనిపోయానని అనుకుంటున్నాడు. కానీ నేను జీవించే ఉన్నాను. నీవు వచ్చి నాకు కాకడ ఆరతి చేయి” అని చెప్పారు. స్వప్నంలో వచ్చిన ఆజ్ఞ ప్రకారం తెల్లవారుఝామున లక్ష్మణ్ భట్ ద్వారకామాయిలోకి వెళ్ళాడు. కారణం, ఆరోజు బాబా దేహాన్ని ద్వారకామాయిలోనే ఉంచారు. లక్ష్మణ్ భట్ వెళ్ళి అక్కడ ఆరతి చేశాడు. ఆ సమయంలో బాబా చేతులు కదలసాగాయి అని అందరికీ అనిపించింది. మధ్యాహ్నం కూడా ఆరతి ద్వారకామాయిలోనే జరిగింది. 16వ తారీఖు సాయంకాలం బాబా దేహాన్ని బూటీ వాడాకు తీసుకు వచ్చి పెట్టారు. అక్కడ ఆరోజు రాత్రి శేజారతి జరిగింది. తరువాత అక్కడ నిత్యనియమంగా కాకడ ఆరతి, మధ్యాహ్న ఆరతి, సాయంకాలం ఆరతి మరియు శేజ్ ఆరతి అనే క్రమం మొదలై ఇప్పటికీ అప్రతిహతంగా సాగుతూనే ఉంది.

అనుభవం - 18

బాబా మహాసమాధి చెందిన తరువాత రెండు, మూడు రోజులకు శాంతాక్రుజ్ కు  చెందిన మోరేశ్వర్రావు ప్రధాన్ యొక్క మరదలికి బాబా స్వప్నంలో కనిపించి “నీ ట్రంకుపెట్టెలో పసుపు రంగు పీతాంబరం ఉంది. ఆ వస్త్రాన్ని నా సమాధిపై కప్పడానికి పంపించు” అని చెప్పారు. ఆమె ఆ పీతాంబర వస్త్రాన్ని చాలా సంవత్సరాల పూర్వం ట్రంకుపెట్టెలో భద్రపరచి ఉంచింది. ఆ విషయం ఆమెకు గుర్తు కూడా లేదు. లేవగానే ఆమె ఆ స్వప్నాన్ని గురించి మోరేశ్వర్ ప్రధాన్ కు చెప్పింది. వెనువెంటనే ట్రంకు పెట్టె తెరచి, ఆ పీతాంబరవస్త్రాన్ని శిరిడీకి పంపించమని మోరేశ్వర్ ప్రధాన్ కు ఇచ్చింది. ప్రస్తుతం ఆ వస్త్రం ఇక్కడే (శిరిడీలో) ఉంది. అప్పుడప్పుడు ఆ వస్రాన్ని సమాధిపై కప్పి ఉంచుతారు.

అనుభవం - 19

ఒకరోజు తెల్లవారుఝామున లక్ష్మణ్ రావ్ ఉరఫ్ కాకా మహాజని స్వప్నంలో బాబా కనిపించి “నిద్రపోతున్నావా? లే, ఈ రోజు నాది ముప్పయ్యవ రోజు. లేచి ఆ కార్యక్రమం సంగతి చూడు” అని చెప్పారు. మహాజని నిద్ర మేల్కొన్నాడు. తనకు ఏమనిపించిందంటే, ముప్పయ్యవ రోజు ఎప్పుడో అయిపోయి ఉంటుంది అని! కాని మరలా తాను లెక్కపెడితే ఆరోజు ముప్పయ్యవ రోజుగా తేలింది. అప్పుడు తాను బ్రాహ్మణులను పిలిపించి బాబా పాదుకలకు అభిషేకం చేయించాడు మరియు కొందరు భక్తులను భోజనానికి పిలిచి బాబా యొక్క మాసికం యొక్క పుణ్యతిథిని వైభవం జరిపించారు. ఆ తరువాత ప్రతి మాసిక పుణ్యతిథి ముంబాయిలో జరుగుతూ ఉంది.

అనుభవం - 20 


శ్రీ మోరేశ్వర్ ప్రధాన్ గారి పెద్ద కుమారుడు ఒకసారి బాగా జబ్బున పడ్డాడు. ఆ సమయంలో అక్కడ శాస్త్రిబువా అనే తేలంగి బ్రాహ్మణుడు ఉండేవారు. ఆ శాస్త్రిబువా దత్తోపాసకులు. తనకు శ్రీ మోరేశ్వర్, శ్రీ సాయిబాబాను పూజించడం ఇష్టం ఉండేది కాదు. “నీవు బాబాను వదిలేయ్, శ్రీ దత్తుని శరణు చెందు, అప్పుడు నీ కుమారుడు బాగవుతాడు” అని తాను మోరేశ్వర్‌కు చెప్పాడు. “బాబా సాక్షాత్తు దత్తుడే” అని మోరేశ్వర్ చెప్పాడు. అప్పుడు శాస్త్రిబువా, “ఒకవేళ నీ కుమారుడు ఐదు నిమిషాలలో పాలు త్రాగితే, సాయిబాబా సాక్షాత్తు దత్తుడేనని నేను ఒప్పుకుంటాను” అని అన్నారు. “ఉదయం నుండి పిల్లవాడు కోలుకుంటూ త్వరగా పూర్తిగా ఆరోగ్యవంతుడైనట్లయితే, నేను కూడా బాబా దర్శనానికి వెళతాను, మరియు నూట పాతిక రూపాయలు దక్షిణగా సమర్పించుకుంటాను అని కూడా అన్నాడు. శాస్త్రిగారు కోరుకున్న విధంగానే పిల్లవాడు ఐదు నిమిషాలలో పాలు త్రాగసాగాడు. అలానే మరుసటిరోజు నుండి పిల్లవాడు కోలుకోసాగాడు. పిల్లవాడు పూర్తిగా కోలుకున్నాక శాస్త్రిబువా శిరిడీకి బాబా దర్శనానికై వెళ్ళాడు. రూ.125/-లను బాబాకు దక్షిణగా సమర్పించాడు. తరువాత మూడవ పొద్దులో బాబా రూ.5/- లను దక్షిణగా అడిగారు. అప్పుడు మాధవరావ్ దేశ్‌పాండే బాబాతో, “ఉదయం ఆయన 125 రూపాయలను దక్షిణగా ఇచ్చారు. ఇప్పుడు ఇంకో ఐదు రూపాయలు దక్షిణగా ఎందుకు?” అని అడిగాడు. అప్పుడు బాబా, "రూ.125/- దక్షిణగా ఇచ్చింది తన దత్తునికి. నాకు ఎక్కడ ఇచ్చారు?” అని అన్నారు. అప్పుడు శాస్త్రిబువా, బాబా అడిగిన విధంగానే 5 రూపాయలను ఇచ్చారు.

తరువాయి భాగం రేపు 

సోర్స్: సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

సాయిభక్తుల అనుభవమాలిక 60వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1. బదిలీతో పాటు ప్రమోషన్ కూడా అనుగ్రహించారు శ్రీసాయి
  2. శ్రీసాయిబాబా ఎప్పుడూ మాతోనే ఉన్నారు

బదిలీతో పాటు ప్రమోషన్ కూడా అనుగ్రహించారు శ్రీసాయి

ఓం సాయిరామ్! సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు మాలతిరెడ్డి. మేము ప్రస్తుతం ఉంటున్నది కడప. మరోసారి బ్లాగులో అనుభవాలు పంచుకునే అదృష్టం కల్పించిన బాబాకి నా కృతజ్ఞతాపూర్వక నమస్కారములు. ఈ సంవత్సరం జనవరి 15, సంక్రాంతినాడు మేము శిరిడీలో ఉన్నాము. సాయి తండ్రి మమ్మల్ని శిరిడీకి రప్పించటమే ఆశ్చర్యమనుకుంటే, మేము బాబా దర్శనం చేసుకుని రూముకి వచ్చి ఫోన్ తీసి చూసుకుంటే ఇంకా పెద్ద ఆశ్చర్యం! "మీ అనుభవం ఈరోజు బ్లాగులో పోస్ట్ చేస్తున్నాం సాయి" అంటూ మెసేజ్ ఉంది. నాకు పట్టరానంత సంతోషం కలిగింది. కొన్నిరోజుల ముందు నేను పంపిన నా మొదటి అనుభవాన్ని(మా అబ్బాయిపై బాబా కురిపించిన ఆశీస్సులు.) ఆరోజే పోస్ట్ చేయడం బాబా ఆశీర్వాద సూచకంగా అనిపించి నేనెంతో ఆనందించాను. వెంటనే నాకు తెలిసిన సాయిబంధువుకి ఆ వార్త షేర్ చేశాను. తను కూడా చాలా ఆనందంగా ఫీలై, "అంతా సాయిబాబా ఆశీర్వాదం" అని రిప్లై ఇచ్చారు.

శిరిడీనుండి హైదరాబాద్ వచ్చాక మావారు బాబాని తలచుకుని ICT(inter circle transfer) కోటాలో హైదరాబాదుకి బదిలీ కోసం అప్లై చేశారు. చాలా కొద్దిమందికి మాత్రమే ICT లో పోస్టింగ్ ఇస్తారు. అందువలన నేను, "బాబా! మీ ఆశీర్వాదాలతో మావారికి హైదరాబాదుకి బదిలీ అయితే, మావారు అక్కడ జాయినింగ్ అయ్యేరోజే నేను నా అనుభవాన్ని బ్లాగుకి పంపుతాను" అని మ్రొక్కుకున్నాను. మేము కోరుకున్నట్లుగానే బాబా మమ్మల్ని ఆశీర్వదించారు. 2019, మే 29 సాయంత్రం హైదరాబాదుకి బదిలీ అయినట్లు ఉత్తర్వులు వచ్చాయి. ICT లో అవకాశమే తక్కువనుకుంటే, బాబా మాకు హైదరాబాదులోని మంచి బ్రాంచికి బదిలీతో పాటు చీఫ్ మేనేజరుగా ప్రమోషన్ కూడా ఇచ్చారు. "చాలా చాలా చాలా ధన్యవాదములు సాయి తండ్రీ!" ఈరోజు(మే 30) మావారు హైదరాబాదులో జాయిన్ అవుతున్నారు. అందుకే నేను బాబాకు చెప్పుకున్నట్లు నా అనుభవాన్ని మీకు పంపుతున్నాను. తప్పులేవైనా ఉంటే సరిచేసి మీ వీలునుబట్టి బ్లాగులో ప్రచురించండి.


ఇంకొక విషయం, మా అబ్బాయికి బాబా IIT లో సీటు ఇప్పించటమే కాకుండా, తనకి ఎల్లవేళలా తోడుగా ఉంటూ ముందుకు నడిపిస్తున్నారు. రీసెంట్ గా H1B కూడా ఇప్పించారు. "బాబా! మీకు నేను ఎలా ధన్యవాదములు చెప్పుకోగలను?!" నా అనుభవాలు బ్లాగులో పంచుకునే అవకాశం కల్పించిన సాయిబాబాకు, బ్లాగు నిర్వాహకులకు నా ధన్యవాదములు. ప్రస్తుతం మా పెద్దబాబు పెళ్లి విషయం బాబాని అడుగుతూ ఉన్నాను. అది కూడా బాబా తప్పక నెరవేరుస్తారు. అది నెరవేరాక ఆ అనుభవంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ బాబా ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటున్నాను.

శ్రీసాయిబాబా ఎప్పుడూ మాతోనే ఉన్నారు

పేరు వెల్లడించని సాయిభక్తుడు తనకు, తన కూతురికి సాయిబాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

ఓం సాయిరాం! జై సాయిరాం!


 http://shirdisaibabaexperiences.blogspot.com/

నాకు సాయిబాబా వెబ్‌సైటుతో పరిచయం కలిగించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా నా కృతజ్ఞతలు. ఒకసారి వెబ్‌సైటుతో పరిచయం కలిగిన తరువాత, ప్రతిరోజూ క్రమంతప్పకుండా వెబ్‌సైట్ సందర్శించి, బాబాను ప్రార్థించుకుంటుంటేవాడిని. మాతృభూమికి ఎంతోదూరంలో ఉన్న మాకు, వెబ్‌సైట్ ద్వారా శ్రీసాయిబాబాను దర్శించుకొనే భాగ్యం కలిగింది.

రకరకాల మార్గాల ద్వారా శ్రీసాయిబాబా తమ సర్వవ్యాపకత్వాన్ని మనకు తెలియచేసే నా ఈ అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను.

మా అమ్మాయి, నేను శ్రీసాయిబాబాను విశ్వసిస్తాము. నేను ప్రతిరోజూ శ్రీసాయిసచ్చరిత్రలో కొన్ని వాక్యాలైనా పారాయణ చేస్తుంటాను. శ్రీసాయిబాబా అటువంటి మంచి ఆలోచనను నాకు కలిగించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.

మా అమ్మాయి తన చదువు నిమిత్తం మాకు దూరంగా హాస్టల్లో ఉంటున్నది. శ్రీసాయిబాబా ఎల్లప్పుడూ ఆమెను జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నారని నా నమ్మకం. ఒకసారి నేను మా అమ్మాయిని కలవటానికి తన హాస్టలుకు వెళ్ళాను. కాసేపు ఇద్దరం సరదాగా ఆడుతూ, మాట్లాడుతూ గడిపిన తరువాత, ఇద్దరం షాపింగ్ చెయ్యటానికి, దగ్గరలో ఏమైనా మందిరాలు ఉంటే దర్శించటానికి ఆ ఏరియాలోని వీధుల్లో నడవడం మొదలుపెట్టాము. ఆ ఏరియా అంతా మంచి మంచి రోడ్లతో ఎంతో చక్కగా ప్లానింగ్ చేసి ఉంది. హఠాత్తుగా, మా సంభాషణ సాయిబాబా వైపుకి మరలింది. శ్రీసాయిబాబా మనతోనే ఉన్నారని మా అమ్మాయి నాతో చెపుతూ, "కానీ బాబాను దర్శించుకోవటానికి ఈ ఏరియాలో ఒక్క సాయిబాబా మందిరం కూడా లేదు" అని బాధపడింది. ఇంతలో దగ్గరలోనే ఉన్న చిన్న మందిరానికి వెళ్ళటానికి నేను ఒక క్రాస్ రోడ్డులోకి వెళ్లబోతుండగా, అటువద్దని, కొంచెం ముందుకు వెళ్లి వేరే క్రాస్ రోడ్డులోనుంచి వెళితే ఆ మందిరానికి త్వరగా చేరుకుంటామని మా అమ్మాయి నాతో వాదించింది. ఈ మిషతోనైనా మా అమ్మాయితో మరికొంత సమయం గడిపి, ఆ తరువాత తనని హాస్టల్లో దిగపెట్టవచ్చని నాకు అనిపించి, మా అమ్మాయి చెప్పిన దానితో ఏకీభవించి ముందుకు నడవసాగాము. ఆ రోడ్డులో కొన్ని అడుగులు వేశామో లేదో, ఒక పెద్ద సాయిబాబా పటము, ఆ పటం క్రింద, “శ్రీ శిరిడీ సాయి ట్రస్టు” అని వ్రాసి ఉండటం చూచి మేము సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాము. మా అమ్మాయి మాత్రం ఎంతో ఆనందోద్వేగంతో, ‘ఓం సాయిరాం!’ అని పెద్దగా అరిచింది. కానీ మందిరం మూసివుండటంతో మేము బయటనుండే బాబాను దర్శించుకున్నాము. ఈ సంఘటనతో, శ్రీసాయిబాబా ఎల్లప్పడూ మా అమ్మాయితో ఉన్నారని, ఆమెను నిరంతరం రక్షిస్తూ ఉన్నారని సంతోషంతో పొంగిపోయాను.

కొద్దిరోజుల క్రితం, మా అమ్మాయి తనను అకారణంగా ఎవరో విపరీతంగా డిస్టర్బ్ చేస్తున్నారని, దానివల్ల తాను ఎంతో సందిగ్ధంలో ఉన్నట్లు చెప్పినప్పుడు, నేను ఆమె ముఖంలో భయాన్ని, ఆందోళనను గమనించాను. నేను ఆమెతో ఇటువంటి విషయాల గురించి పట్టించుకోవద్దని, చదువు అన్నింటికంటే ముఖ్యం కాబట్టి తనను చదువుమీద ఎక్కువ శ్రద్ధ చూపించమని చెప్పాను. అంతేకాకుండా, ఆమె కోసం 'శ్రీసాయిసచ్చరిత్ర' పారాయణ చేస్తానని కూడా చెప్పి, నేను వెంటనే సప్తాహపారాయణ మొదలుపెట్టాను. ఆ సమయంలో ఆమెకు పరీక్షలు జరుగుతుండటంతో, ప్రతిరోజూ స్నానం చేసిన వెంటనే బాబా ఊదీ నుదుటన ధరించమని తనకు చెప్పాను. రెండవరోజు నేను మా అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు ఆమె, తన రూముకు ఒక పనిమనిషి వచ్చిందని, సాయిబాబా గురించి అడిగి, బాబా ఊదీ కొంచెం ఇవ్వమని అడిగిందని చెప్పింది. అది విన్న వెంటనే నేను, "క్రొత్తవాళ్ళను నీ గదిలోకి అనుమతించి, అనవసరంగా లేనిపోని ప్రాబ్లెమ్స్ ఎందుకు కొనితెచ్చుకుంటావు?" అని ఆమెపై కోపంతో గట్టిగా అరిచి కేకలు వేశాను. కానీ మా అమ్మాయి ఎంతో ప్రశాంతంగా, “దాంట్లో ఏముంది? తను అడిగింది కేవలం సాయిబాబా గురించి, బాబా ఊదీ ఇవ్వమనే కదా! అందుకే కొంచెం బాబా ఊదీ ఇచ్చాను. ఇందులో ఏమీ గాభరాపడాల్సిన అవసరం లేదు” అని అన్నది. నేను మాత్రం ఆ రాత్రంతా ఆమెను రక్షించమని శ్రీసాయిబాబాను ప్రార్థిస్తూనే ఉన్నాను. మరుసటిరోజు ఉదయం నేను శ్రీసాయిసచ్చరిత్ర పారాయణ చేస్తున్నప్పుడు, 20వ చాప్టరులోని, “దాసగణు సందేహాన్ని కాకాసాహెబ్ దీక్షిత్ పనిపిల్ల తీర్చిన వైనం!“ వచ్చింది. అది చదివాక, “నిన్న మా అమ్మాయి రూముకు వచ్చిన పనిమనిషి మరెవరో కాదు, సాక్షాత్తూ శ్రీసాయిబాబానే!” అన్న బాబా సందేశం నాకు స్ఫురించి, నా కళ్ళు ఆనందాశ్రువులతో నిండిపోయాయి. అలా పనిమనిషి రూపంలో వచ్చి ఊదీ అడిగిన బాబా తాము సర్వవ్యాపి అని నిరూపించారు.

అదేరోజు సాయంత్రం నేను మా అమ్మాయికి ఫోన్ చేసి, జరిగిన విషయమంతా చెప్పి, బాబా ఆమెతోనే ఉన్నారని, అందువలన పరిస్థితులన్నీ చక్కబడతాయని, ఆయనపై విశ్వాసాన్ని నిలుపుకోమని సంతోషంతో చెప్పాను. ఈరోజుకు కూడా, అవే ఆలోచనలు, అవే వాక్యాలు నా మదిలో మెదులుతూ ఉంటాయి. శిరిడీ ఇక్కడికి ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్నా, శ్రీసాయిబాబా ఎప్పుడూ మాతోనే ఉన్నారు.

source: https://www.shirdisaibabaexperiences.org/2009/06/shirdi-sai-baba-devotee-experience.html?m=0

సాయి అనుగ్రహ సుమాలు - 18వ భాగం


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 18వ భాగం

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం -13

ఒకసారి నా స్నేహితుడు బాబా దర్శనానికై వచ్చారు. బాబా దగ్గర కూర్చొన్నాక బాబా  పాదాలను మర్ధన చేయసాగారు. అలా మర్దన చేస్తుండగా బాబా ఒక్కసారిగా "మర్ధన చేయవద్దు. అలా ప్రక్కకు జరిగి కూర్చో” అని అన్నారు. బాబా చెప్పిన విధంగానే
ఆ గృహస్తు వెనుకకు జరిగి కూర్చొన్నారు. కొంచెం సేపటికి తన కళ్ళు నీళ్ళతో నిండాయి. కాసేపటి తరువాత మరలా తాను బాబా పాదాలను మర్ధన చేయసాగాడు. అప్పుడు, బాబా ఏమీ అనలేదు. తరువాత వాడాకు వచ్చినప్పుడు తాను “మొదట బాబా చరణ సేవ  చేసుకుంటున్నప్పుడు మనసులో అమంగళకరమైన ఆలోచనలు వచ్చాయి. తక్షణమే బాబా నన్ను వెనుకకు జరిగి కూర్చోమని చెప్పారు. తరువాత నాకు ఆ విషయంగా పశ్చాత్తాపం కలిగింది. మనసులోనే బాబాకు క్షమాపణలు అడిగాను. తరువాత మరలా బాబా పాదాలు మర్దన చేసుకుంటున్నప్పుడు బాబా అందుకే ఏమీ అనలేదు” అని చెప్పాడు. అటువంటి అనుభవాలను బాబా నిత్యం తమ భక్తులకు ప్రసాదిస్తూ ఉంటారు. బాబా శిక్షణను ఇచ్చే పద్ధతి అవర్ణనీయమైనది.

అనుభవం -14

ఒకరోజు ఉదయం ఎప్పటిలాగానే బాబా దర్శనానికి వెళ్ళాను. అప్పుడు బాబా ధుని వద్దనే నిలబడి ఉన్నారు. నేను వెళ్ళి చరణాలకు నమస్కారం చేసుకోగానే బాబా  “అరే! నీకెందుకు ఆందోళన? ఆందోళనంతా నాది” అని అన్నారు. నేను మరలా నమస్కారం చేసుకుని “అవును, నిజంగానే ఆందోళనంతా మీదే” అని అన్నాను. బాబాకు మన పట్ల మనకంటే ఎన్నోరెట్లు ఆందోళన ఉండటం వలన, ఆ అనుభవాలు నిత్యం కలుగుతుండటం వలన బాబా మాటలు అక్షరం అక్షరం బోధపడ్డాయి. అయినప్పటికీ ఈ రోజు ప్రత్యేకించి అలా ఎందుకన్నారో అర్థం కాలేదు. ఆ మాటలకు అర్థం నేను ముంబాయికి వెళ్ళాక బోధ పడింది. ఏరోజయితే బాబా ఆ మాటలను అన్నారో, అదేరోజు నా కుమార్తె పార్లీలోని మా ఇంట్లో డ్రాయింగ్ రూమ్లో ఆడుకుంటూ మూలనున్న బీరువాపై ఎక్కసాగింది. అప్పుడు జారి పడిపోయింది. తాను క్రింద పడిపోయి, తనపై బీరువా పడింది. ఆ బీరువాపై గాజువి మరియు లోహపు ఆటబొమ్మలు ఉన్నాయి. అందరి భారాన్ని మోసే ఆ ప్రభువు యొక్క కృపవలన, ఆ ఆటబొమ్మలన్నీ చేతితో తీసి పెట్టినట్లుగా ప్రక్కకు పడిపోయాయి మరియు అమ్మాయికి కొంచెం కూడా దెబ్బ తగలలేదు. తనచేతి గాజు పగిలిపోవడం వలన చేయి మీద కొంచెం గీసుకుపోయింది.

అలాగే ఒకరోజు రాత్రి ఆ అమ్మాయి శౌచవిధి కోసం వెళ్ళగా  అక్కడ పెద్ద పాము ఉంది. అప్పుడు అమ్మాయి వయసు 5 సంవత్సరాలు. ఆ పాము అమ్మాయిని చూడటానికి ముందే అమ్మాయితో ఉన్న మనిషి ఆ పాముని చూసి వెంటనే అమ్మాయిని ఎత్తుకొని బయటకు తీసుకువచ్చేసింది.

అనుభవం - 15

దహణుకు చెందిన ఉద్దవేశ్ బువా కొంతమందితో కలసి ఒకసారి ద్వారకా యాత్రకు వెళ్ళాడు. ముంబాయి నుండి ఓడలో వెళ్ళారు. అందరి టిక్కెట్లు బువా వద్ద, ఉన్నాయి. టిక్కెట్లు రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి ఓడ టిక్కెట్లు, రెండవది లగేజ్ టిక్కెట్లు. బువా లగేజ్ టిక్కెట్లను వేరుగా కొని జేబులో పెట్టుకున్నాడు. ఓడ టిక్కెట్లను డబ్బులున్న పర్సులో పెట్టుకున్నాడు. ఓడపై ఉన్నప్పుడు తాను ఏదో కారణంగా డబ్బులున్న పర్సును బయటకు తీయవలసి వచ్చింది. ఆ సమయంలో తాను రెయిలింగ్ వద్ద నిలబడి ఉన్నాడు. పర్సు తీయగానే టిక్కెట్లు జారిపోయి సముద్రంలో పడ్డాయి. అంటే ఓడ టిక్కెట్లు మరియు బువా డబ్బులు మొత్తం సముద్రం పాలయ్యాయి. ఓడ నుండి దిగేటప్పుడు టిక్కెట్టు ఇవ్వవలసి ఉంటుంది. బువా టికెట్ కలెక్టర్ తో జరిగిన విషయమంతా చెప్పాడు. టికెట్ తీసుకున్నట్లు ఋజువుగా లగేజీ టిక్కెట్లను కూడా చూపించారు. దాంతో టికెట్ కలెక్టర్ జరిగిన విషయాన్ని అర్థం చేసుకుని వారికి ఏ విధమైన ఆటంకం కలిగించలేదు. ద్వారకలో దిగిన తరువాత గోమతి స్నానానికి, దేవి చరణస్పర్శకు, పూజకు డబ్బులు అవసరమవుతాయి. కానీ బువా వద్ద డబ్బులు ఏ మాత్రం మిగల్లేదు. బాబాపై దృఢమైన శ్రద్ధ ఉండటం వలన “నిన్ను తప్ప ఇతరులను దీన ముఖం వేసుకొని ఏమి అడిగేది” అనే సంతోక్తిని అనుసరించి, ఇతరులను ఎవరినీ అడగకుండా శిరిడీకి బాబాకు ఉత్తరం వ్రాసాడు. ఏ రోజయితే తాను శిరిడీకి ఉత్తరం వ్రాసాడో అదే రోజు రాత్రి బాబా దహణుకు చెందిన ఒక ధనిక భక్తునికి స్వప్నంలో కనిపించి, తనకు సముద్రంలో బువా పర్సు పడిపోయిన విషయం చెప్పి, వెనువెంటనే డబ్బులు పంపించవలసిందిగా ఆజ్ఞాపించారు. మరుసటిరోజు ఆ భక్తుడు బువాకు రూ. 50/- లను మనియార్డరు ద్వారా పంపుతూ, జరిగిన వృత్తాంతాన్ని వివరిస్తూ వ్రాసారు.

తరువాయి భాగం రేపు.

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

సాయిభక్తుల అనుభవమాలిక 59వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవం:

  • మా దైవం సాయిబాబా

విజయవాడ వాస్తవ్యులైన ఇందిరగారు తమ అనుభవాలనిలా మనతో పంచుకుంటున్నారు:

1. మావారికి 2002లో చాలా జబ్బు చేసింది. చాలామంది డాక్టర్లని సంప్రదించాము. కానీ సమస్య ఏమిటన్నది తెలియలేదు. చివరికి మంగళగిరిలో ఉన్న నెమ్ము స్పెషలిస్టుకి చూపించాము. ఆయనకి కూడా అర్థంకాక ఇంకో డాక్టర్ దగ్గరకి పంపించారు. ఆయన స్కాన్ తీయించి, లంగ్ క్యాన్సర్ అని చెప్పారు. కీమోథెరపీ 6 సిట్టింగులు పెట్టాలని చెప్పారు. మా పెద్దమ్మాయి రేవతికి బాబా కనబడుతుంటారు. ఏదైనా అడిగితే సమాధానం చెపుతుంటారు. అక్టోబర్ నెలలో మొదటి కీమోథెరపీ ఉండగా ఆ ముందురోజు మా అమ్మాయితో మావారు, 'బాబాని రమ్మ'ని చెప్పమన్నాను. మా అమ్మాయి అడిగితే, "వాళ్ళని వెళ్ళమను, నేను వాళ్ళకంటే ముందుగానే అక్కడ ఉంటాను" అని చెప్పారు. మర్నాడు మేము డాక్టర్ దగ్గరకి వెళ్ళేసరికి అప్పుడే ఎవరో బాబా క్యాలెండర్ ఇచ్చివెళ్లారట, దానిని మా ముందే గోడకు తగిలించారు. తరువాత డాక్టర్, "కీమోథెరపీ చేసేటప్పుడు లోపల ఉన్న గడ్డ పగిలి ఆయాసం రావచ్చు, పేషంట్ తట్టుకుంటే ఫరవాలేదు. లేదంటే ప్రాణం పోయే ప్రమాదం ఉంది" అని చెప్పారు. బాబా దయవలన ఆయాసం వచ్చినప్పటికీ మావారు తట్టుకోగలిగారు. అలా 2004 మార్చి వరకు బాబా వారిని కాపాడారు. తరువాత బాబా మా అమ్మాయితో, "వాడు అప్పుడే పోవలసినవాడు, 18 నెలలు లాక్కొచ్చాను, ఇక నావల్ల కాలేదు" అని చెప్పారు.

2. మా పెద్దమ్మాయి డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడు ఒకసారి తన స్నేహితురాలు తన కుటుంబంతో శిరిడీ వెళ్ళింది. ఆ అమ్మాయి బాబా దర్శనం చేసుకుని సమాధిమందిరం లోపలినుండి బయటకు వస్తుంటే ఒక పూజారి తనని పిలిచి ఒక ఆరెంజ్ కలర్ త్రాడు, ప్రసాదము ఇచ్చి, "నీ స్నేహితురాలు రేవతికి ఇచ్చి, తనని అడిగినట్లు చెప్పు" అన్నారట. ఆ అమ్మాయి శిరిడీనుండి వచ్చాక మా అమ్మాయికి ప్రసాదం, త్రాడు ఇచ్చి, "మీకు శిరిడీలో చుట్టాలు ఉన్నారా?" అని అడిగింది. అందుకు మా అమ్మాయి, "మాకు శిరిడీలో తెలిసిన వాళ్లెవరూ లేరు" అని చెపితే, తను, "ఏమో నాకు తెలియదుగాని, అక్కడ పూజారి మాత్రం ఈ త్రాడు, ప్రసాదం నీకిచ్చి, అడిగానని కూడా చెప్పమన్నారు" అని చెప్పింది. ఆ విషయం మా అమ్మాయి నాతో చెప్పింది. నేను తనతో, "ఆ రూపంలో బాబాయే నీకు త్రాడు, ప్రసాదం పంపించారు" అని చెప్పి ఆ త్రాడు మా అమ్మాయి చేతికి కట్టి, ప్రసాదాన్ని అందరమూ తీసుకున్నాము. ఈ సంఘటన సుమారుగా 2003లో జరిగింది. 

3. తరువాత అదే సంవత్సరంలో ఒకసారి నేను చపాతీలు, బంగాళదుంప కూర చేసి స్టవ్ ప్రక్కన పెట్టాను. ఆరోజు మా రెండవ అమ్మాయి స్కూల్ నుండి చాలా ఆలస్యంగా వచ్చింది. తను వచ్చాక అందరమూ తినడానికి కూర్చున్నాము. అప్పుడు చూస్తే చపాతీ కొంచెం త్రుంచి ఉంది, ప్రక్కన ఉన్న కూర మధ్యలో కొంచెం తీసినట్టుగా గుర్తులు ఉన్నాయి. నాకేమీ అర్థంకాక, "మీలో ఎవరన్నా తిన్నారా?" అని పిల్లల్ని అడిగాను. వాళ్ళు 'మేము తినలేదు' అని అన్నారు. తరువాత మా అమ్మాయికి బాబా కనిపించి, "నేనే తిన్నాను" అని చెప్పారు.

4. 2003 కార్తీకమాసంలో మా అమ్మాయి తన స్నేహితులతో కలిసి వనభోజనానికి వెళ్ళింది. నేను తనకి చపాతీలు చేసి ఇచ్చాను. వాళ్లంతా మధ్యాహ్నం తింటున్న సమయంలో ఒక కుక్క వచ్చి వాళ్ళ దగ్గర కూర్చుందట. తన స్నేహితుల్లో ఒకరు, "రేవతీ! ఒక చపాతీ దానికి పెట్టు" అన్నారు. మా అమ్మాయి వెళ్ళి చపాతీ పెడితే, "నేనే" అని బాబా నిజరూప దర్శనం ఇచ్చారు. మా అమ్మాయికి మాత్రమే బాబా కనబడ్డారు.

5. మా అమ్మ మా అమ్మాయితో, "బాబాని ఒక్కసారి దర్శనం ఇమ్మని చెప్పమ"ని అడుగుతూ ఉండేది. ఒకరోజు అమ్మ మెట్లు ఎక్కుతుండగా మెట్లమీద చిన్న పాము కనిపించింది. దాని కళ్ళు మెరుస్తూ ఉన్నాయి. అమ్మ వెంటనే క్రిందకి దిగిపోయి, "మెట్లమీద పాము ఉంద"ని అందరినీ పిలిచారు. వాళ్లు వచ్చి చూస్తే అక్కడ ఏ పామూ లేదు. అంతా వెతికారు గానీ ఎక్కడా పాము కనపడలేదు. తరువాత అమ్మ, "బాబానే ఆ రూపంలో వచ్చారా?" అనే అనుమానంతో మా అమ్మాయితో బాబాని అడగమని చెప్పింది. మా అమ్మాయి బాబాని అడిగితే, "వచ్చింది నేనే! లేకపోతే నాకు కనపడు, కనపడు అంటుందా? అందుకే అలా దర్శనమిచ్చాను" అన్నారు.

6. మా అమ్మకి 2005లో కంటిలో శుక్లాలు వచ్చాయి. డాక్టర్లు ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ ముందురోజు మా అమ్మ మా అమ్మాయితో, "బాబాని రమ్మని చెప్పమ్మా" అని అడిగారు. అందుకు బాబా, "సరే, వస్తాలే!" అని చెప్పారు. మర్నాడు ఉదయం 8 గంటలకి ఆపరేషన్ థియేటర్ లోపలికి అమ్మని తీసుకుని వెళ్లారు. కంట్లో మందువేసి దూదితో కంటిమీద తిప్పేసరికి శుక్లమ్ ముక్కలు ముక్కలుగా అయిపోయిందట. అలా జరగడం నిజంగా ప్రమాదమట. తరువాత 8 గంటల 10 నిమిషాలకి బాబా లోపలికి వెళ్లారు. బాబాని చూసిన మా అమ్మాయి, "అమ్మా! బాబా ఇప్పుడే లోపలికి వెళ్లారు" అని చెప్పింది. బాబా లోపలికి వెళ్లకపోయుంటే అమ్మ కన్ను పోయేదే! కానీ బాబా దయవలన అమ్మ కన్ను బాగయింది.

7. మా అమ్మానాన్న కాశీ వెళ్లినప్పుడు ఏదో ఒకటి అక్కడ వదిలిపెట్టాలని మా నాన్న జామకాయ వదిలి వచ్చేసారు. ఆ తరువాత కొన్నాళ్లకి వాళ్ళిద్దరికీ షుగర్ వ్యాధి వచ్చింది. షుగర్ వ్యాధిగ్రస్తులు తినాల్సిన పండ్ల రకాలు చాలా తక్కువ కావడంతో మా నాన్న మా అమ్మాయితో, "జామకాయ తినొచ్చా?" అని బాబాని అడగమన్నారు. అందుకు బాబా, "కాశీలో వదిలిపెట్టారు, అదెలా కుదురుతుంది?" అని చెప్పారు. రెండురోజుల తరువాత నాకొకరు పెద్ద జామకాయ ఇచ్చారు. నేను దానిని కడిగి బాబాకి నైవేద్యంగా పెట్టాను. నేను అప్పట్లో టీచర్‌గా పనిచేస్తుండేదాన్ని. నేను స్కూలుకి వెళ్లి సాయంత్రం వచ్చి చూస్తే బాబాకు పెట్టిన జామకాయ లేదు. పిల్లలు తిన్నారేమో అని నేను ఊరుకున్నాను. మా ఇంటి వెనుక లైనులో మా అమ్మా వాళ్ళు ఉంటారు. సాయంత్రం 6 గంటలకి నన్ను మా అమ్మ పిలిచి, ఇంటిలో దేవుడి దగ్గర ఒక కవరులో పెట్టి ఉన్న జామకాయను చూపించారు. అది నేను ఉదయం బాబాకి పెట్టిన జామకాయే! పైగా ఆ కవరు నేను ప్రక్కన పడేసిన నల్లని కవరే! అప్పుడు అర్థమైంది, మా నాన్న 'జామకాయ తినవచ్చా' అని బాబాని అడిగారు కదా! అందుకు సమాధానంగా మా ఇంట్లో జామకాయను మాయం చేసి, వాళ్ళ ఇంట్లో పెట్టి 'తినవచ్చ'ని బాబా తెలియజేసారు.

8. మా పెద్దమ్మాయి పెళ్లి సందర్భంగా మొదటి శుభలేఖను బాబా వద్ద పెట్టి పెళ్లికి రమ్మని ఆహ్వానించాను. తరువాత ఆ విషయమే మర్చిపోయాను. పెళ్లిలో మేమంతా బిజీగా ఉన్న సమయంలో ఒకావిడ వచ్చి మా అమ్మతో, "నాకు భోజనం పెడతారా?" అని అడిగారు. మా అమ్మ ఆవిడకు భోజనం పెట్టించారు. ఆవిడ భోజనం చేస్తూ నావైపే చూస్తూ ఉన్నారట. తరువాత మా అమ్మ ఆ రూపంలో బాబానే వచ్చారని, ఆవిడ కళ్ళు నీలిరంగులో ఉన్నాయని చెప్పారు. ఆ విషయం తెలిసి బాబాని పిలిచి, అయన వస్తే గుర్తుపట్టలేకపోయానని చాలా బాధపడ్డాను. 

సాయి అనుగ్రహ సుమాలు - 17వ భాగం


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 17వ భాగం

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 8

నా మిత్రుడొకరు ఒక రోజు బాంద్రాలో బాబా చిత్రపటానికి పూజ చేసుకుంటున్నారు. బాబాకు అలంకరించడానికి పూలను సిద్ధం చేసుకున్నారు. వాటిలో ఉత్తమమైన మోగ్రా పూలు కూడా ఉన్నాయి.  పూలను బాబా చిత్రపటానికి అలంకరించాలని తన కోరిక. కానీ పూలు పెద్దవిగా ఉండటం వలన గంధంలాగ అతుక్కునే అవకాశం లేదు. బాబా ఎప్పుడూ పూలను ముక్కు వద్ద ఉంచుకొనే వారనే విషయం తనకు గుర్తుకు వచ్చింది. అప్పుడు పూలను ముక్కు వద్దకు తీసుకు వెళ్లి మరలా క్రింద పెట్టాలనేది తన ఆలోచన. కానీ ఆ పూలు  ముక్కు వద్ద అతుక్కోన సాగాయి. ఆ పూలు సాయంకాలం వరకు అలాగే అతుక్కునే ఉన్నాయి.

అనుభవం - 09

శిరిడీలో బాబూ ఖరండీకర్ అనే పేరు గల బ్రాహ్మణుడు ఉండేవాడు. శాంతి అనే మూడేళ్ళ వయసు కలిగిన తన కూతురు  సాఠెవాడా వెనుక భాగంలోనున్న బావిలో పడింది. చాలాసేపు బావిలోనే ఉంది. తరువాత తనను బయటకు తీసి చూస్తే, తనకు ఏమాత్రం చిన్న దెబ్బ కూడా తగలలేదు. “బాబా నన్ను కిందపడకుండా పట్టుకున్నారు” అని తను చెప్పసాగింది. తనకు తాను బాబా సోదరినని చెప్పుకొనేది. బాబాకు తన పట్ల ఎంతో ప్రేమ.

అనుభవం - 10

చిదంబర్ కేశవ్ గాడ్గిల్  అనే పేరు కలిగిన బాబా భక్తుడు ఒకరు ఉండేవారు. ఆయన ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసేవారు. కొన్నిరోజులు నగర్ జిల్లా కలెక్టర్ కు కార్యదర్శిగా పని చేసారు. తరువాత సిన్నూర్ లో  మమ్లేదార్ గా పని చేసారు. తనకు తరచు బాబా దర్శనభాగ్యం కలుగుతుండేది. సిన్నూర్ నుండి తనకు చాలా దూరానికి బదిలీ అయింది. వెంటనే వెళ్ళి చేరవలసిందిగా ఉత్తర్వులు వచ్చాయి. బాబా దర్శనానికి వెళ్ళే అవకాశం లేకుండా పోయింది. తాను కోపర్గాం నుండే రైలులో వెళ్ళాడు. కాని బాబా దర్శనానికి వెళ్ళలేకపోవడంతో చాలా చింతించసాగాడు. తరువాత బండి వెళుతున్నప్పుడు ఒక్కసారిగా కిటికీ ద్వారం నుండి ఒక కాగితపు పొట్లం వచ్చి తన శరీరంపై పడింది. విప్పిచూస్తే అందులో ఊదీ లాంటి పొడి కనపడింది. ఆ పొట్లాన్ని తాను జాగ్రత్తగా దాచుకున్నాడు. తరువాత కొన్ని రోజులకు బాబా దర్శనానికి వెళ్ళే భాగ్యం కలిగింది. అప్పుడు బాబా తమకు తామే “నీవు రాలేదని నీకు ఊదీ పంపించాను. నీకు చేరింది కదా?” అని అన్నారు. ఆ మాటలు వినిన గాడ్గిల్ ఎంతో ఉద్వేగానికి లోనయ్యాడు. తరువాత తాను ఆ ఊదీని ఒక తాయెత్తులో పోసి ఉంచాడు. చివరి వరకు ఆ తాయెత్తు తనవద్దే ఉండేది.

అనుభవం - 11

నాకు పని మీద ఇండోర్ కు వెళ్ళవలసి ఉంది. మన్మాడ్ మీదుగా వెళ్ళవలసి ఉండటంతో శ్రీ సద్గురు సాయిబాబా దర్శనం చేసుకొని తరువాత ముందుకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాను. నా స్నేహితులు నన్ను శిరిడీకి వెళ్లవద్దని చాలా దూరం చెప్పి చూసారు. “బాబా సమయానికి బయలుదేరడానికి అనుమతి ఇవ్వరు" అని వారి   అభిప్రాయం. అప్పుడు నేను వారితో “ఇండోర్ కు వెళ్ళడానికి ఇంకా రెండు రోజుల సమయం ఉంది. ఈ లోపల వెళ్ళి బాబా దర్శనం చేసుకొని తరువాత ఇండోర్ కు  వెళ్ళాలని నిర్ణయించుకున్నాను” అని చెప్పాను. నేను సంకల్పం చేసుకున్న విధంగానే శిరిడీ వెళ్ళాను. శ్రీ సద్గురు సాయిబాబా దర్శనం కోసం ద్వారకామాయిలోకి వెళ్ళాక బాబా నన్ను “ఎప్పుడు బయలుదేరుతున్నావ్?” అని అడిగారు. “మీరు ఈ రోజు వెళ్ళమని ఆజ్ఞాపిస్తే, ఈ రోజే బయలుదేరి వెళతాను” అని చెప్పాను. కానీ నాకు రెండు రోజులు ఉండే సమయం ఉంది. ఆ విషయాన్నే బాబాకు చెప్పాను. ఆ విషయం చెప్పగానే “రెండు రోజులు ఉండి వెళ్ళు” అని బాబా ఆజ్ఞాపించారు. బాబా ఆజ్ఞ ప్రకారం నేను రెండు రోజులు ఉండి తరువాత ఇండోర్ కు వెళ్ళాను. అర్థమేమిటంటే నా మిత్రుల భయం నిరర్థకమైంది.

అనుభవం - 12

సఖారామ్ హరి ఉరఫ్ బాపుసాహెబ్ జోగ్ గారి మాతృశ్రీ మరణించారు. ఆవిడ ఉత్తరక్రియల కోసం తాను నాసిక్ వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. అందుకోసం బాబాను అనుమతి ఇవ్వమని అడిగాడు. బాబా అనుమతి ఇవ్వడం ఒక్కొక్కరోజు వాయిదా వేస్తూ వచ్చారు. అప్పుడు బాపూసాహెబ్ బాబాతో “బాబా, మా శాఖ యొక్క బ్రాహ్మణులు ఇక్కడ ఉండరు. అందువలన నేను ఈ రోజు నాసిక్ బయలుదేరి వెళ్ళాలి” అని చెప్పాడు. అందుకు బాబా “ఇంకో రెండు ప్రహరీలు (ప్రహరి= మూడు గంటలు) చూద్దాం” అని చెప్పారు. బాబా చెప్పి అరగంట అయిందో, లేదో అంతలోనే ఒక మంచి విద్వానుడైన మరియు జోగ్ శాఖకు చెందిన ఒక వైదిక బ్రాహ్మణుడు శిరిడీకి వచ్చాడు. సర్వ ఉత్తరక్రియలు శిరిడిలోనే జరిగాయి. చివరిరోజు నాసిక్ వెళ్ళడానికి శ్రీ బాపూసాహెబ్ జోగ్ బాబా అనుమతిని అర్థించాడు. ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను. అప్పుడు నేను “బాబా, మీరు కూడా రండి. బాపూసాహెబ్. నేను అందరం బయలుదేరుదాం. దారిలో బాపూసాహెబ్ ను నాసిక్ లో  వదులుదాం. తరువాత మనం బొంబాయికి వెళదాం” అని బాబాతో అన్నాను. అందుకు బాబా "నేను ఎప్పుడూ ఎవరినీ మధ్యలో వదిలేరకం కాదు” అని అన్నారు.

తరువాయి భాగం రేపు.

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

సాయిభక్తుల అనుభవమాలిక 58వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. సాయినాథుని సంరక్షణ
  2. ఊదీ మహిమ

సాయినాథుని సంరక్షణ:

సాయిబంధువులందరికీ నమస్కారం. నాపేరు శ్రావణి. బాబా నా జీవితంలోకి ప్రవేశించినప్పటినుండి నాకు అండగా ఉంటూ నా జీవితాన్ని నడిపిస్తున్నారు. ఆయన ఇచ్చిన అనుభవాలను ఎప్పటికప్పుడు మీతో పంచుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు ఏప్రిల్, మే నెలల్లో బాబా ఇచ్చిన మరికొన్ని అనుభవాలను మీ అందరితో పంచుకుంటాను.


మొదటి అనుభవం:

బాబా నా జీవితంలోకి వచ్చిన కొద్దిరోజులకే 'నాకొక అన్నయ్యని ఇచ్చార'ని గత సంవత్సరం మీతో పంచుకున్న ఒక అనుభవంలో తెలియపరిచాను. నేను అన్నయ్యతో మొదటిసారి మాట్లాడింది 2018, ఏప్రిల్ 13న. ఇక అప్పటినుండి నాకు తననెప్పుడు చూస్తానా అని ఉండేది. అప్పుడప్పుడు, "బాబా, అన్నయ్యని నాకు ఎప్పుడు చూపిస్తారు?" అని బాబాని అడుగుతుండేదాన్ని. అక్టోబర్ నెలలో అన్నయ్య శిరిడీ వెళ్ళినప్పుడు ఈ విషయం గురించి బాబాని అడగమని తనకి కూడా చెప్పాను. తను, "బాబా అనుకుంటే, మనం సంవత్సరంలోనే కలవొచ్చు" అన్నారు. అదే జరిగింది. సరిగ్గా సంవత్సరానికి 2019, ఏప్రిల్ 13న నేను అన్నయ్యను చూసే అవకాశాన్ని బాబా ఇచ్చారు. తను శిరిడీ వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు ఏప్రిల్ 12, 13 రెండురోజులు హైదరాబాదులో ఉంటానని చెప్పారు. నాక్కూడా హైదరాబాదులో పని ఉండడంతో ఆరోజుకు హైదరాబాద్ చేరుకుని అన్నయ్యని కలిసాను. అలా మొదటిసారి మా పరిచయం జరిగిన తేదీ రోజే మేము కలిసేలా ఏర్పాటు చేసారు బాబా. "బాబా! ఆ తేదీని ఎప్పటికీ గుర్తుండిపోయేలా మంచి గిఫ్ట్ ఇచ్చారు. మీ ఆశీస్సులు లేకుంటే ఇదంతా జరిగేది కాదు. హైదరాబాద్ ప్రయాణంలో కూడా మీరు నాకు తోడుగా ఉన్నారని నాకు తెలుసు. థాంక్యూ బాబా!"


రెండవ అనుభవం:

ఏప్రిల్ 22వ తేదీన మా ఇంట్లో మరమ్మత్తు పనులు జరుగుతూ ఉన్నాయి. మా ఇంటి ఆవరణలో ఒక బాత్రూమ్ ఉంది. పని చేస్తున్నతను బాత్రూమ్ గోడలు చూసి, "ఈ గోడలు పటిష్ఠంగా లేవు. కూలిపోయే ప్రమాదం ఉంది, దీన్ని కూడా మరమ్మత్తు చేసేద్దామా?" అని అడిగారు. నిజానికి అది నిర్మించింది 2015లోనే. అందువలన మా నాన్న దాన్ని మరమ్మత్తు చేయడానికి ఒప్పుకోలేదు. కానీ నేను, "దాన్ని కూడా మరమ్మత్తు చేసేయండి" అని చెప్పాను. అతను సరేనని అందుకు కావాల్సిన డమ్మీ పైపులు తీసుకుని రావడానికి వెళ్లారు. అతను మా ఇల్లు దాటి నాలుగడుగుల దూరంలో మా వీధిలో ఉన్న బాబా మందిరం వరకు వెళ్ళుంటారు. అంతలోనే ఆ గోడ అమాంతంగా కూలిపోయింది. మేము ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటే, పక్కనే ఉన్నావిడ, "నిజంగా బాబా నీ నోటితో గోడ మరమ్మత్తు చేయమని చెప్పించినట్లున్నారు. నువ్వు చెప్పకపోయుంటే అతను అక్కడే పని చేస్తుండేవాడు. ఎంత ప్రమాదం తప్పింది!" అని అంది. ఆవిడ 'బాబా చెప్పించి ఉంటారు' అనడంతోనే నేను ఆశ్చర్యపోయాను. నిజంగా బాబా చాలా పెద్ద ప్రమాదంనుండే కాపాడారు. ఎందుకంటే, మా అమ్మ అటువైపు తిరుగుతూ వుంటుంది, మరీ ముఖ్యంగా మా అబ్బాయి ఎప్పుడూ అటువైపే ఆడుతుంటాడు. పని చేస్తున్నతను కూడా అప్పుడే వెళ్ళాడు. సంఘటన జరిగే సమయానికి ఎవరూ అక్కడ లేకపోవడం బాబా కృపే. 'ఎవరికైనా ఏమైనా జరిగివుంటే?' అని ఊహించుకోవడానికే చాలా కష్టంగా ఉంది. "చాలా చాలా కృతజ్ఞతలు బాబా, ఎల్లవేళలా మమ్మల్ని కంటికి రెప్పలా కాపుకాస్తున్నారు".


మూడవ అనుభవం:

2019, ఏప్రిల్ 28న వేరే ఊరిలో ఉన్న మా ఫ్రెండ్, వాళ్ళ ఇంటిలో చేసుకుంటున్న పూజకు నన్ను, నా ఫ్రెండ్ ని ఆహ్వానించింది. నేను, నా ఫ్రెండ్ వెళ్ళడానికి నిర్ణయించుకున్నాం. కానీ, అక్కడకు వెళ్లేందుకు దారి, బస్సు టైమింగ్స్ వంటి వివరాలు ఏవీ సరిగ్గా తెలియవు. నేను ఇంటినుండి బయలుదేరేటప్పుడు మా వీధిలో ఉన్న బాబా గుడిలో బాబాకు నమస్కరించుకుని, "బాబా! మాకు ఎలా వెళ్లాలో తెలియదు, మీరే మాకు తోడుగా ఉండి జాగ్రత్తగా తీసుకెళ్లండి" అని ప్రార్థించి వెళ్ళాను. మేము బస్టాండుకి చేరుకునేసరికి మేము వెళ్లాల్సిన ఊరికి వెళ్ళే బస్సు బయలుదేరేందుకు సిద్ధంగా ఉంది. వెంటనే మేము బస్సు ఎక్కేసాము. ఆశ్చర్యం! బస్సులోని కండక్టర్ టెన్త్ క్లాసులో మా తోటి విద్యార్థి. తను మమ్మల్ని సరిగ్గా పూజ జరుగుతున్న చోట దింపాడు. 'మాకు తోడుగా ఉండండి బాబా' అని అడిగినందుకు నిజంగానే బాబా దగ్గరుండి దించినట్లనిపించింది. "థాంక్యూ సో మచ్ బాబా!"


నాల్గవ అనుభవం:

ఈమధ్య ఎండలు ఎక్కువగా ఉండటంతో నా నోరంతా పూచి, నాలుక భాగమంతా సన్న గుల్లలు వచ్చి బాగా పొక్కిపోయింది. ఏది తినాలన్నా చాలా కష్టంగా ఉండేది. రెండురోజులపాటు మాట్లాడటానికి కూడా కష్టంగా ఉండేది. చివరికి నీళ్ళు త్రాగినా మంటగా అనిపించేది. ఆ బాధ భరించలేక బాబాని ప్రార్థించి కొంచెం ఊదీ తీసుకుని నాలుకపైనంతా రాసుకున్నాను. అలా రెండురోజులపాటు చెయ్యగా క్రమేపీ నొప్పి, మంట తగ్గిపోయాయి. "థాంక్యూ సో మచ్ బాబా!"

ఊదీ మహిమ:

ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

ఒకరోజు సాయంత్రం నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. తను నాకోసం ఎగ్ కర్రీ చేసి డిన్నర్ లో పెట్టింది. నిజానికి అలర్జీ కారణంగా నేను కొన్ని ఆహారపదార్థాలను రాత్రిపూట తీసుకోవడం మానేసాను. వాటిలో ఎగ్ కూడా ఒకటి. కానీ తిననని హంగామా చేయడం ఎందుకని నా ఫ్రెండ్ సంతోషం కోసం ఎగ్ కర్రీ తిన్నాను. తర్వాత నీళ్లు త్రాగి నిద్రపోయాను. హఠాత్తుగా అర్థరాత్రి రెండుగంటల సమయంలో ఛాతీకి, కడుపుకి మధ్యభాగంలో నొప్పి మొదలైంది. వికారంగా కూడా అనిపించింది. నాకు చాలా ఆందోళనగా అనిపించి వెంటనే పూజగదిలోకి వెళ్లి, "బాబా! ఈ నొప్పి తగ్గిపోతే నా అనుభవాన్ని బ్లాగులో షేర్ చేసుకుంటాను" అని ప్రార్థించి కొంచెం ఊదీ తీసుకుని నా నుదిటిపై పెట్టుకుని, మరికొంత నోట్లో వేసుకున్నాను. తర్వాత కూర్చుని ఇంగ్లీష్ బ్లాగులో భక్తుల అనుభవాలు చదవడం మొదలుపెట్టాను. ఒక్కొక్క అనుభవం పూర్తయ్యేకొద్దీ కొంచెం కొంచెంగా నొప్పి తగ్గుతున్నట్లుగా అనిపించింది. మొత్తం అనుభవాలన్నీ పూర్తయ్యేసరికి నొప్పి మొత్తం తగ్గిపోయింది. వికారంగా అనిపించడం కూడా తగ్గిపోయింది. తర్వాత నేను హాయిగా నిద్రపోయాను. "ప్రియమైన బాబా! మీరు లేకుంటే, మేము కూడా లేము. ఎల్లప్పుడూ మా తప్పులు మన్నించి, మీ కృపను మాపై ఉంచండి. ఏమీ ఆశించకుండా మాపై ప్రేమను కురిపించే మీ తల్లిప్రేమకు నా నమస్సుమాంజలు". 

సాయి అనుగ్రహ సుమాలు - 16వ భాగం


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 16వ భాగం

శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 3

బాపూజీశాస్త్రి గుళవి 1918 ఫిబ్రవరి నెలలో బాబా దర్శనానికి వచ్చారు. ఆయన వచ్చేటప్పుడు గోదావరి నీళ్ళను తీసుకువచ్చారు. ఆ జలంతో బాబాకు యథోచితంగా అభిషేకం చేసుకోవాలని వచ్చారు. ఆ తరువాత శాస్త్రిగారు శ్రీరామదాస నవమి కోసం సజ్జన్ గడ్ కు  వెళ్ళేందుకు అనుమతి అడిగారు. బాబా అనుమతిని ప్రసాదించి, “అక్కడా నేనే ఉన్నాను, ఇక్కడా నేనే ఉన్నాను” అని చెప్పారు. శాస్త్రిగారు సజ్జన్ గడ్ కు వెళ్ళాక దాసనవమి రోజు తెల్లవారుఝామున 5 గంటలకు బాబా, శాస్త్రి గారికి ప్రత్యక్ష దర్శనాన్ని ప్రసాదించారు. అంతేకాదు, శాస్త్రిగారు బాబా పాదాలను  స్పర్శించి నమస్కరించుకున్నారు. తరువాత బాబా అదృశ్యం అయ్యారు.

అనుభవం - 4 

 రావ్ బహదూర్  సాఠెగారి వాడా నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. ముందు, ముందు వాడా నిర్మాణానికి వేపచెట్టు అడ్డువస్తుందని, వారు వెళ్ళి ఆ చెట్టు కొట్టేసేందుకు అనుమతిని అడిగారు. అప్పుడు బాబా "మనం చెట్టు ఎందుకు కొట్టెయ్యాలి?” అని అన్నారు. తరువాత పని చాలా వరకు పూర్తయ్యాక, వేపచెట్టులో కొంత భాగం పనికి అడ్డు రాసాగింది. అప్పుడు వెళ్ళి బాబాను మరలా అనుమతిని అడిగారు. అప్పుడు బాబా “అడ్డం వచ్చినట్లయితే కొట్టి పారేయాల్సిందే. ఎంతవరకు అడొస్తే అంత భాగం మాత్రమే కొట్టేయండి” అని చెప్పారు.

అనుభవం - 5

బాబా యొక్క భక్తులు ఒకరు విపరీతంగా అప్పులపాలయ్యారు. ఒక షావుకారు తనను జప్తు చేసేందుకు ఉత్తర్వులు తీసుకువచ్చారు. ఆ సమయానికి ఆ భక్తుని వద్ద డబ్బులు ఏర్పాటు చేసే అవకాశం లేదు. అయినప్పటికీ కొంత సంపాదన ఉండేది. ఏం చేసినా షావుకారు ఆగేట్టు లేడు. ఇంతలో భక్తులందరూ కలసి ఆ భక్తుని ఇంట్లో ఉన్న బాబా చిత్రపటం ముందు నామసప్తాహం చేసే ఆలోచన చేసారు. ఆ భక్తుడు కూడా ఎంతో ఆనందంతో అందుకు ఒప్పుకున్నారు. ఇదే మంచి అవకాశం అని షావుకారు అనుకున్నాడు. తాను వెనువెంటనే జప్తు  వారంట్ విడుదల చేయించుకుని, కోర్టు గుమస్తాను తీసుకొని ఆ భక్తుని ఇంటికి వెళ్ళారు. నామసప్తాహం జరుగుతోంది. అప్పులపాలైన ఆ భక్తుడు షావుకారు వద్దకు వెళ్ళి “మంచిది, మీకు అనిపిస్తే సామానును తీసుకుపోండి. నామసప్తాహం కోసంగా మా ప్రయోజనార్థమై బాబా స్థలాన్ని ఖాళీ చేయించి ఇచ్చారని అనుకుంటాము. అంతా ఆయన ఇచ్చ ప్రకారమే జరుగుతుంది” అని అన్నారు. ఆ మాటలకు ఆ షావుకారుకు ఎంత పశ్చాత్తాపం కలిగిందంటే, షావుకారు ఆ వారెంటు  ను వెంటనే  రద్దు చేయించారు. మరలా ఎప్పుడూ వారెంట్ ను తీసుకొనలేదు.

అనుభవం -6 

హరిద్వార్ కు చెందిన భక్తుడు ప్రతిరోజు ఉదయం పూట దర్బారులో బాబా ఎదురుగా స్తంభం వద్ద కూర్చొనేవాడు. ఒకసారి తాను రావడం ఆలస్యమైంది. అమ్మాయి ఆ స్తంభం వద్ద ఆ భక్తుడు ఎప్పుడూ కూర్చొనే చోటులో కూర్చొని ఆ భక్తుడు వచ్చినాసరే ఆ అమ్మాయి ఆ చోటు నుండి లేవలేదు. అప్పుడు అమ్మాయిని లేవమని చెప్పడంతో ఆ అమ్మాయి అక్కడ నుండి లేచింది. అప్పుడు  భక్తుడు ఆ స్థలంలో కూర్చొన్నాడు. బాబా తనను ఐదు నిమిషాలు కూర్చోనిచ్చి తరువాత “వెళ్ళి క్రింద సభామండపంలో కూర్చో” అని ఆజ్ఞాపించారు. తరువాత కొంచెం సేపటికి తాను మరలా పైకి వచ్చి, తన చోటులో కూర్చోబోతుండటంతో బాబా మరలా తనను “క్రిందకు వెళ్ళి కూర్చోమని” చెప్పారు. ఆ అమ్మాయిని అక్కడ నుండి లేపినందుకు “బాబా నాకు ఈ విధంగా గుణపాఠం చెపుతున్నారు” అని తనకు అర్థమైంది.

అనుభవం - 7

నేను ఒకసారి నవరాత్రులు ప్రారంభమైనాక నాగపూర్ నుండి బయలుదేరి శిరిడీకి వెళ్ళాను. దసరా అక్కడే జరిగింది. భక్తులందరూ బాబాకు రకరకాల పండ్లు, మిఠాయిలు సమర్పించుకుంటున్నారు. నా వద్ద పండ్లు లేవు. నా పూజ ఎప్పటిలాగే సాధారణంగా జరిగింది. ఏవైనా పండ్లు ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. కొంచెం సేపటికి బాబా అందరికీ ద్రాక్షపండ్లు పంచి పెట్టారు. నాకు కూడా కొన్ని ఇచ్చారు. బాబా అన్ని పండ్లను పంచేసారు. తమకోసం ఒక్క పండును కూడా పెట్టుకోలేదు. అది చూసి నాకు వచ్చిన ద్రాక్షపండ్లలో కొన్ని బాబాకు ఇవ్వాలి అని నాకు అనిపించింది. ఆ విధంగానే చేసాను. బాబా నేను ఇచ్చిన ద్రాక్షపండను తీసుకొని తిన్నారు. దాంతో నాకు చాలా ఆనందం వేసింది. అర్థమేమిటంటే దసరా పూజకు సంబంధించి నాకు అనిపిస్తున్న లోటును తీసివేసి, నాకు ఆనందాన్ని ప్రసాదించారు.

తరువాయి భాగం రేపు.

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.

సాయిభక్తుల అనుభవమాలిక 57వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1. బాబా ఆశీస్సులతో వచ్చిన ఉద్యోగం
  2. సర్జరీ అవసరం లేకుండా బాబా కాపాడారు

బాబా ఆశీస్సులతో వచ్చిన ఉద్యోగం

బెంగళూరునుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా తెలియజేస్తున్నారు:

నేను 2012 నుండి సాయిబాబా భక్తురాలిని. సాయిభక్తుల అనుభవాలు చదవడంతో నా రోజు ముగుస్తుంది. ఆ అనుభవాల ద్వారా నా భక్తి, విశ్వాసాలు ఎంతగానో అభివృద్ధి చెందుతున్నాయి. ఇక నా అనుభవానికి వస్తే ...

నేను 2016, అక్టోబరులో కొన్ని కారణాల వలన నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను. తర్వాత చాలా కంపెనీలలో ఉద్యోగం కోసం ప్రయత్నించాను. అయితే ఏ కంపెనీ నుండి ఇంటర్వ్యూకి పిలుపు రాలేదు. దాంతో నేను చాలా నిరాశ చెందాను. నేనెప్పుడు 'క్వశ్చన్ అండ్ ఆన్సర్ సైట్' లో సాయిబాబాను అడిగినా, "నీ కోరిక నెరవేరుతుంది" అని వచ్చేది. ఖాళీగా సమయాన్ని వృధా చేసుకోకుండా నేను నా నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సర్టిఫికేషన్ కోర్సులో చేరాను. బాబా కృపవలన అందులో ఉత్తీర్ణురాలినై మళ్లీ ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఆ సమయంలో సాయి దివ్యపూజ చేస్తూ, సాయి సచ్చరిత్ర కూడా పారాయణ చేశాను. తర్వాత కొన్ని ఇంటర్వ్యూ కాల్స్ వచ్చాయి. నేను విజయవంతంగా అన్ని రౌండ్స్ పూర్తి చేసినప్పటికీ ఉద్యోగం మాత్రం రాలేదు. ఆ పరిస్థితి నన్ను ఇంకా క్రుంగదీసింది. కానీ నేను బాబాపట్ల విశ్వాసాన్ని కోల్పోలేదు.

తర్వాత ఒకరోజు నాకొక కల వచ్చింది. కలలో నేను ఒక చీకటి ప్రదేశంలోకి నెట్టివేయబడ్డాను. నేను కొంచెం ముందుకి నడవగా ఒక కాంతి కనిపించింది. అప్పుడు నాకర్థమైంది, 'అది ఒక గుహ' అని. అక్కడ శివపార్వతులు కూర్చుని ఉండటం చూశాను. తర్వాత నేను వారిని బిల్వపత్రాలతో పూజిస్తూ ఉన్నాను. అంతటితో నాకు మెలకువ వచ్చింది. నాకది శుభసంకేతంగా అనిపించి, ఉదయాన నేను శివాలయానికి  బయలుదేరాను. దారిలో బిల్వపత్రాలు దొరుకుతాయో లేదోనని అనుకుంటూనే ఆలయాన్ని చేరుకున్నాను. అక్కడ ఒక స్త్రీ బిల్వపత్రాలను పెట్టుకుని కూర్చుని ఉంది. నేను ఆ బిల్వపత్రాలను తీసుకుని శివుని దర్శనం చేసుకున్నాను. తర్వాత నేను సాయి మందిరానికి వెళ్లాను. అక్కడ ఒక బాలుడు పరుగున వచ్చి నా చేతిలో 'నవ గురువార వ్రతం' పుస్తకం పెట్టి, వెంటనే వెళ్లిపోయాడు. సాయి నవగురువార వ్రతం చేయమని సూచిస్తున్నట్లుగా నాకనిపించి, మరుసటివారం నుండి వ్రతాన్ని ప్రారంభించాను. వెంటనే బాబా స్వప్న దర్శనమిచ్చారు. మళ్లీ నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సైట్ లో నా ఉద్యోగం  గురించి బాబాను అడిగితే, "నీ కోరిక కృష్ణ జయంతి(కృష్ణాష్టమి) నాడు నెరవేరుతుంది" అని వచ్చింది. మరుసటిరోజే ఒక పెద్ద ఎమ్.ఎన్.సి. కంపెనీ నుండి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. అన్ని రౌండ్లలో బాబా నాకు తోడుగా ఉండి, అన్ని ప్రశ్నలకి సరైన సమాధానం చెప్పించారు. తర్వాత బాబా చెప్పినట్లుగానే కృష్ణజయంతి నాడు నాకు ఆఫర్ లెటర్ వచ్చింది. 2018, సెప్టెంబరులో నేను ఉద్యోగంలో జాయినయ్యాను. సుమారు రెండు సంవత్సరాల గ్యాప్ తర్వాత బాబా ఆశీస్సులతో నాకా ఉద్యోగం వచ్చింది. "థాంక్యూ సో మచ్ బాబా! ఎప్పుడూ ఇలాగే నాకు తోడుగా ఉండి సరైన మార్గంలో నన్ను నడిపించండి".

సర్జరీ అవసరం లేకుండా బాబా కాపాడారు

పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలి అనుభవం:

గత ఆరేళ్లుగా నేను బాబా భక్తురాలిని. నేను మైసూరుకు చెందిన దానిని అయినప్పటికీ ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్నాను. నేను చిన్నప్పటినుంచి సైనస్ సమస్యతో బాధపడుతున్నాను. కాలం గడిచేకొద్దీ అది నాకు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రతి ఉదయం విపరీతమైన తుమ్ములతో  చాలా కష్టంగా ఉండేది. చివరికది ఆస్తమాగా కూడా పరిణమించింది. డాక్టరుని సంప్రదిస్తే ఆపరేషన్ చేయాల్సి ఉంటుందని, చేసినా 100% నయమవుతుందని చెప్పలేమని అన్నారు. ఇక నేను ఆందోళనగా బాబాను ప్రార్థించాను. మరుసటిరోజు భయపడుతూనే మళ్లీ డాక్టర్ వద్దకు వెళ్లాను. ఆయన నా ముక్కు పరిశీలించి, "ఇప్పుడు ఎంతో మెరుగ్గా ఉంది. సర్జరీ తప్పనిసరేమీ కాదు" అని చెప్పారు. ఒక్కరోజులో అంత మార్పుకి నేను ఆశ్చర్యపోయాను. నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. "బాబా! థాంక్యూ సో మచ్ బాబా! ఈ సమస్యనుండి పూర్తిగా నన్ను మీరే బయటపడేస్తారని నా విశ్వాసం".

source: https://www.shirdisaibabaexperiences.org/2019/04/shirdi-sai-baba-miracles-part-2319.html

సాయిభక్తుల అనుభవమాలిక 56వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవం:


  • ప్రేమపూర్వకమైన పిలుపుకు బట్టలు సర్దుకుని వచ్చిన బాబా.

నా పేరు లక్ష్మీప్రసన్న. నేను హైదరాబాద్ నివాసిని. బాబాతో నాకున్నది ఏ బంధమోగానీ ఆయన చూపించే ప్రేమ మాత్రం అనిర్వచనీయం. దానిని మానవ సంబంధమైన పదజాలంతో వర్ణించి దాని విలువను నేను తగ్గించలేను. కానీ, నేను బాబాను 'తాత' అని అనుకుంటూ ఉంటాను. మా ఇంట్లో చిన్న బాబా విగ్రహం ఒకటుంది. ఆయనకు సబ్బుతో స్నానం చేయించి, కొత్త బట్టలు వేసి మురిసిపోతూ ఉంటాను. ఒకసారి నాకెందుకో పెద్ద బాబా విగ్రహం ఒకటి తెచ్చుకోవాలనీ, అది కూడా శిరిడీ నుండి అయితే ఇంకా బాగుంటుందనీ అనిపించింది. తరువాత దసరారోజుల్లో మేము శిరిడీ బయలుదేరుతూ, "బాబా! ఎలాగైనా సరే, మీరు మాతోపాటు శిరిడీ నుండి వచ్చి మా ఇంటిలో ఆసీనులు కావలసిందే!" అని బాబాకి చెప్పుకుని, ఇంట్లో బాబా కోసం ఒక ఆసనం వేసి వెళ్ళాను.

మేము శిరిడీ నుండి తిరుగుప్రయాణమయ్యేరోజు ఒక పెద్ద బాబా విగ్రహం తీసుకున్నాము. అది చాలా బరువుగా ఉంది. తీసుకుని వెళ్లడం కాస్త కష్టమే, కానీ ఆ విగ్రహమే కావాలని నా మనసుకు అనిపించింది. బాబాకు సరిపడే తలపాగాలు, దండలు కూడా తీసుకున్నాము. అయితే బట్టలు మాత్రం చాలా ధర చెప్పారు. అస్సలు తగ్గడం లేదు. నాకేమో అంత ధర పెట్టాలని లేదు. ఎందుకంటే నాకు టైలరింగ్ వచ్చు. బాబాకి కావలసినవన్నీ నేనే తయారుచేసుకుంటాను. అంతేతప్ప వేరే ఏ ఉద్దేశ్యం కాదు. కానీ ఈలోపే తాత(బాబా) 'ఈ పిల్ల బట్టలు కొనేలా లేదు' అని అనుకున్నట్టున్నారు. ఇక ప్యాకింగ్ చేస్తారన్న సమయంలో నేను హఠాత్తుగా, "ప్యాక్ చేయొద్దు, ఆగండి. నేను బాబా విగ్రహాన్ని శిరిడీ అంతా తిప్పి, సమాధిమందిరం లోపలకి తీసుకుని వెళ్లి వస్తాన"ని చెప్పాను. షాపతను, "ఇంత బరువు మీరు మోయలేరు. అయినా సమాధిమందిరం లోపలికి ఇంత పెద్ద విగ్రహాలని అనుమతించరు" అన్నాడు. ఆ మాటలు విన్న నేను, "తాతా! మీరు బరువు తగ్గండి ప్లీజ్, లేదంటే నాకు మిమ్మల్ని మోయటానికి తగిన శక్తినన్నా ఇవ్వండి" అని బాబాకు చెప్పుకుని, మొదట నాకిష్టమైన ద్వారకామాయికి లైన్లో తీసుకెళ్ళాను. లోపలికి వెళ్ళగానే అక్కడున్నవాళ్ళు, "అయ్యో! అమ్మా, ఇంత బరువు పట్టుకుని లైన్లో ఎందుకొచ్చారు? మామూలుగా రావచ్చు కదా!" అని బాబాని లోపలంతా తాకించి ఇచ్చారు.

తరువాత సమాధిమందిరానికి వెళ్తే లోపలికి అనుమతించలేదు. అయితే లోపలికి అనుమతించడం బాబా ఇష్టంకానీ వాళ్ళది కాదు కదా! బాబా అద్భుతం చూపారు. అక్కడే ఉన్న ఒక స్వీపర్, "అమ్మా, ఇలా ఇవ్వండి" అని బాబాని సమాధి వద్దకు తీసుకుని వెళ్ళాడు. మామూలుగా లోపలికి వెళ్ళిన బాబా గంధం, గులాబీమాలతో తిరిగి వచ్చారు. "ఇందాక ఇలా లేరు, ఇప్పుడు ప్రాణం పోసుకుని వచ్చారు బాబా" అని అనిపించింది. అతను బాబా విగ్రహాన్ని నాకు అందించి‌, తన జేబులోనుంచి డబ్బులు తీసి, "అమ్మా, ఇవి తీసుకుని బాబాకి బట్టలు తీసుకోండి" అని చెప్పాడు. ఇక అందరూ బాబాకు నమస్కరించడం మొదలుపెట్టారు. అందులో ఒక జంట వచ్చి, "ఇవి బాబా వస్త్రాలు, సమాధిమందిరంలో మాకిచ్చారు, ఇవి మీరు తీసుకోండి" అని నాకు ఇచ్చి వెళ్లిపోయారు. బాబాను చూస్తుంటే, నేను రమ్మన్నానని బట్టలు కూడా సర్దుకుని అతిథిలా నాతో వస్తున్నారనిపించింది. కానీ ఈ అతిథి మళ్ళీ తిరిగి వెళ్ళే అతిథి కాదు అని చాలా ఆనందించాము.

తరువాత బాబాతో పాటు ట్రైన్ ఎక్కాము. బాబా ఉన్న బాక్సును ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు. చివరికి మావారు తన బెర్తుపైన తలవద్ద పెట్టుకుని, సర్దుకుని పడుకున్నారు. తరువాత అర్థరాత్రి సమయంలో నా బెర్తుపై ఒక ముసలాయన కూర్చున్నాడు. ఆయన నన్ను ఎక్కడ తాకుతాడో అని నేను, నేను ఎక్కడ తనను తాకుతానో అని ఆయన ఇద్దరమూ ఒదిగి ఉన్నాము. ఉదయం మావారు, "రాత్రంతా ఆ బాక్సులో నుండి ఒక విధమైన వైబ్రేషన్స్, 'ఓం' అనేవిధంగా వస్తూ వుంది. అందువలన సరిగా పడుకోలేద"ని చెప్పారు. మరి నేను చూసింది?! ఖచ్చితంగా తన మూటతో సహా తాత మాతో వచ్చారు. ఇంటికి వచ్చాక బాబా తనకు కావలసినవన్నీ తనే సమకూర్చుకున్నారు. ఇవన్నీ ఇప్పుడు తలచుకుంటుంటే తాత ప్రేమ మన మీద ఎంతగా ఉంటుందో అర్థమవుతూ ఉంది.

"బాబా! మీ బిడ్డలందరినీ ఈ ప్రాపంచికం నుండి మరలి నీ లీలలో తరించిపోయేలా ఆశీర్వదించండి". 


సాయి అనుగ్రహసుమాలు - 15వ భాగం


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 15వ భాగం
  
శ్రీహరిసీతారామ్ దీక్షిత్‌గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 2

నాకు బాబా దర్శనం మొదటిసారి అయినప్పుడు నా మిత్రుడు శ్రీగోవింద్ రఘునాథ్ దభోల్కర్‌కి కూడా బాబా దర్శనం అయితే బాగుంటుందని నాకు కోరిక కలగడంతో నేను శిరిడీ నుండే తనకు ఉత్తరం వ్రాశాను. బాబా దర్శనం తప్పక చేసుకోవాలని విన్నవించాను. ఆ తరువాత కొద్దిరోజులకు తనను నేను కలవడం జరిగింది. అప్పుడు తను, “నేను దర్శనానికి తప్పక వెళతాను. కానీ గురువు యొక్క ఉపయోగమేమిటో నాకు అర్థం కావడం లేదు. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలని నాకు అనిపిస్తుంది” అని అన్నాడు. ఆ తరువాత ఈస్టర్ సెలవులలో తాను బాబా దర్శనానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. తాను ఏ రోజయితే బయలుదేరాలో ఆరోజు, 'తన స్నేహితుని యొక్క ఒక్కగానొక్క కుమారుడు చనిపోయాడు, ఆ సమయంలో తన స్నేహితుని గురువు కూడా అక్కడే ఉన్నారు' అనే వార్త వచ్చింది. దాంతో తాను శిరిడీ వెళ్ళే ఆలోచనను విరమించుకున్నాడు. ఇంతలో ఇంకొక స్నేహితుడు కలిసి శిరిడీకి వెళ్ళమని గట్టిగా చెప్పడం వలన శిరిడీ ప్రయాణం ఖరారైంది. తాను ఆ ప్రకారమే శిరిడీకి బయలుదేరాడు. కోపర్గాఁవ్‌కు వెళ్ళే మెయిల్ దాదర్లో ఆగుతుందని తనకు సమాచారం ఉండటం వలన, తాను దాదర్‌కు బయలుదేరాడు. ఇంతలో తనకు బాంద్రా స్టేషనులో ఒక మహమ్మదీయ గృహస్థు కలిశాడు. ఆయన దభోల్కర్‌తో, “మెయిల్ దాదర్‌లో ఆగదు, నీవు బోరీబందర్ స్టేషన్‌కు వెళ్ళు” అని చెప్పాడు. ఆ విధంగానే తాను బోరీబందర్‌కు వెళ్ళాడు. మరుసటిరోజు ఉదయం శిరిడీకి చేరుకున్నాడు. బాబా దర్శనానికి వెళ్ళడానికి ఇంకా సమయం ఉండటంతో, తాను ఒక గృహస్థుతో  మాట్లాడుతూ కూర్చొన్నాడు. ఆ వేళలో “గురువు యొక్క ఉపయోగం ఏమిటి?” అనే విషయంపై వాదులాడుకోవడం చాలాసేపు జరిగింది. తరువాత మేమందరం బాబా వద్దకు వెళ్ళాము.  అక్కడ కూర్చొన్న తరువాత బాబా - దాభోళ్కర్ వైపు చూస్తూ - ఈ హేమాద్‌పంత్  ఏమంటున్నాడు?” అని నన్ను అడిగారు. అందుకు నేను బాబా "మీకు అన్నీ తెలుసు” అని సమాధానం ఇచ్చాను. తరువాత ఆరోజు నేను బయలుదేరాల్సి ఉండటంతో అనుమతి అడగాల్సి ఉంది. అందువలన నేను, “బాబా, ఈరోజు బయలుదేరాలా?" అని అడిగాను. బాబా “అవును” అని అన్నారు. ఆ మాట విన్న భక్తుడొకరు, “బాబా, ఎక్కడకు వెళ్ళాలి?” అని అడిగారు. ఆకాశం వైపుకి చూపిస్తూ, “అలా పైకి” అని బాబా సమాధానం ఇచ్చారు. మరలా ఆ భక్తుడు “బాబా, మార్గం ఎలా ఉంటుంది?" అని అడిగాడు. అందుకు బాబా, “మార్గాలకేం? పుష్కలంగా ఉన్నాయి. వివిధ ప్రదేశాలనుండి మార్గం ఉంది. మనకు ఇక్కడి నుండి కూడా ఒక మార్గం వెళుతుంది. మార్గం చాలా కష్టమైనది. మార్గంలో పులులుంటాయి, ఎలుగుబంటి ఉంటుంది” అని  అన్నారు. అప్పుడు నేను, “కానీ బాబా, మార్గదర్శి తోడుంటే?” అని అడిగాను. అప్పుడు బాబా, "మార్గదర్శి తోడుంటే ఇక ఏ పంచాయితీ లేదు. అప్పుడు పులి ప్రక్కకు వెళుతుంది. ఎలుగుబంటి ప్రక్కనుండి వెళ్ళిపోతుంది. లేదంటే ఒక పెద్ద చితి ఉంది. అందులో వెళ్ళి పడే ప్రమాదముంది” అని అన్నారు. ఈ సంభాషణ యొక్క పరిణామం దాభోళ్కర్ మనసుపై చాలా పడింది. “నా ప్రశ్నకు సమాధానం దొరికింది” అని తనకు అనిపించసాగింది. ఆ తరువాత బాబా తనకు తరచూ ఎన్నో అనుభవాలను ప్రసాదించారు. ఇప్పుడు తాను బాబాకు సంపూర్ణభక్తుడయ్యాడు.

తరువాయి భాగం రేపు.

సోర్స్ : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్ .

సాయి అనుగ్రహ సుమాలు - 14వ భాగం


కాకా సాహెబ్ దీక్షిత్ డైరీ - 14వ భాగం  

బాబా కృపవలన ఈరోజునుండి సాయిస్మరణలోని భాగంగా పర్నా విజయ్ కిషోర్ గారు రచించిన దీక్షిత్ డైరీలోని మరికొన్ని అనుభవాలను పంచుకొనే అవకాశం మనకు దక్కింది. "బాబా! మీకివే మా నమస్సుమాంజలులు".

శ్రీహరి సీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 1

బాబా వివిధ రూపాలలో తమ భక్తుల వద్దకు వెళతారు. తరువాత ఆ విషయానికి సంబంధించిన పరోక్షసంజ్ఞను ఇచ్చేవారు. ఒకసారి నానాసాహెబ్ చందోర్కర్ బాబా కోసం నైవేద్యాన్ని తీసుకు వచ్చారు. బాబాకు పూరణ్ పోళీ అంటే ఇష్టమని తనకు తెలిసి ఉండటం వలన, కావాలని పూరణ్ పోళీ తయారు చేయించుకుని నైవేద్యాన్ని తీసుకువచ్చారు. నానాసాహెబ్ నైవేద్యం తీసుకువెళ్ళే సమయానికి బాబా అప్పుడే భోజనం చేసి కూర్చొని ఉన్నారు. నానాసాహెబ్ బాబాను మరలా భోజనం చేయమని ప్రాధేయపడ్డారు. అప్పుడు బాబా “నేను ఇప్పుడే భోజనం చేసాను, ఇక నీవు నీ నైవేద్యపళ్ళెం తీసుకొని వాడాకు వెళ్ళి భోజనం చేయి” అని చెప్పారు. బాబా ఆజ్ఞాపించడంతో నానాసాహెబ్ వాడాకు వెళ్ళక తప్పలేదు. కానీ వెళ్ళే సమయంలో మాధవరావ్ దేశ్ పాండేతో “మీరు ఇక్కడే ఉండండి. బాబా ఆ పళ్ళెంలో నుండి ఏదయినా భుజిస్తే వచ్చి నాకు చెప్పండి. అప్పుడు నేను భోజనానికి కూర్చొంటాను” అని చెప్పారు. ఆ విధంగానే మాధవరావు బాబా వద్దనే కూర్చొన్నారు. అక్కడ వాడాలో నానాసాహెబ్ మాధవరావు కబురు కోసం ఎదురు చూడసాగారు. కొంచెం సేపు గడచిన తరువాత బాబా “నానాసాహెబ్ భోజనం చేసాడా?” అని మాధవరావుని అడిగారు. అప్పుడు మాధవరావు “లేదు, ఈ పళ్ళెంలో నుండి మీరు కొంచెం ఏదయినా భుజిస్తే, అప్పుడు తాను భోజనానికి కూర్చొంటారు” అని సమాధానమిచ్చాడు. అప్పుడు బాబా నవ్వుతూ “అరే! పళ్ళెంలో భోజనం పెడుతున్నప్పుడే ఈగరూపంలో వెళ్ళి నైవేద్యాన్ని భుజించాను, కనుక తనను ఇక భోజనం చేయమని చెప్పు” అని చెప్పారు. ఆ విషయం మాధవరావు ద్వారా తెలుసుకున్న నానాసాహెబ్ సంతోషంగా భోజనానికి కూర్చొన్నాడు.

అదేవిధంగా ఒకసారి నానాసాహెబ్ తో  బాబా “అరే! ఎవరైనా మన ద్వారం దగ్గరికి భిక్షకు వస్తే, వారికి మన శక్తి కొలది ఇవ్వాలి. ఒకవేళ మన దగ్గర ఇవ్వడానికి ఏమి లేనట్లయితే, అదే విషయాన్ని వారికి నెమ్మదిగా, మృదువుగా చెప్పాలి” అని చెప్పారు.ఆ బోధ జరిగిన తరువాత నానాసాహెబ్ తన ఊరికి వెళ్ళిపోయాడు.తరువాత  ఒకసారి ఒక వృద్ధురాలు భిక్ష అడగడానికి తన ఇంటి ద్వారం వద్దకు వచ్చింది.తనతో  "భిక్షలేదు, వెళ్ళు” అని నౌకరు చెప్పాడు. కానీ ఆ భిక్షగత్తె మొండి వైఖరి చూపించసాగింది. దాంతో నానాసాహెబ్ స్వయంగా ఆ భిక్షగత్తెను కోపంతో అరచి పంపించివేసారు. ఆ తరువాత నానాసాహెబ్ మరల బాబా వద్దకు వచ్చినపుడు బాబా  తనతో “ఏవరైన మన వద్దకు భిక్షకు వస్తే వారితో మృదువుగా మాట్లాడాలి అని చెప్పినా, ఆ విషయం నీవు మరచిపోయావు కదా? నేను వృద్ధురాలైన భిక్షగత్తె రూపంలో మీ ఇంటికి వస్తే, నాకు తిట్లు భిక్షగా లభించాయి” అని అన్నారు.

ఒకసారి మహల్సాపతి వద్దకు ఒక కుక్క వచ్చింది. ఆ కుక్క చాలా మురికిగా కనిపిస్తూ, నోటి నుండి లాలాజలం కారుతూ ఉంది. మహల్సాపతి దానిని కర్రతో కొట్టాడు. అది బాధతో అరుస్తూ వెళ్ళిపోయింది. తరువాత మహల్సాపతి బాబా దర్శనానికి వెళ్లినపుడు,బాబా "నేను ఎంతో ఆశతో భగత్ వద్దకు (మహల్సాపతిని  బాబా భగత్ అని అంటారు) వెళితే, “నేను కర్ర దెబ్బలు తినవలసి వచ్చింది” అని చెప్పారు.

ఆ విధంగా అనేక లీలల ద్వారా బాబా భక్తులకు శిక్షణనిస్తూ ఉంటారు. బాబా ఎల్లప్పుడు "అరే! ఎవరినీ తిరస్కరించి పంపించివేయకూడదు. మనవద్దకు ఏదైన కుక్క పిల్లి వంటివి వస్తే ఏదో ఋణానుబంధంతోనే వస్తాయి. మనం ఎవరినీ కష్టపెట్టకూడదు అని” అంటుంటారు. బాబా కేవలం ముఖతః బోధ మాత్రమే చేయరు. ఆ బోధను వివిధపద్దతులలో హృదయంలో ముద్రించుకుపోయేటట్లు చేస్తారు. బాబా అటువంటి బోధ చేసిన తరువాత రెండు, మూడు గంటల వ్యవధిలో మేమందరం వాడాలో భోజనానికి కూర్చొన్నప్పుడు మెట్ల వద్దకు ఒక కుక్క వచ్చింది. మేము దానిని అదిలిస్తే ముందరనున్న ఇంకొక వసతిగృహం మెట్ల వద్దకు వెళ్ళింది. అక్కడ అది తన్నులు తిని బాధతో పెద్ద, పెద్దగా అరుస్తూ బయటకు వెళ్ళింది. దాని అరుపులు వినిన తరువా బాబా ఉదయం చేసిన బోధ గుర్తుకు వచ్చి, “మనం దానిని అదిలించకుండా ఒక రొట్టె ముక్కను గాని వేసినట్లయితే, ఆ రొట్టెముక్కను తీసుకొని అది వెళ్ళిపోయి ఉండేది  పాపం అది తన్నులు తినకుండా ఉండేది” అని అనిపించింది. అదే రోజు సాయంత్రం దాసగణు యొక్క కీర్తన జరిగింది. ఆ కీర్తనలో శ్రీ విట్టలుడు కుక్కరూపంలో నామదేవుని వద్దకు వెళ్ళి సజ్జ రొట్టెను తీసుకొని వెళుతుంటే, నామదేవుడు నెయ్యి గిన్నెను తీసుకొని “దేవా, ఆ ఎండి పోయిన రొట్టెను అలా తినవద్దు, ఈ నెయ్యి వేసుకొని తినండి" అని అంటూ ఆ కుక్క  వెనుక పరుగెత్తడం అనే కథాభాగం కీర్తనలో వచ్చింది. మారుతీ దేవాలయంలో శ్రీ మాధవరావు అడ్కర్ భక్తలీలామృతాన్ని ప్రతి రోజు సాయంకాలం పారాయణం చేసేవారు.ఆశ్చర్యంగా అదే రోజు సాయంకాలం పారాయణలో ఆ  కథాభాగమే వచ్చింది. ఆ విధంగా బాబా ఉదయం చేసిన బోధను, ఆయనే దృఢంగా హృదయంలో ముద్రించుకుపోయేటట్లు చేసారు. ప్రతి ఒక్కసారి భక్తుల ఆర్తిని తీర్చడానికి మరియు వారిని సమాధానపరచడానికి వారి వద్దకు వేరు, వేరు రూపాలలో వెళుతూ ఉంటారు.

తరువాయి భాగం రేపు.

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్ .

సాయిభక్తుల అనుభవమాలిక 55వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1. బాబా స్మరణతో రక్షణ
  2. బాబా కృపతో ఆగిన బ్లీడింగ్

బాబా స్మరణతో రక్షణ

పేరు వెల్లడించని సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

12 సంవత్సరాలుగా నేను సాయిబాబా భక్తురాలిని. ఆయన నా జీవితంలో ఎన్నో అనుభవాలు చూపించారు. నా జీవితాన్ని నడిపిస్తున్న కాంతి కిరణం ఆయన. నేను ఏ కష్టంలో ఉన్నా నా నోటినుంచి వచ్చే మొదటిపదం 'సాయిరాం'. ఇక నా అనుభవంలోకి వస్తే...

నాకు పదినెలల వయసున్న పాప ఉంది. తనకి గుండు చేయించడం, చెవులు కుట్టించడం వంటి ఆచారాలు ఉన్నాయి. మా బావగారికి పిల్లలు లేరు. దాంతో అతనిపై ఉన్న ప్రేమ వలన మా అత్తామామలు మా పాప విషయంలో అసూయతో తప్పులుపడుతూ ఏదో ఒకటి అంటూ ఉండేవారు. అప్పటికే మేము కొన్ని ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతూవుంటే, వాళ్ళు అనే మాటలతో పూర్తిగా విసిగిపోతూ ఉండేదాన్ని. ఇటువంటి పరిస్థితుల్లో పాపకు పుట్టువెంట్రుకలు తీయడానికి తేదీ నిర్ణయించాం. ఆ పని చేసే సమయంలో పాప తలపై ముందు భాగమంతా పొలుసు బారిపోయి ఉండటం గమనించాం. వాటిని బ్లేడుతో తొలగించలేనని, దానంతట అదే తొలగిపోవాల్సిందేనని గుండు చేస్తున్న అతను అన్నాడు. దానివలన మా పాప తల చూడటానికి అదోలా ఉంది. పైగా ఆ సమస్య సమసిపోయినప్పటికీ, అది తన జుట్టు పెరుగుదలపై ప్రభావం చూపుతుందేమోనని నేను చాలా ఆందోళనపడ్డాను. తెలిసినవాళ్ళు కొందరు పాపకి స్నానం చేసేటప్పుడు ఆ భాగంలో బాగా రుద్దితే పోతుందని చెప్పారు. కానీ అలా చేయడానికి భయపడ్డాను. ఇంకోవారంలో మేము యు.ఎస్. వెళ్లాల్సి ఉండటంతో నేను, "బాబా! మేము యు.ఎస్. వెళ్ళడానికి బయలుదేరేలోపల మా పాప సమస్య సమసిపోతే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని హృదయపూర్వకంగా బాబాని ప్రార్థించాను. తరువాత బాబా స్మరణ చేస్తూ నూనెతో పాప తలపై రుద్దడం మొదలుపెట్టాను. కేవలం రెండురోజుల్లో బాబా కృపవలన తన తలపై ఉన్న పొలుసు అంతా పోయింది. దానితో ఆందోళననుండి బయటపడి ఆనందంగా బాబాకి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. తరువాత పాపకు చెవులు కుట్టేముందు బాబా స్మరణ చేస్తూ తన చెవులకు ఊదీ పెట్టాలని అనుకున్నాను. కానీ చెవులు కుట్టే సమయానికి టెన్షన్‌లో ఊదీ పెట్టడం మర్చిపోయాను. ఇక చేసేది లేక, "బాబా! అంతా సజావుగా సాగేలా సహాయం చేయండి" అని ప్రార్థించాను. ఆయన కృపవలన ఏ ఇబ్బందీ లేకుండా అంతా సాఫీగా జరిగిపోయింది. ఎవరికి ఏ కష్టం వచ్చినా బాబాను పిలవండి, ఆయన రక్షణ మనకు అందుతుంది.

బాబా కృపతో ఆగిన బ్లీడింగ్

బహరేన్ నుండి పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకున్నారు:

సాయి బ్రదర్స్ & సాయి సిస్టర్స్.. ఓం సాయిరామ్! నేను భారతీయురాలిని అయినప్పటికీ మావారి ఉద్యోగరీత్యా ప్రస్తుతం గల్ఫ్‌లో ఉంటున్నాను. 2015, డిసెంబర్ నెల సెలవులలో మేము ముంబాయి వెళ్ళాము. కాలుష్యం వలన ప్రస్తుతం ముంబాయి వాతావరణం హ్యుమిడిటీతో చాలా వేడిగా ఉన్నందున హఠాత్తుగా ఒకరోజు మావారి ముక్కునుండి రక్తం కారింది. ఆ సమయంలో ఆయనకి జలుబు కూడా ఉంది. నేను డాక్టర్ వద్దకు వెళ్దామంటే, ఇక్కడ కాలుష్య వాతావరణం వలన ఇలా జరిగింది, ఏమీ కాదులే అని ఆయన నా మాట కొట్టిపారేశారు. అయితే మేము గల్ఫ్ తిరిగి వచ్చాక కూడా అప్పుడప్పుడు బ్లీడింగ్ అవుతుండేది. అసలే భయస్తురాలినైన నేను డాక్టరుని సంప్రదించుదామని మావారిని బలవంతపెట్టాను. కానీ మాములే, ఆయన అస్సలు ఒప్పుకోలేదు. ఆయనెప్పుడూ అంతే, ఒకసారి ఏదైనా వద్దు అనుకున్నారంటే ఏమి జరిగినా, తన నిర్ణయాన్ని మార్చుకోరు. ఏం చేయాలో అర్థంకాక నా బుర్రంతా రకరకాల ఆందోళనలతో వేడెక్కిపోయింది. చివరికి బాబానే శరణన్నాను. "బాబా! ఏ సమస్యలు లేకుండా పూర్తిగా బ్లీడింగ్ ఆగిపోతే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని ప్రార్థించాను. తరువాత బాబా కృపవలన బ్లీడింగ్ ఆగిపోయింది. కానీ నేను అనుకున్న ప్రకారం ఆ అనుభవాన్ని బ్లాగులో పంచుకోలేదు. నా నిర్లక్ష్యం కారణమో ఏమో మళ్లీ గతనెలలో ముక్కునుండి బ్లీడింగ్ అయింది. అప్పుడు నేను, "బాబా! దయచేసి నా తప్పును మన్నించి, బ్లీడింగ్ ఆగిపోయేలా చూడండి. నెలలోగా నా అనుభవాన్ని పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. వెంటనే బాబా కరుణించారు, బ్లీడింగ్ ఆగిపోయింది. "థాంక్యూ బాబా! బ్లీడింగ్ ఆగిపోయేలా చేశారు. నేను మీ బిడ్డని, దయచేసి మావారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఆయనకున్న డ్రింకింగ్ అలవాటు కూడా మానుకునేలా చేయండి. ఎందుకంటే మీరు మాత్రమే మా శ్రేయస్సుని కోరుకునేది. థాంక్యూ బాబా! ఐ లవ్ యు!"

source: https://www.shirdisaibabaexperiences.org/2019/05/shirdi-sai-baba-miracles-part-2346.html

సాయి అనుగ్రహసుమాలు - 13వ భాగం.

కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ  - పదమూడవ భాగం.. 

బాబా ఊదీ! ప్లేగు ఏది?! 

నేను శిరిడీలో ఉన్నప్పుడు ఒకరోజు రాత్రి 9గం||ల ప్రాంతంలో షామా సోదరుడు బాపాజీ తన ఊరినుండి వచ్చాడు. అతను భయాందోళనలతో కంపించిపోతూ, “నా భార్యకు ప్లేగు సోకింది. జ్వరం చాలా ఎక్కువగా ఉంది. రెండు బొబ్బలు కూడా కనిపించాయి. వెంటనే బయలుదేరి రా!” అన్నాడు షామాతో. షామా వెంటనే బాబా వద్దకెళ్ళి ప్రయాణానికి బాబా అనుమతి కోరాడు. అప్పుడు బాబా, “ఇంత రాత్రప్పుడు వెళ్ళటమెందుకు? రేపు పొద్దునే బయలుదేరి వెళ్ళవచ్చులే! ప్రస్తుతానికి ఊదీ పంపించు!” అన్నారు. ఆ మాటలు విని  బాపాజీ  దుఃఖంతో మరీ కృంగిపోయాడు. కానీ, షామా మాత్రం బాబా ఆదేశాన్ని ఉల్లంఘించకుండా, (బాబా చెప్పినట్లు) ఊదీ మాత్రం పంపించి, తాను శిరిడీలోనే ఉండిపోయాడు. మరుసటిరోజు ఉదయం, బాబా శలవు తీసుకొని, తన సోదరుని భార్యను చూడటానికి వాళ్ళ ఊరు సావుల్‌విహిర్ వెళ్ళాడు. బయలుదేరే ముందు షామాకు శలవిస్తూ, వెంటనే తిరిగి వచ్చెయ్!” అన్నారు బాబా. షామా అక్కడకెళ్ళేసరికి అతని సోదరుని భార్యకు జ్వరం తగ్గిపోయి ఉంది. బొబ్బలు కూడా మాయమై, ఆ సమయానికి ఆమె టీ తయారుచేస్తోంది! ఆమెకు పూర్తి స్వస్థత చేకూరి ఉండటంతో బాబా చెప్పినట్లు మాధవరావు (షామా) వెంటనే శిరిడీకి తిరిగి రాగలిగాడు.

భక్తి లేక శాంతి సున్న! 

దాదాకేల్కర్ మిత్రుడైన అనంతరావ్ పాటంకర్ పూనా నివాసి. ఆయనకు వేదాంతపు పిచ్చి. అంతేకాదు! వేదాంతోపన్యాసాలు కూడా ఇస్తుండేవాడు. ఆయనొకసారి బాబా దర్శనానికి శిరిడీ వచ్చాడు. బాబాను దర్శించి, “బాబా, నేను చాలా గ్రంథాలే చదివాను. కానీ, మనోనిశ్చలతగానీ, మనశ్శాంతిగానీ ఏమాత్రం లభించడంలేదు!” అని విన్నవించాడు. దానికి బాబా, “ఒకసారి ఇక్కడికి ఒక వ్యాపారస్థుడు వచ్చాడు. అప్పుడు ఒక మేక తొమ్మిది పెంటికలు (పేడ) వేసింది. అతను వాటిని మూటకట్టుకొని తీసుకెళ్ళాడు” అన్నారు. అనంతరావుకి ఆ మాటల అంతరార్థం ఏమీ బోధపడలేదు. వాడాకి వెళ్ళగానే బాబా మాటల అర్థం ఏమైవుంటుందని దాదాకేల్కర్‌ని అడిగాడు. దాదాకేల్కర్ తనకూ ఆ మాటల అర్థం ఏమీ బోధపడటం లేదని చెప్పి, బహుశా తొమ్మిది పెంటికలు నవవిధభక్తికి సంకేతం అయ్యుండొచ్చుననీ, ఆ నవవిధభక్తిని సంపాదించమని బాబా అనంతరావుకి  ఉపదేశించి ఉంటారనీ అన్నాడు. మరుసటిరోజు అనంతరావు బాబా దర్శనానికెళ్ళగానే, బాబా అతణ్ణి చూచి, “ఏం? నేను చెప్పినట్లు ఆ తొమ్మిది పెంటికలు ఏరుకున్నావా?” అని అడిగారు. అనంతరావు బాబా పాదాలకు మ్రోకరిల్లి, “మీ అనుగ్రహముంటే ఆ తొమ్మిది పెంటికలు సంపాదించగలను” అన్నాడు. బాబా ప్రసన్నంగా అతణ్ణి ఆశీర్వదించారు. దీన్నిబట్టి తెలిసేదేమంటే - భక్తి లేకుండా మనోనిశ్చలత, శాంతి లభించడం దుర్లభమని!

పరదూషణంటే..పెంట తినడమే! 

ఒకసారి వాడా(వసతిగృహం)లో చాలామంది కూర్చుని ఉన్నారు. వారిలో ఒకాయన అప్పుడక్కడ లేని ఒక వ్యక్తిని గురించిన దోషాలు, దుర్గుణాలు ఏకరువు పెడుతున్నాడు. చాలామందికి అతని పద్ధతి నచ్చలేదు. కొంతసేపైన తరువాత అతడు లఘుశంక తీర్చుకోవడానికి బయటకెళ్ళాడు. ఈలోగా బాబా వాడా మీదుగా లెండీకి వెళుతున్నారు. అక్కడి ప్రజలందరూ బాబా పాదాలకు నమస్కరించారు. అప్పుడు ఆయన 'అంతకుముందు పరనింద చేస్తున్న వ్యక్తి ఎక్కడ'ని నన్ను(దీక్షిత్) అడిగారు. అతడు లఘశంక తీర్చుకోవడానికి బయటకెళ్ళాడని నేను చెప్పాను. ఆ తరువాత ఆ వ్యక్తి వాడాకు తిరిగి రాగానే బాబా అతని కోసం అడుగుతుండినారని తెలియజేశాను. అప్పుడు అతడు ఇలా చెప్పాడు: “దారిలో బాబాను కలిశాను. ఆయన నాకు పెంట తింటున్న ఒక పందిని చూపి, “చూడు! అది ఎంత ఆనందంగా ఆ మాలిన్యాన్ని తింటూ ఉందో! కానీ, మనకు మాత్రం దాన్ని చూస్తుంటే అసహ్యం వేస్తుంది. ఇతరులను (పరోక్షంలో) దూషించడం కూడా సరిగ్గా ఇటువంటిదే. దూషించేవాడికి ఆ పరనింద తియ్యగానే ఉంటుంది. కానీ చూచేవాళ్లకి పరమ అసహ్యంగా ఉంటుంది. ఇతరుల గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడకూడదు” అని అన్నారు.

గమనిక: ఇప్పటివరకు 'సాయిపథం' మ్యాగజైన్స్‌లో ప్రచురితమైన దీక్షిత్ డైరీలోని అనుభవాలను యథాతథంగా మీతో పంచుకున్నాము. ఇంతటి అనుగ్రహ అవకాశాన్ని ఇచ్చిన సద్గురు శ్రీసాయినాథునికి, పూజ్యశ్రీ సాయినాథుని శరత్‌బాబూజీకి మా నమస్సుమాంజలులు. మరికొన్ని అనుభవాలు రేపటి భాగంలో.....

సోర్స్: సాయిపథం - వాల్యూం -2

సాయిభక్తుల అనుభవమాలిక 54వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవం: 

  • బాబా! మీరెప్పుడూ మాకు అండగా నిలవాలి.

య.ఎస్.ఏ నుండి ఒక అజ్ఞాత సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

కొన్ని రోజుల క్రితం ఒక శనివారంనాడు నేను ఇంట్లో ఉన్నప్పుడు నా శరీరంలోని చాలా భాగాలపై తేనెటీగలు కుట్టాయి. ముఖ్యంగా పెదవిపై కుట్టాయి. దానివలన ఒక గంటలో నా పెదవి బాగా వాచిపోయి, విపరీతంగా నొప్పి పెట్టసాగింది. నొప్పి తట్టుకోలేక ఇంటి చిట్కాలన్నీ ఉపయోగించి ఊదీ కూడా రాశాను. కానీ నొప్పి, వాపు తగ్గలేదు. మరుసటిరోజు ఉదయానికి నా ముఖమంతా బాగా వాచిపోయింది. దానితో నాకు చాలా భయమేసి బాబా ముందు కూర్చుని ఏడుస్తూ, "బాబా! నేను రేపు ఆఫీసుకి వెళ్ళాలి. ఇలా ఉంటే ఎలా వెళ్ళగలను? దయచేసి ఈ వాపులు తగ్గిపోయేలా చూడండి" అని ప్రార్థించాను. తరువాత ఊదీ పెట్టుకుని, "ఈ నొప్పి, బాధ తగ్గిపోతే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని బాబాకు చెప్పుకున్నాను. అద్భుతం! సాయంత్రానికల్లా వాపు చాలావరకు తగ్గిపోయింది. సోమవారం ఉదయానికి కొంచెం వాపు ఉన్నప్పటికీ ఎవరైనా బాగా గమనిస్తే గానీ కనిపించేలా లేదు. శరీరంపై ఇతర చోట్ల కూడా తేనెటీగ కుట్టిన ఆనవాళ్లు ఉన్నప్పటికీ అవి ఎవరికీ కనిపించవు. కాబట్టి నేను సంతోషంగా ఆఫీసుకు వెళ్ళాను. "మీరు చేసిన సహాయానికి చాలా చాలా కృతజ్ఞతలు బాబా! మా అమ్మాయి చదువు విషయంలో జాగ్రత్త తీసుకోండి. మా ఇల్లు త్వరగా అమ్ముడయ్యేలా అనుగ్రహించండి. ఆ విషయంలో మీ ఆశీస్సులు మాకవసరం. నా కొడుకు కొన్ని వైద్యపరీక్షలు చేయించుకుంటున్నాడు. ఆ విషయంలో తనకి సహాయం చేసి తనిని జాగ్రత్తగా చూసుకోండి. బాబా! మీరెప్పుడూ మాకు అండగా నిలవాలి. దయచేసి నా మనస్సులోని కోరికలను నెరవేర్చండి. అది మీరు మాత్రమే చేయగలరు."

మరో అనుభవం:

ఒకసారి మా అమ్మాయికి పరీక్షలు ఉండటంతో తను మానసికంగా చాలా ఆందోళనపడుతూ ఉంది. ఎందుకంటే, తను అంతకుముందు జరిగిన పరీక్షల్లో సరైన ప్రతిభ చూపలేకపోయింది. పరీక్ష ముందురోజు నేను, "బాబా! మీరు తనతో ఉన్నారన్న ఆశీర్వాదసూచకంగా ఏదో ఒక రూపంలో నాకు కనిపించండి" అని ప్రార్థించాను. మేము యు.ఎస్.ఏ లో ఉండటం వల్ల వెహికల్స్ పైన బాబా ఫోటో ఉండటం గానీ, సాయి పేరు కనిపించడం గానీ చాలా అరుదు. అయినా నేను 'SAI' అన్న మూడక్షరాల కోసం ఆతృతగా చూస్తూ ఉన్నాను. ఆఫీసుకి వెళ్ళే దారిలో గానీ, ఆఫీసులో గానీ ఎక్కడా సాయి ఫోటో, SAI అన్న మూడు అక్షరాలు కనిపించలేదు. రోజులో చాలాభాగం గడిచిపోయినా బాబా సంకేతం నాకు కనిపించలేదు. ఆరోజు ఆఫీసులో కాన్ఫరెన్స్ ఉంది. కాన్ఫరెన్సులో వెజిటేరియన్ ఫుడ్ లేకపోవడంతో నా కొలీగ్ ఒకరు, "మనం బయటికి వెళ్లి, వెజిటేరియన్ ఫుడ్ తీసుకుందామా?" అని అడిగారు. సరేనని ఇద్దరం దగ్గర్లో ఉన్న ఇండియన్ రెస్టారెంట్ కు నడుచుకుంటూ బయలుదేరాం. అలా వెళుతూ రోడ్డు దాటడం కోసం ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాము. హఠాత్తుగా ఒక వీధి మలుపులో ఉన్న 'SAIntel' అనే హోటల్ పేరు నా కళ్ళలో పడింది, ఆ పేరులో ఉన్న SAI అన్న మూడు అక్షరాలు తళుక్కుమని మెరిసినట్లు అనిపించాయి నాకు. వెంటనే బాబాకి కృతజ్ఞతలు చెప్పుకుని, ఆ హోటల్ పేరును ఫోటో తీసి, మా అమ్మాయికి పంపించి, "సాయి నీతోనే ఉన్నార"ని చెప్పాను. మరుసటిరోజు తను నాకు ఫోన్ చేసి, "పరీక్ష చాలా బాగా వ్రాసాన"ని చెప్పింది. మరొకరోజు ఫోన్ చేసి, "అమ్మా! నాకు 95% వచ్చింద"ని చెప్పింది. బాబా లీలలు అద్భుతం. ఆయన నాతో, మా అమ్మాయితో ఉన్నానని సూచించారు. "థాంక్యూ సో మచ్ బాబా!"

నేను 'నవ గురువార వ్రతం' చేస్తున్నాను. వ్రతం మొదలుపెట్టేముందు వ్రతం చేసిన రోజు కేవలం స్వీట్స్, ఫ్రూట్స్ మాత్రమే తీసుకుంటానని అనుకున్నాను. కానీ ఒకరోజు ఆఫీసులో చాలా మీటింగ్స్ ఉండటంతో ఆరోజు లంచ్ టైములో బాబా గుడికి వెళ్ళలేకపోయాను. సాయంత్రం కూడా బాగా పొద్దుపోయేసరికి టెంపుల్ దగ్గర ఆగకుండానే ఇంటికి వచ్చేసాను. పైగా బాగా ఆకలితో ఉండటం వలన వ్రతం చేసిన సంగతి మరచిపోయి మామూలుగా భోజనం చేసేశాను. "ప్లీజ్ బాబా! నా నిర్లక్ష్యానికి క్షమించండి. నిన్నటికి 8వ వారం వ్రతం పూర్తయింది. కానీ ఇల్లు అమ్మకం జరగలేదు. దానివలన మాకు నష్టం ఉండటంతో నాకు చాలా ఆందోళనగా ఉంది. మరో నాలుగు వారాల్లో నేను 15 ఏళ్ల తర్వాత శిరిడీ వస్తున్నాను. ఆలోగా ఇల్లు అమ్ముడైపోయేలా చేసి ప్రశాంతమైన మనసుతో మిమ్మల్ని దర్శించుకునేలా అనుగ్రహించండి బాబా!"

source: https://www.shirdisaibabaexperiences.org/2019/05/shirdi-sai-baba-miracles-part-2345.html

సాయిభక్తుల అనుభవమాలిక 53వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:
  1. అనారోగ్యం నుండి అమ్మను బయటపడేశారు బాబా.
  2. బాబా కరుణ:

అనారోగ్యం నుండి అమ్మను బయటపడేశారు బాబా.

యు.ఎస్.ఏ నుండి సాయిభక్తురాలు ఉషానందిని తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

నేను 2009వ సంవత్సరం నుండి బాబా భక్తురాలిని. 2018 అక్టోబరు నెలలో మేము సెలవుల్లో ఇండియా వచ్చాము. ఆ సమయంలో సోడియం, పొటాషియం లోపంవల్ల మా అమ్మగారి ఆరోగ్యం బాగోలేదు. ఆమె అతి కష్టం మీద నడవడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. అక్టోబరు 12న నేను ఒక సెమినార్ కోసం వేరే ఊరు వెళ్ళాను. ఆరోజు ఇంటిలో ఎవరూ లేని సమయంలో అమ్మ రెండుసార్లు మంచం దగ్గర కింద పడిపోయింది. పడిపోయిన ప్రతిసారీ దాదాపు రెండు గంటల పాటు పైకి లేవలేక అలాగే క్రిందనే ఉండిపోయింది. తర్వాత 72 గంటల పాటు తను పూర్తిగా మంచానికే అతుక్కుపోయింది. పరిస్థితి ఎంత దారుణమంటే పడుకునివున్న తను మరోవైపు తిరగాలంటే కూడా మరొక మనిషి సహాయం అవసరమైంది. మా జీవితంలో ఎంతో బాధాకరమైన రోజులవి. అక్టోబరు 15, బాబా సమాధి చెందిన రోజు. ఆరోజు నేను, "బాబా! అమ్మనిలా మంచంపై కష్టపడేలా చేయకండి. తనకి ఆరోగ్యాన్ని ప్రసాదించండి" అని ప్రార్థించాను. చివరికి అమ్మని ఆ స్థితిలో చూడలేక, "బాబా! కావాలంటే అమ్మని మీ దగ్గరకైనా తీసుకునిపోండి" అని కూడా అనుకున్నాను. తర్వాత ఆమె ఆరోగ్యం గురించి 'క్వశ్చన్ అండ్ ఆన్సర్' సైటులో చూస్తే, "ఒక వ్యక్తి వచ్చి మీకు సహాయం చేస్తాడు, దాంతో మంచి జరుగుతుంది" అని వచ్చింది. ఆరోజు రాత్రి 2 గంటల సమయంలో అమ్మ తనంతట తానే నిద్రలో మరోవైపు  తిరగటం గమనించాను. దాంతో బాబా దయవలన తను త్వరగా కోలుకుంటుందని కాస్త ఉపశమనంగా అనిపించింది. ఆ సమయమంతా నేను సాయి నామస్మరణ చేస్తూనే ఉన్నాను. నిద్రలో కూడా నా నోట బాబా నామస్మరణ జరగటం నేను గమనించాను. బాబా చెప్పినట్లుగానే అమ్మ సహాయార్థం ఒక నర్సు వచ్చింది. తరువాత బాబా అనుగ్రహంతో ఆమె కాస్త కోలుకుంది. అప్పుడు తనకి కిడ్నీకి, గుండెకి సంబంధించిన పరీక్షలు చేయించాం. రిపోర్టులన్నీ బాగానే వచ్చాయి. ఆమె నిదానంగా బలాన్ని కూడదీసుకుంటూ నడవడం మొదలుపెడుతున్న సమయంలో హఠాత్తుగా అక్టోబర్ 29న తను మళ్ళీ అనారోగ్యం పాలైంది. అప్పుడు వేరే చోట ఉన్న నేను మళ్లీ తన ఆరోగ్యం గురించి బాబాని అడిగాను. "18 గంటల్లో తను కోలుకుంటుంద"ని వచ్చింది. నేను ఆందోళన చెందుతున్నప్పటికీ బాబాపై పూర్తి నమ్మకంతో ఇంటికి ఫోన్ చేయలేదు. సహనంతో 18 గంటలు పూర్తయ్యేవరకు వేచి చూసాను. 24 గంటల తర్వాత ఇంటికి ఫోన్ చేస్తే, అమ్మ తన కాళ్ళపై తాను నిల్చొని నాతో మాట్లాడింది. ఈ విధంగా మన పూర్వజన్మ కర్మలను బాబా తొలగిస్తున్నారు. "ప్లీజ్ బాబా! అమ్మని, నా బ్రదర్ ని, మా కుటుంబాన్ని ఆశీర్వదించండి".

బాబా కరుణ:

మరో సాయిభక్తురాలు ఒక చిన్న అనుభవాన్ని పంచుకుంటున్నారు.

"బాబా! మీ దివ్యపాదాలకు నా ప్రణామములు". నాకొక చంటిబిడ్డ ఉన్నాడు. నేను రోజూ తనకి స్నానం చేయించిన తర్వాత బాబా ఊదీ పెడుతూ ఉంటాను. ఒకరోజు రాత్రి హఠాత్తుగా తనకి చాలా ఎక్కువగా తమ్ములు రావడం మొదలైంది. మరుసటిరోజుకి అది ఇంకా ఎక్కువ అవుతుందేమోనని నాకు భయం వేసి, "బాబా! తనకి నయమయ్యేలా చూడండి, ఈ తుమ్ములు ఆగిపోయి తను హాయిగా ఊపిరి పీల్చుకునేలా చూడండి" అని ప్రార్థించాను. ఆశ్చర్యం! తెల్లవారేసరికి తమ్ములు చాలావరకు తగ్గిపోయాయి. "కోటి ప్రణామాలు బాబా!"

source: https://www.shirdisaibabaexperiences.org/2019/05/shirdi-sai-baba-miracles-part-2345.html

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo