సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 47వ భాగం....

ఈరోజు భాగంలో అనుభవం: 
  • బాబా ఆశీస్సులేనని నిర్ధారణ

ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్ని పంచుకుంటున్నారు.

సాయిబంధువులందరికీ నమస్తే! "నేనుండగా నీకు భయమేల?" అన్న బాబా పలుకులు ఎంత అద్భుతమైనవి! నాకే కష్టం వచ్చినా  ఆ పలుకులు నాకెంతో ధైర్యాన్నిస్తాయి. నేను బాబా భక్తురాలినై ఒకటిన్నర సంవత్సరం అవుతుంది. ఈ కొద్దికాలంలోనే నేను చాలా సాయిలీలలను అనుభవించాను. అయితే, "ఆ లీలలు యాదృచ్ఛికంగా సంభవించాయా? లేకపోతే బాబా ఆశీస్సులా?" అని నాకు అనుమానం కలుగుతుండేది. కానీ బాగా లోతుగా ఆలోచించి చూస్తే, అవి బాబా ఆశీస్సులేనన్న గుర్తులు స్పష్టంగా కనిపించేవి. అలా  నిర్ధారణ పొందిన ఒక అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.

కొత్తగా స్థాపించిన ఒక కంపెనీలో నేను పనిచేస్తూ ఉండేదాన్ని. నేను నా పనితో, నా సహచరులతో చాలా సంతోషంగా ఉండేదాన్ని. ఒక సంవత్సరం తర్వాత కంపెనీ కొన్ని ప్రాజెక్టులను కోల్పోయింది. దాంతో చెడుకాలం మొదలైంది. అప్పటివరకు కంపెనీ పెట్టిన పెట్టుబడికి తగిన ఆదాయం రాక ఉద్యోగస్తులకు సమయానికి జీతం వచ్చేది కాదు. పైగా నేను జాయినయినప్పుడు ప్రమోషన్ ఇస్తామన్న ఒప్పందాన్ని కూడా వాళ్ళు నిలబెట్టుకోలేదు. ఆ పరిస్థితుల వలన కొత్త ఉద్యోగం వెతకడం మొదలుపెట్టాను. నా ప్రొఫైల్ కి తగిన ఉద్యోగం దొరకడం చాలా కష్టమైన పని. ఎందుకంటే ఆ టెక్నాలజీ కొత్తగా వచ్చింది, ఇంకా మార్కెట్లో నిలదొక్కుకోలేదు. చాలా కొద్ది ఎం.యెన్.సి కంపెనీలలో మాత్రమే అవకాశం ఉంది. అయితే వాళ్లు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగాలు మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. నేను, "బాబా! నాకు మంచి ఎం.యెన్.సి కంపెనీలో పర్మినెంట్ ఉద్యోగాన్ని ఇవ్వండి" అని రోజూ ప్రార్థిస్తూ ఉండేదాన్ని.

బాబా కృపవలన ఒకరోజు నేనొక ఇంటర్వ్యూ విజయవంతంగా పూర్తి చేశాను. అయితే ఆరు నెలల తర్వాత పనితీరును బట్టి పర్మినెంట్ చేస్తామని వాళ్ళు చెప్పారు. కాంట్రాక్ట్ జాబ్ అయినప్పటికీ నేను చాలా సంతోషపడ్డాను. పర్మినెంట్ జాబ్ కోసం వెతుకుతున్న నేను కాంట్రాక్ట్ అయినా ఆ క్షణం నేనెందుకు ఆనందపడ్డానో నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంటుంది. అయితే అది బాబా కృప అని నాకు తర్వాత తెలిసింది. పాత కంపెనీలో నోటీసు పీరియడ్ రెండు నెలలు ఉండగా కొత్త కంపెనీ వాళ్లు అత్యవసర పరిస్థితి కారణంగా 15 రోజుల్లోనే ఉద్యోగంలో జాయినవ్వాలని టెక్నికల్ రౌండ్‌లోనే నాకు చెప్పారు. ఆ ఉద్యోగం నాకు ఎలాగైనా కావాలని బాబాతో చెప్పుకుని, పాత కంపెనీలో అడక్కుండానే వాళ్లకు సరేనని చెప్పేసాను. వాళ్ళు ఆఫర్ లెటర్ ఇచ్చి పాత కంపెనీలో పేపర్స్ సబ్మిట్ చేయమని చెప్పారు. ఇక సమస్య మొదలైంది. పాత కంపెనీ వాళ్ళు చాలాసేపు డిస్కస్ చేసిన తర్వాత, కనీసం ఒక నెలరోజులైనా ఉద్యోగం చేయాల్సిందేనని చెప్పారు. అదే విషయం కొత్త కంపెనీ వాళ్ళకి నేను చెప్పాను. కానీ వాళ్ళు అత్యవసరంగా జాయిన్ కావాలని, అలా కుదరదంటే ఉద్యోగంలోకి తీసుకోవడానికి వేరే వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. నేను ఎటూ తేల్చుకోలేని క్లిష్టపరిస్థితుల్లో పడిపోయాను. ఆ టెన్షన్‌తో నిద్రకూడా పట్టలేదు. రాత్రి, పగలు, "బాబా! దయచేసి నాకు సహాయం చేయండి. ఈ పరిస్థితినుండి నన్ను బయటపడేయండి" అని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. ఒకవేళ కొత్త కంపెనీలో నేను వాళ్ళు చెప్పిన సమయానికి జాయిన్ కాకపోతే నాకు ఉద్యోగం లేకుండా పోతుంది. పైగా పాత కంపెనీలో కూడా పేపర్ సబ్మిట్ చేసినందువల్ల నెలరోజుల తరువాత ఆ ఉద్యోగం కూడా పోతుంది. ఈ ఆలోచనలతో చాలా ఒత్తిడికి లోనయ్యాను. పదిరోజుల తర్వాత నేను పాత కంపెనీ వాళ్ళని, "ఒక వారంలో నన్ను రిలీవ్ చేయమ"ని అభ్యర్థించాను. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. కొత్త కంపెనీ వాళ్లు కూడా నా జాయినింగ్ తేదీ వెనుకకు జరపడానికి ఒప్పుకోలేదు. ఇక నేను బాబాను స్మరించి ఇంటినుండి పని చేసేలా పాత కంపెనీ నుండి అనుమతి తీసుకుని కొత్త కంపెనీలో జాయినయ్యాను. అయితే కొత్త కంపెనీ వాళ్లు పాత కంపెనీ నుండి రిలీవింగ్ లెటర్ అడిగారు. ఏం చెప్పాలో అర్థంకాక, "రేపు ఇస్తాన"ని చెప్పాను. వాళ్ళు లెటర్ ఇచ్చేవరకు ఉద్యోగం హోల్డ్‌లో ఉంటుందని చెప్పారు.

అదలా ఉంటే, పాత కంపెనీ క్లయింట్ వర్క్ అప్డేట్ గురించి పదేపదే ఫోన్ చేస్తున్నారు. నేను వాళ్ళతో, "అత్యవసర పరిస్థితి కారణంగా హాస్పిటల్లో ఉన్నాను. సాయంత్రం ఇంటికి వెళ్లి వర్క్ చేస్తాన"ని చెప్పాను. రోజంతా ఇలా ఒకటే టెన్షన్‌తో దేనిమీదా దృష్టి పెట్టలేకపోయాను. సాయంత్రం ఇంటికి వెళ్ళాక పాత కంపెనీ పని మొదలుపెట్టాను. అది పూర్తయ్యేసరికి చాలా రాత్రయింది. హమ్మయ్య అనుకునేలోపు వాళ్లు మళ్లీ వర్క్ ఇచ్చి, "అత్యవసరం కనుక రేపు మధ్యాహ్నానికల్లా పూర్తి చేయాలి" అన్నారు. ఇక నాకు ఒకటే టెన్షన్. రాత్రంతా 'రేపేం చేయాల'ని ఆలోచిస్తూనే ఉన్నాను. ఆలోచనలతో నిద్ర కూడా పట్టలేదు. ఆ పరిస్థితికి బాగా విసిగిపోయి నన్ను నేను తిట్టుకుంటూ, "బాబా! నాకు సహాయం చేయండి" అని ప్రార్థించాను. తర్వాత బాగా ఆలోచించి కొత్త కంపెనీలో ఉద్యోగ అవకాశాన్ని వదులుకుని, పాత కంపెనీలో ఆ నోటీస్ పీరియడ్ పూర్తి చేసి రిలీవింగ్ లెటర్ సంపాదించుకోవాలన్న నిర్ణయానికి వచ్చేశాను. ఎందుకంటే ఒకవేళ నేను క్లయింట్ ఇచ్చిన పని పూర్తి చేయకపోతే రిలీవింగ్ లెటర్ ఇవ్వడంలో కంపెనీ ఆలస్యం చేస్తుంది. భవిష్యత్తులో నా కెరియర్‌కి రిలీవింగ్ లెటర్ తప్పనిసరి. అదివరకు నోటీసు పీరియడ్ ఇవ్వకుండా వెళ్లిపోయిన నా సహోద్యోగులకు ఒక సంవత్సరం దాటినా కంపెనీ రిలీవింగ్ లెటర్ ఇవ్వలేదు.

ఉదయాన బాబాను తలుచుకుని క్లయింట్ ఇచ్చిన వర్క్ చేయడానికి కూర్చున్నాను. కొంతసేపటికి హఠాత్తుగా నా గురించి అంతా తెలిసిన నా రూమ్మేట్ వచ్చి, "నువ్వు ఇంకా నీ కొత్త కంపెనీకి వెళ్లకుండా ఉన్నావేమిటి? రెండవరోజే నువ్వు ఆలస్యం చేస్తే ఎలా? వెంటనే బయలుదేరి వెళ్ళు" అని చెప్పింది. నాకేం మాట్లాడాలో అర్థంకాక కాసేపు మౌనంగా ఉండిపోయాను. మా ఇద్దరి మధ్యన చాలా డిస్కషన్ జరిగాక కొత్త కంపెనీకి వెళ్లడానికి నిర్ణయించుకున్నాను. అప్పటికే బాగా ఆలస్యమై దాదాపు 12 అవుతుంది. అంతలో మళ్లీ క్లయింట్ నుండి ఫోన్ వచ్చింది. ఏం చెప్పాలో అర్థంకాక నేను ఫోన్ లిఫ్ట్ చేయకుండా, "బాబా! నాకు సహాయం చేయండి" అని ప్రార్థించాను. క్లయింట్ కంపెనీ సీ.ఈ.ఓ. కి ఫిర్యాదు చేసాడు. దాంతో సీఈఓ ఫోన్ చేసి, "నీకు ఇష్టం లేకపోతే  చెప్పు, ఎందుకిలా చేస్తున్నావు? నీ ప్రవర్తన వలన నేను క్లయింట్ కి సమాధానం  చెప్పలేకపోతున్నాను" అని అన్నారు. మా ఇద్దరి మధ్య చాలాసేపు మాటలు జరిగాక, నేను "చాలా క్లిష్టపరిస్థితిలో ఉన్నాను. కాబట్టి నేను వర్క్ చేయలేను" అని చెప్పేసాను. చివరికి సాయిబాబా కృపవలన నేను కోరుకున్నట్లుగా నన్ను రిలీవ్ చేయడానికి సీఈఓ ఒప్పుకున్నారు. నేను పడుతున్న టెన్షన్ నుండి ఉపశమనం లభించింది, కొత్త కంపెనీలో నా ఉద్యోగం కన్ఫర్మ్ అయింది. ఆరోజు గురువారం కావడంతో నా ఆనందానికి అవధులు లేవు. మరుసటిరోజే నాకు నా డెస్క్ చూపించారు. నేను డెస్క్ చూస్తూ ఆశ్చర్యపోయాను. డెస్క్ వద్ద బాబా ఫోటో ఉంది. ఆ విధంగా ఆ మొత్తం ప్రక్రియ తన అనుగ్రహంతోనే నడిచిందని, అవి తన ఆశీస్సులే అని బాబా నాకు నిరూపణ చేశారు. ఆరోజునుండి ప్రతిరోజూ ఆఫీసుకు వెళుతూ బాబా ఫోటో చూసి, నాకాయన చేసిన సహాయానికి కృతజ్ఞతలు  చెప్పుకుంటూ ఉండేదాన్ని.

నాలుగు నెలల తర్వాత బాబా అనుగ్రహం వలన మంచి ప్యాకేజీతో వేరే పెద్ద ఎం.యెన్.సి. కంపెనీలో పర్మినెంట్ ఉద్యోగం వచ్చింది. నేను పనిచేస్తున్న కంపెనీలో నా ఉద్యోగం పర్మినెంట్ కావడానికి ఇంకా రెండు నెలలు ఉండటంతో బాబా అనుగ్రహంతో వచ్చిన కొత్త ఆఫర్‌ని వదులుకోలేక పోయాను. ఆ ఉద్యోగం విడిచిపెట్టేముందు బాబా ఫోటోను అక్కడే విడిచిపెట్టి, "బాబా! మళ్ళీ ఇక్కడికే రావాలని నా కోరిక. త్వరలోనే నన్ను ఇక్కడికి తీసుకుని రండి" అని ప్రార్థించాను. ఇప్పుడు నేను కొత్త కంపెనీలో ఉన్నాను, కానీ నా హృదయం పాత కంపెనీలో ఉన్న బాబా దగ్గరే ఉంది. ఎంత త్వరగా ఆయన నన్ను అక్కడికి తీసుకుని వెళ్తారా అని ఎదురుచూస్తూ ఉన్నాను.


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo