కాకాసాహెబ్ దీక్షిత్ డైరి - ఆరవ భాగం.
పనికిమాలిన పరనింద
అంజన్ వేల్ వాస్తవ్యుడైన మధురదాస్ తరచు శిరిడీ వచ్చి బాబాను దర్శిస్తుండేవాడు. ఒకసారి శిరిడీ వచ్చినప్పుడు అక్కడ హెటల్ నడుపుతున్న సగుణమేరునాయక్ వద్ద బసచేసాడు. ఇద్దరూ గంటల తరబడి పిచ్చాపాటి మాట్లాడుకోవడంలో పడ్డారు. 'వీడిట్లా, వాడట్లా' అంటూ ఇతరుల దోషాలను గురించిన చర్చలోనే వారి సంభాషణ ఎక్కువభాగం గడిచింది. తరువాత మధురదాస్ వెళ్ళి బాబా దగ్గర కూర్చున్నాడు. అతన్ని చూడగానే బాబా తీవ్రస్వరంతో, “సగుణ్ ఏమంటున్నాడు?”అని అడిగారు. మధురదాస్ కు తన సంభాషణ గుర్తుకొచ్చి, సిగ్గుతో తల వంచుకున్నాడు. అటువంటి పరనిందా ప్రసంగాలు బాబాకు ఇష్టంలేదని గ్రహించాడు. బాబా అతనితో, “ఇతరుల దోషాల గురించి మాట్లాడటంగానీ, ఆ మాటలు వినడంగానీ మంచిది కాదు!” అన్నారు.
స్వప్నంలో వైద్యం
బాబా భక్తురాలైన శాంతాబాయి బేలాపూరు సమీపంలోని టర్బెగావ్ లో నివసించేది. ఆమె ఎడమచేతి వేలి ఎముకమీద కురుపు లేచి బాగా బాధిస్తుండేది. ఒకసారి ఆమెకు స్వప్నంలో దర్శనమిచ్చి, “వ్రణం మీద డేకామలి రాయి!” అని చెప్పారు. నిద్రనుండి మేల్కొని ఆమె అలానే డేకామలి రాసుకొంది. కురుపు నయమై బాధ పూర్తిగా తగ్గిపోయింది. ఈ విషయాన్ని ఆమె 1-9-1918న ఒక ఉత్తరంలో వివరంగా తెలిపింది.
ఊది చికిత్స
బొంబాయి వాస్తవ్యుడైన నారాయణ గోపీనాధ్ డిగేకు పొట్ట ప్రేవులలో వ్రణం లేచింది. అది రాను రాను పెద్దదయి అతి బాధాకరంగా పరిణమించింది. బొంబాయిలోని ఎందరో ప్రఖ్యాత డాక్టర్లకు చూపించుకొని మందులు వాడాడు. కానీ ఫలితం కనిపించలేదు. సాయి భక్తుడయిన ఇతని మిత్రుడు ఒకాయన శిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేస్తే వ్రణం తగ్గవచ్చని సలహా ఇచ్చాడు. కానీ ఆతని ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా శిరిడీ దాకా ప్రయాణం చేసే స్థితిలో లేడు. అందుకని అతడు తన మిత్రుడితో“బాబా అనుగ్రహం వల్ల వ్రణం పగిలి మలవిసర్జనతో బయటకువచ్చేసి, ఆరోగ్యం మెరుగైతే గానీ నేను శిరిడీ వెళ్ళలేను” అన్నాడు. శ్రీడిగే గారి మిత్రుడు అతనికి బాబా ఊదీని ఇచ్చి రోజూ ధరించమని చెప్పాడు. డిగే ఊదీ ధరించిన మరుసటి రోజే అతని వ్రణం పగిలి, మలవిసర్జనతో బయటకు కొట్టుకొచ్చేసింది! ఒక్క వారంలో డిగేకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరింది. ఆ వెంటనే అతను శిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకొన్నాడు.
శ్రీ ఖేంజి లాల్జీ జోషీ పార్లే లోని పంజాబీ చాల్ లో నివసించేవాడు. ఆయన కుమార్తె చాలాకాలంగా తీవ్ర అనారోగ్యానికి గురయింది. ఒకనాడు ఆమె పరిస్థితి ఆందోళనగా మారింది. ఆమె తల్లి తనకుమార్తెకు బాబా ఊదీ ఇచ్చి, బాబాను ఆర్తితో ప్రార్థించింది. వెంటనే ఆమె కుమార్తె ఆరోగ్యం మెరుగవడం ప్రారంభించింది. ఒకరోజు శ్రీజోషీ, తన భార్య, కుమార్తెలను తీసుకొని శిరిడీ వెళ్ళాడు. కూతురు చాలా బలహీనంగా ఉండి స్వయంగా నడవనుకూడా శక్తిలేని పరిస్థితిలో ఉంది. తల్లిదండ్రులు ఆమెను ఎత్తుకొనితీసుకెళ్లి బాబా ముందు కూర్చొనబెట్టారు. బాబా ఆమె ముఖాన ఊదీ వ్రాసి ఆశీర్వదించారు. మూడురోజులుగా ఆమె పూర్తిగా కోలుకొని, తనకై తానే స్వయంగా నడవగలిగింది.
శ్రీసాయి దిద్దిన కాపురం
దహనూకు చెందిన శ్రీజి.కె. వైద్య ఒకసారి శిరిడీ వచ్చి బాబా దర్శనం చేసుకొన్నాడు. దహనూ తిరిగి వెళ్ళగానే తన అన్నగారైన శ్రీఆత్మారాంను కూడా శిరిడీ వెళ్ళిరమ్మని సలహా యిచ్చాడు. తమ్ముడి మాటమీద ఆత్మారాం శిరిడీ వచ్చాడు. అప్పుడు అతని వయస్సు 42 సంవత్సరాలు. 38 సంవత్సరాలు నిండుతున్న ఆయన భార్య వారి వివాహం జరిగిన లగాయతూ (ఏవో మనస్పర్థల వల్ల) పుట్టింట్లోనే ఉండిపోయి, భర్త దగ్గరకు రాలేదు. పెళ్ళి అయిందన్నమాటే గానీ వారు కలిసి కాపురం చేసింది లేదు. ఇరువైపుల పెద్దలు ఎంత ప్రయత్నించినా, ఆమె తన భర్త వద్దకు వెళ్ళడానికి ససేమిరా నిరాకరించింది.
ఆత్మారాం శిరిడీ వచ్చి బాబా ఊదీ ప్రసాదాలు తీసికొన్న సమయంలోనే పుట్టింట్లో ఉన్న ఆయన భార్యకు ఏదో ప్రేరణకలిగి, వెంటనే అత్తవారింటికి వెళ్ళింది. అక్కడ తన మరిది జి.కె.వైద్యతో “నిజానికి యిదే నా యిల్లు! పుట్టింట్లో ఉండటం నాకేం బాగులేదు” అని చెప్పింది! తన వదినగారిలో హఠాత్తుగా వచ్చిన యీ మార్పుకు శ్రీవైద్య ఆశ్చర్యపోయాడు. ఆ తరువాత ఆత్మారాం దంపతులు ఏ పొరపొచ్చాలు లేకుండా, పిల్లాజెల్లాతో హాయిగా కాపురం చేసారు! ఈ సంఘటన 1913లో జరిగింది.
తరువాయి భాగం రేపు
మూలం: సాయిపథం వాల్యూమ్ -1