ఈరోజు భాగంలో అనుభవం:
- మనకేది మంచిదో అది మాత్రమే బాబా మనకి ఇస్తారు.
చెన్నై నుండి సాయిభక్తుడు దురై తన అనుభవాన్ని పంచుకుంటున్నారు.
నేను ఒక సాధారణ సాయిభక్తుడిని. నేనిప్పుడు చెప్పబోయే అనుభవం 2016 - 2017 మధ్యలో జరిగింది. నేను 2010 నుండి యు.ఎస్. లో ఉంటున్నాను. యు.ఎస్. లో స్థిరపడాలన్నది నా లక్ష్యం. నేను పనిచేస్తున్న కంపెనీ వాళ్లు గ్రీన్ కార్డు స్పాన్సర్ చేస్తారని ఆశిస్తూ ఉండేవాడిని. అయితే ఆ కంపెనీ వాళ్ళకి 2016 మధ్యవరకు గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ పాలసీ లేదు. నాకేం చేయాలో అర్థంకాక బాబాని ప్రార్థిస్తూ ఉండేవాడిని.
బాబా అనుగ్రహం వలన 2016లో నా భార్య రెండవసారి గర్భవతి అయింది. అదేసమయంలో నేను పనిచేస్తున్న కంపెనీకి గ్రీన్ కార్డ్ ప్రాసెస్ చేసేందుకు అనుమతి లభించింది. అనుమతి వచ్చిన ఒక్క వారంలోనే నన్ను కూడా గ్రీన్ కార్డ్ ప్రక్రియకు ఎంపిక చేశారు. హఠాత్తుగా జరుగుతున్న పరిణామాలకి నన్ను నేను నమ్మలేకపోయాను. అమెరికన్ డ్రీమ్ నిజమవుతుందనే ఆనందంతో నా కోరిక తీరుస్తున్నందుకు బాబాకి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. అయితే మనిషి ఒకటి తలిస్తే, భగవంతుడు తలంపు మరోలా ఉంటుంది. ఒకరోజు మా సీనియర్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ ని కలిసాను. ఆయన నా పనితనానికి గొప్పగా మెచ్చుకుని, భవిష్యత్తులో ఏదైనా అవసరం వస్తే సహాయం చేస్తానని వాగ్దానం చేశారు. అయితే నేను అతనితో మాటలలో ఉండగా అకస్మాత్తుగా నా లోపలినుండి, "అంతా మాయ. సుఖదుఃఖాలు జీవితంలో సమంగా ఉంటాయి. నిన్నిప్పుడు పొగుడుతున్న ఇదే వ్యక్తి భవిష్యత్తులో నిన్ను చాలా నీచంగా చూస్తాడు" అన్న శ్రీసాయిబాబా మాటలు వినిపించాయి. బాబా మాటలు ఖచ్చితంగా నిజమవుతాయని నాకు తెలుసు కాబట్టి రానున్న నెలలు నాకు, నా కుటుంబానికి ఎంత కష్టంగా ఉంటాయో అని అనిపించింది.
తర్వాత గ్రీన్ కార్డు ప్రాసెస్ కి సంబంధించి నాకొక మెయిల్ వచ్చింది. అందులో సారాంశం ఏమిటంటే, నేను సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ చాలా పాతవని, కొత్తవి కావాల్సి ఉందని. దాంతో నేను నా హెచ్.ఆర్ ని సంప్రదించి, కొత్త ఇన్ఫర్మేషన్ సంపాదించడంలో సాయం చేయమని అభ్యర్థించాను. మొదట్లో వాళ్ళు సాయం చేశారు గానీ, తర్వాత, "అది నీ బాధ్యత, నువ్వే ఆ డాక్యుమెంట్స్ ఏర్పాటు చేసుకో" అని చెప్పేశారు. రోజులు పరుగెడుతున్నాయి. నాకేమో ఆ డాక్యుమెంట్స్ విషయంలో అంతగా అవగాహన లేదు. తరచూ, "బాబా! నాకు సహాయం చేయండి" అని ప్రార్థిస్తూ ఉండేవాడిని. కానీ ఏం ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి నేను, "స్వంతంగా ఏదో ఒకటి ఏర్పాటు చేసుకోనా, వద్దా?" అని బాబాని అడిగాను. బాబా సమాధానం 'ఎస్' అన్నట్లు నాకు అనిపించి, నేను చేస్తుంది సరైంది కాదని తెలుస్తున్నప్పటికీ ఏవో కొన్ని ప్రయత్నాలు చేశాను. కానీ చివరికి అంతా తలక్రిందులైంది. నా డాక్యుమెంట్స్ చూసిన వేరే టీమ్ వాళ్ళు చాలా తప్పులు గుర్తుపట్టారు. దాంతో నామీద విచారణ మొదలైంది. హెచ్.ఆర్ వాళ్ళు నాకు ఫోన్ చేసి అడిగితే, నేను నా తప్పులన్నీ ఒప్పుకుని, క్షమాపణ చెప్పుకున్నాను. కానీ వాళ్ళు నేను చేసిన దానివలన సంస్థకు చాలా అవమానం జరిగిందని, అందుకు ప్రతిఫలం చెల్లించక తప్పదని నా మీద తీవ్రంగా మండిపడ్డారు. నేను ఇంక ఏమీ మాట్లాడలేక ఫోన్ పెట్టేసి అంతా నా అదృష్టానికి వదిలేశాను. దాదాపు రెండునెలలు ఎవరితో ఎటువంటి సంబంధం లేకుండా ఉండిపోయాను. నా గ్రీన్ కార్డు ప్రాసెసింగ్ నిలిచిపోయింది. నేను మనశ్శాంతి కోల్పోయాను. పన్నెండేళ్ల నా సర్వీసులో బ్లాక్ మార్క్ తెచ్చుకోవడమే కాకుండా నా కుటుంబాన్ని కూడా ఇబ్బందుల్లో పడేసాను. "బాబా! సహాయం చేయండి" అని ప్రార్థిస్తూ ఉన్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో బాబా నుండి ఎటువంటి స్పందనా ఉండేది కాదు. ఒక్కోసారి ఏదైనా స్పందన వచ్చినా అస్పష్టంగా ఉండేది. ఆయన "చివరికి అంతా మంచే జరుగుతుంది" అనేలా సంకేతం ఇస్తుండేవారు. ఏం చేయాలో అర్థంకాక ఏ నిర్ణయమూ తెలుసుకోలేకపోయేవాడిని. ఏరోజుకారోజు సమస్య పరిష్కారమవుతుందని ఆశగా ఎదురుచూస్తూ ఉండేవాడిని.
రెండునెలల తర్వాత నిండు గర్భిణి అయిన నా భార్యకు సహాయం చేయడానికి నా పేరెంట్స్ యు.ఎస్. వచ్చారు. తన డెలివరీ డేట్ 2016 డిసెంబరులో ఉండగా, 2017 ఏప్రిల్ లో నా వీసా గడువు ముగియబోతోంది. 2017లో ఏం జరుగుతుందో ఏమీ అర్థంకాని పరిస్థితిలో ఉన్నాను. అలాంటి పరిస్థితులో ఒక హెచ్.ఆర్. ఎగ్జిక్యూటివ్ ఫోన్ చేసి రెండువారాల్లో యు.ఎస్. వదిలి వెళ్లిపోవాల్సిందిగా చెప్పారు. ఆ మాట వింటూనే నేను షాక్ అయ్యాను. నన్ను నేను శాంతపరుచుకుని నా భార్య డెలివరీ గురించి వివరించి, కొన్నిరోజులు అక్కడ ఉండేలా అనుమతించమని అభ్యర్థించాను. బాబా కృపవలన ఆమె కొన్నిరోజులు ఉండటానికి అనుమతించి, తర్వాత నిర్ణయం జనవరిలో తీసుకుంటానని చెప్పారు. ఆ పరిస్థితినుండి బయటపడేలా సహాయం చేయమని నేను నా మేనేజర్లని, సూపర్ వైజర్లని అభ్యర్థించాను. కానీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. పూర్తిగా యు.ఎస్. లో ఉండే ఆశ ఆవిరైపోయినట్లు అనిపించింది. అయినా ఉండబట్టలేక మళ్లీ, "బాబా! నాకు సహాయం చేయండి" అని ప్రార్థించాను. ఎప్పట్లాగే, "నన్ను తలచుకో. అంతా సక్రమంగా సాగుతుంది" అని సమాధానం వచ్చింది. డిసెంబర్ చివర్లో బాబా ఆశీస్సులతో మాకు అబ్బాయి పుట్టాడు. అంత కఠినమైన పరిస్థితులలో నా భార్య, పిల్లలే నాకున్న కాస్త సంతోషం.
జీవితం చాలా దుర్భరంగా సాగుతున్న సమయంలో ఒకరోజు మా అమ్మ నా దగ్గరకు వచ్చి, "ఒకవేళ నువ్వు ఇండియాకి తిరిగి వచ్చేటట్లయితే, నీకు చెడు జరుగుతున్నట్లుగా భావించకు!" అని చెప్పి, "ఎందుకో తెలియదు, నీకు ఇలా చెప్పాలని అనిపిస్తుంది" అని అంది. తను ఆ మాట చెప్పిన వెంటనే నా ఫోన్లో అకస్మాత్తుగా బాబా ఫోటో కనిపించింది. దాంతో అది బాబా ఇస్తున్న సందేశంగా తీసుకున్నాను. మరొకరోజు రాత్రి నా భార్యకి కలలో బాబా కనిపించి, తనని ఆశీర్వదిస్తూ, "నీ కుటుంబానికి అంతా మంచే జరుగుతుంది. యు.ఎస్.లో ఉండడం గురించి ఏమి నిర్ణయించుకున్నారు?" అని అడిగారు. అందుకు నా భార్య, "బాబా! మేము పూర్తిగా మిమ్మల్ని నమ్ముతున్నాము. మీరు ఏది ఇచ్చినా అది మా మేలుకోసం మీరిచ్చే ఆశీర్వాదమే" అని బదులిచ్చింది. ఉదయాన లేస్తూనే బాబా స్వప్నదర్శనానికి తను ఎంతగానో సంతోషించింది. ఆ కల ద్వారా బాబా మాకు యు.ఎస్. విడిచి వెళ్లిపొమ్మని ఆశీర్వదించినట్లుగా భావించాము. తర్వాత ఒకరోజు, నాలుగు నెలలుగా నా జీవితంలో నడుస్తున్న గందరగోళానికి మనశ్శాంతి కోల్పోయి ఏడుస్తూ, బాబాను ప్రార్థిస్తూ నా మొబైల్లో బ్రౌజ్ చేస్తున్నాను. హఠాత్తుగా, "శాంతించు! నీ మనసు ప్రశాంతంగా ఉంచుకుని నీ మనసులో ఉన్న కోరికను స్పష్టంగా నాకు చెప్పు, నేను నెరవేరుస్తాను" అన్న సందేశంతో సాయిబాబా కనిపించారు. ఆయన నన్ను నా కోరిక చెప్పమని అడుగుతున్నారు కాబట్టి, నేను 'గ్రీన్ కార్డు ప్రాసెస్ విజయవంతంగా పూర్తిచేసి నన్ను ఇక్కడ స్థిరపడేలా చేయమ'ని అడగాలని అనుకున్నాను. కానీ, అంతలో ఏమి జరిగిందో ఏమో తెలియదు గానీ, కళ్ళుమూసుకుని, "బాబా! మీరు ఏమిచ్చినా అది మా మేలు కోసమే. కాబట్టి దయచేసి మీకేది మంచిదనిపిస్తే అదే ఇవ్వండి" అని అడిగాను. అసలు ఎందుకలా చెప్పానో నాకే తెలీదు. కానీ ఏదో తెలియని దైవికచర్యగా అనుభూతి చెందాను. నా నోటి నుంచి వచ్చిన నా మాటలకి నాకు చాలా సంతోషంగా అనిపించింది. బాబా మాతో ఉంటూ మా యోగక్షేమాలు ఎంత బాగా చూసుకుంటున్నారో అర్థమైంది. మన జీవితంలోని ప్రతి కదలికను (సంతోషమైనా, దుఃఖమైనా) ఆయన నియంత్రిస్తూ ఉన్నారు.
చివరికి మార్చి నెల మొదలయ్యేసరికి నా సూపర్ వైజర్స్ అందరూ నాకు సహాయం చేయలేమని చేతులెత్తేశారు. నిజం చెప్పాలంటే, 'నీ సామానంతా సర్దుకుని తిరిగి ఇండియాకి వెళ్ళిపో' అని. మా మేనేజర్ ఎంతో బాధగా నాకోసం ఎంత కృషి చేశారో వివరించారు. నేను, "మరేం పర్వాలేదు. ఏం జరిగినా అంతా నా మంచికే" అని చెప్పాను. సాయిబాబా ఆశీస్సులు చివరికి రూపుదాల్చాయి అని అర్థం చేసుకున్నాను. ఇక ఇండియాకి తిరిగివచ్చే ప్రయత్నంలో అన్నీ సెటిల్ చేసుకోవడంలో లెక్కలేనన్ని సమస్యలు ఎదుర్కొన్నాను. కానీ బాబా రాత్రిపగలు నాకు తోడుగా ఉండి ప్రతిక్షణం ఎంతో సహాయంచేసి మమ్మల్ని ఇండియాకి చేర్చారు. నేను ఇండియా వచ్చి ఇప్పటికి దాదాపు సంవత్సరం పైన అవుతుంది. ఒక్కసారి గతంలోకి వెళితే ఎంతో బాధాకరంగా అనిపిస్తుంది. కానీ అంత కష్టకాలంలో కూడా బాబా సర్వదా మాతో ఉంటూ, నన్ను ఏనాడూ పూర్తిగా క్రుంగిపోనివ్వలేదు. నేను అప్పుడూ బాబాని అనుసరించాను, ఇప్పుడు కూడా అనుసరిస్తున్నాను. నేను ఆయన్ని పూర్తిగా అర్థం చేసుకున్నానని అనుకునేవాడిని. అయితే ఆ పరిస్థితులద్వారా నేనింకా అర్థం చేసుకోవలసింది చాలా ఉందని బాబా తెలియజేసారు. నేను హృదయపూర్వకంగా కోరుకున్న నా కోరిక నెరవేరక పోయినా, అంతకంటే గొప్పది, వెలకట్టలేని బాబా ఆశీస్సులు పొందానని భావిస్తున్నాను. మొదట్లో బాబా లెక్కలేనన్ని మన కోరికలు తీరుస్తున్నట్లు అనిపించినా, మనకేది మంచిదో అది మాత్రమే బాబా మనకి ఇస్తారని రానురాను అర్థమైంది. బాబాను హృదయపూర్వకంగా ప్రేమించే వాళ్ళకి కొన్ని సందర్భాల్లో ఆయన చర్యలు అర్థం కాకపోయినప్పటికీ ఆయన ప్రేమలో ఎటువంటి లోటూ ఉండదు. కన్నతల్లిలా ఆయన రాత్రిపగలు తన భక్తులకోసం మెలకువగా ఉంటూ కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటారు. జీవితంలో ఎందరో వస్తారు, పోతారు, బాబా మాత్రం ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టరు. "సాయిదేవా! మీకు నా నమస్సుమాంజలులు. అందరికీ శాంతిని చేకూర్చండి".