కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - పదమూడవ భాగం..
బాబా ఊదీ! ప్లేగు ఏది?!
నేను శిరిడీలో ఉన్నప్పుడు ఒకరోజు రాత్రి 9గం||ల ప్రాంతంలో షామా సోదరుడు బాపాజీ తన ఊరినుండి వచ్చాడు. అతను భయాందోళనలతో కంపించిపోతూ, “నా భార్యకు ప్లేగు సోకింది. జ్వరం చాలా ఎక్కువగా ఉంది. రెండు బొబ్బలు కూడా కనిపించాయి. వెంటనే బయలుదేరి రా!” అన్నాడు షామాతో. షామా వెంటనే బాబా వద్దకెళ్ళి ప్రయాణానికి బాబా అనుమతి కోరాడు. అప్పుడు బాబా, “ఇంత రాత్రప్పుడు వెళ్ళటమెందుకు? రేపు పొద్దునే బయలుదేరి వెళ్ళవచ్చులే! ప్రస్తుతానికి ఊదీ పంపించు!” అన్నారు. ఆ మాటలు విని బాపాజీ దుఃఖంతో మరీ కృంగిపోయాడు. కానీ, షామా మాత్రం బాబా ఆదేశాన్ని ఉల్లంఘించకుండా, (బాబా చెప్పినట్లు) ఊదీ మాత్రం పంపించి, తాను శిరిడీలోనే ఉండిపోయాడు. మరుసటిరోజు ఉదయం, బాబా శలవు తీసుకొని, తన సోదరుని భార్యను చూడటానికి వాళ్ళ ఊరు సావుల్‌విహిర్ వెళ్ళాడు. బయలుదేరే ముందు షామాకు శలవిస్తూ, వెంటనే తిరిగి వచ్చెయ్!” అన్నారు బాబా. షామా అక్కడకెళ్ళేసరికి అతని సోదరుని భార్యకు జ్వరం తగ్గిపోయి ఉంది. బొబ్బలు కూడా మాయమై, ఆ సమయానికి ఆమె టీ తయారుచేస్తోంది! ఆమెకు పూర్తి స్వస్థత చేకూరి ఉండటంతో బాబా చెప్పినట్లు మాధవరావు (షామా) వెంటనే శిరిడీకి తిరిగి రాగలిగాడు.
భక్తి లేక శాంతి సున్న!
దాదాకేల్కర్ మిత్రుడైన అనంతరావ్ పాటంకర్ పూనా నివాసి. ఆయనకు వేదాంతపు పిచ్చి. అంతేకాదు! వేదాంతోపన్యాసాలు కూడా ఇస్తుండేవాడు. ఆయనొకసారి బాబా దర్శనానికి శిరిడీ వచ్చాడు. బాబాను దర్శించి, “బాబా, నేను చాలా గ్రంథాలే చదివాను. కానీ, మనోనిశ్చలతగానీ, మనశ్శాంతిగానీ ఏమాత్రం లభించడంలేదు!” అని విన్నవించాడు. దానికి బాబా, “ఒకసారి ఇక్కడికి ఒక వ్యాపారస్థుడు వచ్చాడు. అప్పుడు ఒక మేక తొమ్మిది పెంటికలు (పేడ) వేసింది. అతను వాటిని మూటకట్టుకొని తీసుకెళ్ళాడు” అన్నారు. అనంతరావుకి ఆ మాటల అంతరార్థం ఏమీ బోధపడలేదు. వాడాకి వెళ్ళగానే బాబా మాటల అర్థం ఏమైవుంటుందని దాదాకేల్కర్‌ని అడిగాడు. దాదాకేల్కర్ తనకూ ఆ మాటల అర్థం ఏమీ బోధపడటం లేదని చెప్పి, బహుశా తొమ్మిది పెంటికలు నవవిధభక్తికి సంకేతం అయ్యుండొచ్చుననీ, ఆ నవవిధభక్తిని సంపాదించమని బాబా అనంతరావుకి ఉపదేశించి ఉంటారనీ అన్నాడు. మరుసటిరోజు అనంతరావు బాబా దర్శనానికెళ్ళగానే, బాబా అతణ్ణి చూచి, “ఏం? నేను చెప్పినట్లు ఆ తొమ్మిది పెంటికలు ఏరుకున్నావా?” అని అడిగారు. అనంతరావు బాబా పాదాలకు మ్రోకరిల్లి, “మీ అనుగ్రహముంటే ఆ తొమ్మిది పెంటికలు సంపాదించగలను” అన్నాడు. బాబా ప్రసన్నంగా అతణ్ణి ఆశీర్వదించారు. దీన్నిబట్టి తెలిసేదేమంటే - భక్తి లేకుండా మనోనిశ్చలత, శాంతి లభించడం దుర్లభమని!
పరదూషణంటే..పెంట తినడమే!
ఒకసారి వాడా(వసతిగృహం)లో చాలామంది కూర్చుని ఉన్నారు. వారిలో ఒకాయన అప్పుడక్కడ లేని ఒక వ్యక్తిని గురించిన దోషాలు, దుర్గుణాలు ఏకరువు పెడుతున్నాడు. చాలామందికి అతని పద్ధతి నచ్చలేదు. కొంతసేపైన తరువాత అతడు లఘుశంక తీర్చుకోవడానికి బయటకెళ్ళాడు. ఈలోగా బాబా వాడా మీదుగా లెండీకి వెళుతున్నారు. అక్కడి ప్రజలందరూ బాబా పాదాలకు నమస్కరించారు. అప్పుడు ఆయన 'అంతకుముందు పరనింద చేస్తున్న వ్యక్తి ఎక్కడ'ని నన్ను(దీక్షిత్) అడిగారు. అతడు లఘశంక తీర్చుకోవడానికి బయటకెళ్ళాడని నేను చెప్పాను. ఆ తరువాత ఆ వ్యక్తి వాడాకు తిరిగి రాగానే బాబా అతని కోసం అడుగుతుండినారని తెలియజేశాను. అప్పుడు అతడు ఇలా చెప్పాడు: “దారిలో బాబాను కలిశాను. ఆయన నాకు పెంట తింటున్న ఒక పందిని చూపి, “చూడు! అది ఎంత ఆనందంగా ఆ మాలిన్యాన్ని తింటూ ఉందో! కానీ, మనకు మాత్రం దాన్ని చూస్తుంటే అసహ్యం వేస్తుంది. ఇతరులను (పరోక్షంలో) దూషించడం కూడా సరిగ్గా ఇటువంటిదే. దూషించేవాడికి ఆ పరనింద తియ్యగానే ఉంటుంది. కానీ చూచేవాళ్లకి పరమ అసహ్యంగా ఉంటుంది. ఇతరుల గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడకూడదు” అని అన్నారు.
గమనిక: ఇప్పటివరకు 'సాయిపథం' మ్యాగజైన్స్‌లో ప్రచురితమైన దీక్షిత్ డైరీలోని అనుభవాలను యథాతథంగా మీతో పంచుకున్నాము. ఇంతటి అనుగ్రహ అవకాశాన్ని ఇచ్చిన సద్గురు శ్రీసాయినాథునికి, పూజ్యశ్రీ సాయినాథుని శరత్‌బాబూజీకి మా నమస్సుమాంజలులు. మరికొన్ని అనుభవాలు రేపటి భాగంలో.....
సోర్స్: సాయిపథం - వాల్యూం -2
గమనిక: ఇప్పటివరకు 'సాయిపథం' మ్యాగజైన్స్‌లో ప్రచురితమైన దీక్షిత్ డైరీలోని అనుభవాలను యథాతథంగా మీతో పంచుకున్నాము. ఇంతటి అనుగ్రహ అవకాశాన్ని ఇచ్చిన సద్గురు శ్రీసాయినాథునికి, పూజ్యశ్రీ సాయినాథుని శరత్‌బాబూజీకి మా నమస్సుమాంజలులు. మరికొన్ని అనుభవాలు రేపటి భాగంలో.....
సోర్స్: సాయిపథం - వాల్యూం -2