సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 52వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవం:

  • పిలిచినంతనే పలికి తన ఉనికిని తెలియజేసిన శ్రీసాయి

సాయిబిడ్డలందరికీ నమస్కారాలు. నా పేరు జ్యోతి. నా నివాసం అనంతపురం జిల్లాలోని తాడిపత్రి. నేను అమెరికా మహాపారాయణ గ్రూపులో సభ్యురాలిని. నాకు ఇంగ్లీష్ సరిగా రాని కారణంగా నాకు కలిగిన అనుభవాలను వారికి ఎలా వివరించాలో తెలియలేదు. 'ఎలా వాటిని తోటి సాయిబంధువులతో పంచుకోవాల'ని నేను ఆరాటపడుతుంటే, బాబా మీ నెంబర్ తెలియజేయడం నాకు చాలా అనందాన్నిచ్చింది. మీ బ్లాగు, గ్రూపుల ద్వారా నా అనుభవాలను అందరితో పంచుకోగలిగే అవకాశాన్ని బాబాయే ఇచ్చారని అనుకుంటున్నాను. నేను నా అనుభవాలను మీకు తెలుపుతాను. అవి మరీ ఎక్కువగా ఉంటే, మీకు కావలసినంతవరకు తీసుకోవాలని నా మనవి. ఇటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు ఆనందంతో బాబాకు నమస్సుమాంజలులు అర్పించుకుంటున్నాను. ముందుగా నేను గత సంవత్సరంలో బాబా నాకిచ్చిన అద్భుతమైన అనుభవాన్ని పంచుకుంటాను.

2018వ సంవత్సరంలో ఒకరోజు నాతో ఊరికే కాసేపు మాట్లాడదామని నాకు తెలిసిన ఒకామె ఫోన్ చేసింది. నేను మాటల మధ్యలో, "శిరిడీ వెళదామా?" అని అడిగాను. వెంటనే ఆమె పట్టరానంత ఆనందంతో, "అంతకన్నానా! నా మొక్కు ఎంత తొందరగా తీర్చుకుంటానా, శిరిడీ వెళ్ళడానికి ఎవరు తోడు దొరుకుతారా? అని చాలారోజులుగా ఎదురుచూస్తున్నాను" అని అంటూ అసలు విషయం ఇలా చెప్పారు: "(2018) జనవరిలో నా భర్త చాలా అనారోగ్యంతో బాధపడ్డారు. హాస్పిటల్లో చేరిస్తే డాక్టర్లు పరిస్థితి విషమంగా ఉందని, రెండు ఆపరేషన్లు చేయాలని  చెప్పారు. ఆ దిగులుతో నేను, "బాబా! నా భర్తకు నయమైతే, నేను శిరిడీ వచ్చి నిలువుదోపిడీ ఇచ్చుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. నిజంగా బాబా పరమ కృపాళువు, వెంటనే మాపై దయ చూపారు. ఆపరేషన్స్ చెయ్యాలని చెప్పిన డాక్టర్ వెంటనే వచ్చి, "ఆపరేషన్లు అవసరం లేదు, మందులతోనే నయమవుతుంది" అని చెప్పారు. నా ఆశ్చర్యానికి, ఆనందానికి అవధులు లేవు. ప్రమాదకర స్థితిలో ఉన్న నా భర్తని ఆశీర్వదించి, నాకు మాంగల్య భిక్ష పెట్టారు బాబా. ఆయన కరుణకి ఏదీ సాటిరాదు. అప్పటినుండి శిరిడీ వెళ్లేందుకు ఎవరు తోడు దొరుకుతారా అని ఎదురుచూస్తున్నాను".

ఇక మేము ఆలస్యం చేయకుండా వెంటనే తత్కాల్ టిక్కెట్లు బుక్ చేసుకుని శిరిడీకి ప్రయాణమయ్యాం. ఆమె తన ఒంటిమీద 10 తులాల వరకు ఉన్న బంగారాన్ని, 70వేల రూపాయలను పసుపుగుడ్డలో కట్టి నా చేతికి ఇచ్చి, భద్రంగా ఉంచమని చెప్పింది. నేను, "దానిని బాబానే కాపాడుకుంటార"ని చెప్పి నా బ్యాగులో పెట్టి ఉంచాను. ప్రయాణంలో, చిన్నప్పటినుండి బాబా నాపై చూపిన ప్రేమ గురించి, ఆయన చేసిన అద్భుతాల గురించి ఆమెతో చెప్తూ ఎంతో సంతోషంగా గడిపాను. మా ఇద్దరికీ ఎప్పుడెప్పుడు శిరిడీ చేరదామా, బాబాను చూద్దామా అని మనసులో ఒకటే ఆరాటం. పుట్టింటికి వెళుతూ ఎప్పుడెప్పుడు తల్లిని చూద్దామా అన్నంత తాపత్రయం. కోపర్గాఁవ్ వచ్చిందనగా నా సంతోషానికింక అవధుల్లేవు. ఆ ఆనందంలో ఒక ఆలోచన - "బాబా! మేము శిరిడీ వస్తున్నాము. మేము మావాళ్ళ ఇంటికి వెళ్తుంటే, వాళ్ళు మాకోసం ఎదురువస్తారు కదా! అలాగే నీవు కూడా మాకోసం రావాలి. నీవు వచ్చావని నాకు తెలియాలి" అని అనుకుంటూ సీటులో పడుకుని బాబానే తలుచుకుంటున్నాను. అప్పుడు సమయం మధ్యాహ్నం 12 గంటలు కావచ్చింది. "కాసేపట్లో శిరిడీ వచ్చేస్తుంది, మరి బాబా ఎలా వస్తారో?" అని మనసులో ఒకటే ఆలోచన. నా ఎదురు సీటులో నాతో వచ్చినామె కూర్చుని ఉంది. నేను మాత్రం బాబా ఆలోచనలలో విహరిస్తున్నాను. మనసునిండా బాబానే. ఇంతలో ఒకాయన నా ఎదురుగా ఉన్న ఆమె దగ్గరకు వచ్చి, ఏదో మాట్లాడుతున్నారు. నేను మాత్రం అదేమీ పట్టించుకోకుండా 'బాబా ఎలా వస్తార'న్న ఆలోచనల్లోనే ఉన్నాను. కాసేపటికి ఆయన ఆమెను హిందీలో ఏమో అడగాలని ప్రయత్నిస్తున్నారు. నేను ఏమిటో చూద్దామని ఆమెను, "ఏమి అడుగుతున్నారు?" అని అడిగాను. ఆయన నావైపు తిరిగి, "నాకు రెండు రూపాయలివ్వు, నేను నీ పేరు మీద శిరిడీలో బాబాకు అందజేస్తాను" అని చెప్పి, తన ఎడమచేయి చాపారు. వెంటనే నేను వేరే ఏ ఆలోచన లేకుండా రెండు రూపాయలు తీసి ఆయన చేతిలో ఉంచాను. ఆమె ఊరికే చూస్తూ ఉంది. నేను పరీక్షగా ఆయనను ఒకసారి చూసాను, కానీ నాకు ఏమీ అనిపించలేదు. మనసులో మాత్రం 'బాబా ఎలా వస్తార'న్న ఆలోచన అలానే కొనసాగుతూ ఉంది. ఆయన ఆ రెండు రూపాయలు తీసుకున్న తరువాత వేరెవరినీ ఏమీ అడగలేదు. మాతోపాటు శిరిడీ వెళ్తున్న చాలామంది ఆడవాళ్లు ఉన్నారు. కానీ ఆయన ఎవరినీ పలకరించలేదు. శిరిడీ స్టేషన్లో ట్రైన్ ఆగగానే, ఆయన దిగి వెళ్ళిపోయారు. తరువాత నాతోపాటు వచ్చినామె, "ఆయన ఖచ్చితంగా బాబానే" అని అనింది. అప్పుడు నేను, "అయ్యో! బాబా వచ్చినా, ఎదురుగా కూర్చుని ఉన్నా, ఆయన ఆలోచనలోనే ఉన్నా ఆయన్ను కనుక్కోలేక పోయానే" అని బాధపడి, బాబా రావాలనుకున్న విషయాన్ని ఆమెతో చెప్పాను. తరువాత ఆయన రూపాన్ని గుర్తుతెచ్చుకుంటే, నిజంగా ఆయన బాబానే అని అర్థమైంది. ఆయన తెలుపు రంగు ప్యాంటు, షర్ట్ వేసుకుని ఉన్నారు. పైన షర్ట్ కాస్త మాసినట్లు ఉన్నా, లోపల కొత్త షర్ట్ ఉంది. చేతిలో ఉన్న పెద్ద కవరులో బొరుగులు(పేలాలు, మరమరాలు) ఉన్నాయి. ఆయన మోము మంచి పసుపు రంగు ఛాయలో చాలా నీట్ గా, ఎంతో కళగా ఉంది. ఆయన ఖచ్చితంగా బాబానే! వేరే ఎవరైనా అడుక్కునే వాడైతే అందరినీ అడగాలి, అలా చేయలేదు. పైగా కేవలం 2 రూపాయలు అడిగారు. అది కూడా నా పేరుమీద శిరిడీలో బాబాకు అందజేస్తానని చెప్పారు. ఆయన ధరించిన బట్టలు పూర్తి పాతవీ కాదు, అలాగని కొత్తవీ కాదు. బొరుగులు అమ్ముకునే వాడైతే తన దగ్గర అమ్ముకోవడానికి కావలసిన వస్తువులు ఉండాలి. అమ్ముకునేవాళ్ళు, అడుక్కునేవాళ్ళు అలా ఉండరు, ఆయన తేజస్సే వేరు. క్రింద ఇచ్చిన ఫోటోలోని బాబాకు తలపాగా తీసివేస్తే ఎలా ఉంటారో అలాగే ఉన్నారాయన. అలా ఖచ్చితంగా బాబానే వచ్చారు. తన బిడ్డలను ఎంతో ఆప్యాయంగా పలకరించి తాను వచ్చినట్టు తెలియజేయడానికి దక్షిణ అడిగారు. నామీద బాబాకు ఎంత ప్రేమ! పిలిచిన వెంటనే పలికి తన ఉనికిని మాకు తెలియజేసారు. ఆ సంతోషాన్ని దేనితోనూ పోల్చలేం. కోట్ల రూపాయల కన్నా విలువైనది. "శరణం సాయి. ఎంతని పొగడగలం మీ ప్రేమను, కృపను?!"

ట్రైన్ దిగాక ఆయన కోసం ఎంత వెతికామో! కానీ ఆ సర్వాంతర్యామి ఎక్కడా కనపడలేదు. బాబా శిరిడీలో మాకు చాలా అద్భుతాలు చూపించి, ఆశీర్వాదాలిచ్చి పంపారు. ఆమె మొక్కుకున్న నిలువుదోపిడీ నా చేతుల మీదుగా హుండీలో వేయించుకుని, అక్కడే ఆయన ముందు కూర్చుని ప్రార్థించుకునే అవకాశాన్ని కల్పించారు. దర్శనమిమ్మని అడిగిన వెంటనే తాను ఉన్నానని నిరూపించి, తన బిడ్డలయందు తన ప్రేమను చాటుకున్నారు. ఇంతకన్నా ఏం కావాలి, మనం ప్రేమతో పిలిస్తే తల్లి కన్నా ఎక్కువగా బాబా పలుకుతారని చెప్పడానికి! చిన్నప్పటినుండి బాబా నాపై కురిపించిన ప్రేమమయమైన ఆశీర్వాదాలను మీతో పంచుకోగలిగే అదృష్టాన్ని బాబానే ఇచ్చారు. నన్ను ఆదరిస్తున్న సాయి సన్నిధికి ధన్యవాదాలు.

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo