ఈరోజు భాగంలో అనుభవం:
- ఎప్పుడూ అండగా నిలిచే బాబా
నేను ఒక సాయిభక్తురాలిని. మేము యుఎస్ఏలో ఉంటాము. 2019లో ఒక శనివారంనాడు నేను ఇంట్లో ఉన్నప్పుడు నా శరీరంలోని చాలా భాగాలపై తేనెటీగలు కుట్టాయి. ముఖ్యంగా పెదవిపై కుట్టాయి. దానివలన ఒక గంటలో నా పెదవి బాగా వాచిపోయి, విపరీతంగా నొప్పి పెట్టసాగింది. నొప్పి తట్టుకోలేక ఇంటి చిట్కాలన్నీ ఉపయోగించి ఊదీ కూడా రాశాను. కానీ నొప్పి, వాపు తగ్గలేదు. మరుసటిరోజు ఉదయానికి నా ముఖమంతా బాగా వాచిపోయింది. దానితో నాకు చాలా భయమేసి బాబా ముందు కూర్చుని ఏడుస్తూ, "బాబా! నేను రేపు ఆఫీసుకి వెళ్ళాలి. ఇలా ఉంటే ఎలా వెళ్ళగలను? దయచేసి ఈ వాపులు తగ్గిపోయేలా చూడండి" అని ప్రార్థించాను. తరువాత ఊదీ పెట్టుకున్నాను. అద్భుతం! సాయంత్రానికల్లా వాపు చాలావరకు తగ్గిపోయింది. సోమవారం ఉదయానికి కొంచెం వాపు ఉన్నప్పటికీ ఎవరైనా బాగా గమనిస్తే గానీ కనిపించేలా లేదు. శరీరంపై ఇతర చోట్ల కూడా తేనెటీగ కుట్టిన ఆనవాళ్లు ఉన్నప్పటికీ అవి ఎవరికీ కనిపించవు. కాబట్టి నేను సంతోషంగా ఆఫీసుకు వెళ్ళాను. "మీరు చేసిన సహాయానికి చాలా చాలా కృతజ్ఞతలు బాబా".
ఒకసారి మా అమ్మాయికి పరీక్షలు ఉండటంతో తను మానసికంగా చాలా ఆందోళనపడింది. ఎందుకంటే, తను అంతకుముందు జరిగిన పరీక్షల్లో సరైన ప్రతిభ చూపలేకపోయింది. పరీక్ష ముందురోజు నేను, "బాబా! మీరు తనతో ఉన్నారన్న ఆశీర్వాదసూచకంగా ఏదో ఒక రూపంలో నాకు కనిపించండి" అని ప్రార్థించాను. మేము యుఎస్ఏలో ఉండటం వల్ల వాహనాలపైన బాబా ఫోటో ఉండటం గానీ, సాయి పేరు కనిపించడం గానీ చాలా అరుదు. అయినా నేను 'SAI' అన్న మూడక్షరాల కోసం ఆతృతగా చూదసాగాను. ఆఫీసుకి వెళ్ళే దారిలో గానీ, ఆఫీసులో గానీ ఎక్కడా సాయి ఫోటో, SAI అన్న మూడు అక్షరాలు గానీ కనిపించలేదు. రోజులో చాలాభాగం గడిచిపోయినా బాబా సంకేతం నాకు కనిపించలేదు. ఆరోజు ఆఫీసులో కాన్ఫరెన్స్ జరిగింది. కాన్ఫరెన్సులో వెజిటేరియన్ ఫుడ్ లేకపోవడంతో నా కొలీగ్ ఒకరు, "మనం బయటికి వెళ్లి, వెజిటేరియన్ ఫుడ్ తీసుకుందామా?" అని అడిగారు. సరేనని ఇద్దరం దగ్గర్లో ఉన్న ఇండియన్ రెస్టారెంట్‌కు నడుచుకుంటూ బయలుదేరాం. అలా వెళుతూ రోడ్డు దాటడం కోసం ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగాము. హఠాత్తుగా ఒక వీధి మలుపులో ఉన్న 'SAIntel' అనే హోటల్ పేరు నా కళ్ళలో పడింది, ఆ పేరులో ఉన్న SAI అన్న మూడు అక్షరాలు తళుక్కుమని మెరిసినట్లు అనిపించాయి నాకు. వెంటనే బాబాకి కృతజ్ఞతలు చెప్పుకుని, ఆ హోటల్ పేరును ఫోటో తీసి, మా అమ్మాయికి పంపించి, "సాయి నీతోనే ఉన్నార"ని చెప్పాను. మరుసటిరోజు తను నాకు ఫోన్ చేసి, "పరీక్ష చాలా బాగా వ్రాసాన"ని చెప్పింది. మరొకరోజు ఫోన్ చేసి, "అమ్మా! నాకు 95% వచ్చింద"ని చెప్పింది. బాబా లీలలు అద్భుతం. ఆయన నాతో, మా అమ్మాయితో ఉన్నానని సూచించారు. "థాంక్యూ సో మచ్ బాబా. మా అమ్మాయి చదువు విషయంలో జాగ్రత్త తీసుకోండి. మా ఇల్లు త్వరగా అమ్ముడయ్యేలా అనుగ్రహించండి. ఆ విషయంలో మీ ఆశీస్సులు మాకవసరం. నా కొడుకు కొన్ని వైద్యపరీక్షలు చేయించుకుంటున్నాడు. ఆ విషయంలో తనకి సహాయం చేసి తనిని జాగ్రత్తగా చూసుకోండి. బాబా! మీరెప్పుడూ మాకు అండగా నిలవాలి. దయచేసి నా మనస్సులోని కోరికలను నెరవేర్చండి. అది మీరు మాత్రమే చేయగలరు".