సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 36వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు: 
  1. బాబా లీలలు అనూహ్యాలు
  2. బాబా స్మరణ చేసుకోండి, దాంతో మీ సమస్యలన్నీ తీరిపోతాయి

బాబా లీలలు అనూహ్యాలు

సాయిబంధువు రఫీ చాలారోజుల తరువాత మరో అనుభవాన్ని పంపించారు. తన మాటల్లోనే చదవండి..

సాయిబంధువులందరికీ సాయిరాం. ఇటీవల 2019 ఏప్రిల్ నెలలో జరిగిన ఒక అద్భుతమైన అనుభవాన్ని నేనిప్పుడు మీతో పంచుకుంటాను.


మా నాన్నగారు పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి వంటపని చేస్తూ ఉంటారు. ఆయనకు ఈమధ్య పని దొరకక ఇంట్లో మేము చాలా ఇబ్బందులుపడ్డాము. అందువలన ఇంట్లో అందరం దిగులుపడుతూ ఉండేవాళ్ళం. అటువంటి సమయంలో నాకు శిరిడీ వెళ్లే అవకాశం వచ్చింది. ఎలాగో మొత్తానికి డబ్బులు సర్దుబాటు చేసుకుని ఏప్రిల్ నెల మధ్యలో శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకున్నాను. బాబా చక్కటి దర్శనాన్ని అనుగ్రహించారు. అంతేకాదు, పల్లకీ ఉత్సవాన్ని చూసే భాగ్యాన్ని కూడా కల్పించారు. దర్శన సమయంలో మేము ఇంట్లో పడుతున్న కష్టం గురించి బాబాకు చెప్పుకుని, "బాబా! నాన్నకు ఏదైనా పని చూపించండి" అని ప్రార్థించాను. మరో విషయం, ఎనిమిదేళ్ల క్రితం మా అక్క మా నుండి దూరంగా వెళ్ళిపోయి తను ప్రేమించే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. చాలాకాలం వరకు తనెక్కడుందో మాకు తెలియలేదు. చివరికి బాబా దయవలన తెలిసిన వాళ్ళ ద్వారా తనెక్కడుందో తెలిసి మేము తన దగ్గరకు వెళితే, మా మీద కోపంతో అక్క, బావ ఇద్దరూ మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు. ఆ విషయంలో కూడా బాబా ఆశీస్సులు అడుగుతూ వాళ్ళ ఫోటో సమాధి మీద పెట్టాను. వెంటనే బాబా ఎంత లీల చూపారంటే, ఆ ఫోటో దానంతట అదే ఎగిరి సరిగ్గా బాబా పాదాల చెంత పడింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే గాలికి ఎగిరి పడటానికి సమాధిమందిరంలో ఫ్యాన్లు ఉండవు. అది మీ అందరికీ తెలిసిన విషయమే. అక్కని, బావని ఆ రీతిన బాబా ఆశీర్వదించారని నాకనిపించింది. తరువాత నేను రూముకి వచ్చి మొబైల్ చూస్తే, ఇంచుమించుగా నేను సమాధిమందిరంలో ఉన్న సమయంలో మా అమ్మ నుండి మిస్‌డ్ కాల్ ఉంది. నేను ఫోన్ చేస్తే అమ్మ, "ఇంటిలో బాబా మోము ఆకర్షణీయమైన కళతో వెలిగిపోతోంది, బాబాను చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది, అది నీతో పంచుకుందామనే ఫోన్ చేశాను" అని చెప్పింది. అప్పుడు నేను సమాధిమందిరంలో జరిగిన లీలను అమ్మకు చెప్పి, "బాబా ఏదో చేస్తున్నారు" అన్నాను. తరువాత నేను, "బాబా! సంవత్సరంలోగా మళ్ళీ నేను శిరిడీకి రాను" అని చెప్పుకుని శిరిడీ నుండి తిరుగు ప్రయాణమయ్యాను. ఆశ్చర్యం! అద్భుతం! నేను ఇంటికి చేరుకునేలోగానే నాన్నకి టూరిస్ట్ బస్సుల్లో యాత్రికులతో పాటు ఆయా యాత్రలకు వెళ్లి వాళ్ళకి వంట చేసిపెట్టే అవకాశాలు చాలా వచ్చాయి. అలాంటి అవకాశాలు 5, 6 వస్తే, వాటిలో మూడు శిరిడీ ట్రిప్పులే కావడం బాబా అనుగ్రహానికి సంకేతం. నాన్న మొదటి శిరిడీ ట్రిప్పుకు మే 5న వెళ్తున్నారు. అలా నాన్నకు సకాలంలో పనులిచ్చి మా కుటుంబాన్ని ఆదుకున్నారు బాబా. అంతేకాదు, బాబా ఆశీర్వాద ప్రభావంతో ఇప్పుడు అక్కలో కూడా మార్పు వచ్చి మా ఇంటికి రావడానికి సిద్ధంగా ఉంది. అంత అద్భుతంగా అనుగ్రహించారు బాబా. "మీ మేలు ఎప్పటికీ మరువలేనయ్యా సాయీ! చాలా చాలా కృతజ్ఞతలు బాబా!" ఇక చివరిగా,  "సంవత్సరంలోగా శిరిడీ రాన"ని బాబాతో చెప్పుకుని శిరిడీ నుండి తిరిగి వచ్చానని చెప్పాను కదా! కానీ బాబా కృప చూడండి, సరిగ్గా నెల తిరిగేసరికి బాబా నన్ను మళ్ళీ శిరిడీ రప్పించుకుంటున్నారు. 15 రోజుల్లో అమ్మ, నేను శిరిడీ వెళ్తున్నాము. బాబా లీలలు అనూహ్యాలు. మనం ఎన్నెన్నో ఆలోచనలు చేస్తాం, కానీ బాబా సంకల్పమే నెరవేరుతుంది. అదే విషయాన్ని "నా ఆజ్ఞ లేక ఆకైనా కదలదు" అని ఒకే వాక్యంలో చెప్పారు బాబా.

బాబా స్మరణ చేసుకోండి, దాంతో మీ సమస్యలన్నీ తీరిపోతాయి

ఆంధ్రప్రదేశ్ నుండి పేరు వెల్లడించని సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

బాబా పట్ల నా విశ్వాసం బ్లాగులోని భక్తుల అనుభవాలు చదవడంతో వృద్ధి చెందుతున్నాయి. బ్లాగు నిర్వాహకులకు నా కృతజ్ఞతలు. సాయి నాకెన్నో అనుభవాలు ఇచ్చారు. వాటిలో ఒక అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటాను. 

గత ఏడాదిలో ఒకసారి, మరుసటిరోజు ఇంటర్వ్యూ ఉందనగా ముందురోజు నేను రైల్లో హైదరాబాదు వెళ్ళాను. ఆ సమయంలో నేను నెలసరి సమస్యతోపాటు కాలునొప్పితో ఇబ్బందిపడుతూ బాబాని ప్రార్థించాను. అంతే! కేవలం 5 సెకన్లలో నొప్పి మాయమైపోయింది. "థాంక్యూ సో మచ్ బాబా! నాకెప్పుడు ఏ సమస్య వచ్చినా మీ స్మరణ చేసినంతనే సమస్య తొలగిపోతుంది". తర్వాత రోజు నేను ఇంటర్వ్యూకి వెళ్లాను కానీ, సరిగ్గా చెప్పలేకపోయాను. అయితే బాబా కృపవలన హెచ్.ఆర్., "నీకు మరో అవకాశం ఇస్తున్నాను. రేపు మళ్లీ ఇంటర్వ్యూకి హాజరవ్వమ"ని చెప్పారు. ప్రిపేర్ అవడానికి కాస్త సమయం దొరికిందన్న సంతోషంతో వెంటనే నేను సరేనన్నాను. కానీ నేను టాపిక్స్ మొత్తం చూసుకోలేకపోయాను. అందువలన మరుసటిరోజు ఆందోళనపడుతూ  ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఇంటర్వ్యూ గదిలోకి వెళ్లేముందు, "బాబా! నాకు సానుకూలమైన ఫలితాన్ని ఇవ్వండి" అని ప్రార్థించాను. తరువాత నన్ను పిలవగా హెచ్.ఆర్ గది లోపలికి  వెళ్లాను. అతను నన్ను కూర్చోమని చెప్పి, నాకొక పేపర్ ఇచ్చి, "నువ్వు ఏవేవి ప్రిపేర్ అయ్యావో వాటిని పేపర్ మీద వ్రాయి" అని చెప్పారు. నేను మనసులో బాబాను స్మరించుకుంటూ నేను ప్రిపేరైన విషయాలు పేపర్ మీద వ్రాసాను. అవి చూసి అతను ఒక నవ్వు నవ్వి, "నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు చాలా హార్డ్ వర్కర్ వి" అని అన్నారు. ఆ మాట వింటూనే నేను ఆనందాశ్చర్యాలకు లోనై, "థాంక్యూ  సో మచ్ బాబా. మీరు లేకపోతే నా జీవితం లేదు. లవ్ యు సో మచ్ బాబా" అని చెప్పుకున్నాను. ఎవరికి ఏ సమస్య వచ్చినా బాబా స్మరణ చేసుకోండి, దాంతో మీ సమస్యలన్నీ తీరిపోతాయి.


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo