సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 41వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు: 
  1. బాబా సూచనలను మనం అర్థం చేసుకోలేము
  2. ఊదీ మహిమ

బాబా సూచనలను మనం అర్థం చేసుకోలేము

మలేషియా నుండి పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

2016లో నేను యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ సంపాదించాక అప్పటివరకు చేస్తున్న నా మొదటి ఉద్యోగానికి రాజీనామా ఇచ్చాను. ఎందుకంటే, నా ఉద్యోగ స్వభావరీత్యా 14 రోజులు ఉద్యోగం చేసినా నా అవసరాలకు తగినట్టు ఉండేది కాదు. అప్పటినుండి దాదాపు ఒక సంవత్సరంపాటు ఎంతగా ప్రయత్నించినా, లెక్కలేనన్ని ఇంటర్వ్యూలకు హాజరైనా ఫలితం లేకుండా పోయింది. అటువంటి సమయంలో బాబాపై విశ్వాసముంచి సచ్చరిత్ర పారాయణ చేయడం మొదలుపెట్టాను. ఆ క్షణం నుండి పరిస్థితుల్లో మార్పు కనిపించింది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, సాయిబాబాను నమ్మినట్లైతే ప్రతి అణువణువునా ఆయన మనకు గోచరిస్తారు. నా జీవితంలో అదే జరిగింది. సరిగ్గా ఎప్పుడన్నదీ గుర్తులేదు కానీ, ఒకసారి నేను ఇంటర్వ్యూ కోసం ఒక టెక్ కంపెనీకి వెళ్లాను. ఆ ఉద్యోగం నాకు రాలేదు గానీ, ఇంటర్వ్యూకి వెళుతున్నప్పుడు, వచ్చేటప్పుడు మార్గమధ్యంలో ఒక ప్రసిద్ధి చెందిన ఫుడ్ డెలివరీ టెక్ కంపెనీ నా కంటపడింది. కొన్ని రోజులకి అదే ఫుడ్ కంపెనీ నుండి నాకు ఇంటర్వ్యూకి పిలుపు వచ్చింది. ఇంటర్వ్యూకి వెళ్ళాను కానీ, నాకు ఆ వాతావరణం అంతగా నచ్చలేదు. తర్వాత కొన్ని రోజులకి జపనీస్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఇప్పుడే సాయి మిరాకిల్ మొదలైంది. నేను ఉద్యోగానికి వెళుతున్న మొదటిరోజు మార్గమధ్యంలో రెండుసార్లు ఆ ఫుడ్ కంపెనీకి చెందిన ఉద్యోగస్తులను చూశాను. అంతకుముందెప్పుడూ నేను ఆ ఉద్యోగస్తులను చూడలేదు. తరువాత దాదాపు సంవత్సరం క్రితం ఏ సమస్యలతో నేను ఉద్యోగం వదిలేశానో, అవే పరిస్థితులు కొత్త కంపెనీలో కనిపించడంతో నా మనసు వికలమైపోయింది. ఆ సమయంలో ఎందుకో తెలియదు కానీ, 'ఫుడ్ కంపెనీకి ఫోన్ చేయమ'ని నా మనసు చెప్తున్నట్లనిపించింది. వెంటనే ఫోన్ చేసి, "మీ కంపెనీలో ఉద్యోగం చేయాలని నాకు ఆసక్తిగా ఉంది. మీరు సరేనంటే ఉన్నఫళాన ఉద్యోగంలో  చేరిపోతాన"ని చెప్పాను. నమ్ముతారో లేదో గానీ, అదేరోజు వాళ్ళు నాకు ఉద్యోగాన్ని కన్ఫర్మ్ చేసారు. నేను ఆఫీసులో అడుగుపెడుతూనే ప్రవేశద్వారం దగ్గర ఉన్న సాయిబాబా ఫొటోను చూశాను. బాబాను చూశాక ఈ కంపెనీలో నేను ఉద్యోగం చేయాలన్నది బాబా నిర్ణయమని నాకర్థమైంది. "థాంక్యూ సోమచ్ బాబా!" ముందునుండే ఆయన సూచనలిస్తున్నా, నేను అర్థం చేసుకోలేకపోయాను. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారెవరూ ఆశని కోల్పోకండి. బాబా మనకు అండగా ఉన్నారు. ఆయన సరైన సమయంలో మనకన్నీ ఇస్తారు.

ఊదీ మహిమ

తమిళనాడు నుండి సాయిభక్తుడు గణపతి తన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:

నాకు 55 ఏళ్ళు. నేనొక ఇంజనీరింగ్ ప్రొఫెషనల్‌ని. నా ఇష్టదేవత మహాగణపతి. నా సద్గురువు శ్రీ సాయిబాబా. గత సంవత్సరంలో ఒకసారి మా ఆఫీసు హెచ్.ఆర్ టీమ్ వాళ్లు ఏదో మెయిన్‌టెనెన్స్ పని ఉందని కొన్నిరోజులపాటు నా కారుని ఆరుబయట పార్కు చేయమని చెప్పారు. అప్పటికీ నేను, "ఇంకెక్కడైనా పార్కింగు చేసుకునేలా సర్దుబాటు చేయమ"ని అభ్యర్థించాను కానీ, వాళ్లు అవకాశం లేదన్నారు. ఇక చేసేది లేక నేను నా కారుని ఆరుబయట పార్క్ చేశాను. ఆరోజు మధ్యాహ్నం భోజనానికి వెళదామని కారు తీస్తే, కారు లోపల చాలా వేడిగా ఉంది. నా డాష్ బోర్డులో 44 డిగ్రీలు చూపించింది. "ఇంకో రెండు వారాలు బయటే పార్క్ చేయాలి. ఇలా అయితే ఎలా?" అని నా భార్యతో అన్నాను. రెండవరోజు ఉదయం, బాబా ఊదీని కారులో పెడదామనే ఆలోచన వచ్చింది. ఇంట్లో పూజ పూర్తి చేసుకొని కొంత ఊదీ తీసి ఒక కవరులో పెట్టి, దాన్ని తీసుకెళ్ళి కారులో పెట్టాను. తరువాత మధ్యాహ్నం టైంలో కారు బయటికి తీస్తుండగా హెచ్.ఆర్ వాళ్ళు నన్ను పిలిచి, నాకు జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పి, వేరే చోటు చూపించి, కారుని అక్కడ పార్క్ చేసుకోమని చెప్పారు. అదివరకు నేను అడిగితే కుదరదన్న వాళ్లు ఈరోజు వాళ్లంతట వాళ్లే వచ్చి పార్కింగ్ చేసుకోమని చెప్పారు. ఇక నా ఆనందాన్ని మీరే ఊహించవచ్చు. అంతా బాబా కృప. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!".


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo