సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 60వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1. బదిలీతో పాటు ప్రమోషన్ కూడా అనుగ్రహించారు శ్రీసాయి
  2. శ్రీసాయిబాబా ఎప్పుడూ మాతోనే ఉన్నారు

బదిలీతో పాటు ప్రమోషన్ కూడా అనుగ్రహించారు శ్రీసాయి

ఓం సాయిరామ్! సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు మాలతిరెడ్డి. మేము ప్రస్తుతం ఉంటున్నది కడప. మరోసారి బ్లాగులో అనుభవాలు పంచుకునే అదృష్టం కల్పించిన బాబాకి నా కృతజ్ఞతాపూర్వక నమస్కారములు. ఈ సంవత్సరం జనవరి 15, సంక్రాంతినాడు మేము శిరిడీలో ఉన్నాము. సాయి తండ్రి మమ్మల్ని శిరిడీకి రప్పించటమే ఆశ్చర్యమనుకుంటే, మేము బాబా దర్శనం చేసుకుని రూముకి వచ్చి ఫోన్ తీసి చూసుకుంటే ఇంకా పెద్ద ఆశ్చర్యం! "మీ అనుభవం ఈరోజు బ్లాగులో పోస్ట్ చేస్తున్నాం సాయి" అంటూ మెసేజ్ ఉంది. నాకు పట్టరానంత సంతోషం కలిగింది. కొన్నిరోజుల ముందు నేను పంపిన నా మొదటి అనుభవాన్ని(మా అబ్బాయిపై బాబా కురిపించిన ఆశీస్సులు.) ఆరోజే పోస్ట్ చేయడం బాబా ఆశీర్వాద సూచకంగా అనిపించి నేనెంతో ఆనందించాను. వెంటనే నాకు తెలిసిన సాయిబంధువుకి ఆ వార్త షేర్ చేశాను. తను కూడా చాలా ఆనందంగా ఫీలై, "అంతా సాయిబాబా ఆశీర్వాదం" అని రిప్లై ఇచ్చారు.

శిరిడీనుండి హైదరాబాద్ వచ్చాక మావారు బాబాని తలచుకుని ICT(inter circle transfer) కోటాలో హైదరాబాదుకి బదిలీ కోసం అప్లై చేశారు. చాలా కొద్దిమందికి మాత్రమే ICT లో పోస్టింగ్ ఇస్తారు. అందువలన నేను, "బాబా! మీ ఆశీర్వాదాలతో మావారికి హైదరాబాదుకి బదిలీ అయితే, మావారు అక్కడ జాయినింగ్ అయ్యేరోజే నేను నా అనుభవాన్ని బ్లాగుకి పంపుతాను" అని మ్రొక్కుకున్నాను. మేము కోరుకున్నట్లుగానే బాబా మమ్మల్ని ఆశీర్వదించారు. 2019, మే 29 సాయంత్రం హైదరాబాదుకి బదిలీ అయినట్లు ఉత్తర్వులు వచ్చాయి. ICT లో అవకాశమే తక్కువనుకుంటే, బాబా మాకు హైదరాబాదులోని మంచి బ్రాంచికి బదిలీతో పాటు చీఫ్ మేనేజరుగా ప్రమోషన్ కూడా ఇచ్చారు. "చాలా చాలా చాలా ధన్యవాదములు సాయి తండ్రీ!" ఈరోజు(మే 30) మావారు హైదరాబాదులో జాయిన్ అవుతున్నారు. అందుకే నేను బాబాకు చెప్పుకున్నట్లు నా అనుభవాన్ని మీకు పంపుతున్నాను. తప్పులేవైనా ఉంటే సరిచేసి మీ వీలునుబట్టి బ్లాగులో ప్రచురించండి.


ఇంకొక విషయం, మా అబ్బాయికి బాబా IIT లో సీటు ఇప్పించటమే కాకుండా, తనకి ఎల్లవేళలా తోడుగా ఉంటూ ముందుకు నడిపిస్తున్నారు. రీసెంట్ గా H1B కూడా ఇప్పించారు. "బాబా! మీకు నేను ఎలా ధన్యవాదములు చెప్పుకోగలను?!" నా అనుభవాలు బ్లాగులో పంచుకునే అవకాశం కల్పించిన సాయిబాబాకు, బ్లాగు నిర్వాహకులకు నా ధన్యవాదములు. ప్రస్తుతం మా పెద్దబాబు పెళ్లి విషయం బాబాని అడుగుతూ ఉన్నాను. అది కూడా బాబా తప్పక నెరవేరుస్తారు. అది నెరవేరాక ఆ అనుభవంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ బాబా ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటున్నాను.

శ్రీసాయిబాబా ఎప్పుడూ మాతోనే ఉన్నారు

పేరు వెల్లడించని సాయిభక్తుడు తనకు, తన కూతురికి సాయిబాబా ప్రసాదించిన అనుభవాలను మనతో పంచుకుంటున్నారు.

ఓం సాయిరాం! జై సాయిరాం!


 http://shirdisaibabaexperiences.blogspot.com/

నాకు సాయిబాబా వెబ్‌సైటుతో పరిచయం కలిగించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా నా కృతజ్ఞతలు. ఒకసారి వెబ్‌సైటుతో పరిచయం కలిగిన తరువాత, ప్రతిరోజూ క్రమంతప్పకుండా వెబ్‌సైట్ సందర్శించి, బాబాను ప్రార్థించుకుంటుంటేవాడిని. మాతృభూమికి ఎంతోదూరంలో ఉన్న మాకు, వెబ్‌సైట్ ద్వారా శ్రీసాయిబాబాను దర్శించుకొనే భాగ్యం కలిగింది.

రకరకాల మార్గాల ద్వారా శ్రీసాయిబాబా తమ సర్వవ్యాపకత్వాన్ని మనకు తెలియచేసే నా ఈ అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను.

మా అమ్మాయి, నేను శ్రీసాయిబాబాను విశ్వసిస్తాము. నేను ప్రతిరోజూ శ్రీసాయిసచ్చరిత్రలో కొన్ని వాక్యాలైనా పారాయణ చేస్తుంటాను. శ్రీసాయిబాబా అటువంటి మంచి ఆలోచనను నాకు కలిగించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.

మా అమ్మాయి తన చదువు నిమిత్తం మాకు దూరంగా హాస్టల్లో ఉంటున్నది. శ్రీసాయిబాబా ఎల్లప్పుడూ ఆమెను జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నారని నా నమ్మకం. ఒకసారి నేను మా అమ్మాయిని కలవటానికి తన హాస్టలుకు వెళ్ళాను. కాసేపు ఇద్దరం సరదాగా ఆడుతూ, మాట్లాడుతూ గడిపిన తరువాత, ఇద్దరం షాపింగ్ చెయ్యటానికి, దగ్గరలో ఏమైనా మందిరాలు ఉంటే దర్శించటానికి ఆ ఏరియాలోని వీధుల్లో నడవడం మొదలుపెట్టాము. ఆ ఏరియా అంతా మంచి మంచి రోడ్లతో ఎంతో చక్కగా ప్లానింగ్ చేసి ఉంది. హఠాత్తుగా, మా సంభాషణ సాయిబాబా వైపుకి మరలింది. శ్రీసాయిబాబా మనతోనే ఉన్నారని మా అమ్మాయి నాతో చెపుతూ, "కానీ బాబాను దర్శించుకోవటానికి ఈ ఏరియాలో ఒక్క సాయిబాబా మందిరం కూడా లేదు" అని బాధపడింది. ఇంతలో దగ్గరలోనే ఉన్న చిన్న మందిరానికి వెళ్ళటానికి నేను ఒక క్రాస్ రోడ్డులోకి వెళ్లబోతుండగా, అటువద్దని, కొంచెం ముందుకు వెళ్లి వేరే క్రాస్ రోడ్డులోనుంచి వెళితే ఆ మందిరానికి త్వరగా చేరుకుంటామని మా అమ్మాయి నాతో వాదించింది. ఈ మిషతోనైనా మా అమ్మాయితో మరికొంత సమయం గడిపి, ఆ తరువాత తనని హాస్టల్లో దిగపెట్టవచ్చని నాకు అనిపించి, మా అమ్మాయి చెప్పిన దానితో ఏకీభవించి ముందుకు నడవసాగాము. ఆ రోడ్డులో కొన్ని అడుగులు వేశామో లేదో, ఒక పెద్ద సాయిబాబా పటము, ఆ పటం క్రింద, “శ్రీ శిరిడీ సాయి ట్రస్టు” అని వ్రాసి ఉండటం చూచి మేము సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాము. మా అమ్మాయి మాత్రం ఎంతో ఆనందోద్వేగంతో, ‘ఓం సాయిరాం!’ అని పెద్దగా అరిచింది. కానీ మందిరం మూసివుండటంతో మేము బయటనుండే బాబాను దర్శించుకున్నాము. ఈ సంఘటనతో, శ్రీసాయిబాబా ఎల్లప్పడూ మా అమ్మాయితో ఉన్నారని, ఆమెను నిరంతరం రక్షిస్తూ ఉన్నారని సంతోషంతో పొంగిపోయాను.

కొద్దిరోజుల క్రితం, మా అమ్మాయి తనను అకారణంగా ఎవరో విపరీతంగా డిస్టర్బ్ చేస్తున్నారని, దానివల్ల తాను ఎంతో సందిగ్ధంలో ఉన్నట్లు చెప్పినప్పుడు, నేను ఆమె ముఖంలో భయాన్ని, ఆందోళనను గమనించాను. నేను ఆమెతో ఇటువంటి విషయాల గురించి పట్టించుకోవద్దని, చదువు అన్నింటికంటే ముఖ్యం కాబట్టి తనను చదువుమీద ఎక్కువ శ్రద్ధ చూపించమని చెప్పాను. అంతేకాకుండా, ఆమె కోసం 'శ్రీసాయిసచ్చరిత్ర' పారాయణ చేస్తానని కూడా చెప్పి, నేను వెంటనే సప్తాహపారాయణ మొదలుపెట్టాను. ఆ సమయంలో ఆమెకు పరీక్షలు జరుగుతుండటంతో, ప్రతిరోజూ స్నానం చేసిన వెంటనే బాబా ఊదీ నుదుటన ధరించమని తనకు చెప్పాను. రెండవరోజు నేను మా అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు ఆమె, తన రూముకు ఒక పనిమనిషి వచ్చిందని, సాయిబాబా గురించి అడిగి, బాబా ఊదీ కొంచెం ఇవ్వమని అడిగిందని చెప్పింది. అది విన్న వెంటనే నేను, "క్రొత్తవాళ్ళను నీ గదిలోకి అనుమతించి, అనవసరంగా లేనిపోని ప్రాబ్లెమ్స్ ఎందుకు కొనితెచ్చుకుంటావు?" అని ఆమెపై కోపంతో గట్టిగా అరిచి కేకలు వేశాను. కానీ మా అమ్మాయి ఎంతో ప్రశాంతంగా, “దాంట్లో ఏముంది? తను అడిగింది కేవలం సాయిబాబా గురించి, బాబా ఊదీ ఇవ్వమనే కదా! అందుకే కొంచెం బాబా ఊదీ ఇచ్చాను. ఇందులో ఏమీ గాభరాపడాల్సిన అవసరం లేదు” అని అన్నది. నేను మాత్రం ఆ రాత్రంతా ఆమెను రక్షించమని శ్రీసాయిబాబాను ప్రార్థిస్తూనే ఉన్నాను. మరుసటిరోజు ఉదయం నేను శ్రీసాయిసచ్చరిత్ర పారాయణ చేస్తున్నప్పుడు, 20వ చాప్టరులోని, “దాసగణు సందేహాన్ని కాకాసాహెబ్ దీక్షిత్ పనిపిల్ల తీర్చిన వైనం!“ వచ్చింది. అది చదివాక, “నిన్న మా అమ్మాయి రూముకు వచ్చిన పనిమనిషి మరెవరో కాదు, సాక్షాత్తూ శ్రీసాయిబాబానే!” అన్న బాబా సందేశం నాకు స్ఫురించి, నా కళ్ళు ఆనందాశ్రువులతో నిండిపోయాయి. అలా పనిమనిషి రూపంలో వచ్చి ఊదీ అడిగిన బాబా తాము సర్వవ్యాపి అని నిరూపించారు.

అదేరోజు సాయంత్రం నేను మా అమ్మాయికి ఫోన్ చేసి, జరిగిన విషయమంతా చెప్పి, బాబా ఆమెతోనే ఉన్నారని, అందువలన పరిస్థితులన్నీ చక్కబడతాయని, ఆయనపై విశ్వాసాన్ని నిలుపుకోమని సంతోషంతో చెప్పాను. ఈరోజుకు కూడా, అవే ఆలోచనలు, అవే వాక్యాలు నా మదిలో మెదులుతూ ఉంటాయి. శిరిడీ ఇక్కడికి ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్నా, శ్రీసాయిబాబా ఎప్పుడూ మాతోనే ఉన్నారు.

source: https://www.shirdisaibabaexperiences.org/2009/06/shirdi-sai-baba-devotee-experience.html?m=0

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo