సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 12వ భాగం.


కాకా సాహెబ్ దీక్షిత్ డైరీ - పన్నెండవ భాగం.

పిచ్చి తల్లి

గర్భవతిగా ఉన్న నా మిత్రుని కుమార్తెకొకామెకు మనస్థిమితం తప్పింది. రాత్రింబవళ్ళు ఏదేదో పిచ్చిగా అరుస్తూ మాట్లాడుతూ ఉండేది. చేతికి దొరికిన వస్తువులు కిటికీగుండా బయటకు విసిరేసేది. ఆమెకు నెలలు నిండాయి. ఆమెకు కాన్పుకావడం కష్టమౌతుందని డాక్టరు చెప్పాడు. దాంతో అందరికీ ఆందోళన మరీ ఎక్కువైంది. ఆ డాక్టరు ఆమెవద్ద ఎప్పుడూ ఉండేలా మంచి నర్సును నియమించాడు. అంతకుముందు బాబా ఆమెను ఆశీర్వదించి ఉన్నారు. ఆయన ఆశీస్సులే ఆమెను రక్షించాయి! ఒకరోజు ప్రొద్దునే ఆమెకు నొప్పులు మొదలయ్యాయి. ఒక మనిషి డాక్టరు కోసం పరుగిడితే, మరొకతను  ఆమె అక్కను తీసుకురావడానికి వెళ్ళాడు. ఆమె అక్క వెంటనే వచ్చి నొప్పులుపడుతున్న తన చెల్లెలి ప్రక్కన కూర్చుంది. ఆమె అలా కూర్చుందో లేదో కాన్పయి బిడ్డ ఆమె చేతుల్లో పడ్డాడు! ఏ మాత్రం కష్టం లేకుండా ప్రసవమయింది. ప్రసవమైన అర్థగంటకు గానీ డాక్టరు రాలేదు!

బాబా లీల

వెంకటరావు దక్షిణ కెనరాలోని ముల్కి గ్రామ నివాసి. 1916 క్రిస్మస్ రోజున అతని చేతికి బాబా ఫోటో, బాబా ఊదీ వచ్చాయి. అతని అల్లుడు హైకోర్టులో లాయరు. అతను ఒకరోజు హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. అంతేకాదు, అతను మరణించాడనే వార్తలు కూడా పొక్కాయి. ఆ సమయంలోనే వెంకట్రావు మిత్రుడొకాయన, 'బాబా దర్శనం చేసుకోమ'ని వెంకట్రావుకు సలహా ఇచ్చాడు. కానీ, ఆ పరిస్థితుల్లో అతను శిరిడీ వెళ్ళేందుకు వీలుపడలేదు. కానీ, అదృష్టవశాత్తూ, సరిగ్గా ఆ సమయంలోనే అతని చేతికి బాబా ఫోటో, ఊదీ వచ్చాయి. ఊదీ ధరించి, బాబా ఫోటోకు ఆర్తితో మొక్కాడు వెంకట్రావు. ఇది జరిగింది బొంబాయిలో. అయితే, సరిగ్గా అదే సమయంలో ముల్కీ గ్రామంలో ఉన్న అతని కుమార్తెకు ఏదో బలమైన ప్రేరణ కలిగి, “నాన్నా, మీరు ఫలానారోజున ఫలానా సమయంలో బాబాకు పూజచేసి ఆశీస్సులకోసం ప్రార్థించారా?” అని వాకబుచేస్తూ తన తండ్రికి ఒక ఉత్తరం వ్రాసింది. తను బాబాను ప్రార్ధించిన సమయం సరిగ్గా అదే కావటంతో వెంకట్రావు ఆశ్చర్యపోయాడు. ఈ సంఘటనతో బాబాపై అతని భక్తిశ్రద్ధలు ద్విగుణీకృతమైనాయి. తన అల్లుడి గురించిన సమాచారమేదీ లభించలేదుగానీ, తను ఎప్పుడు అనారోగ్యంగా ఉన్నా బాబాను స్మరించి, ఊదీ పెట్టుకోగానే, స్వస్థత చేకూరేది. ఒకసారి అతనికి గుండెనొప్పి వచ్చి స్పృహతప్పి పడిపోయాడు. ఆ స్థితిలో అతనికి బాబా దర్శనమయ్యింది. బాబాతోపాటు ఆయన ఇద్దరు సేవకులున్నారు. వెంకట్రావు వద్దని ఎంతవారిస్తున్నా వారిద్దరూ అతని కాళ్ళుపట్టసాగారు. కొంతసేపయిన తరువాత ముగ్గురూ అదృశ్యులైయ్యారు. ఆ తరువాత 1918లో ఈస్టర్ సెలవులకు వెంకట్రావు శిరిడీ వెళ్ళి బాబాను దర్శించాడు. తనకి వచ్చిన దివ్యదర్శనంలో కనిపించిన ఇద్దరు బాబా సేవకులు బాబా వద్ద కూర్చుని ఉండటం గుర్తించి ఆశ్చర్యపోయాడు. వెంకట్రావు పెద్దకొడుకు ఒక నాస్తికుడు. అతడు తండ్రి భక్తిని చూచి ఎగతాళిగా నవ్వుకొంటుండేవాడు. కానీ ఈ సంఘటనలన్నీ చూశాక, అతనికి బాబాపై విశ్వాసం కుదిరి మంచి బాబా భక్తుడయ్యాడు. తనకు ఏ సమస్య వచ్చినా వెంటనే బాబా రక్షణ కోసం శిరిడీ ఉత్తరం వ్రాసేవాడు.

గోవిందరావు మొక్కు 

గోవిందరావు గార్డే నాగపూరు నివాసి. ఒకసారి, ఒకటిన్నర సంవత్సరాల వయస్సున్న అతని మేనల్లుడికి ప్రమాదంగా జబ్బు చేసింది. మందులెన్ని వాడినా ప్రయోజనం లేకపోయింది. ఆ స్థితిలో గోవిందరావు 'పిల్లవాడికి బాగైతే ఆ కుర్రాడితో పాటు బాబా దర్శనం చేసుకొంటాన'ని మొక్కుకొన్నాడు. ఆ మరుసటిరోజు నుండి పిల్లవాడి ఆరోగ్యం మెరుగవడం మొదలై, కొద్దిరోజుల్లో పూర్తి స్వస్థత చేకూరింది. గార్డే చెల్లెలు (ఆ పిల్లవాడి తల్లి) ఆ తరువాత కొద్దిరోజులకి నాగపూర్ నుండి తన అత్తవారింటికి వెళ్ళిపోయింది. గార్డే మొక్కు మొక్కుగానే మిగిలిపోయింది. మరుసటి సంవత్సరం గార్డే చెల్లెలు నాగపూర్ వచ్చేసరికి ఈసారి గార్డేనే అనారోగ్యంతో మంచంలో ఉన్నాడు. మందులెన్ని వాడినా ఫలితం కనిపించటం లేదు. ఈలోగా గురువారం వచ్చింది. స్థానిక భక్తులు చాలామంది మామూలుగా బాబా భజనకు గార్డే ఇంటికొచ్చారు. భజన జరుగుతుండగా, గార్డేకు తన మొక్కు విషయం జ్ఞప్తికొచ్చింది. 'తన ఆరోగ్యం బాగైతే, తన అల్లుణ్ణి తీసుకొని వెంటనే శిరిడీ వస్తాన'ని మళ్ళీ మొక్కుకొన్నాడు. అంతే! రెండు మూడు రోజులలో అతని ఆరోగ్యం బాగై, వెంటనే శిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకొన్నాడు.

తరువాయి భాగం రేపు.

సోర్సు: సాయిపథం - వాల్యూం 2

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo