సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహ సుమాలు - 14వ భాగం


కాకా సాహెబ్ దీక్షిత్ డైరీ - 14వ భాగం  

బాబా కృపవలన ఈరోజునుండి సాయిస్మరణలోని భాగంగా పర్నా విజయ్ కిషోర్ గారు రచించిన దీక్షిత్ డైరీలోని మరికొన్ని అనుభవాలను పంచుకొనే అవకాశం మనకు దక్కింది. "బాబా! మీకివే మా నమస్సుమాంజలులు".

శ్రీహరి సీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.

అనుభవం - 1

బాబా వివిధ రూపాలలో తమ భక్తుల వద్దకు వెళతారు. తరువాత ఆ విషయానికి సంబంధించిన పరోక్షసంజ్ఞను ఇచ్చేవారు. ఒకసారి నానాసాహెబ్ చందోర్కర్ బాబా కోసం నైవేద్యాన్ని తీసుకు వచ్చారు. బాబాకు పూరణ్ పోళీ అంటే ఇష్టమని తనకు తెలిసి ఉండటం వలన, కావాలని పూరణ్ పోళీ తయారు చేయించుకుని నైవేద్యాన్ని తీసుకువచ్చారు. నానాసాహెబ్ నైవేద్యం తీసుకువెళ్ళే సమయానికి బాబా అప్పుడే భోజనం చేసి కూర్చొని ఉన్నారు. నానాసాహెబ్ బాబాను మరలా భోజనం చేయమని ప్రాధేయపడ్డారు. అప్పుడు బాబా “నేను ఇప్పుడే భోజనం చేసాను, ఇక నీవు నీ నైవేద్యపళ్ళెం తీసుకొని వాడాకు వెళ్ళి భోజనం చేయి” అని చెప్పారు. బాబా ఆజ్ఞాపించడంతో నానాసాహెబ్ వాడాకు వెళ్ళక తప్పలేదు. కానీ వెళ్ళే సమయంలో మాధవరావ్ దేశ్ పాండేతో “మీరు ఇక్కడే ఉండండి. బాబా ఆ పళ్ళెంలో నుండి ఏదయినా భుజిస్తే వచ్చి నాకు చెప్పండి. అప్పుడు నేను భోజనానికి కూర్చొంటాను” అని చెప్పారు. ఆ విధంగానే మాధవరావు బాబా వద్దనే కూర్చొన్నారు. అక్కడ వాడాలో నానాసాహెబ్ మాధవరావు కబురు కోసం ఎదురు చూడసాగారు. కొంచెం సేపు గడచిన తరువాత బాబా “నానాసాహెబ్ భోజనం చేసాడా?” అని మాధవరావుని అడిగారు. అప్పుడు మాధవరావు “లేదు, ఈ పళ్ళెంలో నుండి మీరు కొంచెం ఏదయినా భుజిస్తే, అప్పుడు తాను భోజనానికి కూర్చొంటారు” అని సమాధానమిచ్చాడు. అప్పుడు బాబా నవ్వుతూ “అరే! పళ్ళెంలో భోజనం పెడుతున్నప్పుడే ఈగరూపంలో వెళ్ళి నైవేద్యాన్ని భుజించాను, కనుక తనను ఇక భోజనం చేయమని చెప్పు” అని చెప్పారు. ఆ విషయం మాధవరావు ద్వారా తెలుసుకున్న నానాసాహెబ్ సంతోషంగా భోజనానికి కూర్చొన్నాడు.

అదేవిధంగా ఒకసారి నానాసాహెబ్ తో  బాబా “అరే! ఎవరైనా మన ద్వారం దగ్గరికి భిక్షకు వస్తే, వారికి మన శక్తి కొలది ఇవ్వాలి. ఒకవేళ మన దగ్గర ఇవ్వడానికి ఏమి లేనట్లయితే, అదే విషయాన్ని వారికి నెమ్మదిగా, మృదువుగా చెప్పాలి” అని చెప్పారు.ఆ బోధ జరిగిన తరువాత నానాసాహెబ్ తన ఊరికి వెళ్ళిపోయాడు.తరువాత  ఒకసారి ఒక వృద్ధురాలు భిక్ష అడగడానికి తన ఇంటి ద్వారం వద్దకు వచ్చింది.తనతో  "భిక్షలేదు, వెళ్ళు” అని నౌకరు చెప్పాడు. కానీ ఆ భిక్షగత్తె మొండి వైఖరి చూపించసాగింది. దాంతో నానాసాహెబ్ స్వయంగా ఆ భిక్షగత్తెను కోపంతో అరచి పంపించివేసారు. ఆ తరువాత నానాసాహెబ్ మరల బాబా వద్దకు వచ్చినపుడు బాబా  తనతో “ఏవరైన మన వద్దకు భిక్షకు వస్తే వారితో మృదువుగా మాట్లాడాలి అని చెప్పినా, ఆ విషయం నీవు మరచిపోయావు కదా? నేను వృద్ధురాలైన భిక్షగత్తె రూపంలో మీ ఇంటికి వస్తే, నాకు తిట్లు భిక్షగా లభించాయి” అని అన్నారు.

ఒకసారి మహల్సాపతి వద్దకు ఒక కుక్క వచ్చింది. ఆ కుక్క చాలా మురికిగా కనిపిస్తూ, నోటి నుండి లాలాజలం కారుతూ ఉంది. మహల్సాపతి దానిని కర్రతో కొట్టాడు. అది బాధతో అరుస్తూ వెళ్ళిపోయింది. తరువాత మహల్సాపతి బాబా దర్శనానికి వెళ్లినపుడు,బాబా "నేను ఎంతో ఆశతో భగత్ వద్దకు (మహల్సాపతిని  బాబా భగత్ అని అంటారు) వెళితే, “నేను కర్ర దెబ్బలు తినవలసి వచ్చింది” అని చెప్పారు.

ఆ విధంగా అనేక లీలల ద్వారా బాబా భక్తులకు శిక్షణనిస్తూ ఉంటారు. బాబా ఎల్లప్పుడు "అరే! ఎవరినీ తిరస్కరించి పంపించివేయకూడదు. మనవద్దకు ఏదైన కుక్క పిల్లి వంటివి వస్తే ఏదో ఋణానుబంధంతోనే వస్తాయి. మనం ఎవరినీ కష్టపెట్టకూడదు అని” అంటుంటారు. బాబా కేవలం ముఖతః బోధ మాత్రమే చేయరు. ఆ బోధను వివిధపద్దతులలో హృదయంలో ముద్రించుకుపోయేటట్లు చేస్తారు. బాబా అటువంటి బోధ చేసిన తరువాత రెండు, మూడు గంటల వ్యవధిలో మేమందరం వాడాలో భోజనానికి కూర్చొన్నప్పుడు మెట్ల వద్దకు ఒక కుక్క వచ్చింది. మేము దానిని అదిలిస్తే ముందరనున్న ఇంకొక వసతిగృహం మెట్ల వద్దకు వెళ్ళింది. అక్కడ అది తన్నులు తిని బాధతో పెద్ద, పెద్దగా అరుస్తూ బయటకు వెళ్ళింది. దాని అరుపులు వినిన తరువా బాబా ఉదయం చేసిన బోధ గుర్తుకు వచ్చి, “మనం దానిని అదిలించకుండా ఒక రొట్టె ముక్కను గాని వేసినట్లయితే, ఆ రొట్టెముక్కను తీసుకొని అది వెళ్ళిపోయి ఉండేది  పాపం అది తన్నులు తినకుండా ఉండేది” అని అనిపించింది. అదే రోజు సాయంత్రం దాసగణు యొక్క కీర్తన జరిగింది. ఆ కీర్తనలో శ్రీ విట్టలుడు కుక్కరూపంలో నామదేవుని వద్దకు వెళ్ళి సజ్జ రొట్టెను తీసుకొని వెళుతుంటే, నామదేవుడు నెయ్యి గిన్నెను తీసుకొని “దేవా, ఆ ఎండి పోయిన రొట్టెను అలా తినవద్దు, ఈ నెయ్యి వేసుకొని తినండి" అని అంటూ ఆ కుక్క  వెనుక పరుగెత్తడం అనే కథాభాగం కీర్తనలో వచ్చింది. మారుతీ దేవాలయంలో శ్రీ మాధవరావు అడ్కర్ భక్తలీలామృతాన్ని ప్రతి రోజు సాయంకాలం పారాయణం చేసేవారు.ఆశ్చర్యంగా అదే రోజు సాయంకాలం పారాయణలో ఆ  కథాభాగమే వచ్చింది. ఆ విధంగా బాబా ఉదయం చేసిన బోధను, ఆయనే దృఢంగా హృదయంలో ముద్రించుకుపోయేటట్లు చేసారు. ప్రతి ఒక్కసారి భక్తుల ఆర్తిని తీర్చడానికి మరియు వారిని సమాధానపరచడానికి వారి వద్దకు వేరు, వేరు రూపాలలో వెళుతూ ఉంటారు.

తరువాయి భాగం రేపు.

సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్ .

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo