సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 3వ భాగం


కాకా సాహెబ్ దీక్షిత్ డైరీ - మూడవ భాగం 

అడ్డు గోడ 

ఒకసారి కొంతమంది యువకులు బాబా దర్శనం కోసం వచ్చారు. వారికి బాబాను ఫోటో తీయాలని భలే కోరికగా ఉంది. కెమెరా కూడా తెచ్చుకొన్నారు. రెండురోజులు ఆగి తమ కోరికను శ్రీమాధవరావు దేశపాండే(షామా)కు తెలియజేసారు. బాబా లెండీ నుండి తిరిగి వచ్చేటప్పుడు సాఠేసాహెబ్ వాడా దగ్గర బాబాను ఒక్క నిముషం నిలుచోమని ప్రార్థిస్తాననీ, అప్పుడు వాళ్ళు ఫోటో తీయొచ్చనీ, షామా ఆ బృందానికి చెప్పాడు. బాబా లెండీ వెళ్ళాక వారినందరినీ వెంటబెట్టుకొని సాఠేసాహెబ్ వాడా దగ్గరకు చేరాడు. ఆ యువక బృందం తమ కెమెరా సిద్ధం చేసుకొని ఆత్రుతగా వేచివున్నారు. బాబా ఆ ప్రదేశానికి రాగానే మాధవరావును పిలిచి, “షామా! ఏమిటిదంతా?” అని అడిగారు. “దేవా! వీళ్ళంతా మీ ఫోటో ఒకటి తీయాలని కోరుతున్నారు. అందుకే అందరూ ఇక్కడ నిలబడివున్నారు” అన్నాడు షామా. దానికి సాయి మహరాజ్, “ఫోటో తీయాల్సిన అవసరం ఏమీలేదని ఆ కుర్రవాళ్లకి చెప్పు ! అడ్డుగోడపడగొడితే  చాలు” అంటూ ఒక్క నిముషం కూడా అక్కడ నిలబడకుండా మసీదుకు సాగిపోయారు. ఆ యువకులు ఫోటో తీయాలనుకొన్నది తన మూడున్నరమూరల దేహాన్ననీ, అది నిజానికి తన అసలు స్వరూపం కాదనీ, తాను వేరు, జగత్తు వేరనే ద్వైతభావం వలననే తాను యీ భౌతిక దేహమేనన్న భ్రాంతి కలుగుతున్నదనీ, ఆ అజ్ఞానమనే అడ్డుగోడను పడగొడితే తన నిజస్వరూపం అర్థమవుతుందనీ- తమ మాటలవల్ల శ్రీసాయిమహరాజ్ చెప్పారు. ఆ ఆదేశంలోని అంతరార్థాన్ని గ్రహించి, భక్తులు (అజ్ఞానమనే) అడ్డుగోడను పడగొట్టి, బాబా సత్యమైన స్వరూపాన్ని దర్శించగలగాలి.

ఫోటో

ఇంకొకసారి 'ప్రభు’ సమాజానికి చెందిన ఒక వ్యక్తి బాబా దర్శనం కోసం వచ్చాడు. ఆయన అంతకు మునుపు బొంబాయిలో ఒక ప్రఖ్యాత  ఫోటో గ్రాఫరుకు  చెందిన స్టూడియోలో కొంతకాలం పనిచేసాడు. ఆయన కూడా బాబా ఫోటో తీయాలని తనతో కెమెరా పట్టుకొచ్చాడు. బాబా అనుమతి తీసికోనవసరం లేకుండానే ఫోటో తీయాలని అతని ఉద్దేశం. అలాగే ఫోటో తీసాడు కూడా! కానీ, తరువాత నెగెటివ్ కడిగి చూస్తే, అందులో బాబా ఫోటోకు బదులు తన గురువు ఫోటో వుంది! ఆ అసాధారణ చమత్కారానికి ఆ వ్యక్తి ముగ్ధుడయ్యాడు.. ఎవరి గురువుపట్ల వారు నిశ్చల భక్తి కలిగివుండాలని బాబా తమ లీల ద్వారా తెలియజెప్పారని గ్రహించాడు.

పీతాంబరం

బాబా సమాధి అయిన రెండుమూడు సంవత్సరాల తర్వాత M.Wప్రధాన్ మరదలికి ఒకరోజు బాబా దర్శనమిచ్చి, “నీపెట్టెలో పచ్చని పట్టుగుడ్డ ఒకటుంది గదా! దానిని నా సమాధిపై కప్పడానికి  శిరిడీ పంపు” అని చెప్పారట! చాలాకాలం క్రితమే పెట్టెలో ఒక మూల పడవేసిన ఆ గుడ్డ ఒకటున్నదన్న సంగతే నిజానికి ఆమెకు జ్ఞాపకంలేదు. బాబా చెప్పిన తర్వాత, పెట్టెలో చూస్తే ఆ గుడ్డ కనిపించింది. విషయం ప్రధాన్ కి చెప్పి, ఆ గుడ్డను శిరిడీ పంపింది. ఆ తర్వాత (1923) బాబా సమాధిపైన కప్పేందుకు ఆ గుడ్డను తరచు వినియోగించేవారు.

తండ్రి - కొడుకులు

థానాకు చెందిన ఒక వ్యక్తి కుమారుడు కొన్ని ఏళ్ళ క్రితం తప్పిపోయాడు. ఆ తరువాత కనిపించలేదు. ఆ వ్యక్తి శిరిడీ వచ్చి తన కుమారుడు తనకు దొరికేటట్లు చేయమని బాబాను ప్రార్థించాడు.“త్వరలోనే నీ కొడుకును నీవు కలుసుకుంటావ్” అన్నారు బాబా. అతను రెండురోజుల తర్వాత ఇంటికి తిరిగివెళ్ళడానికి బాబా అనుమతి తీసుకొని బయలుదేరాడు. మన్మాడు నుండి బొంబాయి  వెళ్ళే రైలులో ఎక్కి థానాలో దిగాడు. అదే సమయానికి  బొంబాయి నుండి వచ్చే రైలు కూడా స్టేషన్లో ఫ్లాట్ మీద ఆగింది. తప్పిపోయిన ఆ వ్యక్తి కుమారుడు రైల్లో నుండి దిగాడు. బాబా చెప్పినట్లే, తండ్రీకొడుకు కలుసుకొన్నారు.

తరువాయి భాగం రేపు

మూలం: సాయిపథం వాల్యూమ్ 1         

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo