బాబాను ప్రత్యక్షంగా దర్శించిన ఆ తరం సాయిభక్తులను ఎందరినో కలిసి 'సాయిపథం' బృందం నిర్వహించిన ఇంటర్వ్యూల నుండి ఈరోజు 'సాయిపథం' వాల్యూమ్-1లో ప్రచురించబడిన రూయీ గ్రామస్థుడైన శ్రీనామదేవ్ రామ్ ఓబ్లేగారితో జరిగిన ఇంటర్వ్యూ విశేషాలను ప్రచురిస్తున్నాం.
శిరిడీ కాక బాబా తమ జీవితకాలంలో (అంటే శిరిడీలో స్థిరపడ్డ తర్వాత) సంచరించిన గ్రామాల్లో రహతా, నీమ్‌గాఁవ్ తర్వాత రూయీ గ్రామాన్ని చెప్పుకోవాలి. రూయీ గ్రామం శిరిడీకి రోడ్డుమీద వెళితే సుమారు 10 మైళ్ళ దూరంలోను, అడ్డత్రోవన (డొంకదారిలో) సుమారు మూడు మైళ్ళ దూరంలోను ఉంది. రూయీలో బాబాను దర్శించిన ఒక వృద్ధభక్తుడున్నారని తెలిసి 'సాయిపథం' ప్రతినిధి బృందం 1988, మే నెలలో రూయీ గ్రామం సందర్శించింది. శిరిడీలోనే ఉద్యోగం చేస్తున్న ఆ వృద్ధుని మనవడు, శిరిడీలో స్థిరపడ్డ ఒక ఆంధ్ర యువకుడు ఈ ఇంటర్వ్యూ విషయంలో 'సాయిపథం' బృందంతో ఉండి ఎంతో సహకరించారు. రూయీలో బాబా పాదస్పర్శచేత పునీతమైన శివాలయంలో ఆ వృద్ధభక్తుడు, ఆయన కుమారుడు రామారావ్ ఒబ్లే, ఒక స్థానిక పత్రికా విలేఖరితో సహా ఆ గ్రామానికి చెందిన సుమారు పాతికమంది పెద్దలు 'సాయిపథం' బృందంతో సమావేశమైనారు.
ఆ వృద్ధుని పేరు నామదేవ్ రామ ఓబ్లే. వయస్సు సుమారు 95-100 సంవత్సరాలు. వృత్తి వ్యవసాయం. 'సాయిపథం'తో ఆయన చెప్పిన విషయాల సారాంశం ఈ క్రింది విధంగా ఉంది :
నా.రా.ఓబ్లే: "నాకు తెలిసి సాయిబాబా మా రూయీ గ్రామానికి రెండు, మూడుసార్లు వచ్చారు. ఇక్కడకు వచ్చినపుడు మనం కూర్చున్న ఈ శివాలయం వద్ద, దగ్గరలో ఉన్న మారుతీ మందిరం దగ్గర, ఇక్కడికి ఉత్తరంగా ఉన్న మఱ్ఱిచెట్టు క్రింద ఉన్నారు. అప్పుడు ఊరి పెద్దలతో పాటు నేను కూడా బాబా దర్శనం చేసుకున్నాను. అయితే బాబాను రూయీలో చూడడానికి ముందే కొన్నిసార్లు శిరిడీలో దర్శించాను. బాబా రూయీ వచ్చినప్పుడు నల్ల కఫ్నీ వేసుకుని ఉన్నారు”.
ప్రశ్న: “బాబా నల్ల కఫ్నీ వేసుకున్నారా? వేరే రంగు గుడ్డలేమో? మీకు బాగా గుర్తుందా?”
నా.రా.ఓబ్లే: (దృఢంగా) “నాకు బాగా గుర్తుంది. బాబా రూయీ వచ్చినప్పుడు నల్లరంగు కఫ్నీయే ధరించారు. బాబా తరచూ నీమ్‌గాఁవ్‌లో ఉండే ఒక ఫకీరు దగ్గరకు వెళ్ళేవారు. ఆ ఫకీరు కూడా రోజూ బాబాను దర్శించేవాడు. శిరిడీ అడ్డతోవన ఇక్కడికి చాలా దగ్గర. నేను నా సాటి పిల్లలు కలిసి అప్పుడప్పుడు శిరిడీ వెళ్ళేవాళ్ళం. అక్కడ బాబా దగ్గర భజనలు జరుగుతుండేవి. భక్తులకు రకరకాల ప్రసాదాలు, కుక్కలకు రొట్టెలు పెట్టేవారు. బాబా తనకు బుద్ధిపుట్టినప్పుడు అక్కడున్నవారికి డబ్బులు కూడా పంచేవారు. మసీదులో ఎప్పుడూ ఏదో వాద్యసంగీతం వాయిస్తుండేవారు. పుణతంబా నుండి వచ్చిన ఒక బ్రాహ్మణుడికి బాబా ఒక పొట్లం ఇచ్చారని, బాబా మధ్యలో విప్పి చూడవద్దని చెప్పినా అతడు దారిలో విప్పి చూశాడనీ, దాంట్లో మాంసం ఉందనీ, దాన్ని ప్రక్క కాలువలో పారేశాక చూస్తే ఆ కాగితానికి బంగారు తీగలు అంటివున్నాయనే విషయాన్ని అప్పట్లో చాలా విశేషంగా చెప్పుకునేవారు. (ఈ బాబా లీలను 'సాయిచరిత్ర'లో వివరంగా చూడవచ్చు.)
గంగగిర్ మహరాజ్ మా ఊర్లో ఒకసారి సప్తాహం చేశారు. ఆ కనిపించే బావి దగ్గరే ఆయన స్నానం చేసేవారు, నాకు ఇప్పటికీ బాగా గుర్తు. బాబా దయవల్లే మా పొలం బాగా పండి, నేను నా పిల్లలు సుఖంగా ఉన్నామని నా నమ్మకం. అంతా బాబా కృప!"
మూలం: సాయిపథం, vol-1.
సాయిరాం. .Congrats సాయి సురేష్ గారు 🌹 ,మీ blog saiyug network వారి official telugu blog గా assosiate చేయబడినందుకు ..చాలా సంతోషం. మీపై సాయి అనుగ్రహానికి ఇది నిదర్శనం.
ReplyDeleteఓం సాయిరాం...🌹🙏🌹
ReplyDelete🕉 sai Ram
ReplyDelete