కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 18వ భాగం
శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.
అనుభవం -13
ఒకసారి నా స్నేహితుడు బాబా దర్శనానికై వచ్చారు. బాబా దగ్గర కూర్చొన్నాక బాబా పాదాలను మర్ధన చేయసాగారు. అలా మర్దన చేస్తుండగా బాబా ఒక్కసారిగా "మర్ధన చేయవద్దు. అలా ప్రక్కకు జరిగి కూర్చో” అని అన్నారు. బాబా చెప్పిన విధంగానే
ఆ గృహస్తు వెనుకకు జరిగి కూర్చొన్నారు. కొంచెం సేపటికి తన కళ్ళు నీళ్ళతో నిండాయి. కాసేపటి తరువాత మరలా తాను బాబా పాదాలను మర్ధన చేయసాగాడు. అప్పుడు, బాబా ఏమీ అనలేదు. తరువాత వాడాకు వచ్చినప్పుడు తాను “మొదట బాబా చరణ సేవ చేసుకుంటున్నప్పుడు మనసులో అమంగళకరమైన ఆలోచనలు వచ్చాయి. తక్షణమే బాబా నన్ను వెనుకకు జరిగి కూర్చోమని చెప్పారు. తరువాత నాకు ఆ విషయంగా పశ్చాత్తాపం కలిగింది. మనసులోనే బాబాకు క్షమాపణలు అడిగాను. తరువాత మరలా బాబా పాదాలు మర్దన చేసుకుంటున్నప్పుడు బాబా అందుకే ఏమీ అనలేదు” అని చెప్పాడు. అటువంటి అనుభవాలను బాబా నిత్యం తమ భక్తులకు ప్రసాదిస్తూ ఉంటారు. బాబా శిక్షణను ఇచ్చే పద్ధతి అవర్ణనీయమైనది.
అనుభవం -14
ఒకరోజు ఉదయం ఎప్పటిలాగానే బాబా దర్శనానికి వెళ్ళాను. అప్పుడు బాబా ధుని వద్దనే నిలబడి ఉన్నారు. నేను వెళ్ళి చరణాలకు నమస్కారం చేసుకోగానే బాబా “అరే! నీకెందుకు ఆందోళన? ఆందోళనంతా నాది” అని అన్నారు. నేను మరలా నమస్కారం చేసుకుని “అవును, నిజంగానే ఆందోళనంతా మీదే” అని అన్నాను. బాబాకు మన పట్ల మనకంటే ఎన్నోరెట్లు ఆందోళన ఉండటం వలన, ఆ అనుభవాలు నిత్యం కలుగుతుండటం వలన బాబా మాటలు అక్షరం అక్షరం బోధపడ్డాయి. అయినప్పటికీ ఈ రోజు ప్రత్యేకించి అలా ఎందుకన్నారో అర్థం కాలేదు. ఆ మాటలకు అర్థం నేను ముంబాయికి వెళ్ళాక బోధ పడింది. ఏరోజయితే బాబా ఆ మాటలను అన్నారో, అదేరోజు నా కుమార్తె పార్లీలోని మా ఇంట్లో డ్రాయింగ్ రూమ్లో ఆడుకుంటూ మూలనున్న బీరువాపై ఎక్కసాగింది. అప్పుడు జారి పడిపోయింది. తాను క్రింద పడిపోయి, తనపై బీరువా పడింది. ఆ బీరువాపై గాజువి మరియు లోహపు ఆటబొమ్మలు ఉన్నాయి. అందరి భారాన్ని మోసే ఆ ప్రభువు యొక్క కృపవలన, ఆ ఆటబొమ్మలన్నీ చేతితో తీసి పెట్టినట్లుగా ప్రక్కకు పడిపోయాయి మరియు అమ్మాయికి కొంచెం కూడా దెబ్బ తగలలేదు. తనచేతి గాజు పగిలిపోవడం వలన చేయి మీద కొంచెం గీసుకుపోయింది.
అలాగే ఒకరోజు రాత్రి ఆ అమ్మాయి శౌచవిధి కోసం వెళ్ళగా అక్కడ పెద్ద పాము ఉంది. అప్పుడు అమ్మాయి వయసు 5 సంవత్సరాలు. ఆ పాము అమ్మాయిని చూడటానికి ముందే అమ్మాయితో ఉన్న మనిషి ఆ పాముని చూసి వెంటనే అమ్మాయిని ఎత్తుకొని బయటకు తీసుకువచ్చేసింది.
అనుభవం - 15
దహణుకు చెందిన ఉద్దవేశ్ బువా కొంతమందితో కలసి ఒకసారి ద్వారకా యాత్రకు వెళ్ళాడు. ముంబాయి నుండి ఓడలో వెళ్ళారు. అందరి టిక్కెట్లు బువా వద్ద, ఉన్నాయి. టిక్కెట్లు రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి ఓడ టిక్కెట్లు, రెండవది లగేజ్ టిక్కెట్లు. బువా లగేజ్ టిక్కెట్లను వేరుగా కొని జేబులో పెట్టుకున్నాడు. ఓడ టిక్కెట్లను డబ్బులున్న పర్సులో పెట్టుకున్నాడు. ఓడపై ఉన్నప్పుడు తాను ఏదో కారణంగా డబ్బులున్న పర్సును బయటకు తీయవలసి వచ్చింది. ఆ సమయంలో తాను రెయిలింగ్ వద్ద నిలబడి ఉన్నాడు. పర్సు తీయగానే టిక్కెట్లు జారిపోయి సముద్రంలో పడ్డాయి. అంటే ఓడ టిక్కెట్లు మరియు బువా డబ్బులు మొత్తం సముద్రం పాలయ్యాయి. ఓడ నుండి దిగేటప్పుడు టిక్కెట్టు ఇవ్వవలసి ఉంటుంది. బువా టికెట్ కలెక్టర్ తో జరిగిన విషయమంతా చెప్పాడు. టికెట్ తీసుకున్నట్లు ఋజువుగా లగేజీ టిక్కెట్లను కూడా చూపించారు. దాంతో టికెట్ కలెక్టర్ జరిగిన విషయాన్ని అర్థం చేసుకుని వారికి ఏ విధమైన ఆటంకం కలిగించలేదు. ద్వారకలో దిగిన తరువాత గోమతి స్నానానికి, దేవి చరణస్పర్శకు, పూజకు డబ్బులు అవసరమవుతాయి. కానీ బువా వద్ద డబ్బులు ఏ మాత్రం మిగల్లేదు. బాబాపై దృఢమైన శ్రద్ధ ఉండటం వలన “నిన్ను తప్ప ఇతరులను దీన ముఖం వేసుకొని ఏమి అడిగేది” అనే సంతోక్తిని అనుసరించి, ఇతరులను ఎవరినీ అడగకుండా శిరిడీకి బాబాకు ఉత్తరం వ్రాసాడు. ఏ రోజయితే తాను శిరిడీకి ఉత్తరం వ్రాసాడో అదే రోజు రాత్రి బాబా దహణుకు చెందిన ఒక ధనిక భక్తునికి స్వప్నంలో కనిపించి, తనకు సముద్రంలో బువా పర్సు పడిపోయిన విషయం చెప్పి, వెనువెంటనే డబ్బులు పంపించవలసిందిగా ఆజ్ఞాపించారు. మరుసటిరోజు ఆ భక్తుడు బువాకు రూ. 50/- లను మనియార్డరు ద్వారా పంపుతూ, జరిగిన వృత్తాంతాన్ని వివరిస్తూ వ్రాసారు.
తరువాయి భాగం రేపు.
సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.