సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 56వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవం:


  • ప్రేమపూర్వకమైన పిలుపుకు బట్టలు సర్దుకుని వచ్చిన బాబా.

నా పేరు లక్ష్మీప్రసన్న. నేను హైదరాబాద్ నివాసిని. బాబాతో నాకున్నది ఏ బంధమోగానీ ఆయన చూపించే ప్రేమ మాత్రం అనిర్వచనీయం. దానిని మానవ సంబంధమైన పదజాలంతో వర్ణించి దాని విలువను నేను తగ్గించలేను. కానీ, నేను బాబాను 'తాత' అని అనుకుంటూ ఉంటాను. మా ఇంట్లో చిన్న బాబా విగ్రహం ఒకటుంది. ఆయనకు సబ్బుతో స్నానం చేయించి, కొత్త బట్టలు వేసి మురిసిపోతూ ఉంటాను. ఒకసారి నాకెందుకో పెద్ద బాబా విగ్రహం ఒకటి తెచ్చుకోవాలనీ, అది కూడా శిరిడీ నుండి అయితే ఇంకా బాగుంటుందనీ అనిపించింది. తరువాత దసరారోజుల్లో మేము శిరిడీ బయలుదేరుతూ, "బాబా! ఎలాగైనా సరే, మీరు మాతోపాటు శిరిడీ నుండి వచ్చి మా ఇంటిలో ఆసీనులు కావలసిందే!" అని బాబాకి చెప్పుకుని, ఇంట్లో బాబా కోసం ఒక ఆసనం వేసి వెళ్ళాను.

మేము శిరిడీ నుండి తిరుగుప్రయాణమయ్యేరోజు ఒక పెద్ద బాబా విగ్రహం తీసుకున్నాము. అది చాలా బరువుగా ఉంది. తీసుకుని వెళ్లడం కాస్త కష్టమే, కానీ ఆ విగ్రహమే కావాలని నా మనసుకు అనిపించింది. బాబాకు సరిపడే తలపాగాలు, దండలు కూడా తీసుకున్నాము. అయితే బట్టలు మాత్రం చాలా ధర చెప్పారు. అస్సలు తగ్గడం లేదు. నాకేమో అంత ధర పెట్టాలని లేదు. ఎందుకంటే నాకు టైలరింగ్ వచ్చు. బాబాకి కావలసినవన్నీ నేనే తయారుచేసుకుంటాను. అంతేతప్ప వేరే ఏ ఉద్దేశ్యం కాదు. కానీ ఈలోపే తాత(బాబా) 'ఈ పిల్ల బట్టలు కొనేలా లేదు' అని అనుకున్నట్టున్నారు. ఇక ప్యాకింగ్ చేస్తారన్న సమయంలో నేను హఠాత్తుగా, "ప్యాక్ చేయొద్దు, ఆగండి. నేను బాబా విగ్రహాన్ని శిరిడీ అంతా తిప్పి, సమాధిమందిరం లోపలకి తీసుకుని వెళ్లి వస్తాన"ని చెప్పాను. షాపతను, "ఇంత బరువు మీరు మోయలేరు. అయినా సమాధిమందిరం లోపలికి ఇంత పెద్ద విగ్రహాలని అనుమతించరు" అన్నాడు. ఆ మాటలు విన్న నేను, "తాతా! మీరు బరువు తగ్గండి ప్లీజ్, లేదంటే నాకు మిమ్మల్ని మోయటానికి తగిన శక్తినన్నా ఇవ్వండి" అని బాబాకు చెప్పుకుని, మొదట నాకిష్టమైన ద్వారకామాయికి లైన్లో తీసుకెళ్ళాను. లోపలికి వెళ్ళగానే అక్కడున్నవాళ్ళు, "అయ్యో! అమ్మా, ఇంత బరువు పట్టుకుని లైన్లో ఎందుకొచ్చారు? మామూలుగా రావచ్చు కదా!" అని బాబాని లోపలంతా తాకించి ఇచ్చారు.

తరువాత సమాధిమందిరానికి వెళ్తే లోపలికి అనుమతించలేదు. అయితే లోపలికి అనుమతించడం బాబా ఇష్టంకానీ వాళ్ళది కాదు కదా! బాబా అద్భుతం చూపారు. అక్కడే ఉన్న ఒక స్వీపర్, "అమ్మా, ఇలా ఇవ్వండి" అని బాబాని సమాధి వద్దకు తీసుకుని వెళ్ళాడు. మామూలుగా లోపలికి వెళ్ళిన బాబా గంధం, గులాబీమాలతో తిరిగి వచ్చారు. "ఇందాక ఇలా లేరు, ఇప్పుడు ప్రాణం పోసుకుని వచ్చారు బాబా" అని అనిపించింది. అతను బాబా విగ్రహాన్ని నాకు అందించి‌, తన జేబులోనుంచి డబ్బులు తీసి, "అమ్మా, ఇవి తీసుకుని బాబాకి బట్టలు తీసుకోండి" అని చెప్పాడు. ఇక అందరూ బాబాకు నమస్కరించడం మొదలుపెట్టారు. అందులో ఒక జంట వచ్చి, "ఇవి బాబా వస్త్రాలు, సమాధిమందిరంలో మాకిచ్చారు, ఇవి మీరు తీసుకోండి" అని నాకు ఇచ్చి వెళ్లిపోయారు. బాబాను చూస్తుంటే, నేను రమ్మన్నానని బట్టలు కూడా సర్దుకుని అతిథిలా నాతో వస్తున్నారనిపించింది. కానీ ఈ అతిథి మళ్ళీ తిరిగి వెళ్ళే అతిథి కాదు అని చాలా ఆనందించాము.

తరువాత బాబాతో పాటు ట్రైన్ ఎక్కాము. బాబా ఉన్న బాక్సును ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు. చివరికి మావారు తన బెర్తుపైన తలవద్ద పెట్టుకుని, సర్దుకుని పడుకున్నారు. తరువాత అర్థరాత్రి సమయంలో నా బెర్తుపై ఒక ముసలాయన కూర్చున్నాడు. ఆయన నన్ను ఎక్కడ తాకుతాడో అని నేను, నేను ఎక్కడ తనను తాకుతానో అని ఆయన ఇద్దరమూ ఒదిగి ఉన్నాము. ఉదయం మావారు, "రాత్రంతా ఆ బాక్సులో నుండి ఒక విధమైన వైబ్రేషన్స్, 'ఓం' అనేవిధంగా వస్తూ వుంది. అందువలన సరిగా పడుకోలేద"ని చెప్పారు. మరి నేను చూసింది?! ఖచ్చితంగా తన మూటతో సహా తాత మాతో వచ్చారు. ఇంటికి వచ్చాక బాబా తనకు కావలసినవన్నీ తనే సమకూర్చుకున్నారు. ఇవన్నీ ఇప్పుడు తలచుకుంటుంటే తాత ప్రేమ మన మీద ఎంతగా ఉంటుందో అర్థమవుతూ ఉంది.

"బాబా! మీ బిడ్డలందరినీ ఈ ప్రాపంచికం నుండి మరలి నీ లీలలో తరించిపోయేలా ఆశీర్వదించండి". 


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo