కాకా సాహెబ్ దీక్షిత్ డైరీ - నాలుగవ భాగం.
పరామర్శ
ఒకసారి షామా (మాధవరావు దేశపాండే)కి బాబా స్వప్నంలో కనిపించి, “నీవు గోవర్ధనదాసు ఇంటికి వెళ్లవా? అతని తల్లి మరణించినది. వెళ్లి అతణ్ణి పరామర్శించు” అని చెప్పారు. కలలో వచ్చిన ఆదేశాన్ని యథాతథంగా తీసుకొని, ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి, గోవర్దనదాసు ఇంటికి వెళ్ళాడు షామా. అక్కడకు వెళ్ళిన తర్వాత తెలిసింది షామాకు - ఆ ముందు రోజే గోవర్దనదాసు తల్లి మరణించినదని!
భవిష్య వాణి
బాబా దర్శనం కోసం ద్వారకనాథ్ ప్రధాన్ శిరిడీ వచ్చాడు. అతడు తన మామగారి దగ్గర నుండి బాబా కొక ఉత్తరం తీసుకొచ్చాడు. ఆ ఉత్తరంలో ప్రధాన్ తన కూతురి అనారోగ్యం గురించి వ్రాసాడు. ద్వారకనాథ్ ఆ ఉత్తరాన్ని బాబా చేతికిచ్చాడు. బాబా దాన్ని తలక్రిందులుగా పట్టుకొని "ఆమె వెళ్ళిపోతున్నదన్నమాట” అంటూ గొణిగారు. నాకు (దీక్షిత్) ఆ మాటలు బాగా విన్పించాయి. కానీ మిగతావాళ్ళకి అంత స్పష్టంగా విన్పించలేదు. తర్వాత ఆ ఉత్తరాన్ని బాబాకి చదివి విన్పించారు. ఆ ఉత్తరం చదివిన తర్వాత ద్వారకనాథ్, “బాబా! నాభార్యను ఎప్పుడు తీసుకు రమ్మంటారు?” అని అడిగాడు. దానికి బాబా, "ఇక నాలుగు రోజులలో ఆమే నా వద్దకు వస్తుంది.” అన్నారు. సరిగా నాల్గు రోజులకు ఆమె మరణించడం భక్తులకందరకూ ఆశ్చర్యమేసింది.
అంతర్యామి
ఒక గురుపూర్ణిమ రోజున శ్రీగోవింద రఘునాథ్ దభోల్కర్ (అన్నాసాహెబ్ దభోల్కర్) సకుటుంబంగా శిరిడీవచ్చాడు. అతను తనతో తీసుకువచ్చిన డబ్బు రెండు రోజుల్లోపలే అయిపోయింది. ఆ మరుసటి రోజు నేను (దీక్షిత్), మోరేశ్వర్ ప్రధాన్ శిరిడీ వచ్చాము. ప్రధాన్ తెచ్చుకున్న డబ్బు కూడా ఇట్టే అయిపోయింది. బాబా ఆ ప్రక్కరోజు ప్రధాన్ ను దక్షిణ అడిగారు. “బాబా, నా దగ్గర ఏమి డబ్బు లేదు! అన్నాడు ప్రధాన్. “పోయి,అన్నాసాహెబ్ నడిగి తీసుకురా” అన్నారు బాబా.
అన్నాసాహెబ్ దగ్గరకూడా బొత్తిగా డబ్బు లేదని ప్రధాన్ కు తెలుసు. అయినా బాబా ఆజ్ఞను తూ.చ. తప్పక ఆచరించాలని ప్రధాన్ వెళ్ళి, అన్నాసాహెబ్ ను డబ్బడిగాడు. ప్రధాన్ తనను డబ్బుకోసం అడగ్గానే అన్నాసాహెబ్ ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే సరిగ్గా కొన్నినిముషాల క్రితమే బాంద్రాలోని తన యింటినుండి ఒక వ్యక్తి ద్వారా అన్నాసాహెబ్ కు డబ్బు అందింది. ఇంతలో ఆ విషయం వేరేవ్వరికీ తెలిసే అవకాశమేలేదు! “నా దగ్గర డబ్బుందని మీకెలా తెలిసింది?” అని అడిగాడు అన్నాసాహెబ్. దానికి ప్రధాన్ “నాకు తెలియదు. బాబా ఆజ్ఞానుసారం వచ్చి అడుగుతున్నాను” అన్నాడు.
రక్షకుడు
సహరా (అనే ఊరిలో) ఒక బ్రాహ్మణుడికి మరణశిక్ష పడింది. అతడికొక ముస్లిం మిత్రుడున్నాడు. ఆ మిత్రుడు సాయిభక్తుడు. అతడు శిరిడీ వచ్చి బాబాతో తన మిత్రుడికి పడిన శిక్ష గురించి చెప్పి, అతణ్ణిలాగైనా కాపాడమని ప్రార్థించాడు. “ఇంకో నాలుగు రోజుల్లో భగవంతుడు అనుగ్రహిస్తాడు” అన్నారు బాబా. సరిగ్గా నాలుగు రోజుల తరువాత, తన బ్రాహ్మణ మిత్రుణ్ణి అప్పీలు మీద విడుదల చేసారనే వార్త అందింది
గణేశ - సాయి
ఈ సంఘటన 1911లో జరిగినది. శ్రీచిదంబరరావు గణేశ భక్తుడు. అతడు బాబా గణేశుడని భావించేవాడు. అతడు బాబాను పూజించేటప్పుడు బాబాలో గణేశున్ని భావించుకొని అర్చించేవాడు. ఒకసారి అతడు శిరిడీలో బాబాను పూజిస్తుండగా అక్కడున్నవారితో "ఈ ముసలోడు చాలా టక్కరి నా ఆసనం క్రింద ఎలుక నొకదాన్ని దాచాడు "అన్నారు. గణేశుడు మరి మూషిక వాహనుడు కదా!
తరువాయి భాగం రేపు.
మూలం: సాయిపథం వాల్యూమ్ -1