సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 45వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవాలు:

  1. చిన్న ప్రార్థనకు పలికే శ్రీసాయి

  2. ఊదీ మహిమ



క్రింద ఇవ్వబడిన రెండు అనుభవాలు సాయిబంధువు సాయి సిరి పంచుకుంటున్నారు. 

చిన్న ప్రార్థనకు పలికే శ్రీసాయి

ఒకసారి చెన్నైలో మా బంధువుల వివాహం ఉండటంతో మా కుటుంబసభ్యులంతా చెన్నై వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. ఎందుకంటే పెళ్లికి రెండురోజుల ముందు సంగీత్ కార్యక్రమం ఉంది. నాకలాంటి వాటిలో పాల్గొనటం ఇష్టముండదు. అందుకే ఎప్పుడూ వాటికి దూరంగా ఉంటాను. అయితే ఈసారి మావాళ్లంతా నేను కూడా డాన్స్ చేయాలని పట్టుబట్టారు. నాకు ఎలా తప్పించుకోవాలో అర్థంకాక, "బాబా! నాకు అవన్నీ ఇష్టంలేదు. నేను వెళ్లకుండా ఉండేలా చేయండి" అని ప్రార్థించాను. అలా ప్రార్థించిన కొద్దిసేపటికే 1.50 నుండి 2 గంటల మధ్యలో నాకు నెలసరి సమస్య మొదలైంది. నిజానికి దానికింకా 15 రోజుల సమయముంది. అది బాబా అనుగ్రహమే అన్నట్లు సరిగ్గా 2 గంటల సమయంలో శిరిడీ నుండి నాకు తెలిసిన ఒకతని నుండి, "ఇప్పుడే ద్వారకామాయిలో బాబా ముందు మీ గురించి తలుచుకుని, మీకు ఆశీస్సులు అందజేయమని బాబాను ప్రార్థించాను" అని మెసేజ్ వచ్చింది. ఇక ఆ సమస్య వలన పెళ్ళికి వెళ్లనక్కరలేదని అనుకున్నాను. కానీ మా మామగారు, "నువ్వు పెళ్లి ముందురోజు బయలుదేరి రా" అని చెప్పారు. సంగీత్ లో పాల్గొనకుండా బాబా కృపవలన తప్పించుకోగలిగాను కాబట్టి, ఇక పెళ్ళికి వెళ్లినా నాకే ఇబ్బందీ లేదని నేను ఆనందంగా బయలుదేరాను. నేను రైల్వేస్టేషనుకి వెళ్లి 3వ నెంబర్ ప్లాట్‌ఫారంపై నిల్చొని ట్రైన్ కోసం ఎదురుచూస్తున్నాను. 4వ నెంబర్ ప్లాట్‌ఫారంపై ఒక వ్యక్తి అచ్చం సాయిబాబాలా కఫినీ, తలగుడ్డ ధరించి నడుస్తూ కనిపించారు. ఆయన కొంతమందితో మాట్లాడి, నడుస్తూ నడుస్తూ అమాంతంగా ప్లాట్‌ఫారం మీద నుండి కిందకి దూకేసారు. 'అంత పెద్దాయన అలా దూకేశారు. పాపం, ఏమవుతుందో, ఎటు వెళ్తారో' అని నేను గమనిస్తూ ఉన్నాను. ఒకసారి టికెట్ చూసుకుని, కొంచెం ముందుకు వెళ్లి గమనిద్దాం అనుకున్నాను. ఒక్కక్షణం వెనక్కి తిరిగి టికెట్ చూసి మళ్ళీ ఆయనవైపు చూసేసరికి ఆయన ఎక్కడా కనిపించలేదు. చుట్టుపక్కలంతా చూసాను కానీ, ఆయన జాడ ఎక్కడా కనపడలేదు. అంత పెద్దాయన ఒక్క క్షణంలో ఎటైనా ఎలా వెళ్లగలరని ఆశ్చర్యపోయాను. అప్పుడు అర్థమైంది, 'ఆ వ్యక్తి వేరెవరో కాదు, బాబానే' అని. మనసులోనే బాబాకి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఆరోజు రిపబ్లిక్ డే, పైగా వారాంతం కావడంతో బాగా రద్దీ ఉంది. ఎలా వెళ్తానో ఏమో అనుకున్న నాకు, "నేనున్నాను" అని బాబా నాకు దర్శనమిచ్చి నా ప్రయాణం సౌకర్యవంతంగా జరిగేలా చేసారు. పెళ్లి చూసుకుని తిరిగి వచ్చేందుకు చెన్నై స్టేషన్ చేరుకున్నాక, నేను, మావారు షాపింగ్ చేస్తూ, "ఎక్కడా బాబా కనపడటం లేదేమిటి?" అని అనుకున్నాను. అంతలో ప్లాట్‌ఫారంపై పాత ఎలక్ట్రానిక్ వస్తువుల మధ్య చిన్న బాబా దర్శనమిచ్చారు. బాబా తోడుగా ఉన్నారని నాకు చాలా సంతోషంగా అనిపించింది.

ఊదీ మహిమ:


ఒకరోజు మా మేడపైనుండి చెట్టుకున్న జామకాయలు కోస్తుండగా తేనెటీగ నా చూపుడువేలిపైన కుట్టింది. భరించలేనంత నొప్పికి నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. వెంటనే బాబాని ప్రార్థించి, నొప్పివున్న చోటంతా ఊదీ రాసాను. ఆశ్చర్యంగా మరుక్షణమే ఆ నొప్పంతా మాయం అయిపోయింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!"

మరొకరోజు మావారు తన కుడిచెయ్యి బాగా నొప్పి పెడుతుందని ఆఫీస్ నుండి మధ్యలో ఇంటికి వచ్చేసారు. మాములుగా ఐతే తను ఎంత నొప్పినైనా భరిస్తారు. అలాంటిది అతనలా ఇంటికి రావడంతో నాకు చాలా ఆందోళనగా అనిపించింది. వెంటనే బాబాను ప్రార్థించి, తనకి నొప్పి ఉండే చోటంతా ఊదీ రాసాను. రెండురోజులు అలా చెయ్యగా తన నొప్పి పూర్తిగా తగ్గిపోయింది. "చాలా చాలా ధన్యవాదాలు బాబా!"


సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo