కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 15వ భాగం
శ్రీహరిసీతారామ్ దీక్షిత్‌గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.
అనుభవం - 2
నాకు బాబా దర్శనం మొదటిసారి అయినప్పుడు నా మిత్రుడు శ్రీగోవింద్ రఘునాథ్ దభోల్కర్‌కి కూడా బాబా దర్శనం అయితే బాగుంటుందని నాకు కోరిక కలగడంతో నేను శిరిడీ నుండే తనకు ఉత్తరం వ్రాశాను. బాబా దర్శనం తప్పక చేసుకోవాలని విన్నవించాను. ఆ తరువాత కొద్దిరోజులకు తనను నేను కలవడం జరిగింది. అప్పుడు తను, “నేను దర్శనానికి తప్పక వెళతాను. కానీ గురువు యొక్క ఉపయోగమేమిటో నాకు అర్థం కావడం లేదు. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలని నాకు అనిపిస్తుంది” అని అన్నాడు. ఆ తరువాత ఈస్టర్ సెలవులలో తాను బాబా దర్శనానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. తాను ఏ రోజయితే బయలుదేరాలో ఆరోజు, 'తన స్నేహితుని యొక్క ఒక్కగానొక్క కుమారుడు చనిపోయాడు, ఆ సమయంలో తన స్నేహితుని గురువు కూడా అక్కడే ఉన్నారు' అనే వార్త వచ్చింది. దాంతో తాను శిరిడీ వెళ్ళే ఆలోచనను విరమించుకున్నాడు. ఇంతలో ఇంకొక స్నేహితుడు కలిసి శిరిడీకి వెళ్ళమని గట్టిగా చెప్పడం వలన శిరిడీ ప్రయాణం ఖరారైంది. తాను ఆ ప్రకారమే శిరిడీకి బయలుదేరాడు. కోపర్గాఁవ్‌కు వెళ్ళే మెయిల్ దాదర్లో ఆగుతుందని తనకు సమాచారం ఉండటం వలన, తాను దాదర్‌కు బయలుదేరాడు. ఇంతలో తనకు బాంద్రా స్టేషనులో ఒక మహమ్మదీయ గృహస్థు కలిశాడు. ఆయన దభోల్కర్‌తో, “మెయిల్ దాదర్‌లో ఆగదు, నీవు బోరీబందర్ స్టేషన్‌కు వెళ్ళు” అని చెప్పాడు. ఆ విధంగానే తాను బోరీబందర్‌కు వెళ్ళాడు. మరుసటిరోజు ఉదయం శిరిడీకి చేరుకున్నాడు. బాబా దర్శనానికి వెళ్ళడానికి ఇంకా సమయం ఉండటంతో, తాను ఒక గృహస్థుతో మాట్లాడుతూ కూర్చొన్నాడు. ఆ వేళలో “గురువు యొక్క ఉపయోగం ఏమిటి?” అనే విషయంపై వాదులాడుకోవడం చాలాసేపు జరిగింది. తరువాత మేమందరం బాబా వద్దకు వెళ్ళాము. అక్కడ కూర్చొన్న తరువాత బాబా - దాభోళ్కర్ వైపు చూస్తూ - ఈ హేమాద్‌పంత్ ఏమంటున్నాడు?” అని నన్ను అడిగారు. అందుకు నేను బాబా "మీకు అన్నీ తెలుసు” అని సమాధానం ఇచ్చాను. తరువాత ఆరోజు నేను బయలుదేరాల్సి ఉండటంతో అనుమతి అడగాల్సి ఉంది. అందువలన నేను, “బాబా, ఈరోజు బయలుదేరాలా?" అని అడిగాను. బాబా “అవును” అని అన్నారు. ఆ మాట విన్న భక్తుడొకరు, “బాబా, ఎక్కడకు వెళ్ళాలి?” అని అడిగారు. ఆకాశం వైపుకి చూపిస్తూ, “అలా పైకి” అని బాబా సమాధానం ఇచ్చారు. మరలా ఆ భక్తుడు “బాబా, మార్గం ఎలా ఉంటుంది?" అని అడిగాడు. అందుకు బాబా, “మార్గాలకేం? పుష్కలంగా ఉన్నాయి. వివిధ ప్రదేశాలనుండి మార్గం ఉంది. మనకు ఇక్కడి నుండి కూడా ఒక మార్గం వెళుతుంది. మార్గం చాలా కష్టమైనది. మార్గంలో పులులుంటాయి, ఎలుగుబంటి ఉంటుంది” అని అన్నారు. అప్పుడు నేను, “కానీ బాబా, మార్గదర్శి తోడుంటే?” అని అడిగాను. అప్పుడు బాబా, "మార్గదర్శి తోడుంటే ఇక ఏ పంచాయితీ లేదు. అప్పుడు పులి ప్రక్కకు వెళుతుంది. ఎలుగుబంటి ప్రక్కనుండి వెళ్ళిపోతుంది. లేదంటే ఒక పెద్ద చితి ఉంది. అందులో వెళ్ళి పడే ప్రమాదముంది” అని అన్నారు. ఈ సంభాషణ యొక్క పరిణామం దాభోళ్కర్ మనసుపై చాలా పడింది. “నా ప్రశ్నకు సమాధానం దొరికింది” అని తనకు అనిపించసాగింది. ఆ తరువాత బాబా తనకు తరచూ ఎన్నో అనుభవాలను ప్రసాదించారు. ఇప్పుడు తాను బాబాకు సంపూర్ణభక్తుడయ్యాడు.
తరువాయి భాగం రేపు.