సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహ సుమాలు - 5వ భాగం


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - ఐదవ భాగం.

తక్షణ రక్షణ

ఒకరోజు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో బాబా, "ప్రధాన్ ఏమైనా వచ్చాడా?” అని హఠాత్తుగా దీక్షిత్తు ను  అడిగారు. దీక్షిత్ రాలేదని చెప్పి, “బాబా, బయలుదేరి రమ్మని అతనికి కబురుపెట్టనా?” అని అడిగాడు. 'అలాగే కబురు పంపమ'న్నారు బాబా.

అదే రోజు, సరిగ్గా ప్రధాన్ ను గురించి బాబా దీక్షిత్ ను అడుగుతున్న సమయంలోనే, బొంబాయి హైకోర్టులోని బార్ రూంలో ఎవరితోనో మాట్లాడుతున్న M.W.ప్రధాన్ హఠాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడు. పడిపోతూ బాబాను తలుచుకున్నాడు. మిత్రులు గాభరాతో అతడికి వైద్య సహాయం తెచ్చేలోగా, తిరిగి స్వస్థుడయ్యాడు ప్రధాన్. ఆ తరువాత ఎవ్వరి ఆసరా అవసరం లేకుండానే శాంతాక్రజ్ లోని  తన ఇంటికి ట్రయిన్లో తనకై తానే వెళ్ళాడు కూడా. ఆ మరుసటిరోజు బాలాషింపీ అనే భక్తుడు శిరిడీ నుంచి వచ్చి బొంబాయిలో ప్రధాన్ ను కలసి, బాబా ఊదీ, దీక్షిత్ వ్రాసిన ఉత్తరం అందజేసి, బాబా ఆక్రితం రోజు ప్రధాన్ ను తలుచుకొన్న వైనం చెప్పాడు. బాబా తన భక్తుడు కష్టంలో ఉంటే ఎలా వెంటనే తమ రక్షణను అందజేస్తారో అనే దానికి ఇదొక చక్కని దృష్టాంతం.

స్వప్న సందేశం

శాంతాక్రజ్ (బొంబాయి)లో గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించాలని M.W.ప్రధాన్ సంకల్పించి, దానికి బాబా  అనుమతి కోరమని శిరిడిలో ఉన్న దీక్షిత్ కు ఉత్తరం వ్రాసాడు. దీక్షిత్ బాబాకు ఆ విషయం విన్నవించాడు. బాబా అంగీకారం తెలిపారు.

విగ్రహప్రతిష్టాపనకు బాబా అనుమతిని తెలియజేస్తూ  దీక్షిత్ ఆ రోజే ప్రధాన్ కు ఉత్తరం వ్రాసాడు. అదే రోజు రాత్రి ప్రధాన్ మరదలు శ్రీమతి తాయిబాయికి చక్కని గణపతి విగ్రహాన్ని ఒకమూల ప్రతిష్టిస్తున్నట్లు ఒక స్వప్నం వచ్చింది. ప్రొద్దునే శ్రీమతి తాయిబాయి తన స్వప్న వృత్తాంతాన్ని ఇంట్లో అందరికి చెప్పింది. ఆ తరువాత కొంత  సేపటికి మొదటివిడత పోస్టులో శిరిడి నుండి దీక్షిత్ వ్రాసిన ఉత్తరం అందింది. బాబా తన సందేశాన్ని ఉత్తరాలకంటే ముందుగానే స్వప్నంలో ఎలా తెలియజేస్తారో తెలిపేందుకు ఇదొక చక్కని ఉదాహరణ.

ఊది మందు

ఒకసారి దీక్షిత్ తన ఆఫీసులో వుండగా, మిత్రుడోకాయన వచ్చి, “గత ఎనిమిది రోజులుగా నాకు బొత్తిగా నిద్రపట్టడం లేదు. డాక్టరు మందులు కూడా పనిచేయడం లేదు” అని తన బాధ వెళ్ళబోసుకున్నాడు. దీక్షిత్ అతనికి బాబా ఊదీని యిచ్చి మూడురోజులపాటు వరుసగా పడుకోబోయేముందు ఆ ఊదీని పెట్టుకోమని చెప్పాడు. ఆ మరుసటి రోజే ఆ మిత్రుడు దీక్షిత్ ను కలిసి "రాత్రి ఊదీ పెట్టుకొని పడుకున్నాను. గాఢంగా నిద్ర పట్టింది!” అని ఆనందంగా చెప్పాడు.

అలాగే బాంద్రాలో ఉంటున్న దీక్షిత్ మిత్రుడి కుమారుడికి రెండు మాసాలుగా నిద్రపట్టని వ్యాధితో శిరిడీ తీసుకొచ్చారు. శిరిడీ వచ్చినరోజు రాత్రే ఆ పిల్లవాడు అతి గాఢంగా నిద్రపోయాడు. ఆ రోజు నుండి ఆ వ్యాధి మళ్ళీ కనిపించలేదు.

ఉపవాసాలు వ్యర్థం

శిరిడీలోనే (నివాసం ఏర్పరచుకొని, ఆధ్యాత్మిక సాధనలో  నిమగ్నమై) ఉంటున్న దీక్షిత్ కి ఒకసారి తాను రాత్రులు  పూర్తిగా ఉపవసించాలని నిర్ణయించుకున్నాడు. వాడలోని వారందరికీ ఆ విషయం చెప్పాడు కూడా. ఆ మరుసటిరోజు మధ్యాహ్న ఆరతికి మసీదుకి వెళ్ళినప్పుడు, బాబా దీక్షిత్ ను  “అరే, ఈరోజు రాత్రి భోజనానికి ఏం చేసుకొంటున్నావ్?” అని అడిగారు. “మీరేం చేయమంటే అది తయారు చేస్తాను బాబా!” అని జవాబిచ్చాడు దీక్షిత్. "మామూలే! భట్ (పప్పు), పోలీ తయారుచేసుకో!" అన్నారు బాబా. వెంటనే దీక్షిత్, “అయితే ఆ వంటకాలు తయారుచేసి నైవేద్యానికి ఇక్కడకు తీసుకురమ్మంటారా?” అని అడిగాడు. “అక్కరలేదు. నైవేద్యం పెట్టుకొని, అక్కడే తిను!” అన్నారు బాబా. దానికి దీక్షిత్, “సరే బాబా! అయితే రేపట్నుంచి మాత్రం రాత్రిళ్ళు ఏమీ భుజించను” అని అన్నాడు. బాబా అప్పటికి మౌనంగా ఉన్నా, మరుసటిరోజు మళ్ళీ దీక్షిత్ ని అతని రాత్రి భోజనం గురించి అడిగి ముందురోజులాగే నైవేద్యం పెట్టుకొని భుజించమని చెప్పారు. దాంతో బాబాకు తాను ఉపవాసం ఉండటం అంగీకారం కాదని గ్రహించి దీక్షిత్ తన ఉపవాస దీక్ష విరమించుకొన్నాడు. ఆ తరువాత బాబా అతణ్ణి రాత్రి భోజనం గురించి అడుగలేదు.

తరువాయి భాగం రేపు

మూలం : సాయిపథం వాల్యూమ్ -1

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo