కాకాసాహెబ్ దీక్షిత్ డైరి - ఏడవ భాగం.
నా బిడ్డల్ని నేను కాక
మరెవ్వరు రక్షిస్తారు?
1914లో శ్రీఎస్.బి.నాచ్నే దహనూలో ట్రెజరీ మాస్టరుగా పనిచేసాడు. అక్కడే శ్రీఫన్సే కూడా ఉద్యోగి. ఫన్సేకు మతిస్థిమితం లేదు. ఒకసారి శ్రీనాచ్నే తమ వంట ఇంట్లో ఉన్న బాబా ఫోటో ముందు కూర్చుని పూజ చేసుకుంటున్నాడు. అతనికేదో శబ్దం వినిపించి వెనుదిరిగి చూచేసరికి వంటింటి గుమ్మం దగ్గర పిచ్చి ఫన్సే నిలుచుని కనిపించాడు. మరునిమిషం, ఫన్సే హఠాత్తుగా నాచ్నే మీదకు దూకి, అతని గొంతు పట్టుకొని పిసుకుతూ, “నీ రక్తం తాగేస్తాను” అంటూ, నాచ్నే మెడ కొరకడానికి ముందుకు వంగాడు. పూజ చేస్తున్న నాచ్నే తన చేతిలో ఉన్న ఉద్దరిణిని అప్రయత్నంగా తెరచిన ఫన్సే నోట్లో గుచ్చాడు. ఫనే వెంటనే నోరు మూసి, దొరికిన నాచ్నే వ్రేళ్ళను కొరికాడు. అతని గోళ్ళు నాచ్నే మెడలో బాగా దిగబడి, రక్తం కారసాగింది. హఠాత్తుగా ఎదురైన ఆ ఉత్పాతానికి నాచ్నే స్పృహ తప్పి పడిపోయాడు. అతనికి తిరిగి స్పృహ వచ్చేసరికి, తన తల్లి, తమ్ముడు, డాక్టరు తన చుట్టూ కూర్చుని కనిపించారు. సమయానికి నాచ్నే తల్లి , తమ్ముడు చూచి ఆ పిచ్చివాడి పట్టునుండి తన్ను విడిపించి ప్రాణం కాపాడారని తెలిసింది.
తరువాత కొన్ని రోజులకు బాబా దర్శనార్థం నాచ్నే శిరిడీ వెళ్ళాడు. మధ్యాహ్నం మసీదు కెళ్ళి బాబా వద కూర్చోగానే, బాబా అక్కడున్న అన్నాచించినీకర్ కు నాచ్నేను చూపిస్తూ, “అన్నా నేనొక్క క్షణం ఆలస్యం చేసివుంటే ఆ పిచ్చివాడు ఇతణ్ణి చంపేసేవాడే. ఆ పిచ్చివాడు ఇతని మెడ పట్టుకొని పిసుకుతుంటే నేనే అతని పట్టు నుండి ఇతణ్ణి విడిపించాను. నా బిడ్డల్ని నేను రక్షించకుంటే మరెవరు కాపాడుతారు?” అన్నారు.
అతి తెలివి
మా పక్కింట్లో నివసించే శ్రీఆనందరావు కృష్ణచౌబాల్ తన తల్లిగారిని తీసికొని, ఒకసారి నాతోపాటు శిరిడి వచ్చాడు. చౌబాల్ తల్లి చాలా సమర్థురాలు, తెలివైనది. ఆమె “బాబాకు 8 అణాలు దక్షిణ ఇద్దాం” అని, తన కుమారుడి ఒక రూపాయకు చిల్లర తెప్పించింది. ఆ వచ్చిన రెండు పావలా కాసులు, ఒక అర్థరూపాయి కాసులలో, దగ్గర కెళ్ళినప్పుడు ఒక్క పావలా కాసు మాత్రం బాబాకిచ్చి వెనక్కు మళ్ళింది. బాబా ఆమెను వెనక్కు పిలిచి, "మిగతా ఆ పావలా ఇవ్వకుండా ఎందుకమ్మా యీ పేద బ్రాహ్మణుణ్ణి మోసగిస్తావ్?” అన్నారు. ఆమె సిగ్గు పడి మిగతా దక్షిణ కూడా సమర్పించింది.
శిరిడీ మాఝే పండరిపూర్!
శంకర్రావు తల్లిగారు ఒకసారి శిరిడి "చూచుకొని, అక్కడ నుండి పండరిపురం తదితర పుణ్యక్షేత్రాలు దర్శించునుకొన్నది. అనుకొన్న ప్రకారం ముందు శిరిడీ వెళ్ళింది. ఆమె బాబా దర్శనం చేసుకొన్న తరువాత, బాబా ఆమెను పిలిచి, “ఇంటికి తిరిగి వెళ్ళు! ఊదీ తీసుకొని మరీ వెళ్ళు! ” అన్నారు. ఆమె దాంతో తన పండరియాత్ర మానుకొని శిరిడీయే తన పండరి అనుకొని మరలింది. ఇంటికొచ్చి, ఇంట్లో వారికి బాబా ప్రసాదం పంచుదామని, పెట్టె తీసి ఊదీ పొట్లాం విప్పేసరికి ఏముంది? ఆ పొట్లాంలో ఊదీ లేదు. దానికి బదులు పండరి క్షేత్రంలో ప్రసాదంగా ఇచ్చే సువాసనతో కూడిన 'బుక్కా' వుంది. ఆమె, “అర్రె, బుక్కా ఎలా వచ్చింది? ఊదీ ఏమైంది?” అని ఆశ్చర్య పోతుంటే “శిరిడీయే నీ పండరి అన్నావు కదమ్మా? అది అక్షరాల నిజం. బాబా నీకు సరైన ప్రసాదమే ఇచ్చారు” అన్నాం మేము.
మాటిచ్చి, అశ్రద్ధ చూపకు!
1915లో ఒకసారి మేము శిరిడీ బయలుదేరాం. అప్పుడు నాతో నా భార్య, అత్తగారు, శంకర్రావు కూడా వచ్చారు. దారిలో మాకు బేసిన్ లో వెటర్నరీ సానిటరీ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న వాసుదేవ సీతారాం సామంత్ కలిసారు. మేము శిరిడీ వెళ్తున్నామని తెలిసి, నా చేతికి రెండణాలు ఇచ్చి, “ఈ పైకంతో కొబ్బరికాయ, కర్పూరం, అగరుబత్తి కొని నా తరఫున బాబాకు సమర్పించండి” అన్నాడు. సరేనని నేను పైకం తీసుకొన్నాను. మేము శిరిడీ నుండి తిరుగు ప్రయాణమై, బాబా దగ్గర శలవు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు బాబా నాతో, “మంచిది. వెళ్లేటప్పుడు చితలీ మీదుగా వెళ్ళు! , కానీ ఆ రెండణాలు యివ్వకుండా ఈ పేద బ్రాహ్మణ్ణి ఎందుకు మోసం చేస్తావ్?” అన్నారు. అప్పుడు నాకా రెండణాల విషయం గుర్తొచ్చి, వెంటనే రెండణాలకు టెంకాయ, కర్పూరం, ఊదుబత్తి కొని బాబాకు సమర్పించాను. అప్పుడు బాబా నేను వెళ్ళడానికి శలవిస్తూ, “వెళ్లిరా! కానీ, ఏదైనా ఒకపని చేస్తానని ఒప్పుకుంటే, శ్రద్ధగా చెయ్యి లేకపోతే అసలు మాటివ్వనేవద్దు!” అన్నారు.
తరువాయి భాగం రేపు
మూలం : సాయిపథం వాల్యూమ్ -1