కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - 16వ భాగం
శ్రీ హరిసీతారామ్ దీక్షిత్ గారు వ్రాసి ఉంచిన అనుభవాలు.
అనుభవం - 3
బాపూజీశాస్త్రి గుళవి 1918 ఫిబ్రవరి నెలలో బాబా దర్శనానికి వచ్చారు. ఆయన వచ్చేటప్పుడు గోదావరి నీళ్ళను తీసుకువచ్చారు. ఆ జలంతో బాబాకు యథోచితంగా అభిషేకం చేసుకోవాలని వచ్చారు. ఆ తరువాత శాస్త్రిగారు శ్రీరామదాస నవమి కోసం సజ్జన్ గడ్ కు వెళ్ళేందుకు అనుమతి అడిగారు. బాబా అనుమతిని ప్రసాదించి, “అక్కడా నేనే ఉన్నాను, ఇక్కడా నేనే ఉన్నాను” అని చెప్పారు. శాస్త్రిగారు సజ్జన్ గడ్ కు వెళ్ళాక దాసనవమి రోజు తెల్లవారుఝామున 5 గంటలకు బాబా, శాస్త్రి గారికి ప్రత్యక్ష దర్శనాన్ని ప్రసాదించారు. అంతేకాదు, శాస్త్రిగారు బాబా పాదాలను స్పర్శించి నమస్కరించుకున్నారు. తరువాత బాబా అదృశ్యం అయ్యారు.
అనుభవం - 4
రావ్ బహదూర్ సాఠెగారి వాడా నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభమైనాయి. ముందు, ముందు వాడా నిర్మాణానికి వేపచెట్టు అడ్డువస్తుందని, వారు వెళ్ళి ఆ చెట్టు కొట్టేసేందుకు అనుమతిని అడిగారు. అప్పుడు బాబా "మనం చెట్టు ఎందుకు కొట్టెయ్యాలి?” అని అన్నారు. తరువాత పని చాలా వరకు పూర్తయ్యాక, వేపచెట్టులో కొంత భాగం పనికి అడ్డు రాసాగింది. అప్పుడు వెళ్ళి బాబాను మరలా అనుమతిని అడిగారు. అప్పుడు బాబా “అడ్డం వచ్చినట్లయితే కొట్టి పారేయాల్సిందే. ఎంతవరకు అడొస్తే అంత భాగం మాత్రమే కొట్టేయండి” అని చెప్పారు.
అనుభవం - 5
బాబా యొక్క భక్తులు ఒకరు విపరీతంగా అప్పులపాలయ్యారు. ఒక షావుకారు తనను జప్తు చేసేందుకు ఉత్తర్వులు తీసుకువచ్చారు. ఆ సమయానికి ఆ భక్తుని వద్ద డబ్బులు ఏర్పాటు చేసే అవకాశం లేదు. అయినప్పటికీ కొంత సంపాదన ఉండేది. ఏం చేసినా షావుకారు ఆగేట్టు లేడు. ఇంతలో భక్తులందరూ కలసి ఆ భక్తుని ఇంట్లో ఉన్న బాబా చిత్రపటం ముందు నామసప్తాహం చేసే ఆలోచన చేసారు. ఆ భక్తుడు కూడా ఎంతో ఆనందంతో అందుకు ఒప్పుకున్నారు. ఇదే మంచి అవకాశం అని షావుకారు అనుకున్నాడు. తాను వెనువెంటనే జప్తు వారంట్ విడుదల చేయించుకుని, కోర్టు గుమస్తాను తీసుకొని ఆ భక్తుని ఇంటికి వెళ్ళారు. నామసప్తాహం జరుగుతోంది. అప్పులపాలైన ఆ భక్తుడు షావుకారు వద్దకు వెళ్ళి “మంచిది, మీకు అనిపిస్తే సామానును తీసుకుపోండి. నామసప్తాహం కోసంగా మా ప్రయోజనార్థమై బాబా స్థలాన్ని ఖాళీ చేయించి ఇచ్చారని అనుకుంటాము. అంతా ఆయన ఇచ్చ ప్రకారమే జరుగుతుంది” అని అన్నారు. ఆ మాటలకు ఆ షావుకారుకు ఎంత పశ్చాత్తాపం కలిగిందంటే, షావుకారు ఆ వారెంటు ను వెంటనే రద్దు చేయించారు. మరలా ఎప్పుడూ వారెంట్ ను తీసుకొనలేదు.
అనుభవం -6
హరిద్వార్ కు చెందిన భక్తుడు ప్రతిరోజు ఉదయం పూట దర్బారులో బాబా ఎదురుగా స్తంభం వద్ద కూర్చొనేవాడు. ఒకసారి తాను రావడం ఆలస్యమైంది. అమ్మాయి ఆ స్తంభం వద్ద ఆ భక్తుడు ఎప్పుడూ కూర్చొనే చోటులో కూర్చొని ఆ భక్తుడు వచ్చినాసరే ఆ అమ్మాయి ఆ చోటు నుండి లేవలేదు. అప్పుడు అమ్మాయిని లేవమని చెప్పడంతో ఆ అమ్మాయి అక్కడ నుండి లేచింది. అప్పుడు భక్తుడు ఆ స్థలంలో కూర్చొన్నాడు. బాబా తనను ఐదు నిమిషాలు కూర్చోనిచ్చి తరువాత “వెళ్ళి క్రింద సభామండపంలో కూర్చో” అని ఆజ్ఞాపించారు. తరువాత కొంచెం సేపటికి తాను మరలా పైకి వచ్చి, తన చోటులో కూర్చోబోతుండటంతో బాబా మరలా తనను “క్రిందకు వెళ్ళి కూర్చోమని” చెప్పారు. ఆ అమ్మాయిని అక్కడ నుండి లేపినందుకు “బాబా నాకు ఈ విధంగా గుణపాఠం చెపుతున్నారు” అని తనకు అర్థమైంది.
అనుభవం - 7
నేను ఒకసారి నవరాత్రులు ప్రారంభమైనాక నాగపూర్ నుండి బయలుదేరి శిరిడీకి వెళ్ళాను. దసరా అక్కడే జరిగింది. భక్తులందరూ బాబాకు రకరకాల పండ్లు, మిఠాయిలు సమర్పించుకుంటున్నారు. నా వద్ద పండ్లు లేవు. నా పూజ ఎప్పటిలాగే సాధారణంగా జరిగింది. ఏవైనా పండ్లు ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. కొంచెం సేపటికి బాబా అందరికీ ద్రాక్షపండ్లు పంచి పెట్టారు. నాకు కూడా కొన్ని ఇచ్చారు. బాబా అన్ని పండ్లను పంచేసారు. తమకోసం ఒక్క పండును కూడా పెట్టుకోలేదు. అది చూసి నాకు వచ్చిన ద్రాక్షపండ్లలో కొన్ని బాబాకు ఇవ్వాలి అని నాకు అనిపించింది. ఆ విధంగానే చేసాను. బాబా నేను ఇచ్చిన ద్రాక్షపండను తీసుకొని తిన్నారు. దాంతో నాకు చాలా ఆనందం వేసింది. అర్థమేమిటంటే దసరా పూజకు సంబంధించి నాకు అనిపిస్తున్న లోటును తీసివేసి, నాకు ఆనందాన్ని ప్రసాదించారు.
సోర్సు : సాయిభక్త శ్రీకాకాసాహెబ్ దీక్షిత్ డైరీ by విజయ్ కిషోర్.