ఈరోజు భాగంలో అనుభవం:
- బాబా రాకతో నా జీవితం పరిపూర్ణమైంది
ఖతార్ నుండి సాయిభక్తుడు సోలై కన్నన్ తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు.
నాకు 54 సంవత్సరాలు. నేను నా కుటుంబంతోపాటు 28 ఏళ్లుగా మధ్య ఆసియాలో నివసిస్తున్నాను. ముందుగా అందరినీ క్షమాపణలు వేడుకుంటున్నాను. ఎందుకంటే, నేను చెప్పబోయే అనుభవం చాలా పెద్దగా ఉంటుంది. మొదటినుంచి నాకు ఆధ్యాత్మిక భావాలు ఉన్నప్పటికీ నేనెప్పుడూ మతపరమైన విషయాలలో, దేవుళ్ళు, మహాత్ములకు సంబంధించిన విషయాలలో పాల్గొనలేదు. కనీసం ఒక్కసారి కూడా కుటుంబసభ్యులతోనైనా గుడికి వెళ్ళలేదు. ఎప్పుడూ భగవంతుని ప్రార్థించలేదు, కోరికలు తీర్చమని అడగలేదు. ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు, మహాత్ములకు సంబంధించిన పుస్తకాలు చదివాను కానీ, సాయిబాబా నా జీవితంలోకి వచ్చేవరకు ఏ దేవునికి, మహాత్మునికి దగ్గర కాలేదు.
2018లో మా పిల్లలు ఉద్యోగం, చదువులంటూ మానుండి చాలా దూరంగా వెళ్లారు. అందువలన నాకు, నా భార్యకు చాలా ఖాళీ సమయం దొరికింది. దాంతో నాకు మొదటినుంచి ఉన్న పెయింటింగ్ హాబీని బయటకు తీసాను. నా భార్య పెయింటింగ్ ఎప్పుడూ చేయకపోయినా తనకి కూడా దానిపట్ల ఆసక్తి ఉంది. ఇక ఇద్దరం కలిసి సమయాన్ని నాశనం చేయడం మొదలుపెట్టాము. నా భార్య దేవుళ్ళ పెయింటింగ్స్ వేయడం మొదలుపెట్టింది. నేను తనకు సహాయం చేస్తూ, ఫైనల్ టచ్ ఇస్తూ ఉండేవాడిని. శ్రీరాఘవేంద్రస్వామి, అయ్యప్పస్వామి పెయింటింగ్స్ చేశాక సాయిబాబా పెయింటింగ్ వేయాలని నా భార్య అనుకుంది. ఆమెకి ఇతర దేవుళ్ళు, మహాత్ముల గురించి తెలిసి ఉన్నా సాయిబాబా గురించి మాత్రం అంత లోతుగా తెలీదు. అలాంటిది సాయిబాబా పెయింటింగ్ తానెందుకు వేయాలనుకుందో తనకే తెలియదు. నేను తనతో, "చాలా ఏళ్ల క్రితం నాటి దేవుళ్ళు, మహాత్ముల ఒరిజినల్ ఫోటోలు అందుబాటులో లేవు, వాళ్ళు ఖచ్చితంగా ఎలా ఉండేవాళ్ళో ఎవరికీ తెలియదు. కాబట్టి వాటిని మనం పెయింటింగ్ ఎలా చేసినా పర్వాలేదు కానీ, సాయిబాబా విషయం అలా కాదు. ఆయన ఇటీవల కాలంలో నివసించారు. ఆయన ఫోటో మనకు అందుబాటులో ఉంది. కాబట్టి మనం ఒకవేళ ఆయన ఒరిజినల్ ముఖాన్ని ఉన్నది ఉన్నట్లుగా పెయింటింగ్ చేయలేకపోతే దానిని మనం అవతల పారవేయలేము, అలా అని ఉంచుకోనూలేము" అన్నాను. అందుకు ఆమె సమ్మతించి పెయింటింగ్ చేయడం మానుకుంది.
కొన్నిరోజుల తరువాత నేను ఆఫీసునుండి ఇంటికి వచ్చాక ఆమె నాతో, "ఏదో తెలియని శక్తి నన్ను పురికొల్పింది, అందువలన సాయిబాబా పెయింటింగ్ మొదలుపెట్టాను" అని చెప్పింది. ఆమె అప్పటికే మొదలుపెట్టి ఉండటంతో నేను ఇంకేమీ అనకుండా తనని ప్రోత్సహించాను. కానీ బాబా ముఖం బాగా రాలేదు. దానితో నేను సరిచేయడానికి కొంత టచప్ వర్క్ చేశాను. తనకంటే బాగా చేశానని చెప్పలేను కానీ ఆ వర్క్‌లో నేను కూడా పాలుపంచుకున్నాను. తరువాత ఆ పెయింటింగ్‌కి ఫ్రేమ్ కట్టించి మా ఇంటిలో ఒకచోట గోడకి తగిలించాము. గోడకు తగిలించాక గమనిస్తే, సాయిబాబా మా ఇంటిలో ఒక ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించినట్లు అనిపించింది. ఎందుకంటే, ఇంటిలో ఏ మూల, ఏ చోట నిల్చున్నా మా దృష్టి ఆయనపై ఉండేలా ఉంది. అయినా నేను సాయిబాబాకు దగ్గర కాలేదు. కేవలం ఫోటో బాగా వచ్చింది అన్న భావన మాత్రమే!
2018 ఫిబ్రవరిలో మా అమ్మగారి కంటి ఆపరేషన్ ఉండటంతో నా భార్య ఇండియా వెళ్ళింది. నేను ఒంటరిగా ఉన్నాను. ఆ సమయంలో నేను ప్రొస్టేట్ సమస్యతో బాధపడుతున్నాను. మూత్రవిసర్జన చేసే సమయంలో వచ్చే నొప్పి వలన నాకు నరకంలా ఉండేది. ఒకరోజు నేను ఆ భరించరాని బాధని అనుభవిస్తూ మూత్రవిసర్జన చేసి బాత్రూం నుండి బయటకు వచ్చి తలెత్తి సాయిబాబా పెయింటింగ్‌ని చూసాను. సాయిబాబా నన్ను చూసి నవ్వుతున్నారు. అదే సమయంలో ఏదో తెలియని శక్తి నన్ను కుదిపేస్తున్నట్లు అనిపించింది. తరువాత కొంతసేపటికి నేను పెయింటింగ్ వైపు చూస్తూ బాత్రూంకి వెళ్ళాను. భయపడుతూనే మూత్రవిసర్జనకు పూనుకున్నాను. నేను భయపడినట్లుగానే నొప్పి భరించలేనంతగా ఉంది. ఆ సమయంలో నేను, "సాయిబాబా! ఈ నొప్పి గనక పోయినట్లయితే నేను నా ఆలోచనలన్నీ వదిలిపెట్టి నిన్ను నమ్ముతాను. ఇకపై నిన్ను పూజిస్తాను" అని చెప్పుకున్నాను. ఆ క్షణంనుండి కొంచెం కొంచెంగా నొప్పి తగ్గుతూ వారంలో పూర్తిగా తగ్గిపోయింది. అప్పటినుండి ఇప్పటివరకు మళ్ళీ నాకు ఆ సమస్య రాలేదు. ఈ సంఘటన నన్ను బాబాకు దగ్గర చేసింది. మరీ అంత దగ్గర కాలేదు గాని, అప్పుడప్పుడు పెయింటింగ్ వైపు చూస్తూ బాబాకు కృతజ్ఞతలు తెలుపుకుంటుండేవాడిని.
మార్చి నెల మొదటివారంలో నా భార్య తిరిగి ఇంటికి వచ్చింది. కొద్దిరోజులలో తన కంటి సమస్యకు లేజర్ చికిత్స చేయించుకుంది. అందువలన తనకి బాధగా ఉండి, దేనినీ చూడలేకపోయేది. పెయింటింగ్ మీద కూడా దృష్టి పెట్టలేకపోయింది. చికిత్స తరువాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోని కారణంగా మరికొన్ని సమస్యలు వచ్చాయి. దానివలన తను కళ్ళు తెరవలేకపోయేది. దానితో చాలా ఆందోళనపడుతూ ఉండేది. ఇలా ఒక నెల గడిచాక తను ఆ ఆందోళననుండి బయటకి రావాలని పెయింటింగ్ చేయమని బలవంతపెట్టాను. ఆమె, "ఈ కంటి సమస్యతో అది అసాధ్యమ"ని చెప్పింది. తరువాత ఒకరోజు నేను ఆఫీసునుండి వచ్చేసరికి తను పెయింటింగ్ మొదలుపెట్టింది(ఆరోజు జరిగిన మరో అనుభవాన్ని చివరిలో చెప్తాను). ఈసారి పెయింటింగ్ కేవలం బాబా ముఖానికి సంబంధించింది. పూర్తి క్లోజప్ ఫోటో కావడంతో పెయింటింగ్ సరిగా రాలేదు. దానితో నేను దానిపై అదనంగా కొంత వర్క్ చేయడం మొదలుపెట్టాను. అయితే ఈసారి పెయింటింగ్ చేసేటప్పుడు నేను పొందిన అనుభూతి ప్రత్యేకమైంది. పెయింటింగ్ చేస్తూ గాఢంగా బాబాతో అనుసంధానించబడ్డాను. భక్తితో పనిచేశాను అనలేను కానీ, పెయింటింగ్ పనిని పూర్తిగా ఆస్వాదించాను. పెయింటింగ్ చాలా బాగా వచ్చింది. పెయింటింగ్ చేస్తున్నంతసేపూ బాబాలో పూర్తిగా లీనమైపోయాను.
ఆ రెండు పెయింటింగ్స్ ద్వారా సాయిబాబా కృపతో నాకు ఆయనపై గురి కుదిరింది. నేను ఆయన గురించి, ఆయన జీవితం గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాను. అదే సమయంలో "మేరే సాయి" టివి సీరియల్ కూడా చూస్తుండేవాడిని. ఆయన గురించి తెలుసుకుంటున్నకొద్దీ నా మనస్సు ఆయన యందు ఇంకా ఇంకా లీనమైపోతుండేది. నేను ఎంతోమంది మహాత్ముల గురించి చదివాను కానీ, ఎవరిపట్లా నాకు పరిపూర్ణత్వ భావం కలగలేదు. వాళ్లంతా ఎక్కడో ఒకచోట రాజీపడుతున్నట్లు లేదా పరిమితమవుతున్నట్లు అనిపించింది. కానీ సాయిబాబా విషయం అలా కాదు. ఆయన కరుణామయుడు, పరమదయాళువు. ప్రజలకు సేవ చేయడంలో, సహాయం చేయడంలో, మత గ్రంథాలు బోధించడంలో ఆయన ఎక్కడా దేనికీ లొంగినట్లు కనిపించలేదు.
నిదానంగా నేను అన్ని విషయాలలో బాబాకు ఆకర్షితుడనయ్యాను. దాంతో వీలైనంత త్వరగా శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకోవాలని కోరిక కలిగింది. ఆగష్టులో సంవత్సరాంతపు సెలవులు ఉండటంతో ఎలాగైనా ఆ సమయాన్ని శిరిడీ వెళ్లడానికి ఉపయోగించుకోవాలని అనుకున్నాను. కానీ నా భార్యకు పిల్లలతో ఏవో అత్యవసర పనులుండటంతో తను యూరోప్ వెళ్లాలని పట్టుబట్టింది. ఇక నేను సరేనని అందుకు కావలసిన ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టాను. కానీ యూరోప్ వెళ్లడానికి చేసే ప్రతి పనిలో ఏదో ఒక అవాంతరం వస్తూ ఉండటంతో సాయి శిరిడీ రమ్మని పిలుస్తున్నారని నాకనిపించి యూరోప్ వెళ్లే ప్రయత్నం మానుకుని శిరిడీ వెళ్ళడానికే నిశ్చయించుకున్నాను. మాతోపాటు నా తల్లిదండ్రులను, నా భార్య తల్లిదండ్రులను కూడా తీసుకుని వెళ్లాలని అనుకున్నాను. వాళ్లందరికీ చాలా పెద్ద వయస్సు, దాదాపు అందరూ 76 నుండి 85 మధ్య ఉంటారు. అందువలన స్నేహితులు, బంధువులు, "అంత దూరప్రయాణం పెద్దవాళ్లకు చాలా శ్రమతో కూడుకున్నది" అని చెప్పారు. కానీ నేను ఎలాగైనా వాళ్లని తీసుకుని శిరిడీ వెళ్ళాలని అనుకున్నాను. అయితే వాళ్ల ఆహార విషయం నన్ను వేధిస్తూ ఉండేది. బయట పదార్థాలు వాళ్లకి సమస్యలు సృష్టిస్తాయేమోనని భయపడ్డాను. అయినా వాళ్లు తినేది ఒక్కపూటే కదా, ఇండక్షన్ స్టవ్ లేదా రైస్ కుక్కర్ తీసుకుని వెళ్తే సరిపోతుందన్న ఆలోచనతో ధైర్యం చేసి నాలుగు రోజులు శిరిడీలో ఉండేలా ప్లాన్ చేసాను. కానీ నా ఆలోచన ఆచరణలో పెట్టడం సాధ్యపడలేదు. దాంతో నేను చాలా టెన్షన్ పడ్డాను. అయితే బాబా మాపట్ల దయ చూపించారు. మా శిరిడీ ప్రయాణానికి ఒక్కరోజు ముందు నా మేనల్లుడు ఫోన్ చేసి, "మా ఊరికి చెందిన కొంతమంది శిరిడీలో ఉండి స్వయంగా వంటచేసి సాయిభక్తులకు పెడుతున్నారు" అని చెప్పాడు. ఈ విధంగా బాబా నాకు సమాచారమిచ్చి నా టెన్షన్ తీసేసారు. శిరిడీలో మేమున్న నాలుగు రోజులూ అక్కడే భోజనాలు చేసాము. పెద్దవాళ్లకెవరికీ ఎటువంటి ఇబ్బందీ కలగలేదు. అలా ఆ సమస్యకు బాబా పరిష్కారం చూపించారు.
ఆ ట్రిప్‌లో బాబా ఇంకొక మధురమైన అనుభూతి కూడా ఇచ్చారు. నేను కొత్తగా సాయిభక్తుడనయ్యాను, శిరీడీ నాకు కొత్త. ఎప్పుడూ ఎవరితో సాయిబాబా గురించి గానీ, శిరిడీ గురించి గానీ నేను మాట్లాడలేదు. నేరుగా దోహా నుండి శిరిడీ చేరుకున్నాను. ఆన్లైన్లో ఆరతికి బుక్ చేసుకోవచ్చని నాకు తెలీదు. శిరిడీ చేరాక, "కాకడ హారతికి ఎలా వెళ్లాల"ని చాలామందిని అడిగాను. "రాత్రి 11 సమయంలో క్యూలోకి వెళ్ళమ"ని వాళ్ళు చెప్పారు. కానీ పెద్దవాళ్లతో ఆ సమయంలో వెళ్లడం నాకు సాధ్యపడలేదు. మొదటి రెండురోజులు దాని గురించి విచారిస్తూనే సరిపోయింది. తర్వాత వి.ఐ.పి. కౌంటర్ ద్వారా వెళ్లొచ్చని తెలిసింది. నాకున్నది ఒకే ఒక్కరోజు. పైగా ఆ రోజు గురువారం కావడంతో చాలా రద్దీ ఉంటుందని, హారతికి వెళ్లడం చాలా కష్టమని చాలామంది చెప్పారు. కానీ నేను ఎలాగైనా ఆరతికి వెళ్లాలని విఐపి కౌంటర్ కి వెళ్లాను. కానీ వాళ్లు, "ఇప్పటికే పరిమితికి మించి బుక్ కావడం వలన మేమేమీ చేయలేమ"ని చెప్పారు. నేను అక్కడ ఉన్న సిబ్బందిని చాలా చాలా అభ్యర్థించాను. తను తన పై ఆఫీసర్ ని అడిగి, అంతా చెక్ చేసిన మీదట, 'ఎటువంటి అవకాశం లేదు' అని చెప్పారు. కానీ నేను ఆశ వదులుకోకుండా అక్కడేవుండి పదేపదే ఆ కౌంటర్ స్టాఫ్‌ని అభ్యర్ధించాను. కానీ ప్రయోజనం లేకపోయింది. క్యూలో ఉన్నవాళ్లు లోపలికి వెళ్తూ ఉన్నారు. నేను వెనక నిల్చొని బాబా ఏదో ఒకటి చేస్తారని ఆశతో ఆయనను ప్రార్థించాను. కౌంటర్ దగ్గర ఉన్న వాళ్లంతా లోపలికి వెళ్ళాక నేను మళ్ళీ కౌంటర్ స్టాఫ్‌ని అడిగాను. ఆశ్చర్యం! వాళ్ళు ఏమీ మాట్లాడకుండా నా చేతిలో టిక్కెట్లు పెట్టారు. నేను పట్టరాని ఆనందంతో లోపలికి ప్రవేశించాను. నేను పొందిన ఆనందాన్ని, అనుభూతిని నేను ఎప్పటికీ మరిచిపోలేను.
రెండవసారి నా భార్య పెయింటింగ్ మొదలుపెట్టినరోజు జరిగిన అనుభవం చివరిలో చెప్తానన్నాను కదా! ఆరోజు నేను హెల్త్ చెకప్‌కి వెళ్లాను. కారణం, నేను కొన్ని రోజులుగా అధిక బరువుతో ఎప్పుడూ సోమరిగా ఉంటూ తలనొప్పితో బాధపడుతున్నాను. కొన్ని పరీక్షల ద్వారా నా శరీరంలో అధిక గ్లూకోజ్, హై బీపీ, హై కొలెస్ట్రాల్ ఉన్నట్టు తెలిసింది. 8 నెలల క్రితం నార్మల్‌గా ఉన్నది కాస్తా ఇప్పుడు ఇంత తేడా కనిపించడంతో నేను షాకయ్యాను. అదలా ఉంటే, బాబా నా కళ్ళకి నేను తీసుకోవలసిన కొన్ని ఆహారపదార్థాలను చూపించారు. నేను వాటిని రోజూ తీసుకోవడం మొదలుపెట్టాను. నా శిరిడీ ప్రయాణానికి ఒక్కరోజు ముందు నేను మళ్లీ హాస్పిటల్‌కి వెళ్లి చెకప్ చేయించుకున్నాను. ఆ రిజల్ట్స్ నేను శిరిడీ ప్రయాణంలో ఉండగా ఈ-మెయిల్ ద్వారా వచ్చాయి. ఆశ్చర్యం! బాబా కృపవలన అంతా నార్మల్ గా ఉంది.
ఆ పెయింటింగ్స్ రూపంలో బాబా కేవలం మా ఇంట్లోకే కాదు, మా హృదయాలలోకి ప్రవేశించారు. ఆయన మా హృదయమందు కూర్చుని ఆశీర్వదిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నారు. ఆయన మాకు తల్లి, తండ్రి, గురువు, సర్వము. ఆయన తన చేయి ఎప్పుడూ నా భుజంపై ఉంచి నాకెన్నో విషయాలు నేర్పిస్తూ, నాచేత చేయిస్తున్నారు. సాధారణంగా దేవుడు లేదా మహాత్ముల వద్దకు అందరూ వెళ్తుంటారు. కానీ మేము అదృష్టవంతులం. బాబా మా జీవితంలోకి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారు. ఇదంతా నన్ను భక్తిమార్గంలోకి తీసుకురావడానికి ఆయన చేసిన చిన్న ప్రయత్నమే అని నాకు తెలుసు. నేను తెలుసుకోవాల్సింది చాలా ఉంది. బాబా రాకతో నా జీవితం పరిపూర్ణమైంది. ఆయనతో అనుబంధం ఎంతో కొత్తగా, అద్భుతంగా ఉంది.