సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - మొదటి భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ

శ్రీసాయిబాబాను సన్నిహితంగా సేవించిన భక్తులలో ఇద్దరు మాత్రమే బాబాతో తమకు గల అనుభవాల గురించి డైరీ వ్రాసుకున్నారు. వారు శ్రీజి.యస్.ఖపర్డే, శ్రీకాకాసాహెబ్ దీక్షిత్. శ్రీ ఖపర్డే 'శిరిడీ డైరీ' చాలామంది సాయిభక్తులకు సుపరిచితమే. శ్రీ ఖపర్డే ఇంగ్లీషులో వ్రాసుకున్న డైరీని మొదట శ్రీబి.వి.నరసింహస్వామి ప్రచురించారు. తర్వాత అది 'సాయిలీల' (ఇంగ్లీషు) పత్రికలో (1985-86) ధారావాహికంగా ప్రచురింపబడి, ఇప్పుడు శిరిడీ సంస్థానం వారి వద్ద పుస్తక రూపంలో లభిస్తోంది. కాని, కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ మాత్రం చాలామంది సాయిభక్తులకు(ముఖ్యంగా తెలుగువారికి) 1988 నాటికి అలభ్యంగానే ఉంది. శ్రీదీక్షిత్ తన డైరీని మరాఠీ భాషలో వ్రాసుకున్నారు. ఆ డైరీలో తాను 1909లో బాబాను దర్శించిన లగాయతు బాబా మహాసమాధి చెందేంతవరకూ, ఆ తర్వాత 1926లో ఆయన మరణించే ముందుదాకా కూడ తాను చూచిన, విన్న బాబా లీలలను వ్రాసుకున్నారు. ఆ డైరీ యొక్క ఆంగ్లానువాదం మద్రాసు నుండి చాలాకాలం క్రితం ప్రచురింపబడింది. కానీ, ఆ పుస్తకం ఇప్పుడు లభ్యం కావటంలేదు.

బాబాను ప్రత్యక్షంగా సేవించిన యన్.పి.అవస్థే గారి వద్దనుండి ఆ పుస్తకం యొక్క ప్రతి పూనాకు చెందిన యస్.యమ్.గార్జే అను సాయిభక్తునికి లభించింది. అక్కడక్కడ చెదలు తిని మొదటి, చివర రెండు పేజీలు పూర్తిగా చినిగిపోయివున్న ఆ పుస్తకాన్ని 1977లో శ్రీగార్జే 'శ్రీసాయిలీల’ ఎడిటర్ దృష్టికి తీసుకువచ్చారు. చిత్రమేమిటంటే శ్రీశిరిడీ సంస్థానం వారి అనుమతితో ఆ డైరీని ఇంగ్లీషులోనికి అనువదించి ప్రచురిస్తున్నట్టుగా ఆ పుస్తకం ఉపోద్ఘాతంలో అనువాదకుడు వ్రాసివున్నా, ఆ పుస్తకం మరో ప్రతి సంస్థానం గ్రంథాలయంలోగాని, మరెక్కడగానీ లభించలేదు. మొదటి, చివర పేజీలు చినిగిపోయి ఉండడంవల్ల ప్రచురణకర్తకు సంబంధించిన వివరాలు తెలియలేదు. సుమారు 140 పేజీలున్న ఆ డైరీలో 121 వివిధ సంఘటనలు, బాబా లీలల గురించి వ్రాయబడివుంది. అవి యెంతో ఆసక్తిదాయకమైనవే కాక, శ్రీసాయిచరిత్రను గురించి ఎన్నో కొత్త విషయాలు వెలుగులోకి తెస్తాయి. ఆ డైరీలోని కొన్ని భాగాలు 1977-78లో 'సాయిలీల'(ఇంగ్లీషు) పత్రికలో సీరియల్ గా ప్రచురింపబడ్డాయి. ఈ డైరీ గురించి దాని ఆంగ్లానువాదకుడు తన ఉపోద్ఘాతంలో యిలా వ్రాస్తున్నారు - "... ఈ డైరీ బాబా జీవితచరిత్ర గురించి సమాచారాన్నందించే మొట్టమొదటి ఆధారం. పెప్సీ యొక్క, యావలిన్ యొక్క డైరీలు వారివారి కాలాలకు సంబంధించి ఆంగ్లేయుల చరిత్ర రచనకు ఎలా ఉపయోగపడ్డాయో, అలాగే శ్రీహెచ్.యస్.దీక్షిత్ మరాఠీలోను, శ్రీజి.యస్.ఖపర్డే ఇంగ్లీషులోను వ్రాసుకున్న డైరీలు శ్రీసాయి చరిత్రకు విలువైన ఆధారాలు. బాబా లీలలను జాగ్రత్తగా అధ్యయనం చేస్తే సాధకులు తమ గమ్యం చేరడానికి బాబా ఎలా దోహదం చేసేవారో విశదపడుతుంది. దీక్షిత్ డైరీ చదివే ఏ పాఠకునికైనా అదే లక్ష్యం కావాలి..." దీక్షిత్ డైరీ ఎంతో విలువైనది. ముఖ్యంగా క్రొత్తగా బాబా రక్షణలోకి వచ్చిన భక్తులకు ఇది ఎంతో సహాయకారి. తన భక్తుల యోగక్షేమాల బాధ్యత పూర్తిగా తానే వహిస్తానని బాబా యిచ్చిన హామీ కాకాసాహెబ్ దీక్షిత్ కు మాత్రమే పరిమితం కాదు. కానీ, (దీక్షిత్, ఖపర్డేలు తప్ప) బాబాను ప్రత్యక్షంగా సేవించి అలాంటి రక్షణే  పొందిన దాసగణు వంటి చాలామంది ఇతర భక్తులు తమ అనుభవాలను, తమ ఆధ్యాత్మిక పురోగతిని డైరీ రూపంలో గ్రంథస్థం చేసుకోకపోవడం శోచనీయం. ఉపాసనీ బాబా కూడా ఎన్నో ఏళ్ళు బాబా పూర్తి సంరక్షణలో ఉన్నారు. కానీ, దురదృష్టవశాత్తు ఉపాసనీబాబా క్రమబద్ధమైన డైరీ వ్రాసుకోకపోవడమేకాక, తరువాతి రోజుల్లో తాము మొదట ఏ సంవత్సరంలో బాబా వద్దకు వచ్చారో, బాబా వద్ద ఎంతకాలం ఉన్నారో కూడా మర్చిపోయారు. ఉదాహరణకు బాబా ఆదేశానుసారం ఉపాసనీ జీవితచరిత్ర 'ఉపాసనీ లీలామృతం' వ్రాసిన రచయిత ఉపాసనీ బాబా నాలుగు సంవత్సరాలు బాబా ఆజ్ఞ ప్రకారం శిరిడీలో ఉన్నట్లుగా పేర్కొన్నాడు. కానీ, ఆ తరువాత ఖపర్డే డైరీ, బాలకృష్ణ ఉపాసనీశాస్త్రి వద్దవున్న ఉత్తరాల సహాయంతో చేసిన పరిశోధన వల్ల శ్రీఉపాసనీ మహరాజ్ శిరిడీలో ఉండమని బాబా పెట్టిన 4 సంవత్సరాల గడువు పూర్తి చేయలేదనీ, కేవలం 3సం||లు మాత్రమే - అంటే జూన్ 1911 నుండి జూన్ 1914 వరకు- శిరిడీలో ఉన్నారనే విషయం బయటపడింది. ఆ తరువాత ఆయన (శ్రీఉపాసనీ) ఎన్నో సందర్భాలలో శిరిడీ సందర్శించినా, బాబా విధించిన ఆ నాలుగు సంవత్సరాల గడువు మాత్రం పూర్తి చేయలేదు. ఖపర్డే, దీక్షిత్ డైరీల వంటి ఆధారాల వల్లనే శ్రీసాయిభక్తుల జీవితాలకు సంబంధించిన అధ్యయనంలో ఇటువంటి విషయాలు వెలుగులోకి రావడం సాధ్యపడుతుంది. చారిత్రక సత్యాల నిర్ధారణకు ఇటువంటి డైరీలు ఎలా ఉపయోగపడతాయో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే.

కానీ, జీవితచరిత్రలకు సంబంధించిన సంఘటనల నిర్ధారణకేగాక ఈ డైరీల అధ్యయనం వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయి. ఈ డైరీలలోని కొన్ని భాగాల ప్రత్యేక అధ్యయనం వల్ల కొందరు ఎలా తమ ఆరోగ్యం, లౌకిక ఆధ్యాత్మిక విషయాలలో పురోగతి సాధించారో, ఈ డైరీలు చదివిన పాఠకులు గమనించగలరు. దీక్షిత్, ఖపర్డే డైరీల వల్ల ఇంత ప్రయోజనం ఉంది కనుకే వాటిని అనువదించి ప్రచురిస్తున్నాం.

మహల్సాపతి, తాత్యా, నానాచందోర్కర్ తర్వాత బాబాను అత్యంత సన్నిహితంగా సేవించిన ప్రముఖ భక్తులలో హరిసీతారాం దీక్షిత్ ను పేర్కొనాలి. ఈయన సన్నిహితులు చాలామంది ఈయనను 'కాకా' (- అంటే 'మామా' అని అర్థం) అని పిలిచేవారు. శ్రీసాయిబాబా కూడా దీక్షిత్ ను 'కాకా' అని పిలవడంతో ఈయన పేరు కాకాసాహెబ్ దీక్షిత్ గానే అందరికీ సుపరిచితం. శ్రీదీక్షిత్ బొంబాయిలో ప్రఖ్యాత న్యాయవాది. న్యాయవాదవృత్తిలోనే కాకుండా, రాజకీయ సాంస్కృతిక రంగాలలో కూడా ప్రముఖవ్యక్తిగా పేరొందాడు. బొంబాయి శాసనమండలి సభ్యుడుగా, బొంబాయి కార్పొరేషన్ కౌన్సిలర్ గా, బొంబాయి కాంగ్రెసు కమిటీ కార్యదర్శిగా, ఇలా ఇంకా ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించాడు. 1906లో శ్రీదీక్షిత్ ఇంగ్లాండులో రైలు ఎక్కబోతూ, ప్రమాదవశాత్తూ ప్లాట్ ఫారంపై జారిపడ్డాడు. అప్పటినుండి కాలుబెణికి విపరీతంగా నొప్పిపెట్టసాగింది. ఎన్ని వైద్యాలు చేసినా ఫలితం లేకపోయింది. నానాసాహెబ్ చందోర్కర్ ద్వారా బాబా గురించి విని, 1909లో బాబాను దర్శించాడు.

శ్రీదీక్షిత్ మొదట బాబాను దర్శించింది తన కాలి బెణుకు నొప్పి తగ్గించుకోవడానికే అయినా, బాబా దర్శన మాత్రం చేతనే ఆయనలో ఎంతో పరివర్తన కలిగింది. బాబా వంటి సద్గురువును కాలినొప్పి వల్ల కలిగే దుఃఖాన్ని పోగొట్టమని అడిగేకన్నా, సంసార దుఃఖాన్నుండి విముక్తి కోరడం వివేకము, సముచితమూ అని తోచింది. అంతే! లక్షలు ఆర్జించి పెట్టే తన న్యాయవాదవృత్తినీ, సంసార వ్యాపకాలను త్యజించి, శిరిడీలోనే స్థిరపడి తన జీవితాన్ని సాయిసేవకు, ఆధ్యాత్మిక సాధనకు అంకితం చేసాడు. శ్రీదీక్షిత్ శిరిడీలో తన నివాసం కోసం నిర్మించుకొన్న భవనం, అప్పట్లో సాయిభక్తులకు వసతి గృహంగానూ, తరువాత శిరిడీ సంస్థానం వారి భోజనశాలగాను, తరువాత కొంతకాలం సంస్థానం వారి ఫలహారశాలగానూ, ప్రస్తుతం మ్యూజియంగా సద్వినియోగపడుతోంది. శ్రీదీక్షిత్ 1910 నుండి 1918లో బాబా మహాసమాధి అయ్యేంతవరకూ, ఆ తరువాత తాను 1926లో దివంగతులయ్యే వరకూ శిరిడీలోనే ఉండి శ్రీసాయికి అత్యంత సన్నిహిత భక్తునిగా, సాయిబాబా సంస్థాన గౌ||కార్యదర్శిగా 'సాయిలీలామాసిక్' పత్రిక ప్రధాన నిర్వాహకునిగా ఎంతో సేవచేసారు. “కాకా బరువు బాధ్యతలన్నీ నేనే వహిస్తాను” అని బాబా ఒకసారన్నారు. ఈ మాటలు శ్రీదీక్షిత్ అనన్యచింతనతో బాబాను ఎలా శరణుపొందాడో తెలుపుతాయి. "కాకా యోగ్యుడు. అతనిమాట ప్రకారం నడుచుకో!" అని బాబా ఒకసారి 'శ్రీసాయిసచ్చరిత్ర' రచించిన హేమాద్పంతును ఆదేశించారు. శ్రీసాయి అద్భుత మహిమామృతాన్ని, లీలలనూ, తాను చవిచూడటమే కాకుండా, ఎందరో భక్తులు బాబా నుండి పొందిన అనుభవాలను స్వయంగా చూచాడు, విన్నాడు. వాటిలో కొన్ని తన డైరీలో వ్రాసుకొన్నాడు. రేపటినుండి ఆ అనుభవాలను చదువుకుందాం.

సోర్స్: సాయిపథం వాల్యూం 1.

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo