సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 49వ భాగం....


ఈరోజు భాగంలో అనుభవం: 
  • థాంక్యూ సో మచ్ బాబా! ... మీరు నా మనసుని తెలుసుకున్నారు.

యు.ఎస్. నుండి ఒక సాయిభక్తురాలు తన అనుభవాన్నిలా పంచుకుంటున్నారు:

బ్లాగు ద్వారా నాకెంతో మనశ్శాంతి లభిస్తోంది. మీరు చేస్తున్న ఈ మంచి పనికి నా కృతజ్ఞతలు.

నార్త్ అమెరికాలోని బోస్టన్ నగరంలో 2018, అక్టోబర్ నెలలో ఒక సాయి మందిరం ప్రారంభమైంది. ఈ మందిరం నార్త్ అమెరికాలోని మందిరాలలోకెల్లా పెద్దది. దాని ప్రారంభోత్సవానికి బాబా నన్ను కూడా పిలిచారు. అందుకు బాబాకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. బాబా దర్శనానంతరం మా కుటుంబసభ్యులు, స్నేహితులు అందరూ ప్రసాద వితరణ జరుగుతున్న చోటికి వెళ్ళారు. నేను మాత్రం ఆకర్షణీయంగా, అద్భుతంగా వెలిగిపోతున్న బాబాను చూస్తూ అక్కడే నిలబడిపోయాను. మనసులో సరదాగా బాబాతో, "చూడండి బాబా! నేను మీకోసం వచ్చాను.(నాకు తెలుసు నిజానికి బాబా అనుమతి లేకుండా నేను ఎంత ప్రయత్నించినా అక్కడికి రాలేనని. కానీ నేను ఒక తుంటరి బిడ్డని.) నేను ప్రసాదం కోసం కూడా వెళ్లలేదు. ఇప్పుడు మీరు నాపై ఉన్న ప్రేమని  చూపించుకోవాలి. ఎలా అంటే, నాకు చాలా చాలా ప్రీతికరమైన దానిని మీరు నాకిప్పుడు ఇవ్వాలి. దానివలన ఉన్నపళంగా నాకు ఆనందంతో కళ్ళనుండి కన్నీళ్లు రావాలి. నాకేది కావాలో నేను చెప్పట్లేదు. ఎందుకంటే అంతలా కన్నీళ్ళు తెప్పించేటంత ఇష్టమైనది ఏమిటో నాకే తెలియదు. నా మనసు మీకు తెలుసో లేదో చూడాలి. అలాగే మీరు నన్నెలా ఆశ్చర్యపరుస్తారో చూడాలి. మీ బిడ్డలకు ఎన్నో పరీక్షలు పెడతారు. ఇప్పుడు మీరు పరీక్షంపబడుతున్నారు" అని, నవ్వుతూ బాబా వైపు చూసాను. నిజానికి నేనిదంతా సరదాగా బాబాతో మాట్లాడుకున్నాను. అంతేగానీ నా మనసులో ఏమీ లేదు. ఇలా నేను బాబాతో చెప్పుకోవడం పూర్తైన వెంటనే ఒక భజన బృందం లోపలికి వచ్చింది. నాకు బాబా భజనలు వినడం ఎంతో ఇష్టం. అయితే, గతంలో ఆ భజన బృందం వాళ్లు నాకిష్టమైన భజన పాటలెప్పుడూ పాడలేదు. అందువల్ల వాళ్లు రావడం నాకంత ఆసక్తిగా అనిపించలేదు. కానీ బాబాను మధ్యాహ్న ఆరతికి సిద్ధం చేయడానికి పరదాలు వేయడంతో నాకు బాధగా అనిపించి, వెళ్లి భజన బృందం దగ్గర కూర్చున్నాను.

కాసేపటిక్రితం బాబాతో నేను సరదాగా మాట్లాడుకున్నదంతా మర్చిపోయి అక్కడ కూర్చుని ఉన్నాను. ఇంతలో భజన బృందం వాళ్లు "దీవానా తేరా ఆయా బాబా తేరి శిరిడీ మే. మిలో ముఝ్ కో మేరె బాబా భర్నీ తుమ్హే పదెగి - ఝోలీ మే ఖాళీ లాయ రే బాబా - బాబా తేరి శిరిడీ మే" పాటతో భజన మొదలుపెట్టారు. అంతే! ఒక్కసారిగా నా కళ్ళనుండి పట్టరాని ఆనందంతో కన్నీళ్లు వచ్చేసాయి.  కొన్ని సంవత్సరాల క్రితం ఆ పాటంటే నాకు చచ్చేంత ఇష్టం. మొదటిసారి నేను కడుపుతో ఉన్నప్పుడు ప్రతిరోజూ లెక్కలేనన్నిసార్లు ఆ పాట పాడుకుంటూ ఉండేదాన్ని. ఆ ఆనందంలో కాలం గడిచిన తరువాత బాబా నాకు చక్కటి బిడ్డని కానుకగా ఇచ్చారు. అయితే ఐదేళ్ల కాలంలో ఇతర సమస్యలతో సతమతమవుతూ ఆ పాటను పూర్తిగా మర్చిపోయాను. మళ్ళీ ఇన్నాళ్లకు ఆ పాట వింటూ నన్ను నేను మైమరచిపోయాను. వేలాదిమంది భక్తుల ముందు కళ్లనుండి వస్తున్న ఆ కన్నీళ్లను ఎలా ఆపుకోవాలో నాకు తెలియలేదు. అవధులులేని ఆనందంతో, "థాంక్యూ బాబా! మీరు నా మనసుని తెలుసుకున్నారు. నేను మీ ముందు శిరసు వంచి నమస్కరిస్తున్నాను. బాబా! నా హృదయం ఆనందంతో నిండిపోయింది. కానీ ఇంకా సంతృప్తి లేదు. నాకిష్టమైన మరొక భజన పాటను కూడా నాకు వినిపించండి"  అని ప్రార్థించాను.

తర్వాత భజన బృందం వారు కొన్ని పాటలు పాడిన తర్వాత నాకిష్టమైన "బాబా మై తేరి పతంగ్" పాట మొదలుపెట్టారు. (పాటలోని భావం: "బాబా నేను మీ చేతిలో  గాలిపటాన్ని. మీ నుండి దూరంగా పోకుండా దయచేసి దారాన్ని మీ చేతిలో గట్టిగా పట్టుకోండి.") మళ్లీ ఆనందంలో మునిగిపోయాను. తన్నుకొస్తున్న ఆనందాన్ని ఆపుకోలేక ఏడ్చేసాను. "లవ్ యు సో మచ్ బాబా!".

నేను గత ఐదారు సంవత్సరాలుగా ఎన్నో సమస్యలతో పోరాడుతూ వాటినుండి బయటపడవేయమని, మళ్ళీ తల్లినయ్యే అవకాశాన్ని ఇవ్వమని బాబాను ప్రార్థిస్తూ ఉండేదాన్ని. అయితే ఆయనపై తగిన విశ్వాసంతో ఉండలేకపోయేదాన్ని. అది నా దురదృష్టం. కానీ బాబా ఏమీ పట్టించుకోకుండా నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు. "బాబా! అన్నిటికీ నా కృతజ్ఞతలు. నాకు అర్హత లేనప్పటికీ మీరు మంచి సౌకర్యవంతమైన జీవితాన్ని, మంచి వ్యక్తులను, విషయాలను ఇచ్చారు. బాబా! మిమ్మల్ని అర్థం చేసుకునే శక్తినివ్వండి. నాకేది మంచిదో అదే నాకివ్వండి."

మరో చిన్ని అనుభవం: మా అబ్బాయి టాబ్లెట్(ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్) 3 నెలల క్రితం కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా ఎక్కడా కనిపించలేదు. ఎక్కడ పెట్టానో ఎంత ప్రయత్నించినా నాకు గుర్తురాలేదు. ఎప్పుడు బాబాను ఆ విషయం అడిగినా, "పోగొట్టుకున్న వస్తువు దొరుకుతుంది" అని వస్తుండేది. అలా మూడు నెలలు గడిచాక ఒక గురువారంనాడు సదా మా కళ్ళముందు కనిపించే చోటులోనే ఆ టాబ్లెట్ దొరికింది. నిజానికి ఆ చోట నేను రెండు, మూడుసార్లు వెతికాను కానీ, అప్పుడు కనిపించలేదు. "బాబా! అద్భుతమైన మీ శక్తియందు నేనెందుకు విశ్వాసాన్ని నిలపలేక పోతున్నాను? దయచేసి అది నా చేతిలో ఉండేలా అనుగ్రహించండి".

source: https://www.shirdisaibabaexperiences.org/2019/04/shirdi-sai-baba-miracles-part-2337.html

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo