సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 43వ భాగం....

ఈరోజు భాగంలో అనుభవం:

  • నా సాయే నా సంరక్షకుడు


నా పేరు అనామిక. సాయి ప్రపంచంలో నేను చిన్న జీవిని. బాబా నన్నెంతో ప్రేమగా, జాగ్రత్తగా, గారాబంగా చూసుకుంటున్నారు. ప్రతిరోజూ సరికొత్త అధ్యాయాలను జోడిస్తూ ఇ-సాయిసచ్చరిత్ర(ఇంగ్లీష్ బ్లాగు) నిర్వహిస్తున్న హేతల్ బృందానికి మనసారా కృతజ్ఞతలు. బాబా లీలలు మనలో నమ్మకాన్ని, బలాన్ని, సానుకూల దృక్పథాన్ని కలిగిస్తాయి. "బాబా! మీరే నా సర్వస్వం. ప్రతి విషయంలోనూ, ప్రతి సందర్భంలోనూ నేను మీ మీదనే ఆధారపడ్డాను. దేవా! నేను మిమ్మల్ని ప్రేమించిన దానికంటే ఎన్నో రెట్లు మీరు నన్ను ప్రేమిస్తారని, జాగ్రత్తగా చూసుకుంటారని నాకు తెలుసు. మీరు నాకు ఎప్పుడూ ఉత్తమమైనవే ప్రసాదిస్తారు. ఈ ప్రపంచంలో నేను ఎంతో భాగ్యవంతురాలిని, ఎంతో ధన్యురాలిని, ఎందుకంటే నాకు మీరున్నారు. మీరు నా కోసం వేచిచూస్తూ వుంటారని నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. అమోఘమైన మీ లీలలలో కొన్ని ..."

మావారి మొబైల్ బాగుచేయడంలో...

మేము చాలా మొబైల్ ఫోన్లు వాడాము, కానీ ఎప్పుడూ ఏ సమస్యా రాలేదు. మొదటిసారిగా మావారు 60 వేల రూపాయల విలువైన ఫోన్ కొన్నారు. ఒక సంవత్సరంలోపే వేరొకరి పొరపాటువల్ల ఆ మొబైల్ స్క్రీన్ పగిలిపోయింది. మేము చాలా బాధపడ్డాము, ఎందుకంటే ఆ స్క్రీన్ కొత్తది వేయించాలంటే 21 వేలు ఖర్చవుతుంది. ఆ సమయంలో హఠాత్తుగా మావారికి గుర్తొచ్చింది, తను తన స్నేహితుడి సలహామేరకు తన పోస్ట్‌పెయిడ్ నెంబరుతో ఎయిర్‌టెల్ మొబైల్ ఇన్సూరెన్సుకు దరఖాస్తు చేసిన సంగతి. దాంతో మావారు ఎయిర్‌టెల్ కు ఆ విషయాన్ని తెలియజేశారు. కానీ ఇంటర్నెట్లో ఎయిర్‌టెల్ రెస్పాన్స్ గురించి చాలా పూర్ ఫీడ్‌బ్యాక్ ఉంది. కానీ, బాబాకు చెప్పుకొని తర్వాత ప్రయత్నించమని నేను మావారికి చెప్పాను. ఆ తర్వాత బాబా అనుగ్రహంతో మేము శిరిడీకి వెళ్ళాము. బాబా మాకు అద్భుతమైన దర్శనం ప్రసాదించారు. శిరిడీ నుండి తిరిగివస్తున్నప్పుడు ఎయిర్‌టెల్ వాళ్లు మా క్లెయిమ్‌ని ఆమోదించారని, మేము కేవలం 2,200 రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని తెలిసింది. "బాబా! మీ చర్యలు ఎవరికీ అంతుపట్టవు. మేము కేవలం నిమిత్తమాత్రులం."

నా మొబైల్ విషయంలో...

ఒకసారి నేను బస్సులో ఇంటికి వెళుతున్నప్పుడు నా మొబైల్ కనిపించలేదు. అది బస్సులోనే ఎక్కడో పడిపోయివుంటుందని అనుకున్నాను. కానీ, బాబానే నా మొబైల్‌ని నా బ్యాగులోనే వేరే అరలో పెట్టి నాతో ఆటలాడుతున్నారని నేను గ్రహించలేకపోయాను. నేను నిస్సహాయంగా బాబాను ప్రార్థించగానే నా మొబైల్ నాకు కనపడేలా చేశారు బాబా.

మమ్మల్నందర్నీ ప్రమాదం నుంచి రక్షించటంలో...

ఒకసారి మేము మా కజిన్ పెళ్ళికి మా అమ్మమ్మ వాళ్ళింటికి వెళ్ళాము. అక్కడ వాతావరణం చాలా వేడిగా ఉండడం వల్ల, దోమలు ఎక్కువగా ఉండటం వల్ల మా పిల్లలు పడుకోవటానికి చాలా ఇబ్బందిపడ్డారు. దాంతో ఒక మస్కిటో కాయిల్ వెలిగించి వాళ్ల తల దగ్గర ఉన్న కిటికీలో పెట్టాను. టేబుల్ ఫ్యాన్ వాళ్ళ వైపు తిప్పి నేను వేరే వైపు పడుకున్నాను. పిల్లలిద్దరూ బాగా అలసిపోయి ఉండటంవల్ల గాఢనిద్రలోకి జారుకున్నారు. అర్థరాత్రిపూట చాలా వేడిగా ఉండటంతో నేను మంచినీళ్ళు తాగుదామని లేచాను. ఆ సమయంలో కొద్దిగా కాలిన వాసన వచ్చింది. కానీ ఎక్కడా పొగ లేకపోవడంతో నేను అంతగా పట్టించుకోలేదు. గది తలుపు వేసే ఉంది. నేను నిద్రపోతున్న మా పాపకు దగ్గరగా వెళ్లి ప్రేమగా తన తల నిమరసాగాను. అప్పుడు గమనించాను, మేము పడుకున్న పరుపు నెమ్మదిగా కాలుతూ మా పాప జుట్టు వరకు రావడం. తన జుట్టు కూడా కొద్దిగా కాలింది. నేను వెంటనే నా చేతిలో ఉన్న బాటిల్లోని నీళ్లను పరుపుమీద కుమ్మరించాను. కానీ పరుపు ఇంకా కాలుతూనే వుంది. అందువల్ల పంపులోనుంచి మరికొన్ని నీళ్లు తెచ్చి పరుపుమీద పోశాను. పరుపు కాలడం ద్వారా వచ్చే పొగవల్ల ఉక్కిరిబిక్కిరి కాకుండా, ఆ మంటలవల్ల ఏమీ కాకుండా నా పిల్లలను కాపాడినందుకు నేను బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. టేబుల్ ఫ్యాన్ నుంచి వచ్చే గాలివల్ల పొగంతా కిటికీలోనుంచి బయటకు వెళ్ళిపోతోంది. నేను ఈ విషయంలో బాబాకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ఆయనే కాపాడకపోయుంటే పరిణామాలు ఎలా ఉండేవో నేను ఊహించలేను. కానీ బాబా మాతో ఉండగా నాకెందుకు భయం? ఉదయం నిద్ర లేచాక నేను జరిగిందంతా మా వాళ్లతో చెప్పాను. అప్పుడు వాళ్ళు రాత్రంతా ఏదో బాగా కాలిన వాసన వచ్చిందని చెప్పారు.

నా ఆరోగ్యం విషయంలో...

మా కజిన్ పెళ్లి నుంచి తిరిగొచ్చిన తరువాత నాకు తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తాయి. నాకు చాలా నీరసంగా అనిపించేది, సరిగా నిద్ర పట్టేది కాదు. అసలు సమస్య ఏమిటో అర్థం అయ్యేది కాదు. నా ఆరోగ్యపరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ఆఫీసుకి సెలవు పెట్టడం మాత్రం కుదరలేదు. నేను అల్లోపతి డాక్టరునే కాక హోమియోపతి డాక్టరుని కూడా సంప్రదించి ట్రీట్‌మెంట్ తీసుకున్నాను. కానీ పరిస్థితి ఇంకా విషమించింది. నేను బాబాని ప్రార్థించాను. ఆ తరువాత ఒక గురువారంనాడు నేను మా ఇంటికి దగ్గరలో ఉన్న గైనకాలజిస్టుని సంప్రదించాను. ఆమె ఎంతో మంచిది, నా పరిస్థితిని అర్థం చేసుకుంది. అల్ట్రాసౌండ్ స్కాన్ తీసి నా అనారోగ్యానికి కారణం కనుక్కున్నది. తర్వాత పదిరోజుల్లోనే నా సమస్య తీరింది, బాబా అనుగ్రహంతో నేను చాలా త్వరగా కోలుకున్నాను. ఒకరోజు నేను నా సహోద్యోగినితో ఈ సమస్య గురించి మాట్లాడుతున్నప్పుడు, తను కూడా ఇలాంటి సమస్యతోనే బాధపడ్డానని, కానీ దానికి కారణం తెలుసుకోవడానికి దాదాపు పది నెలలు పట్టిందని చెప్పింది. నా అనారోగ్యానికి కారణమేంటో మరింత స్పష్టంగా తెలుసుకునేందుకు బయాప్సీ కోసం శాంపిల్స్ ఇచ్చేముందు నేను చాలా ఆందోళనపడ్డాను. ఆ సమయంలో నేను ఈ బ్లాగులో భక్తుల అనుభవాలు చదవడం మొదలుపెట్టాను. వాటిలో, "Baba made me well with his prasad" (బాబా నన్ను తన ప్రసాదంతో బాగుచేశారు) అనే టైటిల్ తో ఉన్న బాబా లీల నన్ను ఆకర్షించింది. ఆ లీల చదివిన కొద్దినిమిషాల్లోనే శిరిడీ నుంచి నాకు ప్రసాదం వచ్చింది. ఈ విధంగా మరోసారి బాబా నన్ను అనుగ్రహించారు. "బాబా! మీరు చూపించే అనుగ్రహానికి థాంక్యూ అన్నది చాలా చిన్న పదం. బాబా! మరో మూడురోజుల్లో నా బయాప్సీ రిపోర్ట్ రాబోతోంది, ఏ సమస్యా లేకుండా అంతా బాగుండేలా అనుగ్రహించండి!"

మా అత్తయ్యని ప్రమాదంనుంచి కాపాడటంలో...

మాములుగా నేను రోజూ ఆఫీసుకి వెళ్లేటప్పుడు బాబా ఒకటి రెండుసార్లు కనిపిస్తారు. కానీ 2018 అక్టోబర్ 5వ తారీఖున బాబా చాలాసార్లు కనిపించారు. దాంతో, ఏదైనా మంచిగానీ, చెడుగానీ జరగబోతోందని నాకు అనిపించింది. కానీ, బాబానే అంతా చూసుకుంటారని నేను నిశ్చింతగా ఉన్నాను. నేను సాయంత్రం ఇంటికి వచ్చాక మా ఇంట్లో మాతోపాటు ఉండే మా అత్తయ్య తను ఒక ప్రమాదంనుంచి రక్షింపబడ్డానని చెప్పింది. అసలేం జరిగిందంటే, తను ప్రెషర్ కుక్కర్లో అన్నం వండుతున్నప్పుడు ఉన్నట్టుండి కుక్కర్ వాల్వ్ ఎగిరిపోయి వేడి ఆవిరి, వేడి వేడి నీళ్లు, అన్నము అంతా వంటింట్లో చెల్లాచెదురుగా పడింది, కానీ మా అత్తయ్యకి మాత్రం ఏమీ జరగలేదు. "మాకు తెలియకుండానే మమ్మల్ని ఇంతగా కాపాడుతున్నారు, థాంక్యూ బాబా! "

"దేవా! మీ ప్రేరణతో మీ మహాసమాధి సందర్భంగా విజయదశమి రోజున ఇంట్లో భజన చేసుకోవాలని అనుకుంటున్నాను. నా బడ్జెట్లో భజన బృందాన్ని ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు బాబా! ఈ కార్యక్రమం అంతా చక్కగా జరిగేలా అనుగ్రహించండి."

ఓం అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!

source: https://www.shirdisaibabaexperiences.org/2019/04/shirdi-sai-baba-miracles-part-2334.html

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo