సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 9వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - తొమ్మిదవ భాగం.

మహిమ మందులో లేదు!

ఒకసారి మాధవరావు దేశ్‌పాండే(షామా)కి మొలలు (piles) పెరిగి విపరీతంగా బాధపడ్డాడు. అతడు తన బాధ బాబాతో చెప్పుకుంటే, “మధ్యాహ్నం దానికి మందు ఇస్తాలే” అన్నారు బాబా. ఆ తరువాత సోనాముఖి (senna) ఆకులతో బాబానే ఒక కషాయం తయారుచేసి, త్రాగమని షామాకిచ్చారు. ఆ మందు తీసుకోగానే మొలలు తగ్గిపోయాయి. రెండు సంవత్సరాల తరువాత ఒకసారి షామాకి మళ్ళీ మొలలు పెరిగి బాధపెట్టాయి. అంతకు మునుపు ఇలాగే మొలలతో బాధపడితే, బాబా యిచ్చిన సోనాముఖి మందుతో తగ్గిపోవడం గుర్తుకొచ్చి, యీసారి బాబాకి చెప్పకుండా, తానే ఇంట్లో ఆ మందు తయారుచేసుకొని తీసుకున్నాడు. కానీ, యీసారి ఆ మందు తీసుకోగానే మొలలు తగ్గకపోగా, ఇంకా బాధ ఎక్కువయింది. ఇక బాధ భరించలేక వెళ్ళి బాబాతో చెప్పాడు. బాబా ఆశీర్వదించగానే బాధ మాయమయ్యింది. ఈ సంఘటనవల్ల తెలిసిందేమిటంటే - వ్యాధి తగ్గడానికి కారణం బాబా ఆశీర్వాదమేగానీ, మందు కాదని.

దాసగణు అమృతానుభవం

శ్రీజ్ఞానేశ్వర మహరాజ్ రచించిన 'అమృతానుభవం' చాలా ప్రసిద్ధ వేదాంత గ్రంథం. కానీ, ఆ గ్రంథాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అందువల్ల చాలా కొద్దిమందే దానిని చదువుతారు. ఆబాలగోపాలానికి సులభంగా అర్థమయ్యే రీతిలో ఆ గ్రంథానికి 'ఓవీల' రూపంతో “టీక' రచించాలని దాసగణు సంకల్పించాడు. సతారాలో ఉంటున్న ప్రఖ్యాత పండితుడు, సాధువు అయిన దాదా మహరాజు కీ తన సంకల్పం తెలియజేసాడు దాసగణు. 'అమృతానుభవాన్ని' గొప్పగా వివరించగల దిట్టగా దాదా మహరాజ్ విఖ్యాతుడు. దాసగణు కోరికను దాదా మహరాజ్ ఏమాత్రం ప్రోత్సహించలేదు. “టీక(వ్యాఖ్యానం) వ్రాయాలంటే ముందు నీకు మూలం క్షుణ్ణంగా అర్థమై ఉండాలి. నావద్ద కొన్ని మాసాలు ఉండి మూలాన్ని బాగా అధ్యయనం చెయ్యి. ఆ తరువాత వివరణ వ్రాస్తువు గాని!” అన్నాడు దాదా మహరాజ్. దానికి దాసగణు “నేను 'టీక' రచించడం సాయిబాబా సంకల్పమే అయితే దానికి అవసరమైన బుద్ధిని (సామర్థ్యం) బాబానే యిచ్చి, ఆ గ్రంథం నాకు అర్థమయ్యేట్లు ఆయనే చేస్తారు. నేను మాత్రం దానికోసం ఇంకెవర్ని ఆశ్రయించదలుచుకోలేదు” అని జవాబిచ్చాడు. దాసగణు ఉద్దేశ్యం దాదా మహరాజ్ కు రుచించలేదు. అయినా దాసగణు తరఫున బాబాకు ప్రార్థన చేసాడు. ఆ తరువాత దాసగణు వ్యాఖ్యానం వ్రాయడం ఆరంభించాడు. రెండు అధ్యాయాలకు 'టీక' వ్రాయడం పూర్తయింది. ఒకసారి మళ్ళీ దాదా మహరాజ్ దగ్గరి కెళ్ళినపుడు, ఆయన 'టీక' రచన ఏమైందని అడిగారు. దాసగణు తాను వ్రాసిన 'టీక' చదివి వినిపించాడు. అది విన్న దాదా మహరాజ్ ఆ వ్యాఖ్యానాన్ని ఎంతో మెచ్చుకొని, “బాబా నిజంగా సమర్థులు! ఆయన అనుగ్రహం వల్లే నువ్వు ఇంత చక్కటి టీక వ్రాయగలిగావు. నీకు ఇంకెవ్వరి సహాయము అక్కరలేదు” అని అన్నారు.

ఊదీ భీమా - పిల్లల ధీమా!


శ్రీదాజీవామన్ చిదంబర్ స్కూలు హెడ్మాష్టరుగా శిరిడీకి బదిలీ మీద వచ్చారు. ఆయన శిరిడీకి వచ్చిన కొంతకాలం తరువాత ఒకసారి మేం(దీక్షిత్ తదితరులు) కలుసుకొన్నాం. మాటల సందర్భంలో ఆయన నాతో “ఈరోజు వరకు ఉపాధ్యాయుడిగా నాకు కొద్దో గొప్పో మంచి పేరుందండీ! కానీ, ఇక్కడికొచ్చింతరువాత అదికాస్తా చెడిపొయ్యేట్లుంది. ఎందుకంటే, ఇక్కడ పిల్లలెవరూ సరిగ్గా చదవరు. 'ఏమిరా, ఇట్లాగైతే రేపు పరీక్షల్లో ఏం చేస్తారు?' అని అడిగితే, 'మేం బాబా దగ్గర ఊదీ తీసుకొని పెట్టుకొనిపోతే తప్పకుండా పాసవుతాము, సార్!' అని సమాధానమిస్తారు” అంటూ వాపోయాడు. అయిదారు నెలల తరువాత పరీక్షలు జరిగాయి. ఆ తరువాత ఒకసారి ఆ హెడ్మాష్టరు నన్ను(దీక్షిత్) కలిసి, తనంతట తానే, “పరీక్షలు అయిపోయాయండీ! పిల్లలు చెప్పినట్టే బాబా దగ్గర ఊదీ తీసుకొని వెళ్ళి పరీక్షలు వ్రాసారు. పాసయ్యారు! స్కూలుకి మంచి రిజల్టు వచ్చింది” అని.

తరువాయి భాగం రేపు


సోర్స్ : సాయిపథం - వాల్యూం 1

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo