సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయి అనుగ్రహసుమాలు - 11వ భాగం.


కాకాసాహెబ్ దీక్షిత్ డైరీ - పదకొండవ భాగం.

బాబా కుదిర్చిన బేరం

శిరిడీ వాస్తవ్యుడైన లక్ష్మణ్‌భట్ వైదీకి బ్రాహ్మణుడు. అతని వద్దనుండి 1910లో నేను(దీక్షిత్) కొంత భూమిని కొన్నాను. ఆ కొనుగోలుకు సంబంధించిన లావాదేవీలు జరుగుతున్నప్పుడు మొదట లక్ష్మణ్‌భట్ ఆ భూమి ఖరీదు రూ.200/- చెప్పాడు. ఆ భూమి రూ.150/- మించి విలువ చెయ్యదనీ, ఆపైన ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వననీ నేను బేరమాడాను. బేరం తెగలేదు. ఈ బేరసారాలు జరుగుతున్న రోజుల్లోనే, ఒకసారి లక్ష్మణ్‌భట్ మసీదుకు వెళ్ళినపుడు బాబా అతణ్ణి దగ్గరకు పిలిచి, “ఇద్దరూ కలిసి ఒక పరిష్కారానికి రండి. మధ్యేమార్గంగా రూ.175/- తీసుకో! అంతకు తక్కువకు మాత్రం ఒప్పుకోవద్దు!” అన్నారు. అయితే అప్పట్లో లక్ష్మణ్‌భట్ ఈ విషయం ఎవ్వరితోనూ చెప్పలేదు. బేరసారాలు జరిగి జరిగి చివరకు నేనడిగిన రూ.150/- రేటుకే బేరం కుదిరింది. భూమి రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు నేను రిజిస్ట్రార్ ముందే లక్ష్మణ్‌భట్‌కు రూ.150/- చెల్లించాను. కానీ, అదేమి అద్బుతమో, లక్ష్మణ్‌భట్ ఇంటికెళ్ళి మళ్ళీ పైకం లెక్కబెట్టుకొంటే, రూ.175/- ఉన్నది.

అడగ్గానే ఆదుకొనే ఆపద్బాంధవుడు

శ్రీగణపత్ ధోండూ కదమ్ అనే భక్తుడు తనకు కలిగిన ఒక అద్భుతమైన అనుభవాన్ని గురించి నాకు(దీక్షిత్) ఇలా వ్రాశాడు:

“1914లో నేను, నా భార్య కలిసి బాబా దర్శనానికి శిరిడీ బయలుదేరాం. రైలు నాసిక్ లైనులో పోతున్నది. ఇంకో ఒకటి రెండు స్టేషన్లు దాటితేగానీ నాసిక్ రాదు. ఇంతలో ఒక 15, 20 మంది భిల్లులు గుంపుగా నేను కూర్చొని ఉన్న పెట్టెలోకి జొరబడ్డారు. వాళ్ళు కారునలుపు రంగులో చూడ్డానికి భయంకరంగా ఉన్నారు. ఆ పెట్టెలో నేను, నా భార్య, నా కూతురు తప్ప మరింకెవ్వరు ప్రయాణీకులూ లేరు. నేనప్పుడు హరిభక్త పరాయణ శ్రీలక్ష్మణ్ రామచంద్ర పంగార్కర్ రచించిన 'భక్తి మార్గ ప్రదీపిక' అనే పుస్తకం చదువుతూ ఉన్నాను. ఆ భిల్లులు వచ్చి నా ప్రక్కనే కూర్చున్నారు. వాళ్ళు ఆ పుస్తకం వినడానికి వచ్చినట్లుగా భావించుకొని, దాన్లోని కొన్ని అభంగాలను పెద్దగా చదవటం మొదలెట్టాను. ఆ భిల్లులు ఓ ఐదునిమిషాలపాటు నా దగ్గరే కూర్చున్నారు. తరువాత ఉన్నట్టుండి లేచి, రైలు వేగంగా పరుగెడుతుండగానే, రైల్లోంచి దూకేశారు! నేను తలుపు దగ్గరకెళ్ళి  చూస్తే, వారందరూ క్రిందికి దూకి పరుగెత్తిపోతూ కనిపించారు. వెనక్కి తిరిగి చూసేసరికి మా పెట్టెలో ఒక వృద్ధ ఫకీరు కూర్చుని ఉన్నాడు. 'ఆ ఫకీరు మా పెట్టెలోకి ఎట్లా వచ్చాడా?' అని ఆశ్చర్యపోయి నేను చూస్తుండగానే, నా కళ్ళముందే ఆ ఫకీరు అదృశ్యుడయ్యాడు.

హఠాత్తుగా సంభవించిన ఆ అద్భుతానికి నేను సంభ్రమాశ్చర్యాలకు లోనైనాను! కొంతసేపటికిగానీ నేను తేరుకోలేకపోయాను. మర్చిపోలేని విధంగా ఆ సంఘటన నా మనస్సులో హత్తుకుపోయింది. తరువాత మేము శిరిడీ చేరి, బాబా దర్శనం కోసం మసీదు మెట్లమీద కాలు పెట్టామో లేదో, బాబా మమ్మల్ని చూస్తూ, “క్షేమంగా చేరారు కదా?” అని అడిగారు. రైలులో మా పెట్టెలోకి వచ్చిన భిల్లులు మమ్మల్ని దోచుకోడానికే వచ్చారని అర్థమవుతూనే ఉంది. ఆ ఫకీరును చూచి ఎందుకో ఆ భిల్లులు విచిత్రంగా భయపడి పారిపోయారుగానీ, లేకుంటే వాళ్ళు మమ్మల్ని దోపిడీ చేసేవారే. ఆ మొత్తం సంఘటన మనసులో  మెదలి, బాబా భక్తరక్షణాపరతంత్రతకు నా హృదయం భావోద్వేగంతో చలించిపోయింది.”

తరువాయి భాగం రేపు.


సోర్స్ : సాయిపథం - వాల్యూం 1

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo