బాబా అడిగిన పైకం వెనుక పరమార్థం
ఒకసారి నేను(నాచ్నే) శిరిడీలో ఉండగా, శంకర్రావు కూడా అక్కడికొచ్చాడు. బాబా అతణ్ణి రూ.16 దక్షిణ అడిగాడు. అతని వద్ద పైకం లేదు. అతడు బాబా అడిగినప్పుడు దక్షిణ ఇవ్వలేకపోయానని క్రుంగిపోతూ వెనక్కి (బసకు) వచ్చాడు. కొంతతడవైన తర్వాత మళ్ళీ అతడు బాబా దర్శనానికెళ్ళినపుడు, బాబా యీసారి రూ.32 ఇవ్వమని అడిగాడు. తన అసహాయతకు సిగ్గుపడుతూ, శంకర్రావు బసకు చేరాడు. విషయం తెలిసి నాకు నవ్వొచ్చింది. “అట్లా ఎందుకు చేసావ్! నీదగ్గర పైకం లేకపోతే 'నాదగ్గర పైకంలేదు' అని బాబాతో చెప్పి ఉండవచ్చుగదా? నీవేం పలక్కుండా ఉన్నావు గనుకే బాబా దక్షిణ అడుగుతున్నారు” అని అతనితో అన్నాను. ఈసారి గనుక బాబా దక్షిణ అడిగితే అదే చెప్తానన్నాడు శంకర్రావు. ఇద్దరం కలసి మసీదుకెళ్ళగానే, బాబా శంకర్రావును రూ.64 దక్షిణ అడిగారు. “అంత డబ్బు మా దగ్గర ఎలా ఉంటుంది బాబా” అని అన్నాం మేము. “మీ దగ్గర లేకపోతే అందరి దగ్గర దండి పంపించండి” అన్నారు బాబా. ఈ సంఘటన జరిగిన కొంతకాలానికి బాబాకు ఒకసారి బాగా జబ్బు చేసింది. బాబా ఆరోగ్యం కోసం భక్తులు సప్తాహం, అన్నదానం నిర్వహించారు. ఆ సందర్భంగా దభోల్కర్ భార్య దహనూకు చెందిన వామన బాలక్రిష్ణ తదితరులు చందాల వసూళ్ళకు బయలు దేరాలనుకొన్నారు. వామనరావు ఆ కార్యం తన తమ్ముడైన శంకర్రావుకు అప్పగించి, ఆ విషయం నాకు కూడా చెప్పాడు. ఆ తరువాత మేము చందాలు వసూళ్ళు చేసాం. అంతా వసూలైన తర్వాత లెక్కపెడితే ప్రోగైన చందాల పైకం సరిగ్గా రూ.64 ఉంది. బాబా కొన్నిరోజుల క్రితం సరిగ్గా అదే మొత్తాన్ని అందరి దగ్గరా దండి వసూలు చేయమన్న విషయం గుర్తుకొచ్చి ఆశ్చర్యపోయాం.
ఆపద్బాంధవుడు
1915 మార్చి 31వ తేదీన నేను(నాచ్నే), శాంతారాం మోరేశ్వర్ ఫన్సే కలసి ఒక ప్రభుత్వ సంబంధమైన పనిమీద అర్ధరాత్రి ఎద్దులబండిపై, దట్టమైన అడవిదారిగుండా పోవలసి వచ్చింది. దహనూ తాలూకాలోని రాన్ షెట్ అడవి దారిగుండా పోతూ ఉన్నాం. ఎందుకో హఠాత్తుగా మాబండి ఎద్దులు ఆగిపోయి, నెమ్మదిగా వెనక్కి నడవసాగాయి. ఎంత చూసినా కారణం తెలియలేదు. మేము పోతున్నది చాలా ఎక్కుడురోడ్డు. ప్రక్కనే లోయ ఉన్నది. ఇంతలో మా బండి ఇరుసు చీల ఊడివుండటం గమనించి, దిగి దానిని సరిచేసి, బండిని చక్రాలు పట్టుకొని ముందుకు నెట్టాలను కుంటుండగా, శాంతారాం ఒకవైపు వేలుచూపి అటు చూడమన్నాడు. చూస్తే ఏముంది! ఒక భయంకరమైన పెద్దపులి మాకెదురుగా రోడ్డుప్రక్కన కూర్చుని, మాకేసే చూస్తోంది. వెంటనే బండిదిగి చక్రాలకు పోటుపెట్టి ఆపకపోయినా, యీ లోపల ఎద్దులు ఏమాత్రం బెదిరినా మాబండి తలక్రిందులై లోయలో పడుతుంది. కానీ, బండి దిగితే పులి పైన పడుతుందని భయం. ఫనే స్వతహాగా ధైర్యస్థుడు. అతడు, తాను బండిదిగుతాననీ, యీలోపల నన్ను ఎద్దుల పగ్గాలు గట్టిగా పట్టుకోమనీ చెప్పాడు. కానీ, నాకు పగ్గాలు పట్టుకొని కూర్చునే ధైర్యం కూడా పోయింది. ఇంతలో కాలు విరిగిందేమోనన్నట్లు బండి ఎద్దుల్లో ఒక ఎద్దు కాలు మడతబెట్టి కూర్చున్నది. నాకు భయంతో గొంతు తడారిపోతున్నది. అప్పుడు నా పూర్వపుణ్యం వల్ల బాబా గుర్తుకొచ్చారు. బాబానే ఆ సమయంలో ఆపదనుండి మమ్మల్ని రక్షించగలరనిపించింది. నేను బండిలోనుండే “జయ శ్రీసాయిబాబా, పరుగున రావయ్యా!” అంటూ అరిచాను. వెంటనే, ఆ పెద్దపులి లేచి రోడ్డుకు ఎడమ వైపునుండి, కుడివైపుకు దూకి, మావైపే చూస్తూ బండి ప్రక్కగా వెళ్ళిపోయింది. నేను మాత్రం బాబాను పెద్దగా పిలుస్తూనే ఉన్నాను. ఆ పులి అటు వెళ్ళగానే మా ఎద్దులు లేచి పరుగు లంఘించుకోవటంవల్ల, ప్రమాదం నుండి బయటపడ్డాము. అలా అనేకంటే సద్గురు నామస్మరణే మమ్మల్ని కాపాడిందనడం సముచితం.
ఆపద మొక్కులవాడు
దహనూలో గుమాస్తా (తలాతీ)గా పనిచేస్తున్న పరశురాం అప్పాజీ నాచ్నేకు ఒకసారి బాగా 'జబ్బు చేసింది. అతను అప్పటికే శిరిడీ వెళ్ళివున్నాడు. అతనికొచ్చింది సన్నిపాతజ్వరం. మా(బల్వంత్ నాచ్నే) అన్నగారితో సహా, డాక్టర్లందరూ కేసు ఇక లాభంలేదని పెదవి విరిచారు. కానీ, పరశురాం ఎప్పుడూ తనప్రక్కన బాబా ఫోటో పెట్టుకొని, ఆ పటం ముందు నెయ్యిపోసి వెలిగించిన దీపం, అగరువత్తి ఎప్పుడూ వెలిగించి పెట్టమని తల్లిని కోరాడు. అతని తల్లి బాబా ఫోటో ముందు దీపం వెలిగించి, “బాబా నా కుమారుడికి జబ్బు నయం చెయ్యి. అతడికి ఆరోగ్యం బాగయిన వెంటనే, అతణ్ణి నీ దర్శనానికి శిరిడీకి పంపిస్తాను” అని మొక్కుకుంది. ఆ మొక్కు బాబాకు చేరింది. అతను కోలుకున్నాడు. ఇప్పుడతడికి పిల్లలు. ఇంతకుముందుకంటే ఆనందంగా ఉన్నాడు కూడా!
ఊదియే ముందు
ఒకసారి దహనూలో ప్లేగువ్యాధి వ్యాపించడంతో, మేము(నాచ్నే) అక్కడనుండి ఓ చిన్నపల్లెకు నివాసం మార్చాము. ఆ ఊరి జాగీర్దారైన రాజీ సఖారాం వైద్యగారి చిన్నకొడుకు మోరూకు, చాలా ప్రమాదంగా జబ్బు చేసింది. మా అన్నగారు డాక్టరవడంతో ఆయన దగ్గర మందుకోసం రాజీగారి పెద్దకుమారుడు మా ఇంటికొచ్చాడు. ఆ సమయంలో మా అన్నగారు ఇంట్లో లేకపోవడంతో, నన్నే మందేమయినా ఉంటే ఇవ్వమని అడిగాడు. “నా దగ్గరమందులేమీ లేవు, ఊదీ మాత్రం ఉంది. పెట్టిచూడు” అంటూ బాబా ఊదీ ఇచ్చాను. మోరూకు ఊదీ పెట్టగానే ఏ మందూ అవసరం లేకుండానే కోలుకున్నాడు.
తరువాయి భాగం రేపు.
సోర్స్ :సాయిపథం వాల్యూం - 1