సాయి వచనం:-
'మేము ఎన్నో కష్టాలకు ఓర్చాము. నెలల తరబడి ఆహారం లేకుండా ఉన్నాము. వేప మొదలైన ఆకులు మాత్రమే తిన్నాము. శరీరం శుష్కించి, ఎముకలు కూడా నిలువలేని స్థితిలో ఉన్నప్పటికీ భగవంతుని కృపవలన ప్రాణం పోలేదు.'

'సద్గురు కృప ఉంటే ఆ సద్గురు సాన్నిధ్యంలో ఉండి సాధన చేసుకోవాలన్న తలంపు నెరవేరుతుంది' - శ్రీబాబూజీ.

కాకాసాహెబ్ దీక్షిత్ - మొదటి భాగం...




శ్రీకాకాసాహెబ్ దీక్షిత్

బొంబాయికి చెందిన ప్రఖ్యాత న్యాయవాది హరిసీతారాం దీక్షిత్ అలియాస్ కాకాసాహెబ్ దీక్షిత్. 1909 వరకు అతనికి సాయిబాబా పేరే తెలియదు. కానీ, ఆ తరువాత అతను శ్రీసాయికి పరమ భక్తునిగా ప్రసిద్ధిగాంచాడు. ఋణానుబంధం వలన బాబాతో ముడిపడివున్న ఎంతోమంది భక్తులను శిరిడీకి రప్పించడంలోనూ, వాళ్ళకు బాబాపట్ల భక్తిశ్రద్ధలు ఏర్పడటంలోనూ అతనొక మిష అయ్యాడు. శిరిడీ సాయి సంస్థాన్ స్థాపనలో, దాని పురోగతిలో దీక్షిత్ పాత్ర ఎంతో కీలకమైనది. 1926, జులై 5న తనకు అంతిమఘడియలు సమీపించేవరకు సంస్థాన్ గౌరవ కార్యదర్శిగా అతనెంతో ఉత్సుకతతో సమర్థవంతంగా సంస్థాన్ వ్యవహారాలు నిర్వర్తించాడు. సంస్థాన్ ద్వారా వెలువడిన సాయిలీల ద్వైమాసిక పత్రిక (మరాఠీ) నిర్వహణలో కూడా అతని కార్యదక్షత ఎనలేనిది. 1926, జులై వరకు ఆ పత్రికలో అతనివి, అతని స్నేహితులవి 151కి పైగా అనుభవాలు ప్రచురితమయ్యాయి. అవి ఇప్పటికీ సాయిభక్తులకు మార్గనిర్దేశం చేస్తూ బాబా ప్రేమకు పాత్రులను చేస్తున్నాయి.

1864వ సంవత్సరంలో మధ్యప్రదేశ్‌నందు గల ఖాండ్వాలోని ఉన్నత నగరి బ్రాహ్మణ కుటుంబంలో గొప్ప పలుకుబడి, సంపద ఉన్న దంపతులకు హెచ్.ఎస్.దీక్షిత్ జన్మించాడు. అతని ప్రాథమిక విద్య ఖాండ్వా, హింగన్‌ఘాట్‌లలో జరిగింది. మెట్రిక్‌లో ప్రథమశ్రేణి సాధించిన తరువాత ఎఫ్.ఏ, బి.ఏ పూర్తిచేసి, అనంతరం పంతొమ్మిదేళ్లకే బొంబాయిలోని ఎల్ఫిన్‌స్టన్ కాలేజీలో ఎల్.ఎల్.బి పట్టభద్రుడయ్యాడు. తర్వాత 21 ఏళ్ల వయసులోనే సొలిసిటర్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఆ తరువాత అతను న్యాయవాదిగా ‘లిటిల్ అండ్ కంపెనీ’లో చేరి అతి తక్కువ కాలంలోనే ప్రఖ్యాత న్యాయవాదిగా స్థిరపడ్డాడు. తరచూ అతని పేరు పత్రికలలో, న్యాయ నివేదికలలో కనిపిస్తుండేది. ఉదాహరణకు, భావనగర్ ఎక్స్‌పోజర్స్, పూనా వైభవం మొదలైన ప్రఖ్యాత దేశీయ పత్రికలపై జరిపిన న్యాయవిచారణలోనూ, లోకమాన్య బాలగంగాధర్ తిలక్ మరియు గ్లోబ్&టైమ్స్ అఫ్ ఇండియా మొదలైన సంచలనాత్మక కేసులలోనూ సమర్థుడైన న్యాయవాదిగా దీక్షిత్ పేరు దేశమంతటా మారుమ్రోగింది. బాంబే విశ్వవిద్యాలయం, ఏ నోటరీ పబ్లిక్, జస్టిస్ ఆఫ్ ది పీస్ వంటి కమిటీలకు సహచరుడిగా ఎంపికై అతను తన చక్కటి వాక్చాతుర్యంతో, హావభావాలతో కౌన్సిళ్లలో గొప్ప ఖ్యాతి సంపాదించాడు. అంతేకాదు, అతను తరచూ పలు ప్రజాసంస్థలలో పనిచేస్తుండేవాడు. రాజకీయ, సామాజిక, పురపాలక వ్యవహారాలలో పాలుపంచుకుంటూ ప్రజానీకానికి ఉన్నత సేవలు అందిస్తూ అటు ప్రజలలో, ఇటు ప్రభుత్వ వర్గాలలో అతను గొప్ప ఖ్యాతిని, ప్రజాదరణను గడించాడు. అతను రాజకీయంగా ఇండియన్ నేషనల్ కాంగ్రెసులో సభ్యునిగా సర్ ఫిరోజ్ షా మెహతాకు ప్రధాన అనుచరుడిగా ఉండేవాడు. 1901లో అతను బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా ఎంపికయ్యాడు. అయితే తాను నమ్మిన సిద్ధాంతాల కోసం కార్పొరేషన్ పదవికి రాజీనామా చేసిన అతని దేశభక్తి, ఆత్మసమర్పణ ఎనలేనివి. దీక్షిత్ తన ప్రతిభాపాటవాలతో త్వరితగతిన గొప్ప గౌరవప్రదమైన పదవులు అందుకుంటూ అదే స్థితిలో కొనసాగితే అతను ఖచ్చితంగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యునిగా, ఏదైనా రాష్ట్రానికి కమిషనర్ కూడా అయ్యేవాడు. కావాల్సినంత జీతభత్యాలు, తుపాకీ కాల్పుల గౌరవ వందనాన్ని పొందేవాడు. కానీ అతని ప్రారబ్ధం, ఏదో ఋణానుబంధం అతనిని మరో మార్గంలో తీసుకెళ్లింది. సామాన్య దృష్టికి ఆ మలుపు దురదృష్టంగా అనిపించవచ్చుగానీ, అది సద్గురు సాయి యొక్క అపారమైన కృపకు పాత్రుని చేసింది. అతనికి శిరిడీ దర్శించాలన్న ప్రేరణ కలిగిన వైనం, తమ దర్శనాన్ని ప్రసాదించేందుకు బాబా చేసిన ప్రణాళిక ఆసక్తిదాయకంగా, సంతోషదాయకంగా ఉంటాయి.

1906లో దీక్షిత్ ఇంగ్లాండుకి వెళ్ళినప్పుడు లండన్ నగరంలో రైలుబండి ఎక్కే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు కాలుజారి క్రింద పడిపోయాడు. ఆ దుర్ఘటనలో అతని కాలికి గాయమై నడవలేని పరిస్థితి ఏర్పడింది. ఎన్నో రకాల చికిత్సలు, చివరికి శస్త్రచికిత్స చేసినప్పటికీ పూర్తిగా నయంకాక అతను మునుపటిలా నడవలేకపోయాడు. నడకలో కుంటితనం వలన కొన్ని ఫర్లాంగుల దూరం నడిస్తే చాలు అతనికి బాగా నొప్పి, బాధ కలుగుతుండేవి. ఆ కుంటితనం చూడటానికి వికృతంగా ఉండటమే కాకుండా వ్యక్తిగత, దేశీయ, రాజకీయ, చట్టపరమైన మరియు ప్రజాసంబంధిత అనేక కార్యకలాపాలలో అతని సమర్థతను క్రుంగదీసింది. ముఖ్యంగా అతనిలో ఆత్మన్యూనత భావాన్ని, జీవితం పట్ల అసహ్యతను కలిగించడంలో రెట్టింపు ప్రభావాన్ని చూపి, అతన్ని అతి విశిష్టమైన పవిత్ర జీవనానికి సిద్ధం చేసింది. నిజానికి లౌకికమైన కీర్తిప్రతిష్ఠలు, సిరిసంపదలు మనిషినెలా ఆదుకోలేవో అతడికి బాగా అర్థమైంది. అతనిలో తీవ్ర ఆధ్యాత్మిక పిపాస రగుల్కొంది. ఈ కాలంలోనే అతనికి ప్రఖ్యాత మరాఠీ నవలా రచయిత హెచ్.యెన్.ఆప్టే, అన్నాసాహెబ్ దభోల్కర్‌లతో సన్నిహిత స్నేహమేర్పడింది. ఈ ముగ్గురికీ శివాజీ గురువైన సమర్థ రామదాసస్వామి వంటి సమర్థ సద్గురువును ఆశ్రయించాలని తీవ్రంగా అనిపించసాగింది. వారిలో ఎవరికి మొదట అటువంటి మహనీయుడు లభించినా మిగిలిన ఇద్దరికీ కూడా తెలియపరచాలని ఒప్పందం చేసుకున్నారు.

1909వ సంవత్సరంలో దీక్షిత్ తన సెలవు దినాలను లోనావాలాలో ఉన్న తన బంగ్లాలో గడుపుతున్నప్పుడు అనుకోకుండా ఒకరోజు తనతోపాటు బొంబాయిలోని ఎల్ఫిన్‌స్టన్ కాలేజీలో ఒకప్పుడు కలిసి చదువుకున్న నానాసాహెబ్ చాందోర్కర్ కలిశాడు. చదువు పూర్తయిన తరువాత నానాసాహెబ్ ప్రభుత్వ సేవలోనూ, దీక్షిత్ తన కార్యకలాపాలలోనూ నిమగ్నమయ్యారు. ఎన్నో ఏళ్ళ తరువాత కలుసుకున్న స్నేహితులిద్దరూ ఆనందంగా మాటల్లో పడ్డారు. అన్ని సంవత్సరాలలో వారికి ఎదురైన అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకోసాగారు. ఆ మాటలలో దీక్షిత్ తనకు లండన్‌లో జరిగిన ప్రమాదం గురించి, తన కాలి అవిటితనం గురించి వివరంగా చెప్పాడు. వెంటనే నానాకు సాయిబాబా గుర్తుకు వచ్చి, "ఎక్కడైతే ఔషధాలన్నీ పనిచేయడం మానేస్తాయో, అప్పుడు దైవానుగ్రహం పనిచేస్తుంది" అని అన్నాడు. అందుకు దీక్షిత్, "నానా! నువ్వు చెప్పినదానికి నేను పూర్తిగా సమ్మతిస్తాను. కానీ ఈ రోజుల్లో నిజమైన సత్పురుషులు చాలా అరుదు. అటువంటివారు దొరకడం చాలా కష్టం. ఒకవేళ అలాంటివారిని కనుగొనడంలో మనం సఫలీకృతులమైనప్పటికీ చివరిలో పశ్చాత్తాపపడాల్సిన పరిస్థితి వస్తుంది" అని అన్నాడు. అప్పుడు నానాసాహెబ్, "నేను నీకొక విషయాన్ని చెప్తాను. నువ్వు నన్ను నిజంగా విశ్వసిస్తావని ఆశిస్తున్నాను. నేను ఒక గురుమహరాజ్‌కి శిష్యుడిని. వారి పేరు ‘సాయిబాబా’. వారు కోపర్‌గాఁవ్‌కి సమీపంలో వున్న శిరిడీ అనే చిన్న గ్రామంలో నివసిస్తున్నారు. నిజంగా నువ్వు నీ కాలి కుంటితనం నయం కావాలని అనుకుంటే, నా గురువు దర్శనానికి రా! వారు అత్యంత శక్తిమంతులు. వారు నీ అవిటితనాన్ని నయం చేస్తారు. అంతేకాదు, నీ మనోచాంచల్యాన్ని నశింపజేసి భగవంతుని చేరుకొనే మార్గాన్ని చూపిస్తారు. నా గురుమహరాజ్ ఎప్పుడూ ఒకమాట చెప్తుంటారు: 'ఒక పిచ్చుక కాలికి దారాన్ని కడితే, ఎటువంటి ప్రయత్నం లేకుండానే అది మన వైపుకు లాగబడుతుంది. అలాగే నా మనుష్యులు ఈ భూమండలంలో ఏ మూలనున్నా వారిని నా వద్దకు రప్పించుకుంటాను. ఎవరికి పుణ్యం అధికంగా లేదో వాళ్ళు శిరిడీకి పిలవబడరు' అని. కాబట్టి మనం వారి మనుష్యులం కాకపోతే వారి వైపుకు మనం ఆకర్షింపబడము. మీరు వారి మనిషి కాకపోతే మీకు వారి దర్శనం కాదు. ఇదే బాబా యొక్క గుర్తు. కనుక మీ అంతట మీరు అక్కడికి వెళ్ళలేరు" అని చెప్పాడు. అతని ప్రేమపూర్వకమైన వర్ణన వింటూనే, ఋణానుబంధం వలన దీక్షిత్ హృదయంలో బాబాపట్ల ప్రేమ ఉవ్వెత్తున ఎగసింది. అతని మనస్సుపై మాయ యొక్క ప్రభావం తగ్గుతూ దివ్యమైన భక్తిపారవశ్యం ఉద్భవించసాగింది. అప్పటికప్పుడే బాబాను దర్శించుకోవాలని దృఢనిశ్చయం చేసుకుని నానాతో, "నా ఈ కాలి గురించిన మాటెందుకు? అశాశ్వతమైన శరీరానికి సంబంధించిన ఈ కాలి బాధ ఎంతకాలమైనా ఉండనీ, దాని గురించి నాకేం చింతలేదు. నాకు అల్పసుఖాలపై కోరిక లేదు. నేను వానిని కోరను. బ్రహ్మ కంటే వేరే సుఖం లేదు. అదొక్కటే అమూల్యమైనది. ఆ నిరతిశయ సుఖం కోసం నేను తప్పక మీ గురుదర్శనానికి వెళ్తాను, వారికి దాసుణ్ణవుతాను. ఈ కాలి కుంటితనాన్ని బాగుచేయమనికాక నా కుంటి మనసును బాగుచేయమని ప్రార్థిస్తాను" అని చెప్పి, శిరిడీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తీసుకున్నాడు. అప్పటినుండి దీక్షిత్ శిరిడీ వెళ్లే శుభ సమయం కోసం నిరీక్షించసాగాడు.

1909వ సంవత్సరంలో బొంబాయి లెజిస్లేటివ్ కౌన్సిల్ అభ్యర్థిత్వం కోసం ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకాసాహెబ్ దీక్షిత్ అహ్మద్‌నగర్ వెళ్ళాడు. అక్కడ తనకు సన్నిహితుడైన సర్దార్ కాకాసాహెబ్ మిరీకర్ ఇంట్లో బసచేశాడు. మిరీకర్ బాబా భక్తుడు. అతని కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ బాబాపట్ల అత్యంత భక్తివిశ్వాసాలు ఉన్నాయి. మిరీకర్ ఇంట్లో దీక్షిత్ ఉన్న విషయం తెలిసి బాబా భక్తులైన నానాసాహెబ్ ఫన్సే, అప్పాసాహెబ్ గద్రేలు తమ స్నేహితుడైన దీక్షిత్‌ని కలవడానికి మిరీకర్ ఇంటికి వచ్చారు. అందరూ కలిసి అసంఖ్యాక బాబా లీలలను ముచ్చటించుకున్నారు. బాబా లీలలను వినడంతో అప్పటికే బాబా దర్శనభాగ్యం కోసం తహతహలాడుతున్న దీక్షిత్ యొక్క ఆరాటం ఇంకా ఎక్కువైంది. తానొచ్చిన పని పూర్తవుతూనే 'శిరిడీకి ఎలా వెళ్ళాలి? అక్కడికి నన్నెవరు తీసుకొని వెళతారు? ఎవరు నా వెంట వచ్చి నన్ను బాబా సన్నిధికి తీసుకొని వెళ్లి వారి పాదాలపై పడవేస్తారు' అని చింతించసాగాడు. ఆ విషయాన్ని కాకాసాహెబ్ మిరీకర్‌తో చర్చించాడు. గుర్రపుపందేల కోసం అహ్మద్‌నగర్ వచ్చిన కోపర్గాఁవ్ మామల్తదారు, మిరీకర్ గారి కుమారుడు బాలాసాహెబ్ మిరీకర్ కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నాడు. తండ్రీకొడుకులిద్దరికీ ఆ సమయంలో ఏవో పనులున్నందున దీక్షిత్ వెంట ఎవరిని శిరిడీ పంపాలన్న ఆలోచనలో పడ్డారు. మానవుడి ఆలోచన ఒకటైతే పరమేశ్వరుని సంకల్పం మరొకటి. తమ దర్శనంకోసం తపిస్తున్న భక్తుని ప్రబలమైన కోరికను తీర్చటానికి సాయిసమర్థులు చేసిన ఏర్పాట్లు చూడండి.

శిరిడీలో ఉన్న మాధవరావు దేశ్‌పాండేకి 'తన అత్తగారి ఆరోగ్యం బాగోలేదని, వెంటనే బయలుదేరి భార్యతో సహా అహ్మద్‌నగర్ రమ్మ'ని తన మామగారి నుండి టెలిగ్రామ్ వచ్చింది. దాంతో మాధవరావు బాబా అనుమతి తీసుకొని భార్యతో కలిసి శిరిడీ నుండి బయలుదేరి చితలీలో మధ్యాహ్నం మూడు గంటల రైలులో అహ్మద్‌నగర్ చేరుకున్నాడు. వారివురూ ఇంటి గుమ్మం వద్ద టాంగా నుండి దిగుతుండగా ఆ మార్గాన గుర్రపుపందేలకు వెళ్తున్న నానాసాహెబ్ ఫన్సే, అప్పాసాహెబ్ గద్రేలు చూసి అత్యంత ఆశ్చర్యానందాలకు లోనై, 'భాగ్యవశాత్తూ మాధవరావు ఇక్కడికి వచ్చాడు. దీక్షిత్‌ని శిరిడీ తీసుకొని వెళ్ళడానికి ఇంతకంటే మంచి తోడు ఎవరు?' అని అనుకున్నారు. వెంటనే మాధవరావుని కలిసి, "మిరీకరు ఇంటికి కాకాసాహెబ్ దీక్షిత్ వచ్చాడు. అతను మాకు మంచి స్నేహితుడు. మీరు అక్కడికి వెళ్ళండి. దీక్షిత్‌తో మీకు పరిచయమవుతుంది. అతను శిరిడీ వెళ్లాలని అత్యంత కుతూహలంతో ఉన్నాడు. మీ రాక అతనికెంతో సంతోషాన్నిస్తుంది" అని అన్నారు. తరువాత ఆ సమాచారాన్ని దీక్షిత్‌కి కూడా తెలియజేశారు. దాంతో దీక్షిత్ చింత దూరమై సంతోషం కలిగింది. ఇక్కడ అత్తమామామల ఇంటికి చేరిన మాధవరావుకు తన అత్తగారి ఆరోగ్యం మెరుగుపడిందని తెలిసి ఆనందంగా కాసేపు విశ్రమించాడు. అంతలో మిరీకరు వద్దనుండి పిలుపు వచ్చింది. ఆ ఆహ్వానాన్ని అందుకొని మాధవరావు సాయంకాల సమయాన దీక్షిత్‌ని కలవటానికి బయలుదేరి వెళ్ళాడు. బాలాసాహెబ్ మిరీకర్ వారివురికీ పరిచయం చేశాడు. ఇద్దరూ అదేరోజు రాత్రి 10 గంటల రైలులో శిరిడీ ప్రయాణమవ్వాలని నిశ్చయించుకున్నారు. తరువాత జరిగిన అద్భుతం చూడండి.

ఇంతలో బాలాసాహెబ్ మిరీకర్ అక్కడే ఉన్న ఒక చిత్రపటంపైనున్న పరదాను తొలగించాడు. అది సాయిభక్తుడైన మేఘ నిత్యమూ పూజించే బాబా చిత్రపటం. ఆ పటం యొక్క అద్దం పగిలిపోవడం వలన దాన్ని బాగుచేయించటానికి బాలాసాహెబ్ శిరిడీ నుండి నగర్‌కు తెచ్చాడు. గుర్రపుపందేలు పూర్తయి అతను తిరిగి వెళ్ళటానికి ఇంకా సమయం ఉంది. అందువలన అతను ఆ చిత్రపటాన్ని మాధవరావుకిచ్చి, "బాబా సహచర్యంలో సంతోషంగా శిరిడీ వెళ్ళండి" అని చెప్పాడు. సర్వాంగ సుందరమైన ఆ చిత్రపటంపై మొదటిసారి దృష్టిపడగానే దీక్షిత్ మనస్సు ఆనందంతో నిండిపోగా భక్తితో బాబాకు నమస్కరించి, తదేకంగా బాబా వైపే చూడసాగాడు. నిర్మలమూ, మనోహరమూ అయిన సాయిసమర్థుల దర్శనంతో అతని కళ్ళు చెమర్చాయి. తాను ఎవరి దర్శనం కోసమైతే ఆరాటపడుతున్నాడో వారే చిత్రపటం రూపంలో మార్గమందే దర్శనమివ్వడం అతనికి అత్యంత ఆనందాన్ని కలిగించింది. అతని మనసులోని కోరికను తీర్చటానికి సాయిసమర్థులే ఆ మిషతో మిరీకరు ఇంటికి వచ్చినట్లుగా ఉంది. లేకపోతే, శిరిడీలోని బాబా పటం అప్పుడే అక్కడికి ఎందుకు రావాలి?

అనుకున్న ప్రకారం ఆరోజు రాత్రి భోజనం తరువాత దీక్షిత్, మాధవరావులు బాబా చిత్రపటాన్ని తీసుకొని రైల్వేస్టేషనుకి వెళ్లి, రెండవతరగతి రైలుటిక్కెట్లు తీసుకొన్నారు. పదిగంటలవుతూనే రైలు వచ్చింది. అయితే రెండవతరగతి బోగీ ప్రయాణీకులతో క్రిక్కిరిసిపోయి ఉండటంతో ఇద్దరికీ చింత పట్టుకుంది. 'బండి కదలడానికి కాస్త సమయమే ఉంది. ఇప్పుడెలా? ఏమి చేయాలి?' అని అనుకుంటూ 'వెనక్కి వెళ్ళిపోయి మరునాడు శిరిడీ ప్రయాణమవుదామ'ని ఇద్దరూ నిశ్చయించుకున్నారు. అంతలో అకస్మాత్తుగా రైలుబండిలో దీక్షిత్‌కు పరిచయమున్న గార్డు కనిపించాడు. ఆ గార్డు వారివురికీ మొదటితరగతి బోగీలో ప్రయాణించే ఏర్పాటు చేశాడు. ఇద్దరూ బోగీలో కూర్చున్నాక బాబా గురించి మాట్లాడుకోసాగారు. మాధవరావు ప్రేమావేశంతో అమృతమంటి బాబా లీలల గురించి చెప్తుంటే దీక్షిత్‌లో ఆనందం పొంగిపొర్లింది. సమయం చాలా త్వరగా గడిచిపోయింది. ప్రయాణం చాలా ఆనందంగా ముగిసింది. రైలు కోపర్గాఁవ్ చేరుకుంది. ఇద్దరూ సంతోషంగా రైలు దిగారు. అక్కడ అనుకోకుండా వాళ్ళిద్దరికీ నానాసాహెబ్ చాందోర్కర్ కనిపించాడు. నానా కూడా బాబా దర్శనానికి శిరిడీ వెళ్తున్నాడు. అతన్ని కలుసుకున్నందుకు దీక్షిత్ చాలా ఆనందించాడు. యాదృచ్ఛికంగా ఒకరినొకరు కలుసుకున్నందుకు ముగ్గురూ ఆశ్చర్యపోయారు. తరువాత ముగ్గురూ టాంగా కట్టించుకొని ఆనందంగా మాట్లాడుకుంటూ అక్కడినుండి బయలుదేరారు. మార్గమందు గోదావరిలో స్నానం చేసి పవిత్ర శిరిడీ క్షేత్రానికి చేరుకున్నారు.

1909, నవంబరు 2న దీక్షిత్ తొలిసారి బాబాను దర్శించాడు. బాబాను దర్శించినంతనే అతని హృదయం ద్రవించిపోగా ఆనందం కన్నీళ్ల రూపంలో ఉప్పొంగింది. అంతలో బాబా అతనితో, "నేను నీకోసమే ఎదురుచూస్తున్నాను. అందుకే నిన్ను తీసుకురావడానికి షామాను నగరుకు పంపాను" అని అన్నారు. ఆ మాటలు వింటూనే దీక్షిత్ శరీరంలోని అణువణువూ ఆనందంతో పులకించింది. భావోద్వేగంతో కంఠం గద్గదమయింది. మనసంతా ఆనందమయమైంది. శరీరమంతా చెమటలు పట్టి వణకసాగింది. ఆత్మానందభరితుడై కనులు అర్థనిమీలితాలయ్యాయి. "ఈరోజు నా కళ్ళు వాటి సార్థకతను పొందాయి" అంటూ బాబా పాదాలను ఆలింగనం చేసుకున్నాడు దీక్షిత్. అతను పొందిన ఆనందం ప్రపంచంలో మరెక్కడా దొరకనిది. నిజంగా అతను ధన్యుడు.

ఆ తరువాత ముందుగా అనుకున్నట్లే దీక్షిత్ తన స్నేహితులైన శ్రీ అన్నాసాహెబ్ దభోల్కర్, శ్రీ హరినారాయణ ఆప్టేలకు బాబా గురించి చెప్పాడు. వారిలో దభోల్కర్ 1910లో బాబాను దర్శించి వారికి భక్తుడై, వారి అనుమతితో శ్రీసాయిసచ్చరిత్ర గ్రంథాన్ని రచించాడు. నారాయణ ఆప్టేకు మాత్రం బాబా దర్శనభాగ్యం లభించలేదు.  

బాబా యొక్క ప్రథమ దర్శనం దీక్షిత్‌పై ఎప్పటికీ చెరిగిపోని శాశ్వతముద్రను వేసి, బాబాపట్ల అత్యంత అభిమానాన్ని, అనుబంధాన్ని పెంచుకునేలా చేసింది. అప్పటినుండి అతను తరచూ శిరిడీ వచ్చి బాబా సన్నిధిలో గడుపుతుండేవాడు. అప్పటికి అతని వయస్సు కేవలం 45 సంవత్సరాలు. ప్రముఖ న్యాయవాదిగా మంచి లాభదాయకమైన ప్రాక్టీస్, గొప్ప పేరుప్రఖ్యాతులు, సమాజంలోని పెక్కుమందితో పరిచయాలు, సామాజిక, రాజకీయ రంగాలలో గొప్ప ప్రభావాన్ని కలిగివున్న అతను కావాలనుకుంటే అత్యంత గౌరవాన్ని, అధిక సంపదలను పొందే అవకాశాలు చాలా ఉన్నాయి. కానీ అతని హృదయం మహత్తరమైన సాయి సన్నిధిని వరించింది. బాబా సన్నిధి ముందు, వారి కృపాకటాక్షవీక్షణాల ముందు లౌకిక సుఖాలు అత్యల్పమనిపించి వాటన్నింటినీ ఉపేక్షించసాగాడు. బహుశా, అద్భుత వ్యక్తిత్వం గల సాయిబాబా దర్శనం అతని మనసును ప్రాపంచిక ఆకర్షణల నుండి దూరం చేసేందుకు బలమైన ప్రేరణ అయింది.

అంతలా తమను ఆశ్రయించిన దీక్షిత్‌ను ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నపరిచేందుకు బాబా అతని బాధ్యతతో పాటు అతని కుటుంబ సంరక్షణ బాధ్యతలను కూడా చేపట్టారు. ఒకసారి దీక్షిత్ శిరిడీలో ఉన్నప్పుడు ఎప్పటిలాగే బాబా దర్శనానికి మసీదుకు వెళ్ళాడు. అప్పుడు బాబా అతనితో, "కాకా, నీకెందుకు ఆందోళన? నీ బాధ్యత అంతా నాది" అని అన్నారు. అందుకతను కృతజ్ఞతాపూర్వకంగా బాబాకు నమస్కరించినప్పటికీ, అప్పుడుగానీ, అంతకుముందుగానీ తాను ఏమీ చెప్పనిదే బాబా ఆ మాటలు ఆరోజే ఎందుకు చెప్పారో అతనికి అర్థం కాలేదు. కొన్నిరోజుల తరువాత అతను విల్లేపార్లేలో తన ఇంటికి వెళ్ళినప్పుడు సరిగ్గా శిరిడీలో బాబా తనతో, "నీ బాధ్యత నాది" అని  హామీ ఇచ్చినప్పుడే తన ఎనిమిది సంవత్సరాల కూతురు వత్సల పెద్ద ప్రమాదం నుండి బయటపడిందని తెలిసింది. ఆ సమయంలో వత్సల ఇంటిలోని ఒక పెద్ద అలమరా వద్ద ఆడుకుంటోంది. ఆ అలమరా నిండా పెద్ద పెద్ద బొమ్మలున్నాయి. తను ఆడుకుంటూ ఆడుకుంటూ అలమారా పైకెక్కే ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో ఆ అలమరా తిరగబడింది. ఆశ్చర్యకరంగా అందులోని బొమ్మలన్నీ తన మీద పడకుండా ఒక ప్రక్కకు పడిపోయాయి. జరిగిన ప్రమాదం వలన తన చేతికున్న గాజులు విరిగి చిన్నగా గీరుకోవడం తప్ప తనకు ఎలాంటి హానీ జరగలేదు. ఈ విషయం తెలిశాక దీక్షిత్‌కి తన గురుదైవమైన శ్రీసాయి యొక్క దైవికశక్తి, కరుణ గురించి అర్థమై, 'నీ బాధ్యత అంతా నాదే' అని సాయి తనకు భరోసా ఇచ్చినప్పుడే విల్లేపార్లేలో ఆ బాధ్యతను నెరవేర్చారని గ్రహించాడు. ఆ ఒక్కసారే కాదు, అనేకమార్లు బాబా అతనికి ఆ భరోసానిచ్చారు. అంతేకాకుండా, పరిస్థితులేవైనా, సమయమేదైనా తమ మాట నిత్యసత్యమని తిరుగులేని నిదర్శనాన్ని ఇచ్చారు. సామాన్య మానవుడెవరూ అటువంటి భరోసానివ్వలేడు. అత్యంత శక్తిసంపన్నులైన బాబా మాత్రమే ఇవ్వగలరు. ఆ సంఘటనతో శ్రీసాయి సాక్షాత్తూ దైవస్వరూపులనీ, దైవికమైన వారి శక్తి అపారమైనదనీ, తనతో పాటు తన కుటుంబసభ్యులందరి బరువు బాధ్యతలు వారి భుజస్కందాలపై ఉన్నందున ఏ హాని గురించీ భయపడనవసరంలేదని దీక్షిత్‌కు అనిపించింది. ఆ విషయాన్ని అతనెప్పుడూ మరచిపోలేదు.

క్రమంగా దీక్షిత్‌కు బాబా పాదాల యందు స్థిరమైన విశ్వాసం కుదిరి, తన తనువును వారి సేవకే అంకితం చేయాలనిపించింది. అందువలన ఒక సంవత్సర కాలంలోనే అతను బాబా సన్నిధిలో ఒక వాడా(ఇల్లు) నిర్మించుకొని అక్కడే ఉండిపోవాలని సంకల్పించాడు. తన వ్యాపారంలోని 25 వాటాలు అమ్మి ఒక షెడ్డు నిర్మించుకొని, దానిపై రేకులు కప్పించుకుంటే శిరిడీ సందర్శించే యాత్రికులకు కూడా ఉపయోగపడుతుందని మొదట తలచినప్పటికీ, ఆ తర్వాత పెద్ద భవన నిర్మాణం చేపట్టదలిచాడు. 1910, డిసెంబరు 10న బాబా అనుమతి తీసుకొని, అదే శుభసమయమని తలచి వాడా నిర్మాణానికి శంకుస్థాపన చేశాడు. అప్పటివరకు ఎంత చెప్పినా శ్రీసాయిని దర్శించడానికి సామాన్యంగా అంగీకరించని అతని సోదరుడు కూడా ఆ శుభదినాన శిరిడీ చేరాడు. ఆనాడే చావడిలో శేజ్ ఆరతి ప్రారంభమవడం వలన ఆరోజు చిరస్మరణీయమైనది. ఐదు మాసాలలో ఆ భవన నిర్మాణం పూర్తయింది. 1911, ఏప్రిల్ నెలలో పవిత్రమైన శ్రీరామనవమినాడు దీక్షిత్ గృహప్రవేశం చేశాడు. అతను తన ఏకాంత ధ్యానానికి మేడ మీద ఒక్క గదిని మాత్రం ఉంచుకొని మిగిలిన భవనమంతా బాబా దర్శనానికి వచ్చే భక్తుల వినియోగానికి ఇచ్చేశాడు. అదే ప్రఖ్యాతమైన ‘దీక్షిత్ వాడా’.

source: లైఫ్ అఫ్ సాయిబాబా by బి.వి.నరసింహస్వామి, శ్రీసాయి సచ్చరిత్ర.
రెఫరెన్సు: దీక్షిత్ డైరీ బై విజయకిషోర్. 

  

 తరువాయి భాగం కోసం బాబా పాదాలు తాకండి.

2 comments:

  1. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  2. Om sri sai nathaya namaha
    Om sri sai nathaya namaha
    Om sri sai nathaya namaha
    Om sri sai nathaya namaha
    Om sri sai nathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers


Blog Logo