- మనస్పర్థలు తొలగించిన బాబా
- సాయినాథుని దయవల్ల ఉదయానికల్లా తగ్గిన జ్వరం
మనస్పర్థలు తొలగించిన బాబా
పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు ఇటీవల బాబా తనకి ప్రసాదించిన ఒక అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:
సాయిభక్తులకు నా నమస్సులు. నేను బాబాను తలవని రోజంటూ ఉండదు. ఇంతకుముందు ఈ బ్లాగులో, మా అబ్బాయికి పెళ్ళి కుదిరిందనీ, తరువాత ఆ అమ్మాయికి విదేశాలకు వెళ్ళే అవకాశం వచ్చిందనీ, కానీ తను విదేశాలకు వెళ్ళడం మా అబ్బాయికి ఇష్టం లేకపోవటంతో వారిద్దరి మనసులు కష్టపడకుండా ఉండేలా అనుగ్రహించమని బాబాను వేడుకున్నాననీ, బాబా అనుగ్రహం వల్ల వారిద్దరూ సమాధానపడ్డారనీ మీతో పంచుకున్నాను. అయితే, అనుకోకుండా మళ్ళీ ఆ అమ్మాయికి విదేశాలకు వెళ్లే అవకాశం రావటంతో తను విదేశాలకు వెళ్ళటానికి ఒప్పుకోమని మా అబ్బాయిని అడగటం మొదలుపెట్టింది. కానీ తను విదేశాలకు వెళ్ళడం మా అబ్బాయికి ఇష్టం లేదు. ఆ అమ్మాయి ఆ విషయం గురించి తన తల్లిదండ్రులను సంప్రదించింది. వాళ్ళు, “మీ అత్తగారింట్లో వాళ్ళ ఇష్టం” అన్నారు. తరువాత మా అబ్బాయి నాకు ఫోన్ చేసి, “అమ్మా! ఆ అమ్మాయికి విదేశాలకు వెళ్ళే అవకాశం వచ్చిందట. కానీ తనను విదేశాలకు పంపడం నాకు ఇష్టం లేదు. నువ్వు తన తల్లిదండ్రులతో ఒకసారి మాట్లాడు” అన్నాడు. కానీ నేను ముందు ఆ అమ్మాయితో మాట్లాడదామని తనకు ఫోన్ చేశాను. ఆ అమ్మాయి నాతో, “అత్తమ్మా, మీ కోడలికి విదేశాలకు వెళ్ళే అవకాశం వచ్చిందంటే మీకు సంతోషమే కదా! నాపై నమ్మకంతో ఆ ప్రాజెక్టుకు నన్ను సెలెక్ట్ చేశారు” అంది. నేను తనతో, “నీకు విదేశాలకు వెళ్ళే అవకాశం రావటం నాకు సంతోషమే అమ్మా. నీవు నా కూతురులాంటిదానివి. (మాకు ఇద్దరూ కొడుకులే.) కానీ, నీవు పెళ్ళి చేసుకున్న వెంటనే 3, 4 నెలల పాటు విదేశాలకు వెళితే మా అబ్బాయి ఇక్కడ క్రొత్తింట్లో ఒంటరిగా ఉండాలి కదా. పెళ్లయిన వెంటనే మీరిద్దరూ విడివిడిగా ఉండటం నాకు ఇష్టం లేదు. నువ్వేమీ బాధపడకు. ఇద్దరూ హైదరాబాదులోనే ఉద్యోగం చేసుకుంటూ సంతోషంగా ఉండండి” అన్నాను. కానీ ఆ అమ్మాయి, “చూద్దాం, ఆలోచిస్తాను” అన్నది. ‘మీ అమ్మతో మాట్లాడనా?’ అని అడిగితే తను ‘సరే’నంది. నేను వాళ్ళ అమ్మతో మాట్లాడాను. ఆమె, “వదినమ్మా, మా అమ్మాయి విదేశాలకు వెళ్ళడం మాకు కూడా ఇష్టం లేదు” అంది. తరువాత ఆవిడ తన అన్నయ్యను పిలిపించి వాళ్ళ అమ్మాయికి నచ్చజెప్పమని చెప్పింది. వాళ్ళ మామయ్య ఆ అమ్మాయితో, “పెళ్ళయ్యాక ఇలా విడివిడిగా ఉండాల్సి వస్తే ఎవరూ పంపరు. మీ అత్తింటివాళ్ళ స్థానంలో మేమున్నా నిన్ను విదేశాలకు పంపము” అని ఆ అమ్మాయికి నచ్చజెప్పారు. అందరి మాటలూ విన్న తరువాత ఆరోజు రాత్రి పది గంటల సమయంలో ఆ అమ్మాయి తన నిర్ణయం మార్చుకుంది. కానీ తన మనసులో మాత్రం విదేశాలకు వెళ్ళాలనే ఉంది. దాంతో తను మా అబ్బాయితో ముభావంగా ఉండసాగింది. ఆ విషయం మా అబ్బాయి నాకు చెప్పాడు. పెళ్ళి తేదీ దగ్గర పడుతుండగా (2021, మే నెలలో) ఆ అమ్మాయి అలా ఉండటంతో నాకు చాలా బాధగా అనిపించింది. దాంతో నేను, “మా అబ్బాయి, కోడలు ఇద్దరూ ముభావంగా లేకుండా సంతోషంగా కలిసిమెలిసి ఉండేలా అనుగ్రహించమ”ని కన్నీళ్ళతో బాబాను వేడుకుంటూ, కళ్ళు మూసినా, తెరచినా ‘సాయీ, సాయీ’ అని తలచుకుంటూ, సాయిచాలీసాను చదువుకుంటూ, “వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నారని తెలిసిన వెంటనే ఆ అనుభవాన్ని సాయి మహారాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని బాబాకు మ్రొక్కుకున్నాను. సచ్చరిత్ర సప్తాహపారాయణ కూడా ప్రారంభించాను. నేను బాబాను ఎప్పుడు ఏది అడిగినా ఆయన ఎన్నడూ నన్ను నిరాశపరచరు. అలాగే ఇప్పుడు కూడా. బాబా అనుగ్రహంతో మా అబ్బాయి, కోడలి మధ్య విభేదాలు తొలగిపోయి ఇద్దరూ ఆనందంగా ఉన్నారని తెలిసింది. అది తెలిసిన వెంటనే ఎంతో ఆనందంతో బాబాకు కృతజ్ఞతలు తెలుపుకున్నాను. బాబాకు ఇచ్చిన మాట ప్రకారం వెంటనే నా అనుభవాన్ని మీతో పంచుకున్నాను.
సాయినాథుని దయవల్ల ఉదయానికల్లా తగ్గిన జ్వరం
పేరు వెల్లడించని ఒక సాయి భక్తురాలు ఇటీవల బాబా తనకి ప్రసాదించిన ఒక చిన్న అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు:
సాయిబంధువులందరికీ నా నమస్కారం. ముఖ్యంగా ఈ సాయి మహారాజ్ సన్నిధి బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారం. బాబా నాకు ప్రసాదించిన ఒక చిన్న అనుభవాన్ని ఇప్పుడు మీతో పంచుకుంటాను. ఇటీవల మా బాబుకి 103 డిగ్రీల జ్వరం వచ్చింది. బాబు అలా జ్వరంతో బాధపడుతుంటే చూసి తట్టుకోలేని నేను బాబాకు నమస్కరించుకుని, “బాబా! బాబుకి జ్వరం చాలా ఎక్కువగా ఉంది. బాబు జ్వరం త్వరగా తగ్గేలా చేయి తండ్రీ! మీ దయవల్ల బాబు జ్వరం త్వరగా తగ్గిపోతే నా అనుభవాన్ని సాయి మహరాజ్ సన్నిధి బ్లాగులో పంచుకుంటాను” అని మ్రొక్కుకున్నాను. సాయినాథుడు నా మొర ఆలకించాడు. మన సద్గురు సాయినాథుని దయవల్ల మరునాడు ఉదయానికల్లా బాబుకు జ్వరం తగ్గి శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి వచ్చింది. ఎంతో సంతోషంతో బాబాకు మనసారా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. “శతకోటి నమస్కారాలు తండ్రీ! మా అమ్మ సమస్యను కూడా త్వరగా పరిష్కరించు తండ్రీ!” బాబా దయతో మా అమ్మ సమస్య పరిష్కారమైతే ఆ అనుభవంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.
సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు!
Om Sairam
ReplyDelete🙏🙏🙏
Om sai ram if we understand each other there is no problem in life. Om sai ram my kodalu is good girl. I also love her. We both understand each other. No problems. With Sai's blessings my house was with peace
ReplyDeleteSai ram both leelas are good, I am a unmarried girl waiting on baba to fulfill my wish, how good aunty is in first leela, she is praying for their happiness, to get such a sweet mother in law is a blessing, hope baba bless me also in such a way
ReplyDeleteOm sai ram baba please amma arogyam bagundali thandri
ReplyDeleteOM SRI SACHIDHANAMDHA SAMARDHA SATHDGURU SAINATHAYA NAMAH..Om Sai Ram
ReplyDelete