- మనకు అంతా సాయిబాబానే - మన బాగోగులు చూసుకొనేది ఆయనే - రెండవ భాగం
నిన్నటి తరువాయి భాగం....
మూడవ అనుభవం:
మా చెల్లెలి కుటుంబానికి కరోనా వచ్చిన నెలరోజులకి మా పెద్దబ్బాయి వద్దన్నా వినకుండా తన స్నేహితులతో క్రికెట్ ఆడటానికి రెండు మూడుసార్లు బయటికి వెళ్ళాడు. అంతే, మూడవసారి క్రికెట్ ఆడి ఇంటికి వచ్చేటప్పటికి జలుబు, దగ్గు, గొంతునొప్పి, నీరసం మొదలయ్యాయి. తను మెడికల్ స్టూడెంట్ కావడంతో, “వెంటనే యాంటీబయాటిక్ కోర్స్ స్టార్ట్ చేసి 24 గంటలయ్యాక కోవిడ్ టెస్ట్ చేయించుకుంటాను” అన్నాడు. కానీ మరుసటిరోజు ఉదయానికి మా చిన్నబ్బాయికి కూడా కరోనా లక్షణాలు మొదలైపోయాయి. అప్పటికి వాడికి సర్జరీ జరిగి నెలన్నర అయింది. మాకు ఒకటే పిచ్చ టెన్షన్. వెంటనే నేను, మావారు, మా అబ్బాయిలిద్దరూ కరోనా టెస్ట్ చేయించుకున్నాము. మా పిల్లలకు పాజిటివ్, మాకు నెగిటివ్ వచ్చింది. అందరూ ఆశ్చర్యపోవటం, పిల్లలకు పాజిటివ్ ఉండి మీకు రాలేదు అని. మా చిన్నబ్బాయి ఎప్పుడూ నా చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. కానీ నా మనస్సుకు ఒక్కటే అనిపించింది, “బాబా బిడ్డలు వాళ్ళు, వాళ్ళకి ఈ సమయంలో ఏ లోటూ లేకుండా చూడాలి కాబట్టి నన్ను, నా భర్తను నార్మల్‌గా ఉంచారు” అని. బాబా దయవల్ల చిన్నబాబుకి కరోనా లక్షణాలు పెద్దగా ఏమీ లేవు, రుచి లేకపోవడం, నీరసం తప్ప. పెద్దబాబుకి మాత్రం జలుబు, దగ్గు, రుచిలేకపోవటం, థ్రోట్ ఇన్ఫెక్షన్ లాంటి లక్షణాలు వచ్చాయి. మా చెల్లెలి కుటుంబానికి వైద్యం చేసిన డాక్టరుని సంప్రదిస్తే వెంటనే కొన్ని మందులు సూచించి, పిల్లలిద్దరినీ వేరు వేరు గదుల్లో ఒక వారంరోజుల పాటు ఉంచి, కొద్దిరోజుల తరువాత మావారిని, నన్ను మరోసారి కోవిడ్ టెస్ట్ చేయించుకోమని చెప్పి, పిల్లలకు మంచి పౌష్ఠికాహారం ఇవ్వమనీ, వాళ్ళు ఎంత తింటే అంత పెడుతూనే ఉండమనీ, అప్పుడే వాళ్ళు త్వరగా కోలుకుంటారనీ చెప్పారు. ఇక ఆ వారమంతా పిల్లలకు మూడు పూటలా ఏది కావాలంటే అది వండటం, మావారు మా పెద్దబ్బాయిని చూసుకోవటం, నేను మా చిన్నబ్బాయిని చూసుకోవటం, ఇంతే. పిల్లలకు కరోనా పాజిటివ్ అని తెలిసినప్పుడు మావారు ఒక్కటే అన్నారు, ‘అయ్యో, పిల్లలకు కరోనా వచ్చిందే, మనకు వచ్చినా బాగుండేది’ అని. కానీ ఆ తరువాత, “మనకు వచ్చుంటే ఇలా ఎవరు చూసుకుంటారు, ఎవరు వండిపెడతారు? అలా కాకుండా, పిల్లలకు వచ్చింది అనే బాధ ఉన్నప్పటికీ మనకు ఏమీ లేకుండా చూసి, పిల్లలిద్దరికీ ఏ లోటూ రాకుండా బాబా మనతో అన్ని పనులూ చేయించారు” అని అనుకున్నాము. నిజంగా, కరోనా నుంచి బయటపడాలంటే ఒక్కటే మార్గం, ఆ సమయంలో ఎంత పౌష్ఠికాహారం తింటే అంత బలం. ఆ ఇన్ఫెక్షన్‌ను ఎదుర్కోవటానికి శరీరానికి మందులతో పాటు అంతకన్నా ఎక్కువగా పౌష్ఠికాహారం అందించాలి. ఒకవేళ మా నలుగురికీ పాజిటివ్ వచ్చివుంటే మమ్మల్ని అలా జాగ్రత్తగా చూసుకోవటానికిక ఎవరుంటారు? బాబా దయవల్ల కేవలం ఒక్క వారంరోజుల్లో పిల్లలు పూర్తిగా కోలుకుని నార్మల్ అయ్యారు. మధ్యలో నేను, మావారు టెస్ట్ చేయించుకుంటే మాకు నెగిటివ్ వచ్చింది.
నాల్గవ అనుభవం:
డిసెంబరు మొదటివారం నుండి మావారికి విపరీతమైన నడుంనొప్పి వస్తోంది. టాబ్లెట్స్ వేయగానే నొప్పి తగ్గుతుండటంతో ఆయన నడుంనొప్పి మెల్లగా అదే తగ్గిపోతుందని వదిలేసేవారు. డిసెంబరు ఆఖరివారం ప్రారంభంలో విపరీతమైన నొప్పి రావటంతో మాకు తెలిసిన డాక్టర్ స్కానింగ్ చేయించమన్నారు. స్కానింగులో అంతా నార్మల్ అని వచ్చింది. పెయిన్ కిల్లర్ వేసుకోగానే నొప్పి తగ్గిపోయింది. దాంతో, డాక్టర్ ‘అది యూరినరీ ఇన్ఫెక్షన్’ అని చెప్పి మందులిచ్చారు. డిసెంబరు 31వ తారీఖు రాత్రి మా పిల్లలిద్దరూ వాళ్ళ స్నేహితుల ఇంట్లో క్రొత్త సంవత్సర వేడుక జరుపుకుంటామని చెప్పి వెళ్ళిపోయారు. మావారు రాత్రి 8 గంటలకు ఆఫీసు నుండి తిరిగి వస్తూ నాకు ఫోన్ చేసి, “నడుంనొప్పి భరించలేనంతగా ఉంది, అలాగే వస్తున్నాన”ని చెప్పారు. 31వ తారీఖు రాత్రి దాదాపు అన్ని హాస్పిటల్స్ మూసివుంటాయి. మావారి పరిస్థితి చూసి ఏమి చేయాలో తెలీక దగ్గరలో ఉన్న హాస్పిటల్‌కి ఫోన్ చేస్తే, “డాక్టరుగారు మరో పది నిమిషాల్లో వెళ్ళిపోతారు, ఈలోపు వచ్చేలా చూడండి” అన్నారు. మావారు ఆ నొప్పికి అస్సలు తట్టుకోలేకపోతున్నారు. అసలేం జరుగుతోందో మా ఇద్దరికీ అర్థం కావటం లేదు. వెంటనే నేను ఆయన్ని కారులో హాస్పిటల్‌కి తీసుకెళ్ళాను. అప్పటికే హాస్పిటల్ నుండి బయలుదేరుతున్న డాక్టరుగారు మమ్మల్ని, మావారి పరిస్థితి చూసి, “వెంటనే MRI చేయాలి. కిడ్నీలో రాయి ఉంది. అది ఎక్కడ, ఎంత పరిమాణంలో ఉందో వెంటనే చూడాలి” అని చెప్పి, ఆయనే స్వయంగా దగ్గర్లో ఉన్న డయాగ్నస్టిక్ సెంటరుకి ఫోన్ చేసి, “అప్పుడే క్లోజ్ చేయొద్దు, ఈ MRI చాలా అర్జెంటు” అని వాళ్లకు చెప్పారు. వాళ్లు మావారికి MRI స్కానింగ్ చేసి వెంటనే అరగంటలో ఆ రిపోర్టును డాక్టరుకి పంపించేశారు. డాక్టర్ చెప్పినట్టే ఆ రిపోర్టులో కిడ్నీలో రాయి ఉంది. దానివల్ల అంత భరించలేనంత నొప్పి ఉంటుందని మా ఇద్దరికీ తెలియదు. మావారు నొప్పిని అస్సలు భరించలేకపోతున్నారు. వెంటనే IV(Intravenous) స్టార్ట్ చేశారు. పెయిన్ కిల్లర్ వల్ల ఆయనకి అస్సలు నొప్పి తగ్గట్లేదు. ఈ నొప్పి కన్నా చావు మేలు అని తను అంటుంటే నాకు ఒకటే ఏడుపు. 31వ తేదీ రాత్రి 12 గంటలవటంతో క్రొత్త సంవత్సరం వచ్చిందని గోల చేస్తూ మా చుట్టుప్రక్కల అందరూ సందడిగా ఉంటే నేను, మావారు ఆ గదిలో ఏడుస్తూ ఉన్నాము. అలాగే ఒకరినొకరం విష్ చేసుకున్నాము. బాబా ఎందుకు మనకు క్రొత్త సంవత్సరం మొదటిరోజు ఇలా ఇచ్చారో అనుకుంటూ ఉన్నాము. నొప్పి తగ్గక మావారు ఇబ్బందిపడుతున్నారు. అక్కడ డ్యూటీ డాక్టరేమో ‘నొప్పి ఎప్పుడు తగ్గుతుందో చెప్పలేము’ అంటారు. మావారు వేరే పెయిన్ కిల్లర్ డోస్ ఇంకా ఇవ్వమంటారు. వాళ్ళేమో ఇవ్వటం మంచిది కాదు అంటారు. దాంతో డాక్టరుకి కాల్ చేస్తే ఆయన ‘అంతసేపు నొప్పి అలాగే ఉండటం మంచిది కాదు’ అని చెప్పి, వేరే మెడిసిన్ కూడా ఎక్కించమన్నారు. అది ఇచ్చాక మావారికి నొప్పి తగ్గింది. ఆ రాయి బయటికి వచ్చేదాకా ఇలా నొప్పి వస్తుందనీ, నొప్పి వచ్చినప్పుడల్లా ఇంజెక్షన్ తీసుకోవాలనీ చెప్పి మమ్మల్ని ఇంటికి పంపించారు. సరిగ్గా 2 గంటలకు ఇంటికి వచ్చాము. మరలా నొప్పి వస్తుందన్న విషయం మావారిని చాలా భయపెట్టింది. నేను బాబాకు నమస్కరించుకుని, “ప్లీజ్ బాబా, ఆ రాయి బయటికొచ్చేదాకా ఈ నొప్పి లేకుండా మొత్తం తీసేయండి. మరలా మరలా తనకు నొప్పి రాకుండా చూడండి. తన బాధ నేను చూడలేకపోతున్నాను” అని ఆర్తిగా వేడుకున్నాను. ఆ రాయి 15 రోజులకు బయటకు వచ్చింది. అయితే బాబా దయవల్ల ఆ 15 రోజుల్లో మావారు ఏ నొప్పితోనూ బాధపడలేదు. ఒక్కటే అనుకున్నాము, ‘బాబా మన పెద్ద పెద్ద కర్మలను చిన్నవిగా చేసి, అవి దాటడానికి అన్ని మార్గాలనూ ఆయనే ఏర్పాటు చేసి మన చేయి పట్టుకుని మనల్ని దాటిస్తున్నారు' అని.
నిజంగా ఒక్కోసారి చాలా భయమేస్తుంది, ఏడుపు, బెంగ వస్తుంది. కానీ ఆ సమయంలో ఉన్న ఒకే ఆధారం – బాబా. బాబా దగ్గరకు వెళ్ళి చెప్పుకుంటుంటే ఆ భయంలో కూడా ఏదో ధైర్యం వస్తుంది, ఓదార్పు కనిపిస్తుంది. “ఖచ్చితంగా మనల్ని ఈ సమస్య నుండి బయటపడవేయటానికి బాబా ఉన్నారు” అన్న నమ్మకం కుదురుతుంది మాకు. బయటపడే మార్గాన్ని సరైన సమయానికి ఆయనే చూపిస్తారు అని అనుకుంటాము. సమస్య నుండి బయటపడ్డాక అంతా బాబా అనుగ్రహమే అనుకుంటాము. సమస్యలో ఉన్నప్పడు నేను చాలా భయపడిపోయి బాబా దగ్గరే ఉండిపోతాను. సమస్య నుండి బయటపడేయమని నా సాయిఅమ్మను ప్రార్థిస్తాను, బ్రతిమాలుతాను, అడుక్కుంటాను, బెదిరిస్తాను, కోప్పడతాను, అన్నీ చేస్తాను. పిచ్చి పట్టినట్లు నా మనస్సు సాయి చుట్టూ తిరుగుతూనే ఉంటుంది. అదే నా అదృష్టం. సమస్యలో ఉన్నప్పుడు నేను వేరే మార్గాల వైపు వెళ్ళకుండా, వేరే దారులు చూడకుండా ఆయన చుట్టూనే నన్ను త్రిప్పుకుంటూ, నా కర్మానుసారం ఆ సమస్య తీరేదాకా అన్ని రోజులూ నా పిచ్చినంతా భరిస్తూ, నా గోలనంతా సహిస్తూ, కర్మ తీరేరోజున ఆ సమస్యనుండి చిటికెలో బయటపడేస్తారు నా బాబా. సమస్య తీరిన తరువాత తిరిగి చూసుకుంటే అంతా సాయిబాబా అనుగ్రహమే అని అర్థమవుతుంది. ఆయన మన కర్మను తగ్గించడానికి, తీర్చటానికి వేసిన పథకం, ప్రణాళిక ఒక్కసారి అర్థమైతే “ఈ కృప చాలు తండ్రీ!” అని కృతజ్ఞతతో బాబా వద్ద వెక్కి వెక్కి ఏడుస్తాము. బాబా కృపను పొందిన మన భాగ్యానికి, అదృష్టానికి మనం ఎన్ని కోట్లసార్లు బాబాకు కృతజ్ఞత చెప్పినా సరిపోదు. బాబా కృపే మన గొప్ప అదృష్టం. దానికి మించినది మరొకటి లేదు.
Om Sairam
ReplyDeleteSai always be with me
675 days
ReplyDeletesairam
Om Sairam 🙏🙏🙏
ReplyDeleteOm sai ram baba amma problem tondarga cure cheyi thandri sainatha please
ReplyDelete