సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 730వ భాగం....



ఈ భాగంలో అనుభవాలు:

  1. ఎంత దయ సాయికి!
  2. తలచుకున్నంతనే దయ చూపించిన బాబా


ఎంత దయ సాయికి!


పేరు వెల్లడించని ఒక సాయిభక్తురాలు బాబాతో తన అనుబంధాన్ని మనతో పంచుకుంటున్నారు:


సాయిబాబాకు, సాయిభక్తులకు, ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న సాయికి నా నమస్కారాలు. సాయిబాబాకి మా కుటుంబంపై చాలా దయ ఉంది. కానీ ఆ విషయాన్ని నేను చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. ఎలాగంటే... నాకు చిన్నప్పటినుంచి ఆదిదంపతులైన ఆ శివపార్వతులంటే చాలా ఇష్టం. నా చిన్నప్పుడు మాది చిన్న పూరిల్లు. ఆ ఇంటి తలుపుకి శివపార్వతుల ఫోటో ఒకటి ఉండేది. నేను ఏ పని చేస్తున్నా, బయటికి వెళ్తున్నా, లోపలికి వస్తున్నా ఆ ఫోటోలోని శివపార్వతులకు నమస్కరించి వారితో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేదాన్ని. ఒకసారి మా ఊరిలో సాయిబాబా మందిరం నిర్మించాలని సంకల్పించుకుని భక్తులు చందాల సేకరణ ప్రారంభించారు. అప్పుడు మేము చాలా బీదస్థితిలో ఉన్నాము. రోజుకి కేవలం ఐదు రూపాయలకు మాత్రమే పాలు కొనుక్కునే పరిస్థితి మాది. మా నాన్నగారు రైస్ మిల్లులో పనిచేసేవారు. మా అన్నయ్య సినిమా హాలులో ఆపరేటరుగా పనిచేసేవాడు. భక్తులు మా ఇంటికి చందాకు వచ్చినరోజు పాలకోసం ఉంచిన ఐదు రూపాయలు మాత్రమే ఇంట్లో ఉన్నాయి. వచ్చినవాళ్ళకి ఏమివ్వాలో అమ్మకు అర్థంకాలేదు. అప్పుడు ఆ చందాకి వచ్చినవాళ్ళలో ఒక పెద్దావిడ మా అమ్మతో, “పావలా ఉన్నా ఇవ్వమ్మా, చాలు” అని చెప్పింది. దాంతో ఆరోజు పాలకోసమని ఉంచిన ఆ అయిదు రూపాయలు తీసుకొచ్చి ఆ పెద్దావిడకి ఇచ్చాము. బాబా దయవల్ల ఈరోజు 65 రూపాయలు పెట్టి పాలు కొనుక్కుంటున్నాము. మాకు అంత స్తోమత ఇచ్చింది ఆ సాయిబాబానే.


బాబా మందిరం నిర్మించేటప్పుడు నాకు బాబా అంటే ఎవరో, ఏమిటో ఏమీ తెలియదు. “అబ్బో, సాయిబాబా గుడి అంట, ఎవరు వెళ్తారు?” అన్నాను నేను. కానీ, బాబా మందిరం ప్రారంభించిన రోజు నుంచి ప్రతి కార్యక్రమంలోనూ నన్ను భాగస్వామిని చేశారు బాబా. ఆ మందిరంలో బాబా విగ్రహాన్ని పూజ్య గురుదేవులు అమ్ముల సాంబశివరావుగారు ప్రతిష్ఠించారు. సాయిబాబా వార్షికోత్సవానికిగానీ, గురుపౌర్ణమికిగానీ, విజయదశమిరోజుగానీ కమిటీ సభ్యులు మందిరానికి వచ్చేవారు. వారికి కావలసిన ఏర్పాట్లన్నీ బాబా నా చేత చేయిస్తున్నారు. అప్పుడప్పుడు మందిరంలో సాయిసత్యవ్రతం చేసేవారు. ఆ సమయంలో భక్తులకు ఏమి కావాలో, వ్రతం ఎలా చేయాలో, అందుకు కావలసిన పూజాసామాగ్రి ఎలా అందించాలో, ఏది ఎక్కడ ఉందో, కమిటీవారికి కావలసినవి ఎలా అందించాలో అన్నీ నేనే చూసుకుంటాను. ‘ఎవరు వెళతారు గుడికి’ అన్న నాతోనే అన్నీ తానే చేయించారు బాబా. నా మీద ఎంత దయ సాయికి! “బాబా! నిన్ను తెలుసుకోలేనందుకు నన్ను క్షమించు తండ్రీ!” ఒకసారి గుడిలో బాబాకు పూజ చేసే పెద్దావిడకి సూతకం వచ్చినప్పుడు పదిహేను రోజుల పాటు ప్రతిరోజూ సాయిబాబాకి నేనే పూజ చేసి, అభిషేకాలు చేశాను. ఆరతి పాటలు పాడుతూ నాలుగు ఆరతులు ఇచ్చాను. ఇలా అన్ని సేవలూ బాబా నాతో చేయించుకున్నారు. బాబాకి నేనంటే అంత ప్రేమ. బాబా చూపిన ప్రేమను తలచుకుంటే నాకెంతో ఆనందంగా ఉంది. నేను చేసిన పుణ్యం ఏదైనా ఉంటే అది నేను సాయిబాబాకు చేసిన పూజే.


ఒకసారి బాబా మా కుటుంబాన్ని ఒక ఆపద నుండి ఎలా రక్షించారో వివరిస్తాను. మేము చాలా బీదస్థితిలో ఉన్న రోజుల్లో పడుకోవడానికి మంచం కూడా లేక అందరం క్రిందనే పడుకునేవాళ్ళం. ఒకరోజు మా అమ్మని పాము కరిచింది. తనను ఏదో గట్టిగా కుట్టినట్లు అనిపించి అమ్మ లేచి చూస్తే, పాము. చాలా విషపూరితమైన సర్పం అది. ఈ సంఘటన సుమారు అర్థరాత్రి పన్నెండు, ఒంటిగంట మధ్య జరిగింది. అమ్మ గట్టిగా ‘పాము, పాము’ అని అరవటంతో మా నాన్న లేచి ఆ పామును చంపేశారు. మా అన్నయ్య పాము విషం పైకెక్కకుండా అమ్మ కాలికి తాడుతో గట్టిగా కట్టాడు. నేను కొద్దిగా బాబా ఊదీని అమ్మ నోట్లో పెట్టి, మరికాస్త ఊదీని అమ్మ కాలిమీద రాశాను. ఆ రాత్రి సమయంలో పాము విషానికి విరుగుడు ఇంజక్షన్ ఇప్పించడం కోసం అమ్మని రిక్షాలో తీసుకువెళ్లారు. ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము. కానీ ఆ రాత్రి సమయంలో ఎవరూ అమ్మను హాస్పిటల్లో జాయిన్ చేసుకోలేదు. చివరికి బాబా దయవల్ల మరుసటిరోజు ఉదయాన్నే ఒక హాస్పిటల్ వాళ్ళు అమ్మను జాయిన్ చేసుకుని విషానికి విరుగుడు ఇంజక్షన్ చేశారు. సాయి అనుగ్రహంతో మూడు రోజుల తర్వాత అమ్మ నార్మల్ అయింది. ఆ రాత్రంతా నేను అమ్మని కాపాడమని బాబాను ప్రార్థిస్తూ, బాబా జీవితచరిత్రలో శ్యామాను పాము కరిచినప్పుడు బాబా అతనిని కాపాడిన లీలను చదువుతూ, సాయికోటి పుస్తకం రాస్తూ ఉన్నాను. మా అమ్మను కాపాడింది ఏ ఇంజక్షనూ, ఏ డాక్టరూ కాదు, కేవలం ఆ సాయిబాబానే! బాబా ఊదీ పెట్టడం వలన, బాబా లీలను చదవటం వలన బాబానే తోడుగా ఉండి మా అమ్మను రక్షించారు. మా అమ్మకు నయమైతే అయ్యప్పస్వామి మాల ధరిస్తానని మా అన్నయ్య మ్రొక్కుకున్నాడు. ఎలాంటి ఆటంకాలు లేకుండా బాబా మా అన్నయ్య చేత 11 సంవత్సరాలు మాలధారణ చేయించారు. “నా భక్తులకు ఎప్పుడు ఏది అవసరమో అది ఇస్తాను” అన్నారు బాబా. మా కుటుంబం విషయంలో అది అక్షర సత్యమైంది. 


గుర్తు తెచ్చుకుంటుంటే ఒకటి కాదు, రెండు కాదు, ఇలా ఎన్నో విషయాలలో శ్రీసాయిబాబా మా కుటుంబానికి తోడునీడగా ఉండి మమ్మల్ని ఆపదల నుంచి, కష్టాలనుంచి, భయాల నుంచి రక్షిస్తున్నారని తెలుసుకున్నాను. “బాబా! ఎంతో అమోఘమైన మీ కృపను వర్ణించడం నాకు చేతకావట్లేదు. తప్పులేమైనా ఉంటే నన్ను క్షమించండి బాబా! ఈరోజు నా తల్లి, తండ్రి, అన్న, నా భర్త, బిడ్డ, నేను ఇలా ఉన్నాము అంటే అది నీ దయే బాబా! అన్నయ్యకి వివాహం విషయంలో చాలా ఆలస్యం అయింది. అనుకూలవతియైన అమ్మాయిని తీసుకువచ్చి మా అన్నయ్య వివాహం జరిపించు బాబా! ఆలస్యం చేసినా అమృతాన్ని, అంటే జీవితాన్ని ఇస్తావనే నమ్మకంతో ఉన్నాము సాయీ. ‘మనుషులు ఇచ్చేది మాసిపోతుంది, దేవుడు ఇచ్చేది జీవితాంతం ఉంటుంది’ అని నమ్ముకున్నవాళ్ళం బాబా. నీ చల్లని చూపు మాపై ప్రసరించి నా కోరిక తీర్చు తండ్రీ! తప్పకుండా ఆ అనుభవాన్ని ఈ బ్లాగులో పంచుకుంటాను. బాబా! మేము తెలియక చెడు దారిలో వెళ్తున్నా మీ బిడ్డలుగా మమ్మల్ని నీ మార్గంలో నడిపించు తండ్రీ. మాకు సద్బుద్ధిని ప్రసాదించు తండ్రీ. మా అందరినీ పవిత్రమైన సాయి మార్గంలో నడిపించు బాబా. నిన్ను నమ్ముకున్న ప్రతి ఒక్కరికీ తోడునీడగా ఉండు బాబా. నా మనసులోని చంచలత్వాన్ని తొలగించు, నాకు నీవే దిక్కు సాయీ!” 


ఈ బ్లాగులో ప్రచురిస్తున్న బాబా లీలలను, సాయిభక్తుల అనుభవాలను చదువుతూవుంటే ‘అసలు బాబా అంటే ఏంటి’ అనేది తెలుసుకుంటున్నాను. నాకు ఎలా చెప్పాలో, ఏమి చెప్పాలో తెలియక నా మనసులో వచ్చిన ఆలోచనలను మీతో పంచుకున్నాను. తప్పులేమైనా ఉంటే మన్నించండి. నా అనుభవాన్ని మీ అందరితో పంచుకున్నందుకు నా మనస్సు చాలా ఆనందంగా ఉంది, ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది.


తలచుకున్నంతనే దయ చూపించిన బాబా


సాయిభక్తుడు చంద్రకాంత్ తనకు ఇటీవల బాబా ప్రసాదించిన ఒక చిన్న అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


సాయిబంధువులకు, ఈ బ్లాగ్ నిర్వాహకులకు నా నమస్కారం. బాబా దయవలన నాకు చాలా అనుభవాలు కలిగాయి, కలుగుతూనే ఉన్నాయి. ఇటీవల కలిగిన ఒక చిన్న అనుభవాన్ని నేనిప్పుడు మీ అందరితో పంచుకుంటాను. ఈమధ్య నాకు ఒకసారి తల తిరుగుతూ అదోరకంగా అనిపించింది. దాంతో నాకు చాలా భయమేసి ఆ సాయినాథుని తలచుకొని, "తండ్రీ! ఈ కష్టం నుండి నన్ను కాపాడు. నాకు ఏ ఇబ్బందీ లేకుంటే నా అనుభవాన్ని మీ బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. చల్లని తండ్రి, తలచుకున్నంతనే నన్ను ఆ బాధ నుండి బయటపడేశారు. పిలిచిన వెంటనే పలికే నా  సాయినాథుని పాదాలకు శతసహస్రకోటి సాష్టాంగ దండప్రమాణాలు సమర్పించుకుంటూ..  "ఇకముందు కూడా నా వెంటే ఉంటూ నన్ను సమస్యల నుండి కాపాడండి బాబా" అని వేడుకున్నాను.


9 comments:

  1. Om sai ram 1st sai leela she wrote very well. I liked her neration. Baba saved her mom from Posinines snake. That is sai's power. Please cure my icing problem sai deva. Om sai ram��������������

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. Om sai ram first leela is very nice

    ReplyDelete
  4. Om sai ram baba amma problem tondarga cure cheyi baba pleaseeee nenne namukunamu thandri sainatha

    ReplyDelete
  5. Om sai ram,,waiting for ur blessings baba

    ReplyDelete
  6. Om Sree Sachidhanandha Samardha Sadguru Sree Sai Nadhaya Namaha 🕉❤🙏😀😊

    ReplyDelete
  7. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATHAYA NAMAH..OM SAI RAM

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo