సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

కాకాసాహెబ్ దీక్షిత్ - మూడవ భాగం...



బాబా అద్భుత బోధనా పద్ధతి:

ఒకసారి, వేదాంత తత్త్వశాస్త్ర గ్రంథాలలో సంసారం (ప్రాపంచిక జీవితం) గురించిన వర్ణనను చదివినప్పుడు అందులో చెప్పబడ్డ త్రాడు-పాము, ఎండమావి-నీరు, బంగారం-ఆభరణం, మట్టి-మట్టిపాత్రలు వంటి దృష్టాంతాలు ఒకేరకమైనవి కావని దీక్షిత్‌కి అనిపించింది. చీకటిలో త్రాడు పాములా కనిపిస్తుంది; ఎండమావిలో ఇసుకమీద తేలియాడే ఆవిరి దూరంనుంచి నీరులా కనిపిస్తుంది; ఇకపోతే స్వర్ణకారుని దెబ్బలకు బంగారం ఆభరణంగా మారుతుంది; కుమ్మరి తన నైపుణ్యంతో మట్టికి ఆకృతినిచ్చినప్పుడు మట్టిపాత్ర తయారవుతుంది. మొదటి రెండింటిలో - లేనిది ఉన్నట్లుగా కనపడితే, చివరి రెండింటిలో - ఉన్నది వివిధ ఆకృతుల్లో కనపడుతుంది. ఈ విభిన్నమైన దృష్టాంతాలు ఒకే ప్రాపంచిక జీవితానికి ఎలా వర్తిస్తాయో అర్థంకాక దీక్షిత్ చాలా కలవరానికి గురయ్యాడు. ఎంత ఆలోచించినా ఒక సంతృప్తికరమైన నిర్ణయానికి రాలేకపోయాడు. ఒకరోజు అదేమిటో తెలుసుకోవాలని దీక్షిత్ తీవ్రంగా ఆరాటపడుతున్న తరుణంలో, ‘తమకు 100 రూపాయలు కావాల’న్న బాబా సందేశంతో ఒక వ్యక్తి అతని వద్దకు వచ్చాడు. ఆ సమయంలో దీక్షిత్ వద్ద కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఉంది. అతను ఆ విషయాన్నే కబురు తెచ్చిన వ్యక్తికి తెలియజేసి, తన నమస్కారాలనే బాబాకు అందజేయమని చెప్పి పంపించాడు. ఆ వ్య్వక్తి అలా వెళ్ళగానే, 'ఎవరి వద్ద ఎంత ధనముందో అంతర్‌జ్ఞాని అయిన బాబా స్పష్టంగా తెలుసుకోగలరు. ఇక్కడ ఎవరి వద్దా 100 రూపాయలు లేవని వారికి తెలుసు. కాబట్టి నా మనసులో తలెత్తిన సందేహానికి 100 సంఖ్యతో ఏదో సంబంధం ఉండివుండాలి' అని దీక్షిత్‌కి అనిపించింది. వెంటనే అతను బాబా పటం ముందు నిలబడి తనకు మార్గనిర్దేశం చేయమని బాబాను ప్రార్థించాడు. బాబాను ప్రార్థించిన ఐదు నిమిషాల్లో అతనికి 100 సంఖ్యలోని అర్థం ఈ విధంగా స్ఫురించింది: 

“బాబా కోరిన '100' సంఖ్య సంసారానికి (జగత్తుకి) సంకేతం. '100' అంటే 1 ప్రక్కన రెండు సున్నాల చేరిక. అదేవిధంగా జగత్తు యొక్క ఉనికి. '100' సంఖ్యలో '1' పరబ్రహ్మతత్త్వానికి ప్రతీక కాగా, ప్రక్కనున్న రెండు సున్నాలు నామరూపాలతో కూడుకున్న జగత్తుకు ప్రతీకలు. '100' సంఖ్యలో 1 వలననే ప్రక్కనున్న సున్నాలకు విలువ. అలాగే నిత్యసత్యమైన పరబ్రహ్మ(1) వలననే భ్రమపూరితమైన నామరూప జగత్తుకు(00) ఉనికి. అంటే, పరబ్రహ్మ లేకుండా జగత్తుకు అస్తిత్వం లేదు. '100' సంఖ్యలో రెండు సున్నాలు లేకపోయినా ఒకటికి వచ్చిన ప్రమాదంగానీ, హానిగానీ లేదు, దాని అస్తిత్వం నశించదు. అలాగే నామరూప జగత్తు లేకున్నా వాటికాధారమైన పరబ్రహ్మతత్త్వం నిత్యమూ ఉంటుంది. అజ్ఞానం(చీకటి) వలన సత్యమైన పరబ్రహ్మతత్త్వాన్ని అసత్యమైన నామరూప జగత్తు ఆవరించి త్రాడు పాముగా భ్రమింపజేసినట్లు, లేని జగత్తు ఉన్నట్లుగా గోచరిస్తుంది. నామ, రూపాలు భ్రమలు మాత్రమే, అవి కేవలం కనిపిస్తాయి. అంటే త్రాడు-పాము, ఎండమావి-నీరు ఉదాహరణలలో పాము, నీరు నామ, రూపాలవలె భ్రమలు మాత్రమే. ఇకపోతే బంగారం-ఆభరణాలు, మట్టి-మట్టిపాత్రలు ఉదాహరణలలో మూలపదార్థమే ఆయా రూపాలకు ఆధారం. అలాగే జగత్తుకు ఆధారం పరబ్రహ్మతత్త్వం. అందుకే వేదాంతం ఈ జగత్తు లేదనదు. జగత్తు అనే నామరూపాలు నశిస్తాయనీ, వాటికాధారమైనది నిత్యమనీ చెబుతుంది”.

దాంతో కాకాసాహెబ్ సందేహం తీరి, పై రెండు రకాల దృష్టాంతాలలో పరస్పర విరుద్ధత లేదనీ, అవి రెండూ జగత్తుకు అన్వయించవచ్చనీ అవగతమైంది. దీక్షిత్‌కు సందేహం కలగడం, వెంటనే బాబా 100 రూపాయలకోసం కబురుపెట్టడం,  అతను అర్థం స్ఫురింపజేయమని బాబా పటం ముందు ప్రార్థించడం, వెంటనే అతనికి అర్థం బోధపడటం గమనించినట్లయితే కాకాసాహెబ్ సాధనంతటినీ బాబా తామై నడిపిన వైనం మనకు అవగతమవుతుంది.

మరోసారి కాకాసాహెబ్ దీక్షిత్, బాలాసాహెబ్ భాటేలు ఏకనాథ భాగవతంలోని రెండవ అధ్యాయం పారాయణ చేస్తుండగా బాపూసాహెబ్ బూటీ బాబా వద్దనుండి ఒక సందేశం తీసుకొని అక్కడికి వచ్చాడు. అదేమిటంటే, “దీక్షిత్ వద్దనుండి పదహారున్నర రూపాయల దక్షిణ తీసుకొనిరమ్మ”ని, అలాగే “అక్కడ కూర్చొని దీక్షిత్ చదువుతున్న ఏకనాథ భాగవతం విని రమ్మ”ని. అప్పుడు కూడా దీక్షిత్ వద్ద బాబా ఒక గురుపౌర్ణమినాడు ఇచ్చిన ఒక రూపాయి తప్ప మరే డబ్బులు లేవు. అందువల్ల దీక్షిత్ ఆశ్చర్యపోతూ, 'సర్వాంతర్‌జ్ఞాని అయిన బాబాకు నా వద్ద ఎంత డబ్బు వుందో తెలుసు. అయినా కూడా పదహారున్నర రూపాయల దక్షిణ తీసుకొని రమ్మని పంపారంటే, ఇందులో ఏదో మర్మం దాగి ఉంద’ని అనుకున్నాడు. అతను తన గ్రంథపఠన కొనసాగించాడు. బూటీ అక్కడే కూర్చున్నాడు. అప్పుడు ఈ క్రింది శ్లోకం వచ్చింది.

  "కాయేన వాచా మనసేంద్రియైర్వా, బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్,
   కరోమి యద్యత్ సకలం పరస్మై, నారాయణాయేతి సమర్పయామి"

భావం: నా శరీరం, వాక్కు, మనస్సు, బుద్ధి, అహంకారం, ఇంద్రియాలు మరియు ప్రకృతి ద్వారా జరిగే సమస్త కర్మలను ఆ నారాయణునికి సమర్పిస్తున్నాను.

ఆ శ్లోకంపై ఏకనాథ మహరాజ్ చేసిన విస్తృతమైన, బోధనాత్మకమైన వ్యాఖ్యానాన్ని పఠించడం పూర్తవుతూనే బాబా బూటీని పిలుస్తున్నారన్న వార్త తీసుకొని ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు. దాంతో ఆ శ్లోకానికి, బాబా అడిగిన పదహారున్నర రూపాయలకు ఏదో సంబంధం ఉండివుంటుందని దీక్షిత్‌కి బలంగా అనిపించింది. వెంటనే ఆ శ్లోకంలో చెప్పబడ్డ తత్త్వాలను లెక్కించసాగాడు. శరీరం(1), వాక్కు(1), మనస్సు(1), బుద్ధి(1), అహంకారం(1), ఇంద్రియాలు(10) మరియు ప్రకృతి(½). మొత్తం 15½. కానీ బాబా అడిగింది 16½. కాబట్టి మిగిలిన ఒక రూపాయి గురించి కూడా అందులోనే ఉండివుంటుందని అతనికి అనిపించి ఏకనాథుని వ్యాఖ్యానాన్ని మళ్ళీ శ్రద్ధగా పరిశీలించినప్పుడు, ఆ శ్లోకంలో చిత్తం గురించి అసలు ప్రస్తావించనప్పటికీ, చిత్తాన్ని కూడా కలిపి ఏకనాథుడు చక్కటి వివరణ ఇచ్చినట్లు గుర్తించాడు. దాన్ని కూడా పైన అతను లెక్కించిన మొత్తం 15½ కి జోడించినట్లైతే 16½ అవుతుంది. ఆ 16½ తత్త్వాలను భగవంతుడికి అర్పించడమే 16½ రూపాయల దక్షిణ అడగటంలోని బాబా ఉద్దేశ్యం అని దీక్షిత్ గ్రహించాడు.

అయితే, ‘బాబా 16 రూపాయలు కాకుండా 16½ రూపాయలు ఎందుకు అడిగారు? ప్రత్యేకించి ½, అంటే ప్రకృతికి బాబా ప్రాధాన్యతనివ్వడంలో కారణమేమైంటుందా?’ అని దీక్షిత్ లోతుగా ఆలోచించగా, ఏదో ప్రత్యేక సూత్రంపై తన దృష్టిని కేంద్రీకరించమని చెప్పడం బాబా ఉద్దేశ్యంగా అతనికి తోచింది. దాంతో అతను ఏకనాథుని వ్యాఖ్యానాన్ని మళ్ళీ శ్రద్ధగా పరిశీలించాడు. అప్పుడు, ఎటువంటి ప్రయోజనాన్నీ ఆశించక ప్రకృతి సిద్ధంగా జరిగే కర్మలను, అంటే ఏవైతే భగవంతునికి అర్పించడం కష్టమో వాటిని భగవంతునికి అర్పించే మార్గం గురించి ఏకనాథుడు చెప్పినట్లు గుర్తించాడు. నిజానికి ఎరుకతో ఇంద్రియాల ద్వారా జరిగే కర్మలను భగవంతునికి అర్పించడం సాధ్యమవుతుంది, కానీ మన ప్రమేయం లేకుండా స్వభావసిద్ధంగా జరిగే కర్మలు, అంటే కనురెప్పలు వాల్చడం, ఉచ్ఛ్వాసనిశ్వాసాల వంటి వాటిని ఎలా అర్పిస్తాము? దానిగురించి ఏకనాథుడు, "కర్మ చేసి భగవంతునికి అర్పిస్తున్నానని అనుకొనే బదులు, ‘ఆ కర్మలను భగవంతుడే చేయిస్తున్నాడు, నేను ఒక ఉపకరణాన్ని మాత్రమే’ అని భావించడం మంచిద"ని పేర్కొన్నాడు. అంటే, ఒక ఉద్యోగి తనకు సొంతంకాని తన యజమాని యొక్క కోట్ల రూపాయల వ్యాపారంలో నిమగ్నమైనట్లుగా, ‘నా ద్వారా జరిగే చర్యలన్నీ భగవంతునివి’ అని భావించడమన్నమాట. ఈ రకమైన భావాన్ని పెంపొందించుకుంటే కోరికలులేని స్థితి, నిస్వార్థ గుణం వృద్ధి చెందుతాయి. అప్పుడు కర్మ ఎరుకతో జరిగినా, ఎరుక లేకుండా స్వభావసిద్ధంగా జరిగినా ప్రతిదీ ప్రత్యేకించి భగవంతునికి అర్పించాల్సిన అవసరం లేదు. అవి సహజంగానే భగవంతునికి అర్పితమవుతాయి. ఈ విధంగా తనను 16½ రూపాయలు దక్షిణ అడగటంలోని బాబా ఉద్దేశ్యాన్ని అవగతం చేసుకున్నాడు దీక్షిత్.

వైరాగ్యం:

ప్రాపంచిక జీవితంలో మనిషికి సంపదల పట్ల ఉండే వ్యామోహం ఎంత నిరర్థకమైనదో, ఒక సామాన్య సాధకుడు ఎంత నిరాడంబరంగా జీవించాలో తమ ఆదర్శ జీవిత విధానము మరియు బోధనల ద్వారా దీక్షిత్‌కు తెలియజేశారు బాబా. ఒకసారి దీక్షిత్ ఒక ఆవుని కొన్నాడు. అప్పుడు బాబా, "ఈ ఆవు ఒకప్పుడు జాల్నాలోని ఒక పెద్దమనిషిది. అంతకుముందు ఔరంగాబాదుకి చెందిన వ్యక్తిది. ఇంకా ముందు అది మహల్సాపతిది. నిజానికది ఎవరి సొత్తో భగవంతునికే ఎరుక" అని అన్నారు. అలా చెప్పడం ద్వారా సంపద అశాశ్వతమైనదనీ, అది ఎప్పుడూ చేతులు మారుతూ దాని రూపు మార్చుకుంటూ ఉంటుందనీ, కాబట్టి సంపద పట్ల నిర్లిప్తంగా ఉండాలనీ బాబా పరోక్షంగా బోధించారు. బాబా చెప్పిన మాటలు ‘ఈశావాస్య ఉపనిషత్తు’లోని క్రింది శ్లోకానికి సరిపోతాయి.

ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్।
తేన త్యక్తేన భుంజీతా మా గృధా కస్య స్విత్ ధనమ్||

అర్థం: ఈ ప్రపంచంలోని ఏ వస్తువైనా భగవంతునిచే ఆవరించబడి ఉన్నది. వాటిని అపేక్షించక పరిత్యజించి సంతోషంగా ఉండు. సంపద ఎవరిది? నీదిగాని, ఇతరులదిగాని సంపదను కోరుకోకు. సంపద ఎప్పుడూ చేతులు మారుతూ దాని రూపు మార్చుకుంటుంది. అది శాశ్వతం కాదు. కాబట్టి ఆనందాన్ని పొందడానికి సంపదను (ఆత్మనుండి)దూరంగా ఉంచాలి. సంపదలన్నీ వస్తూ పోతూ('ఆగమాపయినః') ఉంటాయని గుర్తించి, వాటి పట్ల నిర్లిప్తంగా ఉండాలి.

తన సద్గురువైన బాబా పట్ల భక్తి ప్రేమలతో పాటుగా దీక్షిత్‌లో వైరాగ్య భావనలు కూడా క్రమంగా వృద్ధి చెందసాగాయి. ముఖ్యంగా బాబా తన బాధ్యతలన్నీ స్వీకరించాక సంపాదన పట్ల, దాని సంరక్షణ పట్ల శ్రద్ధ వహించడం, సమయాన్ని, శక్తిని వెచ్చించడం ఎంత నిరర్థకమో అతను గ్రహించాడు. బాబా దగ్గరకు వచ్చిన తొలినాళ్ళలో దీక్షిత్‌కు పెద్దమొత్తంలో డబ్బు వస్తుండేది. ఒకసారి దీక్షిత్ శిరిడీ వచ్చినప్పుడు ఒక ట్రంకుపెట్టె నిండా రూపాయి నాణేలను (సుమారు వేయిరూపాయలు ఉండవచ్చు) తీసుకొచ్చి, దానిని బాబా ముందు ఉంచి, పెట్టెను తెరచి డబ్బును చూపిస్తూ, "బాబా! ఈ డబ్బంతా మీదే" అని అన్నాడు. బాబా, "అవునా!" అంటూ తమ రెండు చేతులను ఆ పెట్టెలో పెట్టి, దోసిలితో ఆ నాణేలను తీసి, డబ్బుకోసం ఈగల వలె తమ చుట్టూ చేరినవారికి పంచిపెట్టసాగారు. కొన్ని క్షణాల్లోనే ఆ ట్రంకుపెట్టె ఖాళీ అయిపోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న దీక్షిత్ స్నేహితుడు, సబ్ జడ్జి అయిన గార్డే ఇలా చెప్పాడు: "కష్టపడి సంపాదించిన ధనాన్ని బాబా చకచకా పంచేస్తున్న సమయమంతా నేను దీక్షిత్ ముఖంలోని భావాలను నిశితంగా గమనిస్తూ ఉన్నాను. అతని స్థానంలో ఇంకెవరయినా ఉంటే అంత డబ్బును నష్టపోతున్నందుకు ఎంతో బాధపడేవారు. కానీ దీక్షిత్ ఏ మాత్రమూ చలించలేదు".

మొదటిసారి శిరిడీ దర్శించేనాటికి దీక్షిత్ బొంబాయిలో ప్రఖ్యాత న్యాయవాదిగా ఉన్నతస్థితిలో ఉన్నాడు. ఎంతోమంది తమ జీవితకాలంలో సాధించలేనిది అతను కేవలం 15 సంవత్సరాలలో సాధించాడు. దాదాపు బాబాతో అనుబంధం ప్రారంభమైనప్పటినుండి అతను తాను ఆశ్రయించాల్సింది వారి పాదాలనేనని గుర్తించి వారి మార్గదర్శకత్వంలో ఆధ్యాత్మిక ప్రయాణం సాగించాలని తపించాడు. అందువల్ల వీలైనంత తరచుగా శిరిడీ దర్శిస్తూ ఎక్కువ సమయాన్ని బాబా దివ్యసన్నిధిలో గడుపుతుండేవాడు. దాంతో అతని న్యాయవాద ప్రాక్టీస్ దెబ్బతినసాగింది. అప్పుడప్పుడు బాబా అతనితో, “ప్రాక్టీస్ వదులుకోవద్దు, బొంబాయి వెళ్లి ప్రాక్టీస్ కొనసాగించు" అని చెబుతుండేవారు. బాబా ఆజ్ఞను శిరసావహించి బొంబాయి వెళ్లినప్పటికీ దీక్షిత్ మనసు మాత్రం శిరిడీలో బాబా వద్దనే ఉండేది. అందువలన త్వరలోనే అతను తిరిగి శిరిడీ చేరుకొనేవాడు. అతనొకరోజు బాబాతో, "బాబా! భగవంతుడు నాకు చాలినంత సంపదనిచ్చాడు. తిండికి లోటులేదు. మరి నేనెందుకు ఈ ప్రాపంచిక బంధనాలలో ఉండాలి? నా అదృష్టం కొద్దీ శిరిడీలో మీ సన్నిధిలో నివసించే అవకాశం దక్కింది. శిరిడీ వంటి స్వర్గ సుఖాన్ని వదులుకొని ఏ నరకానికీ వెళ్లాలని నాకు కోరిక లేదు. నేను నా సొలిసిటర్ బిజినెస్‌ను మూసివేసి శాశ్వతంగా ఇక్కడే నివాసముండాలని కోరుకుంటున్నాను" అని అన్నాడు. బాబా ఎంతో మృదుమధురంగా, "కాకా! వ్యాపారాన్ని (సొలిసిటర్ బిజినెస్) మూసివేయాల్సిన అవసరమేముంది?" అని అడిగారు. అందుకతను, "బాబా! నా వృత్తిలో నేను సత్యాన్ని అసత్యాలుగా, అసత్యాన్ని సత్యాలుగా వక్రీకరించి చెప్పాలి. అసలు అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏమి చేయాలి?" అని అడిగాడు. అందుకు బాబా, "ఇతరులు వాళ్ళకు నచ్చింది చేయనీ. కానీ మనమెందుకు అలా చేయాలి? నువ్వు ఎటువంటి తప్పులూ చేయకుండా నిజాయితీగా నీ వృత్తిని నిర్వర్తించు. అంతేగానీ వ్యాపారాన్ని మూసివేయాల్సిన అవసరం లేదు" అని అన్నారు. బాబా చెప్పినట్లే దీక్షిత్ తన వ్యాపారాన్ని కొనసాగించాడు.

కానీ సంవత్సరంలో ఎక్కువకాలం శిరిడీలోనే ఉంటూ బాబాను హృదయపూర్వకంగా సేవించుకుంటూ ఉండేవాడు. అలా ఎక్కువ సమయాన్ని బాబా సన్నిధిలో గడుపుతుండటం వలన ప్రాపంచిక అనుబంధాలు, వ్యవహారాల పట్ల ఆసక్తి సన్నగిల్లి శిరిడీనే తన నివాసంగా చేసుకున్నాడు దీక్షిత్. దానివలన తన ప్రాపంచిక వ్యవహారాలలో ఎటువంటి పర్యవసానాలు ఎదురైనా అతను లెక్కచేయదలచుకోలేదు. వృత్తిపట్ల శ్రద్ధ మందగించడంతో ఎంతో లాభదాయకమైన తన వృత్తిని పూర్తిగా అలక్ష్యం చేశాడు. ఫలితంగా సొలిసిటర్ బిజినెస్‌లో అతని భాగస్వాములైన బహదూర్ ఎస్.నారాయణదాసు, ధన్‌జీ షాలు భాగస్వామ్యం నుండి తప్పుకున్నారు. దాంతో దీక్షిత్ క్రొత్తగా న్యాయవాద వృత్తిలోకి వచ్చిన పురుషోత్తంరాయ్ మార్ఖడ్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాడు. కానీ తరచూ దీక్షిత్ బొంబాయిలో లేకపోవడం, వృత్తిపట్ల ఆసక్తి చూపకపోవడం వలన అతను కూడా భాగస్వామ్యం నుండి వైదొలిగాడు. తొందరలోనే మాణిక్‌లాల్ మొదలైనవారు కూడా భాగస్వామ్యం నుంచి తప్పుకొని దీక్షిత్‌ని ఒంటరివాడిని చేశారు. దాంతో న్యాయవాదవృత్తి ద్వారా అతనికి వచ్చే రాబడి ఎంతగానో తగ్గిపోయింది. 1911వ సంవత్సరం నుండి అతని ఆదాయం శూన్యమైంది. అవధులు లేని అతని ఔదార్యం, అతిథి సత్కారాల వలన బొంబాయి, విల్లేపార్లే, లోనావాలాలలో ఉన్న మూడు ఇళ్ళు మినహా మిగతా సంపదంతా కరిగిపోయింది. చివరికి 1912లో దీక్షిత్ తన లాభదాయకమైన ప్రాక్టీసుని మూసివేయడంతో అతనిని ఆదర్శంగా భావించేవాళ్లు, స్నేహితులు, పరిచయస్థులు అందరూ ఆశ్చర్యపోయారు. 'సాయిబాబా అనే ఫకీరు అతనిని వశం చేసుకొని శిరిడీకి లాగి వెర్రివాడిని చేశాడ'ని చాలామంది అనుకోసాగారు. ఆ విమర్శలను దీక్షిత్ అస్సలు పట్టించుకోలేదు. లాభదాయకమైన ప్రాక్టీసును, సామాజికంగా, రాజకీయంగా మంచి గుర్తింపును కోల్పోయినప్పటికీ ఎటువంటి భయాలు, ఆందోళనలు, చింతలు లేకుండా అతను నిశ్చింతగా శిరిడీలో ఉండసాగాడు. సాధారణంగా, ఉన్న సంపదంతా ఊడ్చిపెట్టుకొనిపోయి డబ్బుకు కొరత ఏర్పడితే ఎవరికైనా మనసు కుదేలై, దురదృష్టంగా తలచి ఎంతో దుఃఖానికి లోనవుతారు. కానీ దీక్షిత్ విషయం అలా కాదు. న్యాయస్థానాలకు, సమాజానికి, ప్రజాసంబంధిత కార్యాలకు దూరంగా ఉండటం తన జీవితాన్ని నిస్తేజంగా, నిస్సారంగా చేసినప్పటికీ అతను భాగవతంలోని 27వ అధ్యాయం, పదవ స్కంథంలో, "నేను అనుగ్రహించదలచినవారి సంపదలు హరిస్తాను" అని శ్రీకృష్ణుడు చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకొని, సంపదతో సంక్షేమం, సుఖంతో ఆనందం ముడిపడి ఉందన్న పెద్ద భ్రాంతిని తొలగించి ఆధ్యాత్మికంగా ఉన్నతస్థితిని, అంటే సద్గతిని ప్రసాదించేందుకు సద్గురువు తనకు శిక్షణనిస్తున్నారని తలచాడు. కాబట్టి, సహజంగానే సరళమైన జీవనశైలిని కలిగిన అతను విలాసవంతమైన జీవనాన్ని, అనవసరమైన ఖర్చులను విడిచిపెట్టి, చాలావరకు తన అవసరాలను తగ్గించుకుని అతి నిరాడంబరమైన జీవితాన్ని గడపసాగాడు. సాయిబాబాపట్ల అతనికున్న భక్తివిశ్వాసాలు అటువంటివి.

దీక్షిత్ అంతలా బాబాకు ఆకర్షితుడవడానికి, దీక్షిత్ బాధ్యతలన్నీ బాబా స్వీకరించడానికి అతనికి బాబాతో ఉన్న ఋణానుబంధమే కారణం. ఆ విషయాన్ని బాబానే స్వయంగా చెప్పగా జి.ఎస్.ఖపర్డే తన ‘శిరిడీ డైరీ’లో వ్రాసుకున్నాడు. ఒకరోజు బాబా ఖపర్డేతో, "పూర్వజన్మలో నువ్వు, నేను, కాకాసాహెబ్ దీక్షిత్, షామా, బాపూసాహెబ్ జోగ్ మరియు దాదాకేల్కర్ ఒకే వీధిలో మన గురువుతో కలిసి నివసించేవాళ్ళము. అందుకే ఈ జన్మలో మీ అందరినీ ఒకచోటికి చేర్చాను" అని చెప్పారు. మరో సందర్భంలో, ప్రాపంచిక కోరికలతో బాబా వద్దకు వచ్చే భక్తులను నిరసిస్తూ, “శ్రీసాయిబాబా వంటి సద్గురువును ఆధ్యాత్మికోన్నతి కోసం ప్రార్థించాలిగానీ, తుచ్ఛమైన ప్రాపంచిక కోరికలతో ఆశ్రయించకూడదు” అని హితవు చెబుతున్న దామోదర్ సావల్రాం రాస్నే అనే భక్తునితో బాబా, “అలా అనవద్దు. నాకు సంబంధించినవారు మొదట అలాంటి కారణాలతోనే నా దగ్గరకు వస్తారు. వారి కోరికలు తీరి జీవితంలో సౌఖ్యం చిక్కాక, నన్ను అనుసరించి ఆధ్యాత్మికంగా పురోగమిస్తారు. నిజానికి రకరకాల మిషలమీద నేనే నా భక్తులను నా చెంతకు రప్పించుకుంటాను. వారెంత దూరాన ఉన్నా సరే, నేనే వారిని నా వద్దకు చేర్చుకుంటాను. ఎవరూ వారంతటవారుగ నా దగ్గరకు రారు” అని చెప్పారు. తమను బాబానే వారి వద్దకు లాక్కుంటున్నారన్న వాస్తవంగానీ, ఆ లాగడం వెనుకనున్న కారణంగానీ తెలియకపోయినా భక్తులు బాబాను ఆశ్రయిస్తారు. ఎక్కువమంది ప్రాపంచిక కష్టాల నుండి ఉపశమనం కోసమే భగవంతుని లేదా గురువుని ఆశ్రయిస్తారు. బాబాను ఆశ్రయించడానికి దీక్షిత్‌కి కూడా తన కాలి కుంటితనమే మూలకారణమైంది. కారణమేదైనా, సృష్టిలోని అన్ని జీవులపై, విషయాలపై బాబాకున్న అద్భుతమైన అధికారము, వేలాదిమందికి ప్రయోజనం చేకూర్చే వారి విలక్షణమైన ప్రేమ దీక్షిత్‌ని ఎంతగానో ఆకట్టుకున్నాయి. పూర్వజీవితంలో దత్తమహరాజ్ అనే సాధువుతో ఉన్న పరిచయం మరియు బాబా యొక్క స్వభావం, వారి అద్భుతశక్తి వారిని సమర్థ సద్గురువుగా గుర్తించేందుకు దీక్షిత్‌కి దోహదమయ్యాయి. ఫలితంగా అతను తనంతట తానే బాబాను తన గురువుగా భావించాడు. అయితే బాబా ఎన్నడూ తమను తాము గురువుగా ప్రకటించుకోలేదు. కానీ ఒకానొక సందర్భంలో ఆయన దీక్షిత్‌తో తమ గురుత్వాన్ని, అద్భుతమైన దాని స్వభావాన్ని చెప్పకనే చమత్కారంగా చెప్పారు. ఒకసారి దీక్షిత్ తదితరులు బొంబాయి వెళ్ళడానికి అనుమతి కోరినప్పుడు బాబా వాళ్లతో, “మీరు వెళ్ళవచ్చు” అని చెప్పారు. అక్కడే ఉన్న వేరొక భక్తుడు, "బాబా! ఎక్కడికి వెళ్ళాలి?" అని అడిగాడు. అందుకు బాబా, “పైకి!”, అంటే ‘భగవంతుని వద్దకు’ అనే నిగూఢమైన భావం వచ్చేలా పారమార్థిక పంథాలో బదులిచ్చారు. అందుకు ఆ భక్తుడు, "మార్గమేమిటి?" అని ప్రశ్నించాడు. అప్పుడు బాబా, "చాలాచోట్ల నుండి చాలా మార్గాలున్నాయి" అని చెప్పి, "ఇక్కడ (శిరిడీ లేదా మశీదు) నుండి కూడా ఒక మార్గం ఉంది. కానీ ఆ మార్గమంతా అవరోధాలు ఉన్నాయి. మార్గమందు పులులు, ఎలుగుబంట్లు ఉన్నాయి. ఎవరైనా నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే లోతైన అగాధాల్లో పడిపోయే ప్రమాదముంది" అని అన్నారు. అప్పుడు దీక్షిత్ బాబాను, "మార్గదర్శి తోడుంటేనో?" అని అడిగాడు. "అలాగైతే ఎటువంటి కష్టమూ, ప్రమాదమూ లేదు. పులులు, ఎలుగుబంట్లు ప్రక్కకు తప్పుకుంటాయి" అని బాబా చెప్పారు. ఈ విధంగా భగవంతుని చేరుకోవాలనుకునేవారు శిరిడీ నుండి కూడా తమ లక్ష్యాన్ని సాధించగలరని బాబా స్పష్టంగా చెప్పారు. అంతేకాదు, తమనాశ్రయిస్తే భద్రంగా గమ్యం చేరవచ్చునని పరోక్షంగానైనా బాబా చెప్పిన అతికొద్ది సందర్భాలలో ఇదొకటి. దానిని పొందే భాగ్యం దీక్షిత్‌కే లభించింది.

source: లైఫ్ అఫ్ సాయిబాబా by బి.వి.నరసింహస్వామి, శ్రీసాయిబాబా బై వి.బి.ఖేర్.
రిఫరెన్స్: దీక్షిత్ డైరీ బై విజయకిషోర్.

 


ముందు భాగం కోసం
బాబా పాదుకలు తాకండి.




 


 


తరువాయి భాగం కోసం
బాబా పాదాలు తాకండి.

5 comments:

  1. Kothakonda SrinivasMarch 28, 2021 at 1:06 PM

    ఓం సాయిరాం!

    ReplyDelete
  2. Om sai ram baba amma arogyam bagundali thandri pleaseeee

    ReplyDelete
  3. OM SRI SACHIDANAMDA SAMARDHA SATHGURU SAINATH MAHARAJ KI JAI...OM SAI RAM

    ReplyDelete
  4. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo