సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 720వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:
  1. జీవితం - మాయ
  2. పిలిస్తే పలికే దైవం బాబా

జీవితం - మాయ


సాయిభక్తుడు సత్యసాయి వరప్రసాద్ తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నారు.


నా పేరు సత్యసాయి వరప్రసాద్. నేను బాబా అనుగ్రహంతో పుట్టానని, ఆ విషయం ఎప్పటికీ మర్చిపోకూడదని నాకు మా తాతగారు ఆ పేరు పెట్టారు. మా తాతగారి వలన సత్యసాయిబాబాను మరియు శిరిడీ సాయిబాబాను ఒకేలా చూడటం చిన్నప్పటినుంచి నాకు అలవాటైంది. తాము సశరీరులుగా ఉన్నకాలంలో తన భక్తులకు ప్రసాదించిన లీలలను సచ్చరిత్ర ద్వారా, ఈనాటి భక్తులకు ప్రసాదించిన లీలలను ఈ బ్లాగు ద్వారా మనందరికీ చేర్చటంలో బాబా యొక్క సంకల్పం మనందరికీ అర్థమవుతోంది.


నేను బాబా ద్వారా ఈరోజు తెలుసుకున్న ఒక క్రొత్త విషయాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. నేను ఎప్పుడైనా ఏదైనా సందిగ్ధంలో ఉంటే బాబా నాకు ఏదో ఒక మాధ్యమం ద్వారా సమాధానమిస్తారు అని నా నమ్మకం. అది కేవలం ప్రశ్నలు-జవాబులు ద్వారా మాత్రమే కాదు, కొన్నిసార్లు మనం కలిసే వ్యక్తుల ద్వారా లేదా మనం చూసే సినిమా ద్వారా లేదా మనం వినే పాట ద్వారా లేదా మన ఫోనుకి వచ్చే మెసేజ్ ద్వారా.. ఇలా ఏదైనా కావచ్చు, ఆయన చెప్పేది మనం అర్థం చేసుకునే స్థితిలో ఉండాలి, లేదంటే ఆయన మనకు ఇచ్చే ఉపదేశం మన చెవుల వద్దే ఆగిపోతుంది


నేను ఒక బహుళజాతి సంస్థలో గత 6 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నాను. గత రెండేళ్లుగా నేను ఆ సంస్థ నుంచి బయటకు వచ్చి వేరే సంస్థలో ఉద్యోగంలో చేరితే బాగుంటుంది అనే ఆలోచనలో ఉన్నాను. 2020, డిసెంబరు వరకు ఆ సంస్థ నుండి బయటకు రావటానికి సంశయిస్తూనే ఉన్నాను. నాకు తెలిసిన చాలామంది, “ముందు ఏదైనా మంచి ఉద్యోగం చూసుకుని ఆ తర్వాత ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేయమ”ని సలహా ఇవ్వడంతో ఇంతకాలం ఆగవలసి వచ్చింది. మా కంపెనీలో 3 నెలలు నో డ్యూస్ పీరియడ్ చేయాలి. కానీ, నేను ఇంటర్వ్యూకి వెళ్ళిన అన్ని కంపెనీలూ ‘ఒక నెలరోజుల్లో వాళ్లకి రిపోర్ట్ చేస్తే ఉద్యోగంలో తీసుకుంటామ’ని చెప్పేవారు. నాకు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఒకరోజు ధైర్యం చేసి నేను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసేశాను. ఎప్పటినుంచో అనుకుంటున్నది జరిగితే ఆ సంతోషం ఆరోజు వరకు బాగుంటుంది. అలా ఆనందంగా ఉన్నప్పుడే ‘మాయ’ మనల్ని పలకరించి మనలో ఉండిపోతుంది.


మాయ గురించి చెప్పేముందు ఒక చిన్న విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మంచి-చెడులు సత్యయుగంలో వేర్వేరు గ్రహాలలో, కృతయుగంలో సముద్రానికి ఇరువైపులా, ద్వాపరయుగంలో ఒకే కుటుంబంలో ఉండేవి. మరి ఈ కలియుగంలో ఒకే మనిషిలోకి వచ్చేశాయి. అవే, రెండు వ్యక్తిత్వాలు - మంచి మరియు చెడు. మాయ ఎప్పుడూ మనలో చెడు వ్యక్తిత్వాన్ని ప్రోత్సహిస్తుంది. అంటే, మనలో స్వార్థం, భయం, దుఃఖం, బాధ, ఈర్ష్య మొదలైనవి పెంచేలా చేస్తుంది. మంచి వ్యక్తిత్వం మనలో విశ్వాసాన్ని నింపుతుంది. వర్తమానంలో జీవిస్తూ, దైవం లేదా గురువును నవవిధ భక్తి మార్గాలలో ఏదైనా ఒక మార్గంలో సేవిస్తూ, వారి గురించి ఆలోచిస్తూ, వారు చెప్పింది చేస్తుంటే చాలు, అన్నీ వాళ్ళే చూసుకుంటారు. 


ఎవరికైనా ఏదైనా బాబా ఇవ్వాలి అనుకుంటే అది ఇస్తారు. కానీ ఇచ్చేముందు మాయ మనల్ని మరణించేవరకు తీసుకొని వెళ్తుంది. అప్పుడు బాబా మనల్ని ఆ మాయ నుంచి బయటకు తీసి మనకు కావలసింది ఇస్తారు. ఈ ప్రక్రియలో మనకు తెలియకుండానే మనం చాలా విషయాలు తెలుసుకుంటాం. కొన్ని చెడు అలవాట్లను వదిలేస్తాం. మన అహంకారం, గర్వం నశిస్తాయి. మన ఓవర్ కాన్ఫిడెన్స్ పోయి మనమీద మనకు నమ్మకం కలుగుతుంది.


గత 3 నెలలుగా నేను ఈ మాయలో పడి నా ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఒకానొక సమయంలో నా సద్గురువైన సాయిబాబాని కూడా వదులుకునే స్థితికి వచ్చాను. అందుకే ఈ ఉద్యోగం విషయం బాబాకే వదిలేస్తున్నాను. ‘నేను అనుకున్న కంపెనీలో బాబా నాకు ఉద్యోగం ఇప్పిస్తారు’ అనే నమ్మకంతో, కొంచెం సబూరితో ఉంటున్నాను. ఉద్యోగం వచ్చిన వెంటనే ఆ అనుభవాన్ని ఈ బ్లాగ్ ద్వారా మీతో పంచుకుంటాను.


పిలిస్తే పలికే దైవం బాబా


సాయిభక్తురాలు అరుణలక్ష్మి ఇటీవల తనకు బాబా ప్రసాదించిన అనుభవాన్ని ఇలా పంచుకుంటున్నారు:


సాయిభక్తులందరికీ నమస్కారం. నా పేరు అరుణలక్ష్మి. నేను ఇదివరకు కొన్ని అనుభవాలను మీతో పంచుకున్నాను. ఇప్పుడు 2021, ఫిబ్రవరి 25న బాబా 'పిలిస్తే పలికే దైవం' అని, ప్రతినిత్యం తన భక్తులను కాపాడుతూ ఉంటారని నిరూపించిన అనుభవాన్ని పంచుకోవాలనుకుంటున్నాను.


ఆరోజు నేను మా బాబుకి లంచ్ బాక్స్ ఇవ్వడానికని నా స్కూటీ మీద తను చదువుతున్న స్కూలుకి వెళ్ళాను. అక్కడికి చేరుకున్న తరువాత స్కూటీ ఇంజన్ ఆపుచేద్దామని చూసేసరికి స్కూటీ తాళాలు కనిపించలేదు. స్కూటీ రన్నింగ్‌లో ఉంది, ఏం చేయాలో నాకు పాలుపోలేదు. అంతలోనే, అవి వస్తున్న దారిలోనే ఎక్కడో పడిపోయి ఉంటాయనిపించి, "నాకు సహాయం చేయమ"ని బాబాను మనసారా వేడుకున్నాను. తరువాత తాళాలు వెతుక్కుంటూ వచ్చిన దారిలోనే తిరిగి వెనక్కి వెళ్ళాను. ఎవరికైనా దొరికాయేమోనని దారిపొడుగునా కనపడినవాళ్ళను అడుగుతున్నాను. కానీ, అందరూ వాళ్ళకి దొరకలేదు అనే చెప్పసాగారు. మళ్ళీ బాబాను ప్రార్థించి వెతకడం కొనసాగించాను. అద్భుతం! మరుక్షణంలో రోడ్డుకి ఒక ప్రక్కన పడివున్న స్కూటీ తాళాలు నా కంటపడ్డాయి. బాబా నా మీద చూపిన దయకి చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఆ సంతోషాన్ని మీ అందరితో పంచుకోవాలనిపించి ఇలా మీ ముందుకు వచ్చాను. 'పిలిస్తే పలికే దైవం' అని మరోమారు నిరూపించిన బాబాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ...


బాబాకీ జై!



5 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo