సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1521వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. సమస్యలేవైనా మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తే బాబా తప్పక తీరుస్తారు
2. పారాయణ పూర్తికాకముందే అనుగ్రహంచిన బాబా

సమస్యలేవైనా మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తే బాబా తప్పక తీరుస్తారు


నేను సాయినాథుని భక్తపరమాణువుని. నాపేరు బదరీనాథ్. మాది పూర్వపు పశ్చిమగోదావరి జిల్లా, ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా నిడుదవోలు. ముందుగా సాయిభక్తులందరికీ నమస్కారం. ఈ బ్లాగు నిర్వహిస్తున్న సాయికి కృతజ్ఞతలు. మీరు బ్లాగు నిర్వహించకపోతే లక్షలాది సాయిభక్తుల అనుభవాలను తెలుసుకునే భాగ్యం మాకు ఉండేది కాదు. నేను ఇప్పుడు చెప్పబోయే అనుభవాలు చదివి కొంతమందికి 'ఇంత చిన్న విషయం కూడా చెప్పుకోవాలా?' అనిపించినా, ఇంకొందరు పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఒకరోజు మా ఇంటిలోని 32 ఇంచుల ఎల్ఈడి టీవీ హఠాత్తుగా ఆగిపోయింది. ఆ విషయం నా ఫ్రెండ్‌కి చెప్తే, "ఎల్ఈడి టీవీ రిపేరు వస్తే, ఇక అంతే! ఐదు వందలకో, వెయ్యికో అమ్మేసుకోవడమే. రిపేర్లు అవ్వవు. రిపేర్ అయినా ఆ డబ్బుతో కొత్తది కొనేసుకోవచ్చు" అని అన్నాడు. కానీ నేను ఆ టీవీ మా చెల్లి నాకు ఇచ్చిందన్న సెంటిమెంట్‌తో ఎంతైనా రిపేరు చేయించాలని నిర్ణయించుకొని నా ఫ్రెండ్‌తో కలిసి టీవీ తీసుకొని మెకానిక్ దగ్గరకు వెళ్లాను. అతను, "చూసి, రేపు సాయంత్రానికి కంప్లైంట్ ఏమిటో, ఎంత అవుతుందో చెప్తాను" అని, "వీటికి రిపేరు చేస్తాము కానీ, వారంటీ ఇవ్వడం ఉండదు. ఒకవేళ మీకు కొత్త టీవీ కావాలంటే నెలనెలా కట్టుకునేలా షాపులో ఫైనాన్సు ఇప్పిస్తాను" అని అన్నాడు. "రిపేరుకు ఎంత అవుతుందో చెప్పండి. కొత్త టీవీ విషయం తర్వాత ఆలోచిద్దాం" అని చెప్పి మేము వచ్చేసాం. నా ఫ్రెండ్, "పదివేలకు పైనే అవ్వొచ్చు. కొత్తది తీసుకోవచ్చు కదా! వారంటీ కూడా ఉంటుంద"ని సలహా ఇచ్చాడు. మరునాడు ఉదయం నేను నా నిత్యపూజలో బాబాతో, "తండ్రి సాయిదేవా! ఐదువేల రూపాయల లోపు టీవీ బాగయ్యేలా చూడు తండ్రి. అలా అయితే మీ అనుగ్రహాన్ని తప్పకుండా 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగు ద్వారా మన కుటుంబసభ్యులతో పంచుకుంటాను" అని చెప్పుకున్నాను. సాయంత్రం నా ఫ్రెండ్‌తో కలిసి రిపేర్ షాపుకు వెళితే మెకానిక్, "స్పేర్స్ 4,800 రూపాయలు, సర్వీస్ చార్జీ 500 రూపాయలు. మొత్తం 5,300 రూపాయలు" అన్నాడు. అది విని నా ఆనందానికి అవధులు లేవు. డబ్బులు గురించి కాదుగాని సాయిదేవుని దృష్టిలో నేను ఉన్నాను, ఆయన నా మాటలు విన్నారు, నా సెంటిమెంట్‌ను కాపాడారు, అన్ని కోట్లమంది భక్తుల్లో నన్ను కూడా గుర్తుపెట్టుకున్నారు అదే నా ఆనందానికి కారణం. "సాయి సమర్థా! ఇంతకంటే ఏం కావాలి తండ్రి. మీకు నా శతకోటి వందనాలు".


2023, ఏప్రిల్ 15న నేను క్యారెట్ జ్యూస్ తయారుచేసి ఆఫీసుకి వెళ్లేటప్పుడు తీసుకువెళదామని డీప్ ఫ్రిజ్‍లో ఉంచాను. తరువాత వంట చేసుకొని, టిఫిన్ తిని తయారై ఆఫీసుకు వెళ్ళబోతూ ఫ్రిడ్జ్‌లోని క్యారెట్ జ్యూస్ బాటిల్ తీస్తే, ఆ బాటిల్ పట్టింది పెట్టినట్టే ఉంది. ఏ మాత్రమూ చల్లబడలేదు. తీరా చూస్తే ఫ్రిడ్జ్ పని చేయడం లేదు. అదెప్పుడు ఆగిపోయిందో అర్థం కాలేదు. ఆఫీసుకి టైమ్ అయిపోతున్నా ప్లగ్ ప్రెస్ చేసాను, స్విచ్ చెక్ చేశాను. కానీ ఏం ప్రయోజనం లేదు. ఇక సాయినాథుడే దిక్కు అనుకుని ఆఫీసుకు వెళ్ళాను. నేను ఉండేది మొదటి అంతస్థులో. పైగా ఒక్కడినే ఉంటున్నాను. ఫ్రిడ్జ్‌ని మెకానిక్ షాపుకి తీసుకెళ్లాలంటే ఇరుకుగా ఉండే మెట్ల మీదనుంచి దింపటం, మళ్లీ పైకి ఎక్కించడం చాలా పెద్ద పని. అందుకు కనీసం నలుగురు మనుషులు కావాలి. ముందు వాళ్ళు దొరకాలిగా! సరే ఈ విషయాలన్ని సాయినాథుని చెవిన వేసి, "తండ్రీ! ఎలాగైనా ఫ్రిడ్జ్ పనిచేసేలా చేయండి. నేను సాయంత్రం ఇంటికి వెళ్లేటప్పటికి ఫ్రిజ్ పని చేస్తుంటే గనక రేపే మీ అనుగ్రహాన్ని మన కుటుంబసభ్యులతో పంచుకోవడానికి 'సాయి మహారాజ్ సన్నిధి' బ్లాగుకి పంపుతాను" అని బాబాకి మ్రొక్కుకొని భారం ఆ తండ్రి మీద వేసాను. సాయంత్రం(రాత్రి) ఇంటికి వెళ్ళగానే ముందు ఫ్రిజ్ పని చేస్తుందో, లేదో చూసాను. బాబా దయవల్ల అది పనిచేస్తుండటంతో చాలా ఆనందించాను. మరమత్తు సమస్యలైనా, ఆర్థిక, ఆరోగ్య, విద్య, ఉద్యోగ, విదేశీయాన సమస్యలైనా మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తే బాబా తప్పక తీరుస్తారు. "ధన్యవాదాలు బాబా. మీకు చెప్పినట్లుగానే నా అనుభవాన్ని బ్లాగులో పంచుకున్నాను. మీ పిల్లలందరినీ ఇలాగే కరుణించి కాపాడండి సాయిదేవా".


ఓం శ్రీసాయినాథ్ మహారాజ్ కీ జై!!!


పారాయణ పూర్తికాకముందే అనుగ్రహంచిన బాబా


ప్రియమైన సాయి భక్తులకు ప్రణామాలు. నా పేరు బాలాజీ. నేను ఉదయాన్నే చేసే మొదటి పని ఏమిటంటే, ఈ బ్లాగులో ఆరోజు ప్రచురితమైన అనుభవాలను చదవడం. హృదయానికి హత్తుకునే ఆ అనుభవాలన్నీ చదవని రోజు అంటూ ఉండదు. ఇక నా అనుభవానికి వస్తే.. ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టిన నా కొడుకు తనకి ఏ ఫీల్డ్‌లో ఉద్యోగం కావాలో ఖచ్చితంగా తెలియక ఒక నిర్ణయం తీసుకోవడంలో గందరగోళంలో పడ్డాడు. అప్పుడు నేను, "బాబా! నా కొడుకు భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు తగిన ఉద్యోగం పొందేలా తనకి మార్గనిర్దేశం చేయండి" అని మన ప్రియమైన సాయిని ప్రార్థించి 'సచ్చరిత్ర' సప్తాహ పారాయణ మొదలుపెట్టాను. ఆయన దయతో నా పారాయణ పూర్తికాకముందే నా కొడుకు అపాయింట్‌మెంట్ లెటర్ అందుకున్నాడు. తను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాడు. ఇలా ఎన్నో అనుభవాలు బాబా మాకు ప్రసాదిస్తూ ఉన్నారు. సాయితల్లి చూపుతున్న అనుగ్రహానికి మా కుటుంబం సదా ఋణపడి ఉంటుంది. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి నా హృదయపూర్వక ప్రణామాలు.


సాయిభక్తుల అనుభవమాలిక 1520వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా కృపకు నిదర్శనాలు
2. బాబాని అడిగితే జరగనిదంటూ ఏమీ ఉండదు

బాబా కృపకు నిదర్శనాలు


నా పేరు దేవి. మా వదిన పేరు 'సాయిగీత'. పేరుకు తగ్గుట్టుగా తను తన జీవితాన్ని సాయి ఆజ్ఞానుసారం గడుపుతుంది. సాయి పాటలను ఎంతో బాగా రాగయుక్తంగా పాడుతుంది. తను చాలా అనారోగ్య సమస్యల కారణంగా ఎంతో ఇబ్బందిపడుతున్నప్పటికీ బాబాకి చేయవలసిన సేవలు మాత్రం మానక చేస్తుంది. అందువల్లనేమో బాబా తన 11 సంవత్సరాల అమ్మాయి రజస్వల అవ్వటం గురించి ముందుగానే నాకు తెలియజేసారు. 2022, ఏప్రిల్ నెలలో నేను ఒకరోజు పూజ చేసి బాబా ముందు కూర్చొని బాబా కళ్ళలోకి చూస్తుంటే, 'నీ మేనకోడలు ఈ నెలలో రజస్వల అవుంతుంది' అని బాబా చెప్తున్నట్లు నాకు అనిపించింది. చీటీలు వేసే అలవాటున్న నేను, 'అవునా బాబా! ఈనెల తను రజస్వల అవుతుందా? లేక నేను భ్రమపడుతున్నానా?' అని బాబాను అడిగాను. బాబా నుండి 'అవును' అని సమాధానం వచ్చింది. నేను ఆ విషయం మావారితో చెప్పి, "అందుకోసం మనం డబ్బులు సిద్ధం చేసుకోవాలి" అని అన్నాను. మావారు బాబాను అంతగా నమ్మరు. అందువల్ల నేను చెప్పినదానికి 'నీకు పిచ్చా?' అన్నట్లు చూసారు. ఆ విషయం అలా ఉంచితే, నేను మా వదినకు బాబా సందేశం గురించి తెలియజేసి పాపకు కావలసిన బట్టలు తీసి కుట్టించాము. బాబా అనుగ్రహం వల్ల పాప గురువారం నాడు రజస్వల అవుతుందని మేము అనుకున్నప్పటికీ 2022, ఏప్రిల్ 27, బుధవారం నా మేనకోడలు రజస్వల అయింది. అందరం ఆశ్చర్యపోయాం. బాబా లీలకు పరవశించిపోయాము. పాప బుధవారం రజస్వల అవ్వడానికి కూడా కారణం లేకపోలేదు. మర్నాడు గురువారం మా మావయ్యగారు బాబాలో ఐక్యమయ్యారు(మావయ్యగారి మరణం గురించి కూడా బాబా నాకు ముందే తెలియజేసారు). పాప కూడా అదేరోజు రజస్వల అయినట్లయితే మేనత్తనైనా నాకు తనని కూర్చోబెట్టే అవకాశం ఉండేది కాదు. కాబట్టే ముందురోజే పాప రజస్వల అయ్యేలా అనుగ్రహించారు బాబా. ఆయన 15 రోజులు ముందుగా పాప రజస్వల గురించి తెలియజేసి కావలసిన బట్టలు తీయించి, కుట్టించుకునేలా చేసి అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న మా వదినకి ఇబ్బంది లేకుండా చేసారు. ఇంకో ముఖ్య విషయం ఈ అనుభవంతో మావారు కూడా బాబాను నమ్ముతున్నారు. బాబాను మనసారా ప్రేమించాలి గానీ ఎంత లీలా అయినా చేస్తారు అనడానికి ఈ అనుభవమే ఒక నిదర్శనం.


నాకు తెలిసిన హేమ అనే సాయి భక్తురాలు కరోనా మహమ్మారి నుండి తన కుటుంబాన్ని కాపాడినప్పటి నుండి బాబాను నిత్యం ఆరాధిస్తుంది. తనకి బాబా నామస్మరణ చేయడం అలవాటు. ఒకరోజు తను బాగా మరిగిన వేడినీళ్ల పాత్రను పట్టుకొని వెళ్తుంటే అనుకోకుండా చేయిజారి వేడి నీళ్లు తన ముఖంపై నుండి ఛాతి వరకు పడి కాలి పోయింది. అది చూసిన వాళ్ల అమ్మాయికి ఏం చేయాలో తోచక గుప్పెడు ఊదీ తీసుకొని కాలిన తన తల్లి శరీరంపై అద్ది, చెంబు నీళ్లలో ఎక్కువ మోతాదులో ఊదీ కలిపి త్రాగించింది. మంటతో బాధపడుతున్న హేమ అంతటి బాధలోనూ సాయి నామస్మరణను వదల లేదు. బాబా తమ లీలను చూపించారు. తన భక్తురాలు బాధపడకూడదని ఆ మంటను తామే తీసుకున్నారేమో! హేమకు నిద్రపట్టింది. ఆ క్షణం నుండి తనకి మంట, బాధ కొద్దిగా కూడా లేవు. అంత తొందరగా కాలిన గాయాల నుండి ఉపశమనం లభించడం చూసి డాక్టరు కూడా ఆశ్చర్యపోయారు. బాబా దయవలన ఆ గాయాలు తొందరగానే నయమైపోయాయి. ఈవిధంగా బాబా అనుభవించాల్సిన పెద్ద కర్మను కొంచంగానే అనుభవింపజేసి తమ భక్తురాలిని కాపాడారు. ఆయన తమ భక్తులు ఎక్కడ ఉన్నా మనోనేత్రంతోనే వారిని రక్షిస్తారు. అందుకు నిదర్శనం ఈ అనుభవం.


బాబాని అడిగితే జరగనిదంటూ ఏమీ ఉండదు


నేను ఒక బాబా భక్తురాలిని. ఎప్పుడు నీడలా తోడుండే బాబాకి ధన్యవాదాలు చెప్పుకుంటూ నా అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. ఇటీవల మా డాడీ తను పనిచేసే కంపెనీవాళ్ళు ఆఫర్ చేసిన టూర్‌కి వెళ్లాలనుకున్నారు. అది హిల్ స్టేషన్ అయినందున 'ప్రయాణం ఎలా ఉంటుందో!' అని నాకు టెన్షన్‌గా అనిపించి డాడీ ప్రయాణానికి ముందురోజు, "బాబా! డాడీకి సదా తోడుగా ఉండి తనకి ఏ ఇబ్బందీ లేకుండా టూర్‌కి వెళ్ళొచ్చేలా చూడండి. డాడీ తిరిగి వచ్చిన వెంటనే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాని వేడుకొని, ఊదీ ఇచ్చి డాడీని పంపాను. నా బాబాని అడిగితే జరగనిదంటూ ఏమీ ఉండదని నా నమ్మకం. నేను నమ్మినట్లే బాబా అన్ని వేళల్లో తోడుగా ఉన్నారు. ఆయన దయవల్ల ప్రయాణంలో గానీ, బస చేసిన చోట గానీ డాడీకి ఏ కష్టమూ కలగలేదు. ఆయన క్షేమంగా టూర్ పూర్తి చేసుకొని వచ్చారు.


ఇకపోతే ఈమధ్య మా కంపెనీవాళ్ళు వారంలో కొన్ని రోజులైనా ఆఫీసుకి తప్పనిసరిగా రావాలని రూలు పెట్టారు. తరువాత ఏదో పనిపడి ఒక వారం ఆఫీసుకి వెళ్లలేని పరిస్థితి నాకు వచ్చింది. కంపెనీవాళ్ళు ఆఫీసుకి రానివాళ్లపై చాలా సీరియస్ అవుతున్నారని తెలిసి కూడా అడిగితే ఏమంటారో అనే భయంతో నేను పర్మిషన్ అడగకుండా, "బాబా! ఎలాగైనా మా మేనేజర్ నేను ఈ వారంలో ఆఫీసుకి వెళ్లని విషయం గురించి నన్ను అడగకుండా చూడండి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల మా మేనేజర్ నన్ను ఏమీ అడగలేదు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".


సాయిభక్తుల అనుభవమాలిక 1519వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. బాబా కృపాకటాక్షాలు
2. పితృదేవతల పేరు మీద అన్నదానం విషయంలో బాబా అనుగ్రహం

బాబా కృపాకటాక్షాలు


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజా పరబ్రహ్మనే నమః!!!


సాయి భక్తులకు నమస్కారం. నా పేరు మల్లీశ్వరి. మేము హైదరాబాదులో ఉంటాము. 1983 నుండి బాబా నాకు తెలుసు. ఆయన అనేక అనుభవాలతో నా భక్తిని నిశ్చలం చేస్తున్నారు. 2023, ఏప్రిల్ ఒకటవ తేదీన మా మరిది వేరే ఊరిలో ఉన్న మా బావగారి దగ్గరికి వెళ్దామని, పొలం సమస్యలు మాట్లాడదామని ఒకటే గొడవ చేశారు. ఆ రోజు నాకు జ్వరంగా ఉన్నందున శరీరం సహకరించడం లేదని నేను చెపితే తను కోప్పడ్డారు కానీ, నన్ను అర్థం చేసుకోలేదు. నేను ఏం చేయలేని పరిస్థితిలో, "బాబా! ప్రోగ్రాం పైవారానికి వాయిదాపడేలా చూడండి" అని బాబాతో చెప్పుకున్నాను. ఆ రాత్రి నేను మా మరిదికి ఫోన్ చేస్తే తీయలేదు. 'ఇంకా కోపం తగ్గలేదేమో! బాబాకి చెప్పాను కదా! చూద్దాం' అని ఊరుకున్నాను. బాబా కృపాకటాక్షాల వలన మా మరిది నాకు ఫోన్ చేసి, "సరే వదిన. ఇప్పుడు వెళ్ళోద్దులే, తర్వాత చూద్దాం" అని తనంతటతానే చెప్పాడు. అది విని నా సంతోషానికి అవధులు లేవు. ఆ ఆనందంలో ఈ అనుభవం బ్లాగులో పంచుకోవాలనుకున్నాను. "ఆలస్యం చేసినందుకు క్షమించు బాబా".


2022 కార్తీక మాసంలో మేము మా ఫ్రెండ్‌వాళ్ళ కుటుంబంతో శ్రీశైలం వెళ్ళాము. అభిషేకానికి వెళదామనుకుంటే ఆన్లైన్లో టిక్కెట్లన్నీ బుక్ అయ్యిపోయాయని అన్నారు. నేను, "బాబా! ఇంత దూరం వచ్చి అభిషేకం చేయించకుండా వెళ్లాలంటే బాధగా అనిపిస్తుంది. ఎలాగైనా మాకు టికెట్ దొరికేటట్లు చూడు తండ్రి" అని బాబాను స్మరించుకున్నాను. అంతలో అన్నయ్యగారు(నా ఫ్రెండ్ భర్త), "నేను కౌంటర్ దగ్గరకు వెళ్లి ప్రయత్నిస్తాను. మీరు ఈ లోపు మిగతా ఆలయాలు చూసి రండ"ని అన్నారు. మేము అన్ని ఆలయాలు దర్శించుకుని, శిఖర దర్శనం కూడా చేసుకొని రూమ్ చేరుకున్నాము. ఆ తండ్రి బాబా దయవల్ల మాకు అభిషేకం మరియు కుంకుమార్చన టిక్కెట్లు దొరికాయని తెలిసి నేను చాలా సంతోషించాను. అయితే టికెట్ మీద ఒక్కరినే పంపుతారట. నేను లైన్లో నిల్చొని, "అయ్యో! ఇంత దూరం వచ్చాము. నాతోపాటు మా పాప కూడా అభిషేకం చేస్తే బాగుంటుంది" అని బాబాని వేడుకుంటూ ముందుకు వెళ్ళాను. సెక్యూరిటీవాళ్ళు, "ఒక టికెట్ మీద ఒక్కరే వెళ్ళాలి" అని ఆపితే, "ప్లీజ్! మా పాపని కూడా పంపండి" అని అన్నాను. 500 రూపాయలు తీసుకొని పాపని కూడా వదిలారు. సంతోషంగా నేను, మా పాప అభిషేకం చేసుకున్నాము. తరువాత పాపతో కుంకుమార్చన చేయిద్దామని భ్రమరాంబ అమ్మవారి ఆలయం దగ్గర వేచి ఉండగా అక్కడ కూడా ఒక టికెట్ మీద ఒకరినే పంపుతారని అన్నారు. "అయ్యో! ఇంత దూరం వచ్చి అమ్మవారిని చూడకుండా వెళ్లిపోవాలా బాబా" అని బాబాని తలుచుకుంటూ "బాబా! దయచూపు తండ్రి" అనుకోని అక్కడ నిరీక్షిస్తూ ఉన్నాను. ఈ లోపు నా ఫ్రెండ్, "పూజ చేస్తున్న వాళ్ల తాలూకు వాళ్ళు కూడా అమ్మవారిని దర్శించుకోవచ్చట. నువ్వు సంతోషంగా వెళ్ళు" అంది. దాంతో నేను సంతోషంగా భ్రమరాంబ అమ్మవారిని దర్శనానికి వెళ్ళాను. అమ్మవారు చక్కటి అలంకరణతో శోభాయమానంగా దర్శనమిచ్చారు. బాబా కరుణాకటాక్షాల వల్ల అమ్మవారిని చూడగానే సంతోషంతో ఉప్పొంగిపోయాను. "సమర్థ సద్గురు సాయినాథ మీ పాదారవిందములకు అనంతకోటి వందనాలు". మరో అనుభవంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.


పితృదేవతల పేరు మీద అన్నదానం విషయంలో బాబా అనుగ్రహం


ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథాయ నమః!!!


నా తల్లి, తండ్రి, గురువు, దైవం అయిన సాయినాథునికి నా నమస్కారాలు. నా పేరు నాగార్జున. సాయి ఆశీస్సులతో ఆయన ప్రసాదించిన ఒక అనుభవాన్ని పంచుకునేందుకు ఇలా మీ ముందుకు మరోసారి వచ్చాను. 2022, ఫిబ్రవరి 28న నాకు పొంగు(అమ్మవారు) వచ్చింది. నాకొచ్చిన 18 రోజులకి మా అన్నయ్యకి కూడా వచ్చింది. ఆ సమయంలో నేను బయటకి వెళ్ళకూడదు. కానీ నేను కొత్త అమావాస్య రోజున పితృదేవతల పేరు మీద అన్నదానం చేయాలనుకున్నాను. ఆ విషయమై ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా ఒక సాయికి సంబంధించిన వాట్సాప్ గ్రూపులో భక్తులెవరో, "మేము శిరిడీ వెళ్తున్నాము. ఎవరైనా సాయి అన్నదానానికి విరాళాలు పంపగలరు" అని మెసేజ్ పెట్టారు. కొంతసేపటి తరువాత నాకు, "వాళ్ళద్వారా, వీళ్ళద్వారా ఎందుకు? నేను నీ దగ్గరలేనా?" అని మాటలు వినపడ్డాయి. అప్పుడు నాకు, 'గతంలో శిరిడీ వెళ్ళినప్పుడు నేను చిలకలూరిపేట నిత్యాన్నదాన ట్రస్ట్‌కి విరాళం ఇచ్చానని, వాళ్ళు ఇచ్చిన రసీదు నా దగ్గర ఉంద'ని గుర్తొచ్చి అక్కడికే విరాళం పంపమని బాబా చెప్తున్నారనిపించింది. నేను వెంటనే ఆ రసీదులో ఉన్న ఫోన్ నెంబరుకి 'ఫోన్ పే' ద్వారా నాకు తోచిన విరాళం పంపి మా నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్యల పేర్ల మీద అన్నదానం చేయమని వాళ్ళకి వాట్సాప్‌లో మెసేజ్ పెట్టాను. కొద్దిసేపటికి వాళ్ళు నాకు ఫోన్ చేసి, "మీరు కోరిన రోజున మీ పెద్దల పేరు మీద అన్నదానం చేస్తాం" అని చెప్పారు. ఆరోజు(కొత్త అమావాస్య) రానే వచ్చింది. ఆరోజు సాయంత్రం ఈటీవిలో వచ్చే 'సద్గురుసాయి' సీరియల్లో దేవా అనే ఒకతను తన పితృదేవతలకు భోజనం పెడితే, వాళ్ళు స్వీకరించినట్లు టెలికాస్ట్ అయింది. తద్వారా నేను ఆరోజు చేయించిన అన్నదానంతో మా పితృదేవతలు సంప్రీతులయ్యారని బాబా తెలియజేసారు. నాకు చెప్పలేనంత ఆనందం కలిగింది. "ధన్యవాదాలు సాయి. నాకు ఒక మంచి ఉద్యోగాన్ని ప్రసాదించు తండ్రి. పదిమందికి మంచి చేసే విధంగా నన్ను, నా కుటుంబసభ్యుల్ని అనుగ్రహించు సాయి. మాకు ఏ సమయంలో ఏమి కావాలో మీకు తెలుసు. మీ ఆశీస్సులు సదా అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను తండ్రి".


సాయిభక్తుల అనుభవమాలిక 1518వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. దారి చూపిన బాబా
2. ఫంక్షన్‌కి వెళ్ళడానికి అనుమతి వచ్చేలా దయచూపిన బాబా

దారి చూపిన బాబా


సాయి భక్తులందరికీ నా నమస్కారాలు. నా పేరు పవన్. నేను కర్నూలు నివాసిని. 2010 నుండి 2014 వరకు నేను బ్యాంకు మేనేజరుగా పని చేశాను. ఆ సమయంలో నేను చేసిన కొన్ని తప్పిదాల వలన నేను నా ఉద్యోగం కోల్పోయాను. అది నా స్వయం కృతాపరాథమైనందున ఎవరినీ నిందించక దేవుణ్ణి నమ్ముకున్నాను. ఒక సంవత్సరంపాటు ఏ ఉద్యోగం లేక ఖాళీగా ఉన్నాను. ఆ సమయంలో నా ధర్మపత్ని నాకు చాలా సపోర్ట్ ఇచ్చింది. మరల బ్యాంకు ఉద్యోగంలో చేరడానికి ప్రయత్నించాను కాని, నా ప్రయత్నాలన్నీ నిష్ప్రయోజనలయ్యాయి. తరువాత బాబా దయతో నాకు ఒక దారి చూపించారు. 2015లో కర్నూలులోనే నాకు ఇంకొక ఉద్యోగం దొరికింది. 2021లో మంచి హోదాతో ఉద్యోగం పెర్మనెంట్ కూడా అయ్యింది. దీనికి నేను బాబాకు సదా కృతజ్ఞుడిని.


తరువాత బాబా నాపై చూపిన ఒక అనుగ్రహాన్ని ఇప్పుడు చెప్తాను. నేను బ్యాంకులో పనిచేసేటప్పుడు నా ఇంటి డాక్యుమెంట్లు పెట్టి హౌసింగ్ లోన్ తీసుకొన్నాను. ఆ లోన్ క్లోజ్ చేసే స్థోమత ప్రస్తుతం నాకున్నప్పటికీ బ్యాంకువాళ్ళు నా ఇంటి డాక్యుమెంట్లు తిరిగి ఇస్తారన్న నమ్మకం లేదు. ఎందుకంటే, సాధారణముగా ఏ బ్యాంకు ఉద్యోగిపైనైనా అభియోగాలు ఉంటే వాళ్లకు సంబంధించిన డాక్యుమెంట్లు రిలీజ్ చేయడానికి బ్యాంకువాళ్ళు అనుమతి ఇవ్వరు. అదే సంశయంతో నేను బాబాను ప్రార్థిస్తే, ఆయన మా ఫ్రెండ్ రూపంలో నా సమస్య పరిష్కరానికి దారి చూపారు. ఆయన అనుగ్రహంతో నా అదృష్టం కొద్ది ఇక్కడ జొనల్ మేనేజరుగా నా ఫ్రెండ్ వచ్చాడు. నేను బాబాను ప్రార్థించి మా ఫ్రెండ్‌తో నా డాక్యుమెంట్ల గురించి చెప్పాను. తను, "వెంటనే ఒక లెటర్ బ్యాంకు మేనేజర్ ద్వారా పంపించమ"ని చెప్పాడు. తను చెప్పినట్లే నేను ఆలస్యం చేయకుండా నా హౌసింగ్ లోన్ క్లోజ్ చేసి నా డాక్యుమెంట్లు నాకు ఇవ్వవలసిందిగా లోకల్ బ్యాంకు మేనేజరుకు లెటర్ పెట్టాను. అలాగే దానికి తగిన విధంగా నా ఎస్‌బి అకౌంటులో బ్యాలన్స్ పెట్టాను. ఆశ్చర్యం కలిగేలా బాబా దయతో అన్నీ చకచకా జరిగి పోయాయి. నా ఫ్రెండ్ హెడ్ ఆఫీసులో ఫాలో అప్ చేస్తే వాళ్ళు వెంటనే డాక్యుమెంట్ల రిలీజుకు పర్మిషన్ ఇచ్చారు. అది నిజంగా బాబా లీలనే. తర్వాత ఒక నెలలో నా హౌసింగ్ లోన్ ఖాతా క్లోజ్ అయ్యి, నా డాక్యుమెంట్లు నాకు వచ్చాయి. "బాబా! నేను మీకు చాలా ఋణపడి ఉన్నాను. మీ దయ మాపై సదా ఉండాలని ప్రార్ధిస్తున్నాను. మీ దయతో నా కూతురికి మంచి ప్యాకేజీతో ఉద్యోగం వచ్చింది. తనకి మంచి పెళ్ళి సంబంధం కుదిరేలా చూడు స్వామి. అలాగే నా కొడుకు చదువు పూర్తవుతూనే తనకి మంచి ఉద్యోగం దొరికేలా చూడు తండ్రి. నేను కేసు నుంచి కూడా త్వరగా బయటపడేలా చూడు బాబా. సదా మీపై నాకు ప్రేమ తగ్గకుండా చూడు బాబా".


ఓంసాయి శ్రీసాయి శరణం శరణం సాయి!!!

ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!


ఫంక్షన్‌కి వెళ్ళడానికి అనుమతి వచ్చేలా దయచూపిన బాబా


నేను ఒక సాయి భక్తురాలిని. 2023, ఏప్రిల్ 9న బాబా నాకు ప్రసాదించిన ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. 2023, ఏప్రిల్ 10న మా కోడలి శ్రీమంతం ఉండగా ముందురోజు 10వ తరగతి పరీక్షల డ్యూటీలో ఉన్న నేను మా MEO, CS గార్లను, "రేపు మా కోడలి శ్రీమంతానికి వెళ్లేందుకు అనుమతినివ్వమ"ని అడగాలని అనుకున్నాను. కానీ ఎంతలా అడిగినా మా MEO అనుమతి ఇవ్వలేదు. మా CS అయితే ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. చివరికి నేను నా తండ్రి బాబాను, "ఎవరన్నా నా డ్యూటీ చేయడానికి ఒప్పుకుంటే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. ఆశ్చర్యంగా కొద్దిసేపటికి మా CS నాకు ఫోన్ చేసి, "నీకు బదులుగా ఎవరైనా రిలీవర్ని చూపిస్తే అనుమతి ఇస్తామ"ని చెప్పారు. అయితే ఎవరిని అడిగినా నా బదులు డ్యూటీకి రామని చెప్పారు. కొద్దిసేపటికి బాబా దయవలన నా సహోద్యోగి ఫ్రెండ్ ఒకరు డ్యూటీ చేస్తానని ఒప్పుకున్నారు. వెంటనే నేను ఆ విషయం మా MEO, CS గార్లకి చెప్పగా నాకు అనుమతి ఇచ్చారు. అనుమతి లభిస్తుందని నేను అస్సలు అనుకోలేదు. అలాంటిది మా కోడలు ఫంక్షన్‌కి వెళ్ళడానికి ఎటువంటి ఇబ్బందీ లేకుండా చేశారు నా తండ్రి బాబా. ఇది ఆయన మహిమ వల్లే సాధ్యమైంది. "ధన్యవాదాలు తండ్రి".


సాయిభక్తుల అనుభవమాలిక 1517వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. వారణాసి యాత్రలో బాబా చూపిన అనురాగం
2. బాబా దయతో స్వస్థత

వారణాసి యాత్రలో బాబా చూపిన అనురాగం


ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి!!! నా పేరు సూర్యనారాయణమూర్తి. నేను ఇప్పుడు ఆత్మీయ సాయిబంధువులతో మా వారణాసి యాత్రలో బాబా మాపట్ల చూపిన అనురాగాన్ని పంచుకుంటున్నాను. ఈ అనుభవాలు పంచుకోవడంలో ఆలస్యమైనందుకు బాబాని క్షమించమని కోరుకుంటున్నాను. 2023, మార్చి 4వ తేదీ ఉదయం 9 గంటలకు మేము హైదరాబాదు నుండి విమానంలో బయలుదేరి 11:05 నిమిషాలకు వారణాసి చేరుకున్నాం. వారణాసి విమానాశ్రయం నుండి మేము బస చేయాల్సిన చోటుకి టాక్సీలో బయలుదేరి వెళ్తుండగా హొలీ పండగ కారణంగా మణికర్ణిక ఘాటు వద్ద చాలా రద్దీగా ఉంది. ఆ రద్దీని దాటడానికి చాలా సమయం పడుతుంది. ఆ కారణంగా మేము మా బసకు చేరడం ఆలస్యమైతే అక్కడ భోజనాలుండవు. అందుకని నేను సాయిని, "దారి చూపమ"ని ప్రార్థించాను. ఆయన దయ చూపారు. ఒక పోలీస్ అధికారి వాహనంలో వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేసి మమ్మలి వెళ్ళడానికి అనుమతించారు. దానితో మేము సుమారు 1:30 నిమిషాలకు మా బసకి చేరుకున్నాము. బాబా దయవలన మాకు భోజనాలు అందాయి. అలాగే 2023, మార్చి 8న గయ నుండి తిరిగి వచ్చేటప్పుడు కూడా హోలీ వల్ల ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంది. మేము ఎప్పుడు మా బసకు చేరుకుంటామో అని కంగారుపడ్డాం. అప్పుడు కూడా బాబా దయతో పోలీసు ఉన్నతాధికారులు వచ్చి ట్రాఫిక్ నియంత్రణ చేశారు.


2023 మార్చి 7న మేము శ్రీవిశ్వనాథుని దర్శనానికి వెళ్ళినప్పుడు చాలా రద్దీగా ఉంది, లైన్లు కూడా ఆపేసారు. నేను, "బాబా! ఈరోజు మాకు ఎలాగైనా దర్శనం అయ్యేలా దయచూపండి. మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను ప్రార్థించాను. అలా బాబాను ప్రార్థించగానే లైన్లు వదిలారు. అంతేకాదు, విశ్వనాథుని లింగం వద్ద బాబా మాకు దర్శనమిచ్చారు. అది బాబా మాకు ప్రసాదించిన మహద్భాగ్యం.


2023, మార్చి 8న మేము ఉదయం నుండి సాయంత్రం వరకు సుమారు 90 కిలోమీటర్ల కాశీ పరిక్రమ యాత్ర ఆటోలో చేసాము. ఆ యాత్ర అంతటా బాబా మాతో ఉండి మమ్మల్ని ముందుకు నడిపించారు. యాత్ర చివరిలో గంగానదిలో బోటు ఆగిపోయి చాలా ఇబ్బందిపెట్టింది. మేమంతా చాలా భయపడి బాబా నామస్మరణ బిగ్గరగా చేసాము. ఇంతలో మరో బోటు అతను వచ్చి మమ్మల్ని సురక్షితంగా ఒడ్డుకు చేర్చాడు. ఇవన్నీ బాబా అనుగ్రహ చమత్కారాలు. ఇలాగే సర్వోజనులను సకల వేళలందు చల్లగా చూడమని బాబాను ప్రార్థిస్తున్నాను.


బాబా దయతో స్వస్థత


సాయి బంధువులకు నమస్కారాలు. నాపేరు లక్ష్మి. మాది హైదరాబాద్. సద్గురు సాయి నాకు ఎన్నో అనుభవాలు ప్రసాదించారు. 2020, జూన్‌లో ఒకరోజు నిద్రలేచేసరికి నా ఎడమచెవికి ఏదీ వినిపించలేదు. మావారు బ్లాక్ అయివుంటుందని ఇయర్ డ్రాప్స్ వేశారు. అలా రెండు, మూడు రోజులు ఇయర్ డ్రాప్స్ వేసి చూసినా గుణం కనపడలేదు. దగ్గరలో మా అమ్మాయి పెళ్లి కూడా ఉండడంతో నేను కొంచెం ఆందోళన చెందాను. కోవిడ్ సమయమైనందున బయటకి వెళ్లి ఏదైనా హాస్పిటల్‌కి వెళ్లాలంటే భయంతో నెట్లో సెర్చ్ చేస్తే ఒక ENT డాక్టరు అందుబాటులో కనిపించారు. ఆయన్ని సంప్రదిస్తే, "దాదాపు 80 నుండి 90 శాతం డామేజ్ అయింది. అయినా చెవికి ఇంజక్షన్ ఇచ్చి మన ప్రయత్నం మనం చేద్దాం" అన్నారు. నేను బాబాని, "ఏ సమస్య లేకుండా నాకు వినిపించేటట్లు చేయి నాయనా" అని వేడుకున్నాను. ఆయన దయవల్ల అంత డామేజ్ అయినా కూడా మూడు ఇంజన్క్షన్లకే నా చెవి సమస్య నయమైంది. నిజంగా అది అద్భుతం. మా అమ్మాయి పెళ్లి చాలా సంతోషంగా జరిగింది. "కృతజ్ఞతలు బాబా".


ఇటీవల మేము శిరిడీకి ఫ్లైట్ టిక్కెట్లు బుక్ చేసాము. ముందురోజు మా మనవరాలికి విపరీతమైన జ్వరం వచ్చింది. జలుబు, దగ్గుతోపాటు రక్తవిరోచనలు కూడా అయి పాప చాలా నీరసించిపోయింది. డాక్టరు మందులిచ్చారు. మేము బాబాని, "సాయీ! మీ దర్శనానికి మమ్మల్ని అనుమతించు స్వామి. మనవరాలికి తగ్గితే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాన"ని వేడుకున్నాము. అంతే, మా మనవరాలికి తగ్గింది. మరుసటిరోజు చెక్ అప్ కోసం డాక్టరు దగ్గరకి వెళితే, "శిరిడీ వెళ్ళిరండి" అని చెప్పారు. మేము సంతోషంగా శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకుని వచ్చాము. అంతా ఆయన దయ. నేను సదా ఆయనకి కృతజ్ఞురాలిని.


సాయిభక్తుల అనుభవమాలిక 1516వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1.  బాబా రక్షణ
2. శ్రీసాయి ఆరోగ్యప్రదాత

 బాబా రక్షణ

అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాధ్ మహారాజ్ కీ జై!!!

సాయి బంధువులందరికీ నా నమస్కారాలు. నేను ఒక సాయి భక్తురాలినని చెప్పుకోడానికి నాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే, సాయి భక్తులందరూ చాలా అదృష్టవంతులు. వాళ్ళు మిగతా వారి కంటే చాలా భిన్నంగా సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు. అందువల్ల వారికి సమాజంలో చాలా గౌరవం ఉంటుంది. అది బాబా దయ. పోయిన జన్మలో మంచి కర్మలు చేయడం వల్ల ఈ జన్మలో ఆయన భక్తులమయ్యాం. ఆయన మన ప్రేమను తప్ప ఏమీ ఆశించక 'బాబా' అని పిలవగానే 'ఓయ్' అని పరిగెత్తుకుంటూ వచ్చి మనకు సహాయం చేస్తారు. అటువంటి అనుభవాలు మనకు ఆయనతో ఎన్నో ఉంటాయి. మనం ఆయన నుండి పొందిన మేలును గుర్తుపెట్టుకొని ఆయన్ని స్మరించుకుంటూ 'శ్రద్ధ', 'సబూరీ' కలిగి ఉంటే చాలు. ఆయన చాలా పొంగిపోతారు. మనకి ఏది మంచిదో అది సమయానికి సమకూరుస్తారు. కరుణామయుడు, దయార్థహృదయుడు యిన బాబా 'సాయి సాయి' అని జపిస్తే సప్తసముద్రాలు ఆవల ఉన్నా రక్షిస్తానని అభయమిచ్చారు. కాబట్టి మనం ఎల్లప్పుడూ బాబా నామస్మరణలో ఉంటే మన బాగోగులు బాబానే చూసుకుంటారు. మనం దేనికీ చింతించాల్సిన అవసరం లేదు. ఇక నా అనుభవాల విషయానికి వస్తాను.

మేము హైదరాబాద్‌లో ఉంటాము. మా అత్తయ్య, మామయ్య వేరే ఊరిలో ఉంటారు. ఒకరోజు హఠాత్తుగా, 'మామయ్యగారికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చేయి, మాట రావడం లేదు' అని మాకు ఫోన్ వచ్చింది. మావయ్యగారి వయస్సు 85 సంవత్సరాలు. మాకు చాలా భయమేసింది. నేను, "బాబా! మామయ్యకి ఏమీ కాకుండా ఆరోగ్యంగా ఉండేలా చూడండి" అని ప్రార్థించాను. ఆ వూరు నుండి హైదరాబాద్ రావడానికి చాలా సమయం పడుతుందని మా మావయ్యగారి బంధువులు ఆయన్ని అక్కడున్న ఒక హాస్పిటల్లో జాయిన్ చేస్తే, టెస్టులన్నీ చేసి, "బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయింది. ఇంజక్షన్ ఇవ్వాల"ని చెప్పారు. ఆరోజు గురువారం. నేను ఉదయం నుంచి బాబా చరణాలకి పూజ చేశాను. మావారు బాబా ఊదీ తీసుకుని హాస్పిటల్కి వెళ్లి రోజూ మా మామయ్య నుదుటన మరియు చేతికి ఊదీ రాసి, మరికొద్దిగా ఊదీ ఆయన నోట్లో వేస్తుండేవారు. నేను 'శ్రీ సాయి సచ్చరిత్ర' సప్తాహ పారాయణ చేశాను. బాబా దయవల్ల రోజురోజుకి కొంచెం కొంచంగా చేయి, నోరు కదలికలు వచ్చి నాలుగు రోజులకు మంచిగా సెట్ అయిపోయింది. ఆ వయసులో ఆయన కోలుకోవడం చాలా కష్టం కానీ, బాబా కృప, ఆయన ఊదీ వల్ల అంత త్వరగా కోలుకొని ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. "చాలా ధన్యవాదాలు బాబా. మా అత్తయ్య, మామయ్య ఆరోగ్యంగా ఉండేలా దీవించండి. అందరి మీద మీ కృపాదృష్టి ఉంచి అందరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండేలా దీవించండి తండ్రి. పిల్లలకి మంచి విద్య, సద్బుద్ధి ప్రసాదించండి. మేము ఎల్లప్పుడూ మీ పాదాలు విడవకుండా ఉండేలా అనుగ్రహించండి బాబా".

ఒకరోజు హఠాత్తుగా నాకు నడుము నొప్పి, కడుపులో నొప్పి వచ్చాయి. అప్పుడు నేను బాబా ఊదీ సేవించి, 'ఓం శ్రీసాయి ఆరోగ్యక్షేమదాయ నమః' అనుకుంటూ, "బాబా! నాకు తగ్గేలా చూడండి. మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకున్నాను. ఆశ్చర్యం! ఒక గంటలో నొప్పి తగ్గిపోయింది. ఇంకోరోజు మా బాబు తలనొప్పిని అని ఏడ్చాడు. నాకు చాలా భయమేసి, "బాబా! ఏమీ కాకుండా చూడండి. బాబుకి తలనొప్పి తగ్గిపోతే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాకి చెప్పుకున్నాను. తరువాత డాక్టర్ దగ్గరకి వెళ్తే, "ఏమీ లేదు. ఎండ వల్ల వచ్చింది" అని చెప్పారు. మరొకరోజు మా బాబు స్కూలుకు వెళదామని బయలుదేరితే తన సైకిల్ తాళం కనిపించలేదు. తను స్కూలు టైమ్ అయిపోతుందని చాలా టెన్షన్ పడుతుంటే నేను, "బాబా! స్కూలుకు టైమ్ అవుతుంది. తొందరగా సైకిల్ తాళం దొరికేలా చూడండి. మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని అనుకొని 'ఓం శ్రీ సాయి సూక్ష్మయ నమః' అని జపించాను. అలా బాబాని తలుచుకోగానే మా బాబుకి ఆ సైకిల్ తాళం స్కూటీలో పెట్టానని జ్ఞాపకం వచ్చింది. అంతా బాబా దయ. "చాలా చాలా ధన్యవాదాలు బాబా".

శ్రీసాయి ఆరోగ్యప్రదాత

సద్గురు సాయిబాబాకి శతకోటి పాదాబివందనలు సాయి భక్తులకు నమస్కారాలు. నేను ఒక సాయి భక్తుడిని. నేను చాలా రోజుల నుంచి భుజము నొప్పితో బాధపడుతున్నాను. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. చివరికి నేను బాబాకి మ్రొక్కుకొని ఊదీ భుజానికి రాసుకున్నాను. బాబా దయవల్ల చాలా త్వరగా నొప్పి తగ్గింది. అలాగే నా భార్య ఒకవైపు తలనొప్పితో చాలా బాధపడుతూ విలవిలలాడిపోతుంటే నేను, "బాబా! నా భార్యకి నొప్పి తగ్గితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. బాబా దయతో నొప్పి చాలా తొందరగా తగ్గిపోయింది. బాబా దయాసముద్రుడు, అనంత కరుణామయుడు. "బాబా! మీకు శతకోటి వందనాలు. అనంతమైన మీ దయ, కరుణలు ఎల్లప్పుడూ మీ భక్తులపై వుండాలని కోరుకుంటున్నాను తండ్రి".

సాయిభక్తుల అనుభవమాలిక 1515వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా మాతోనే ఉంటున్న బాబా
2. కోరకుండానే బాబా చేసిన అద్భుతం

ఎన్ని ఆటుపోట్లు వచ్చినా మాతోనే ఉంటున్న బాబా
 
సాయిభక్తులందరికీ నమస్కారం. నేను ఒక సాయి భక్తుడిని. నా పేరు మిథున్. బాబా నా జీవితంలోకి నా చిన్నతనంలోనే ప్రవేశించారు. ఆయన నాకు చేసిన మేలు, కష్టాల్లో నాకు చేసిన సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను ఇప్పుడు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను పంచుకుంటున్నాను. తద్వారా ఆ అనుభవాలను చదివేవాళ్లకి బాబా మీద ప్రగాఢమైన విశ్వాసం ఏర్పడుతుందని నమ్ముతున్నాను. నేను యుఎస్ఏలో నివాసముంటున్నాను. 2020, అక్టోబరులో నేను పనిచేసే కంపెనీవాళ్ళు నా గ్రీన్ కార్డ్ ప్రాసెస్ చేసారు. కానీ అందులో ఏదో తప్పు ఉండటంతో మరోసారి ప్రాసెస్ చేయాల్సి వచ్చింది. అది అప్రూవైతేనే నా హెచ్1 వీసా ఎక్స్టెన్షన్‌కి అప్లై చేసే అవకాశముంది. కానీ గ్రీన్ కార్డు ప్రాసెస్ బాగా ఆలస్యం కాసాగింది. ఆ క్రమంలో నా హెచ్1 వీసా ఎక్స్టెన్షన్‌కి అప్లై చేయడానికి కొద్దిరోజుల సమయమే ఉందని తెలియక ఆలోగా గ్రీన్ కార్డు అప్రూవ్ అవ్వకపోతే ఏం చేయాలన్న ఊహ కూడా నాకు రాలేదు. హఠాత్తుగా ఆ విషయం నా గమనికలోకి వచ్చేసరికి నేను షాకయ్యను. నేను నాకు ఏ కష్టమొచ్చినా బాబా నాతోనే ఉన్నారనే నమ్ముతాను. ఆ నమ్మకంతో నేను సాయి దివ్యపూజ మొదలుపెట్టాను. ఆ పూజ మొదలుపెట్టగానే 2022, జూన్‌లో అంటే దాదాపు రెండు సంవత్సరాలకి 'గ్రీన్ కార్డు అప్రూవ్ అయింద'ని మా ఆఫీసు నుంచి నాకు మెయిల్ వచ్చింది. తరువాత వాళ్ళు నా హెచ్1 వీసా ఎక్స్టెన్షన్‌కి అప్లై చేస్తామని అదే నెలలో అప్లికేషన్ వేశారు. కానీ ఆ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఆలస్యం అవ్వసాగింది. అయినప్పటికీ సమయానికి ప్రాసెస్ అవుతుందని నేను అనుకున్నాను. కానీ నవంబరులో నాకు RFE (Request for Evidence) వచ్చింది. సరే, ఒక వారంలో లెటర్ వస్తుంది. అదేంటో చూసి పంపిద్దాం అనుకున్నాను. అయితే మూడు వారాలు అయినా లెటర్ రాలేదు. దాంతో నాకు బాగా టెన్షన్ ఎక్కువై నిద్ర కూడా పట్టేది కాదు. నేను బాబాని ప్రార్థిస్తూ ఉండేవాడిని. బాబా దయవల్ల మా ఆఫీసువాళ్లు ప్రీమియం ప్రాసెస్ చేస్తామని చెప్పారు. అయితే ఒక వారంలో ఆ లెటర్ వచ్చింది. అందులో కేవలం నా పాస్పోర్ట్ కాపీ పంపమని ఉంది. విశేషమేమిటంటే, నేను వీసా విషయంగా ఏడు వారాల బాబాకి దివ్యపూజ మొదలుపెట్టగానే ఈ అద్భుతం జరిగింది. మూడు వారాలు అయ్యేలోపు నా వీసా అప్రూవ్ అయింది. నాలుగో వారం పూజ అయ్యేసరికి నేను హఠాత్తుగా ఇండియా రావాల్సి వచ్చింది. మేము ఇండియా వచ్చాక తిరుగు ప్రయాణానికి 2023, మార్చి 30కి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకొని నేను, నా భార్య వీసా స్టాంపింగ్‌కి వెళ్లి, "నాకు, నా భార్యకి సమయానికల్లా వీసా రావాల"ని బాబాకి మొక్కుకొని డ్రాప్ బాక్స్‌లో వేసాము. బాబా దయవల్ల ఒక వారంలో నా వీసా నా చేతికి వచ్చింది. కానీ నా భార్యని వీసా ఇంటర్వ్యూకి రమ్మన్నారు. మార్చి 20న మేము చెన్నై వెళ్ళాము. నా భార్య, 'బాబా అంతా మంచే చేస్తార'ని నమ్మకంతో ఇంటర్వ్యూకి వెళ్లింది. ఆయన దయవల్ల నా భార్య వీసా అప్రూవ్డ్ అని చెప్పారు. మేము కోరుకున్నట్లే సమయానికల్లా మా వీసా స్టాంపింగ్ అయి మేము క్షేమంగా యుఎస్ఏకి తిరిగి వచ్చాము. జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా బాబా మాతోనే ఉంటారని నా నమ్మకం. మేము సదా ఆయనకి ఋణపడి ఉంటాము. "ధన్యవాదాలు బాబా".

కోరకుండానే బాబా చేసిన అద్భుతం

నా పేరు రేవతి. ఒంటిపూట స్కూళ్ళు పెట్టినప్పటినుంచి నాకు తలనొప్పి మొదలైంది. టాబ్లెట్ వేస్తే కొంచెం తగ్గి మళ్ళీ వస్తుండేది. ఎందుకో గాని, నొప్పి తగ్గాలని బాబాని నేను కోరలేదు. అయితే ఒకరోజు 'సాయి మహారాజ్ సన్నిధి' వాట్సాప్ గ్రూపులో 'సాయిభక్త అనుభవమాలిక 1225వ భాగం' షేరు చేసారు. అందులో "బాబా కృపతో సంవత్సరంనాటి తలనొప్పి నుండి కొంత ఉపశమనం" అన్న ఒక భక్తుని అనుభవం ఉంది. దాన్ని చదివిన నేను అది నా గురించి కాదులే అనుకున్నాను. మరుసటిరోజు ఈ బ్లాగుకి సంబంధించిన 'సాయి మహారాజ్ బ్లెస్సింగ్స్' గ్రూపులో ఒక భక్తురాలు తన అనుభవాన్ని ఇలా పంచుకున్నారు: "ఓం సాయి శ్రీసాయి జయ జయ సాయి. నాపేరు లక్ష్మి. ఈరోజు నేను తలనొప్పి, గ్యాస్ ప్రోబ్లంతో చాలా ఇబ్బందిపడ్డాను. మన సాయితండ్రిని ప్రార్థించి ఊదీ నీళ్లలో కలుపుకుని త్రాగాను. వెంటనే ఆ సమస్యలు తగ్గాయి. శతకోటి వందనాలు సాయితండ్రి. ఎల్లవేళలా అందరినీ ఇలాగే కాపాడు సాయిబాబా" అని. అది చదివాక బాబా నాకే చెప్తున్నారనిపించి వెంటనే ఊదీ కలిపిన నీళ్లు తాగి పడుకున్నాను. నిద్రలేచేసరికి తలనొప్పి లేదు. వారం రోజులుగా టాబ్లెట్ వేస్తున్నా, నవరత్న తైలం రాస్తున్నా తగ్గని తలనొప్పి బాబా ఊదీ వలన తగ్గింది. అది కూడా బాబానే నాకు గుర్తు చేసి నాచేత ఊదీ నీళ్లు త్రాగించారు. "నేను చెప్పకుండానే నా బాధను తొలగించిన మీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో తెలియట్లేదు బాబా. నిజంగా మీ బిడ్డలం అయినందుకు మేము ఎంతో అదృష్టవంతులం బాబా".

సాయిభక్తుల అనుభవమాలిక 1514వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. మదిలోని కోరికను తీర్చిన బాబా
2. ఈ కలికాలంలో పిలిస్తే పలికే దైవం శ్రీసాయిబాబా

మదిలోని కోరికను తీర్చిన బాబా

సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు శిరీష. నేను 2019లో శిరిడీ వెళ్ళినప్పుడు నాతోపాటు విగ్రహం రూపంలో బాబా మా ఇంటికి వచ్చారని ఇదివరకు మీ అందరితో పంచుకున్నాను. నేను ఆ బాబా విగ్రహానికి రోజూ దణ్ణం పెట్టుకొని, దీపం వెలిగిస్తూ ఉంటాను. కొన్ని రోజులకి ఆ బాబాకి ఒక వెండి కిరీటం చేయించాలని నాకు అనిపించింది. ఆ విషయమే ఆలోచిస్తూ ఉండగా ఒకరోజు మా పక్క వీధిలోని ఒక చిన్న వెండి షాపులో ఒక అబ్బాయి చిన్న వెండి గొడుగును, కొన్ని దేవుడికి ఉపయోగించే చిన్న వెండి వస్తువులను శుభ్రం చేస్తుండటం చూసాను. నేను ఆ అబ్బాయిని, "ఇవి నువ్వే చేసావా?" అని అడిగాను. అందుకు తను, "నేనే చేసాన"ని అన్నాడు. అప్పుడు నేను, "మా ఇంట్లో బాబా విగ్రహం ఉంది. దానికి కిరీటం చేస్తావా?" అని అడిగితే, "చేస్తాను" అన్నాడు. కానీ తరువాత నేను రెండు, మూడుసార్లు అడిగినా తను మా ఇంటికొచ్చి కొలతలు తీసుకోలేదు. ఇంకా నేనూ ఊరుకున్నాను. కొన్నిరోజులకి నాకు 'బాబాకు బంగారు కిరీటం చేస్తే బాగుంటుంది' అనిపించింది. కానీ మాకు దగ్గర్లో ఉన్న బంగారం షాపువాళ్ళు చేయలేరేమోననిపించి ఊరుకున్నాను. మనసులో మాత్రం ఆ కోరిక అలానే దృఢంగా ఉండి గుర్తు వచ్చినప్పుడల్లా, "బాబా! నీకోసం కిరీటం నువ్వే చేయించుకో. ఎవరితో చేయించాలో నాకు తెలియడం లేదు" అని చాలాసార్లు చెప్పుకున్నాను. మొన్న ఉగాది ముందురోజు బీరువాలోని బంగారం తీస్తుంటే, మా పాప చిన్నప్పుడు తనకోసం మా ఆడపడుచు చేయించిన గాజులు కనిపించాయి. వాటిని మా పాప ఒక్కసారే వేసుకుంది. ఆ గాజుల సైజు చూస్తే, 'అది బాబా తలకు సరిపోతుందో, లేదో చూద్దామ'ని నాకు అనిపించింది. నా ఆలోచన 'సైజ్ సరిపోతే ఏదైనా పెద్ద షాపుకి వెళ్ళినప్పుడు ఆ సైజులో  కిరీటం చేయించాల'ని మాత్రమే. కానీ ఆ గాజు బాబా తల మీద పెడితే చాలా అందంగా వుంది. అప్పుడు నాకు 'ఈ గాజునే కిరీటంలా పెడితే బాగుంటుంది' అనిపించింది. తర్వాత నాకు నా దగ్గరున్న చిన్న పెండెంట్‌ని ఆ గాజుకి తగిలించాలనిపించింది. వెంటనే ఒక దారంతో ఆ పెండెంట్‌ను గాజుకి కట్టాను. దాన్ని బాబాకు పెడితే ఇంకా బాగుంది. అప్పుడు బాబా నా కోరికని ఇలా తీర్చారని సంతోషించి ఉగాది రోజు నుండి దాన్ని రోజు బాబాకి పెడుతున్నాను. ఈ సంతోషాన్ని, బాబా ప్రేమను మీ అందరితో పంచుకోవాలనిపించి ఇలా మీతో పంచుకున్నాను. కింద ఫోటో జతపరుస్తున్నాను, చూడండి.


ఈ కలికాలంలో పిలిస్తే పలికే దైవం శ్రీసాయిబాబా

సాయి బంధువులకు నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మాది పల్నాడు జిల్లా. నేనిప్పుడు బాబా ప్రసాదించిన అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. ఒకసారి మా అన్నయ్య బావమరిది తన బంగారు నాన్ తాడు ఒకటి దాచి పెట్టమని మా అన్నయ్యకు ఇచ్చాడు. మా అన్నయ్య దాన్ని ఒక పర్సులో పెట్టి బీరువాలో పెట్టాడు. అదే సమయంలో వాళ్ళు తిరుపతి వెళ్తుండటంతో పిల్లలు దొంగల భయముందని ఆ పర్సుని పుస్తకాల మధ్యలో ఉంచి తిరుపతి వెళ్లారు. తిరుపతి నుంచి తిరిగి వచ్చాక వాళ్ళు ఆ పర్సు గురించి పూర్తిగా మర్చిపోయారు. సుమారు ఆరునెలల తర్వాత మా అన్నయ్య బావమరిది ఆ బంగారు తాడు గురించి అడిగితే అప్పుడు అన్నయ్యకు గుర్తు వచ్చి, దాని గురించి ఎంత వెతికినా దొరకలేదు. మా అన్నయ్య వాళ్లింటికి వచ్చే రెండు ఇరుగుపొరుగు కుటుంబాలవాళ్ళను అనుమానించి వాళ్లని అడిగితే, "మాకు తెలియద"ని అన్నారు వాళ్ళు. అన్నయ్య విషయం నాతో చెప్పినప్పుడు నేను, "ఈ కలికాలంలో పిలిస్తే పలికే దైవం శ్రీసాయిబాబా. సద్గురు దైవం. వారికి మొక్కుకొని బంగారం దొరికేవరకు నీకు బాగా ఇష్టమైన ఆహారాన్ని విడిచి, తరువాత శిరిడీ వెళ్లి మ్రొక్కు తీర్చుకోమ"ని చెప్పాను. మా అన్నయ్య నేను చెప్పినట్లే సాయిబాబాకి మ్రొక్కుకుంటే సరిగ్గా 15 రోజులకి ఒక రాత్రిపూట ఆ బంగారాన్ని తీసినవాళ్ళు తమంతటతామే ఆ బంగారం మా అన్నయ్య వాళ్ళింట్లో విసిరేశారు. ఇట్లా పిలిస్తే పలికే దైవం శ్రీ శిరిడీ సాయిబాబా లీలలు ఎన్ని చెప్పగలము?

నా వయసు 35 సంవత్సరాలు. సుమారు రెండు నెలల క్రితం నాకు ఒక పది రోజులు వరకు నిద్రపట్టేది కాదు. నిద్రమాత్రలు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేను చాలా భయపడిపోయాను. సాయిబాబా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సైటులో చూస్తే, 'సాయి సచ్చరిత్ర మూడువారాలు పారాయణ చేస్తే, తగ్గుతుంద'ని వచ్చింది. నేను అలాగే పారాయణ చేస్తే మూడు వారాలకి నా నిద్రలేని సమస్య తగ్గిపోయింది. "థాంక్యూ బాబా. నన్ను మీ శ్రద్ధ, సబూరీ మార్గంలో నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి".

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo