సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1504వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. ఆరోగ్య విషయంలో శాంతపరిచిన బాబా
2. ఆపరేషన్ అవసరం లేకుండా కాపాడిన బాబా

ఆరోగ్య విషయంలో శాంతపరిచిన బాబా

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై| 
సద్గురు శ్రీ సాయినాథుని శరత్‌బాబూజీ కీ జై||

నా పేరు జ్యోతి. నేను యుఎస్ఏలో ఉంటున్నాను. కొన్ని సంవత్సరాలుగా నా ఆరోగ్యం బాగుండట్లేదు. డాక్టర్ దగ్గరకు వెళ్లే ప్రతిసారీ నేను బాబా ముందు నిల్చొని నా బాధ చెప్పుకొనేదాన్ని. ప్రతిసారీ డాక్టర్ 'మీకేమీ సమస్య లేదు' అనేవారు. కానీ నాకు చాలా నొప్పులు వస్తుండేవి. అలా కొన్ని సంవత్సరాలు గడిచాయి. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న మరుసటిరోజు నుండి నొప్పులు మరింత ఎక్కువయ్యాయి. అలా మరో రెండేళ్లు గడిచినా నొప్పులు తగ్గలేదు. అప్పుడు స్పెషలిస్ట్ డాక్టరుని సంప్రదిస్తే చాలా పరీక్షలు చేశారు. ఆ పరీక్షల్లో నాకు సమస్య ఏమీ లేదని తేలింది. కానీ నా బాధ తీరక ఇంకో డాక్టర్ దగ్గరకి వెళ్ళాము. ఆయన వేరే పరీక్షలు వ్రాశారు. ఆ టెస్టులు చేశాక రిపోర్టులు రావడానికి 10 రోజులు పడుతుందన్నారు. ఇక నా టెన్షన్ చూడాలి. నిద్రపోకుండా ప్రతిక్షణం బాబాని తలచుకుంటూ ఉండేదాన్ని. ఆ టెస్టుల రిపోర్టులు రోజుకొకటి వస్తూ కొన్నిరోజులకి చాలా రిపోర్టులు వచ్చాయి. వాటిని చూసే ధైర్యం లేక నా భర్తనే చూడమని చెప్తూండేదాన్ని. నా భర్త మాత్రం, "మనకు బాబా ఉన్నారు. నువ్వు టెన్షన్ పడకు" అనేవారు. బాబా దయవల్ల చాలావరకు రిపోర్టులు నెగిటివ్ వచ్చాయి. 10 రోజులు అయిపోయాక రిపోర్టులన్నీ వచ్చాయో, లేదోనని భయపడుతుంటే డాక్టర్ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఓపెన్ చేసి చూడాలంటే, 'డాక్టరు ఏం చెప్తున్నారో!' అని నాకు చాలా భయమేసింది. అయితే ఆ మెసేజ్‌లో, 'ఏ బాక్టీరియా లేదు' అని వుంది. అప్పుడుగానీ నేను శాంతపడలేదు. "చాలా చాలా ధన్యవాదాలు బాబా. జీవితాంతం మీకు ఋణపడివుంటాము. శిరిడీ వచ్చి నా మొక్కు తీర్చుకుంటాను బాబా. నా ఆరోగ్యం బాగుండేటట్లు చూడు తండ్రీ. అలాగే నా భర్త, పిల్లల ఆరోగ్యం కూడా బాగుండేటట్లు చూసి మమ్మల్ని కాపాడు తండ్రీ. జన్మజన్మలకి మీకు ఋణపడివుంటాను స్వామీ. చివరిగా నాకు, నా భర్తకి మా పిల్లల్ని బాగా చదివించి, మంచి వృద్ధిలోకి తెచ్చే శక్తినివ్వు స్వామీ".

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!

ఆపరేషన్ అవసరం లేకుండా కాపాడిన బాబా

నేను సాయిభక్తురాలిని. నాకు ఇద్దరు మగపిల్లలు. పెద్దబాబు ఎంబీఏ పూర్తిచేసి 3 సంవత్సరాలవుతుంది. తను ఎంబీఏ అయిపోయాక వాళ్ళ డాడీ నడుపుతున్న రియల్ ఎస్టేట్ ఆఫీసుకి వెళ్తున్నాడు. ఇక్కడొక విషయం చెప్పాలి, తను ఎంబీఏ చేసే రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ విషయం మాకు చెప్తే, "ఇప్పుడు లవ్వూ లేదు, ఏమీ లేదు. బుద్ధిగా చదువుకో" అని మందలించాము. ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఆ అమ్మాయికి పెళ్లి చేశారు. అప్పటినుండి మా పెద్దబాబు డ్రింక్ చేయడం, మూడీగా పడుకోవటం చేస్తుండేవాడు. రెండు రోజులు ఆఫీసుకి వెళ్తే నాలుగు రోజులు పూర్తిగా ఇంట్లో పడుకునేవాడు. ఇలా రెండు సంవత్సరాలు చేశాడు. నేను ఎంత చెప్పినా తను వినట్లేదని, "బాబా! మావాడు గదిలో అలా పడుకోకుండా బయటకు వచ్చేలా చేయి తండ్రీ. మీ అనుగ్రహాన్ని మీ భక్తులతో పంచుకుంటాను" అని సాయికి చెప్పుకున్నాను. ఒక 15 రోజులకి బాబు బయటకు వచ్చాడు. ఇప్పుడు బాగానే ఉంటున్నాడు. 'ఈ విషయాన్ని ఎలా వ్రాయాలి?' అని అనుకుంటున్న తరుణంలో నాకు, 'ఈ బ్లాగులో మీ అనుభవం పంచుకోవాలంటే పేపర్ మీద వ్రాసి పంపవచ్చు' అని ఒక మెసేజ్ వచ్చింది. దాన్ని బాబానే పంపారనుకున్నాను. నాకు ధైర్యమొచ్చి వెంటనే అనుభవాన్ని వ్రాద్దామనుకున్నాను. కానీ, ఈలోపు పెద్దబాబుకి చాలా పెద్ద ఆరోగ్య సమస్య వచ్చింది. అదేమిటంటే, సరిగా తినకుండా డ్రింక్ చేయడం వల్ల క్లోమగ్రంథికి ఇన్ఫెక్షన్ వచ్చి చాలా బరువు తగ్గాడు. 70 కేజీల నుంచి 52 కేజీలకు వచ్చాడు. మాకు చాలా భయమేసి ఒక డాక్టర్ దగ్గరకి వెళ్తే, అన్ని టెస్టులు చేసి, "అవసరమైతే ఆపరేషన్ చేయాలి" అని మరింత భయపెట్టారు. నేను బాబా మీదనే భారమేశాను. డాక్టరు ఒక నెలకి మందులు ఇచ్చారు. అవి వేసుకుంటుంటే గ్యాస్ వల్ల విపరీతమైన నొప్పి వచ్చి బిడ్డ తట్టుకోలేకపోయేవాడు. నేను బాబా ఊదీ రాసి, ఊదీని నోట్లో వేయడం చేస్తుండేదాన్ని. అలా ఒక నెల బాధపడ్డాము. తరువాత మళ్ళీ డాక్టరు దగ్గరకి వెళితే, 'ఇంకొంచెం ఇన్ఫెక్షన్ ఉంది' అన్నారు. మాకు భయమేసి ఇంకో డాక్టరుని సంప్రదించి, ఆయనిచ్చిన మందులు రెండు నెలలు వాడితే బాబా దయవల్ల ఆపరేషన్ లేకుండానే ఆ సమస్య నుండి బయటపడ్డాము. బాబు కొంచెం బరువు కూడా పెరిగాడు. ఇది జరిగి ఆరు నెలలవుతుంది. బాబు ఇంకా బరువు పెరగాల్సి ఉంది. "ఆపరేషన్ అవసరం లేకుండా కాపాడినందుకు ధన్యవాదాలు బాబా. మీ దయతో బాబు మంచిగా ఆరోగ్యంగా ఉండాలి. అలాగే, మా కుటుంబాన్ని ఎల్లవేళలా కాపాడు తండ్రీ. నా అనుభవాన్ని పంచుకోవడంలో కొంచెం ఆలస్యమైనందుకు నన్ను క్షమించు సాయితండ్రీ".

2 comments:

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo