సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1514వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. మదిలోని కోరికను తీర్చిన బాబా
2. ఈ కలికాలంలో పిలిస్తే పలికే దైవం శ్రీసాయిబాబా

మదిలోని కోరికను తీర్చిన బాబా

సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు శిరీష. నేను 2019లో శిరిడీ వెళ్ళినప్పుడు నాతోపాటు విగ్రహం రూపంలో బాబా మా ఇంటికి వచ్చారని ఇదివరకు మీ అందరితో పంచుకున్నాను. నేను ఆ బాబా విగ్రహానికి రోజూ దణ్ణం పెట్టుకొని, దీపం వెలిగిస్తూ ఉంటాను. కొన్ని రోజులకి ఆ బాబాకి ఒక వెండి కిరీటం చేయించాలని నాకు అనిపించింది. ఆ విషయమే ఆలోచిస్తూ ఉండగా ఒకరోజు మా పక్క వీధిలోని ఒక చిన్న వెండి షాపులో ఒక అబ్బాయి చిన్న వెండి గొడుగును, కొన్ని దేవుడికి ఉపయోగించే చిన్న వెండి వస్తువులను శుభ్రం చేస్తుండటం చూసాను. నేను ఆ అబ్బాయిని, "ఇవి నువ్వే చేసావా?" అని అడిగాను. అందుకు తను, "నేనే చేసాన"ని అన్నాడు. అప్పుడు నేను, "మా ఇంట్లో బాబా విగ్రహం ఉంది. దానికి కిరీటం చేస్తావా?" అని అడిగితే, "చేస్తాను" అన్నాడు. కానీ తరువాత నేను రెండు, మూడుసార్లు అడిగినా తను మా ఇంటికొచ్చి కొలతలు తీసుకోలేదు. ఇంకా నేనూ ఊరుకున్నాను. కొన్నిరోజులకి నాకు 'బాబాకు బంగారు కిరీటం చేస్తే బాగుంటుంది' అనిపించింది. కానీ మాకు దగ్గర్లో ఉన్న బంగారం షాపువాళ్ళు చేయలేరేమోననిపించి ఊరుకున్నాను. మనసులో మాత్రం ఆ కోరిక అలానే దృఢంగా ఉండి గుర్తు వచ్చినప్పుడల్లా, "బాబా! నీకోసం కిరీటం నువ్వే చేయించుకో. ఎవరితో చేయించాలో నాకు తెలియడం లేదు" అని చాలాసార్లు చెప్పుకున్నాను. మొన్న ఉగాది ముందురోజు బీరువాలోని బంగారం తీస్తుంటే, మా పాప చిన్నప్పుడు తనకోసం మా ఆడపడుచు చేయించిన గాజులు కనిపించాయి. వాటిని మా పాప ఒక్కసారే వేసుకుంది. ఆ గాజుల సైజు చూస్తే, 'అది బాబా తలకు సరిపోతుందో, లేదో చూద్దామ'ని నాకు అనిపించింది. నా ఆలోచన 'సైజ్ సరిపోతే ఏదైనా పెద్ద షాపుకి వెళ్ళినప్పుడు ఆ సైజులో  కిరీటం చేయించాల'ని మాత్రమే. కానీ ఆ గాజు బాబా తల మీద పెడితే చాలా అందంగా వుంది. అప్పుడు నాకు 'ఈ గాజునే కిరీటంలా పెడితే బాగుంటుంది' అనిపించింది. తర్వాత నాకు నా దగ్గరున్న చిన్న పెండెంట్‌ని ఆ గాజుకి తగిలించాలనిపించింది. వెంటనే ఒక దారంతో ఆ పెండెంట్‌ను గాజుకి కట్టాను. దాన్ని బాబాకు పెడితే ఇంకా బాగుంది. అప్పుడు బాబా నా కోరికని ఇలా తీర్చారని సంతోషించి ఉగాది రోజు నుండి దాన్ని రోజు బాబాకి పెడుతున్నాను. ఈ సంతోషాన్ని, బాబా ప్రేమను మీ అందరితో పంచుకోవాలనిపించి ఇలా మీతో పంచుకున్నాను. కింద ఫోటో జతపరుస్తున్నాను, చూడండి.


ఈ కలికాలంలో పిలిస్తే పలికే దైవం శ్రీసాయిబాబా

సాయి బంధువులకు నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మాది పల్నాడు జిల్లా. నేనిప్పుడు బాబా ప్రసాదించిన అనుభవాలను మీతో పంచుకుంటున్నాను. ఒకసారి మా అన్నయ్య బావమరిది తన బంగారు నాన్ తాడు ఒకటి దాచి పెట్టమని మా అన్నయ్యకు ఇచ్చాడు. మా అన్నయ్య దాన్ని ఒక పర్సులో పెట్టి బీరువాలో పెట్టాడు. అదే సమయంలో వాళ్ళు తిరుపతి వెళ్తుండటంతో పిల్లలు దొంగల భయముందని ఆ పర్సుని పుస్తకాల మధ్యలో ఉంచి తిరుపతి వెళ్లారు. తిరుపతి నుంచి తిరిగి వచ్చాక వాళ్ళు ఆ పర్సు గురించి పూర్తిగా మర్చిపోయారు. సుమారు ఆరునెలల తర్వాత మా అన్నయ్య బావమరిది ఆ బంగారు తాడు గురించి అడిగితే అప్పుడు అన్నయ్యకు గుర్తు వచ్చి, దాని గురించి ఎంత వెతికినా దొరకలేదు. మా అన్నయ్య వాళ్లింటికి వచ్చే రెండు ఇరుగుపొరుగు కుటుంబాలవాళ్ళను అనుమానించి వాళ్లని అడిగితే, "మాకు తెలియద"ని అన్నారు వాళ్ళు. అన్నయ్య విషయం నాతో చెప్పినప్పుడు నేను, "ఈ కలికాలంలో పిలిస్తే పలికే దైవం శ్రీసాయిబాబా. సద్గురు దైవం. వారికి మొక్కుకొని బంగారం దొరికేవరకు నీకు బాగా ఇష్టమైన ఆహారాన్ని విడిచి, తరువాత శిరిడీ వెళ్లి మ్రొక్కు తీర్చుకోమ"ని చెప్పాను. మా అన్నయ్య నేను చెప్పినట్లే సాయిబాబాకి మ్రొక్కుకుంటే సరిగ్గా 15 రోజులకి ఒక రాత్రిపూట ఆ బంగారాన్ని తీసినవాళ్ళు తమంతటతామే ఆ బంగారం మా అన్నయ్య వాళ్ళింట్లో విసిరేశారు. ఇట్లా పిలిస్తే పలికే దైవం శ్రీ శిరిడీ సాయిబాబా లీలలు ఎన్ని చెప్పగలము?

నా వయసు 35 సంవత్సరాలు. సుమారు రెండు నెలల క్రితం నాకు ఒక పది రోజులు వరకు నిద్రపట్టేది కాదు. నిద్రమాత్రలు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేను చాలా భయపడిపోయాను. సాయిబాబా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సైటులో చూస్తే, 'సాయి సచ్చరిత్ర మూడువారాలు పారాయణ చేస్తే, తగ్గుతుంద'ని వచ్చింది. నేను అలాగే పారాయణ చేస్తే మూడు వారాలకి నా నిద్రలేని సమస్య తగ్గిపోయింది. "థాంక్యూ బాబా. నన్ను మీ శ్రద్ధ, సబూరీ మార్గంలో నడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాను తండ్రి".

3 comments:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete
  2. Om Sairam
    Sai always be with me

    ReplyDelete
  3. ఓం సాయిరామ్

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo