సాయి వచనం:-

- శ్రీబాబూజీ.

సాయిభక్తుల అనుభవమాలిక 1502వ భాగం....


ఈ భాగంలో అనుభవాలు:

1. మన కృషి మనం చేస్తే తగిన ఫలితాన్ని బాబా ఇస్తారు
2. ఆర్థిక ఇబ్బందుల్లో బాబా చేసిన సహాయం

మన కృషి మనం చేస్తే తగిన ఫలితాన్ని బాబా ఇస్తారు

నా పేరు శ్రీనివాసరావు. ముందుగా సాయినాథునికి నమస్కరిస్తూ ఆయన నా కుమారునికి మెడికల్ పీజీ ఎంట్రన్స్ పరీక్షలో మంచి ర్యాంకు వచ్చేలా అనుగ్రహించిన అనుభవాన్ని మీతో పంచుకుంటున్నాను. మా చిన్నకుమారుడు గత ఏడాది మార్చిలో NRI మెడికల్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేశాడు. అదే సంవత్సరం తను నీట్ పీజీ పరీక్షలు వ్రాశాడు. కానీ ఆ సమయంలో హౌస్ సర్జన్ వర్క్ ఎక్కువగా ఉండటం వలన తను సరిగా ప్రిపర్ కాలేకపోయాడు. అందువల్ల ర్యాంకు ఎక్కువ వచ్చింది. ఆ ర్యాంకుకు రాష్ట్రంలోని ఏదో ఒక కాలేజీలో ENT కోర్సు వస్తుందిగానీ నా కుమారునికి ఇష్టమైన కోర్సు రాదు. కాబట్టి మా కుమారుడు, "నేను నాకు ఇష్టం లేని కోర్సులో చేరను. మరల ప్రిపేరై వచ్చే సంవత్సరం మళ్ళీ పరీక్ష వ్రాస్తాను" అని మాతో చెప్పాడు. మేము తనకొక సంవత్సరం వృధా కాకుండా ఉండాలని, విదేశాలలో పీజీ చేయడానికి మాట్లాడి, దానికి అవసరమైన డబ్బు సమకూర్చుదామని అనుకున్నాము. కానీ మా కుమారుడు, "డబ్బు పెట్టి చదవడం నాకు ఇష్టం లేదు. నేను మరల ప్రిపేరై గవర్నమెంట్ కాలేజీలలో నాకు ఇష్టమైన సీటు వచ్చేటట్లు ర్యాంకు తెచ్చుకుంటాను" అని ప్రిపేర్ అవసాగాడు. మేము మా తండ్రి సాయినాథుని, "నా కుమారునికి సహాయం చేయండి" అని ప్రార్థించి ఆయనపై భారమేసి, మా కుమారునితో, "నువ్వు నీకు నచ్చినట్లు మంచిగా ప్రిపేర్ అవ్వు" అని ప్రోత్సహించాము. ప్రతిరోజూ నా భార్య పద్మావతి, "మా కుమారునికి సహాయం చేయండి" అని బాబాను వేడుకుంటూ ఉండేది. 2023, మార్చి 5వ తేదీన నీట్ పీజీ పరీక్ష అనగా నా భార్య ముందు గురువారం బాబా గుడిలోనూ, పరీక్ష జరిగేరోజున శివాలయంలోనూ బాబు హాల్‌టికెట్ పెట్టి పూజ చేయించింది. ఆ సమయంలో అభిషేకం చేసేటప్పుడు హాల్‌టికెట్‌పై నీళ్లు పడి మరకలు అవడంతో పరీక్ష హాల్లో అభ్యంతరపెడతారేమోనని "వేరే హాల్‌టికెట్ తీసుకొని వెళ్ళమ"ని మా కుమారునితో మేము చెప్పాము. అయితే, అంతకుముందెప్పుడూ భగవంతుని నమ్మని మా కుమారుడు విచిత్రంగా భగవంతునిపై నమ్ముకముంచి అభిషేకం వల్ల తడిసిన ఆ హాల్‌టికెట్‌నే తీసుకొని పరీక్షకు హాజరై 550 మార్కులు తెచ్చుకోవాలని లక్ష్యం పెట్టుకొన్నాడు. కానీ పరీక్ష వ్రాసి బయటకు వచ్చాక, తెలిసీ 5 ప్రశ్నలకు సమాధానం తప్పు పెట్టానని, అందువలన 20 మార్కులు నష్టపోతానని నా భార్య వద్ద బాధపడ్డాడు. అందుకు నా భార్య మా కుమారుడితో, "శ్రీసాయిసచ్చరిత్ర గ్రంథంలో బాబా చెప్పినట్లు నీ కష్టం నువ్వు చేశావు. ఫలితం బాబానే ఇస్తారు" అని చెప్పింది. తరువాత మేము, "బాబా! మా కుమారునికి  మంచి మార్కులు, ర్యాంకు వచ్చేలా దీవించు" అని బాబాను ప్రార్థించాము. బాబా మా ప్రార్థనలు విన్నారు. మార్చి నెల 14వ తేదీన వచ్చిన నీట్ పీజీ ఫలితాల్లో మా కుమారునికి 540 మార్కులు వచ్చి అల్ ఇండియా స్థాయిలో 10,039 ర్యాంకు వచ్చింది. అంతా  భగవంతుని దయ అని మా కుమారుడు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాడు. "ధన్యవాదాలు బాబా. ఈరోజు మా జీవితాలు ఇలా ఉన్నాయంటే నీవు పెట్టిన భిక్ష బాబా. మీ ఋణం ఎలా తీర్చుకోగలం తండ్రీ? మా కుమారునికి మంచి కాలేజీలో తనకి ఇష్టమైన కోర్సులో సీటు వచ్చేలా దీవించు తండ్రీ. అలాగే జర్మనీలో ఉన్న పెదబాబుకి కూడా ఎటువంటి ఇబ్బందులు లేక మంచిగా చదువుకునేటట్లు చూడు తండ్రీ. పిల్లలిద్దరూ మంచి నడవడి, సద్బుద్ధి కలిగివుండి పదిమందికి సహాయపడేలా చూడు తండ్రీ. తెలిసీతెలియక ఏమైనా తప్పులు చేస్తే మన్నించి మమ్మల్ని, బంధుమిత్రులందరినీ చల్లగా చూడు తండ్రీ".

ఆర్థిక ఇబ్బందుల్లో బాబా చేసిన సహాయం

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
సద్గురు శ్రీసాయినాథుని శరత్‌బాబూజీ కీ జై!!!

నా పేరు రాంబాబు. మాది విజయనగరం. బాబా నాకు ప్రసాదించిన మరొక అనుభవాన్ని ఈ బ్లాగ్ ద్వారా మీతో పంచుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మా ఇంట్లో కొంచెం ఆర్థిక ఇబ్బందులున్నాయి. అంటే, టీవీ, కరెంట్ స్టవ్, ఆడియో సిస్టమ్, గీజర్ లాంటివి రిపేర్ చేయించాల్సి ఉన్నాయి. ఇలాంటి సమయంలో 2023, ఏప్రిల్ 2న హఠాత్తుగా మా ఫ్రిడ్జ్ కూడా పనిచేయలేదు. నాకు ఒక్కసారిగా చాలా కంగారుగా అనిపించి, "బాబా! ఈ ఫ్రిడ్జ్ పనిచేసేలా చూడండి. అది పనిచేస్తే మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని బాబాను వేడుకొని కొంచెం ఊదీని ఫ్రిడ్జ్‌కి పెట్టాను. వెంటనే పవర్ పోయింది. తిరిగి పవర్ వచ్చాక చూస్తే, ఫ్రిడ్జ్ మామూలుగానే పనిచేస్తుంది. మేము ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాం. నేనున్న పరిస్థితిలో ఇది చాలా పెద్ద సహాయం మరియు అద్భుతం. బాబా అనుగ్రహాన్ని చూస్తుంటే ఆయన మమ్మల్ని గమనిస్తూ మాతోనే వున్నారనిపిస్తూ వుంటుంది. సాయినాథుని కృపకు సదా నేను కృతజ్ఞుడిని.

శ్రీసాయినాథాయ నమః!!!
సర్వేజనాః సుఖినోభవంతు!!!

1 comment:

  1. Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha
    Om sri sainathaya namaha

    ReplyDelete

సాయి మహారాజ్ సన్నిధి సోషల్ మీడియా లింక్స్:

Subscribe Here

బ్లాగ్ అప్డేట్ నోటిఫికేషన్స్ నేరుగా మీ మెయిల్ కే వచ్చేందుకు క్రింద బాక్సులో మీ మెయిల్ ఐడి టైపు చేసి subscribe పై క్లిక్ చేసి, తరువాత స్టెప్స్ పూర్తీ చేయండి.

Delivered by FeedBurner

Followers

Recent Posts


Blog Logo