1. సాయికి చెప్పుకుంటే తీరనిదేదీ ఉండదు2. బాబా ఇచ్చే ప్రతి అనుభవంలోనూ ఏదో ఒక శిక్షణ అంతర్లీనంగా ఉంటుంది
సాయికి చెప్పుకుంటే తీరనిదేదీ ఉండదు
ఓం శ్రీసాయినాథాయ నమః!!! ముందుగా, తల్లి, తండ్రి, సద్గురువు, దైవమైన శ్రీసాయినాథునికి సాష్టాంగ ప్రణామాలు. సాయి కుటుంబసభ్యులందరికీ నమస్కారం. నేను సాయిభక్తురాలిని. మా చిన్నబాబు బిబిఎ, ఎంబీఏ(మార్కెటింగ్) చదివాడు. కానీ తనకి ఫీల్డ్ వర్క్ చేయడం ఇష్టం లేక డెస్క్ జాబ్ చేయాలని అనుకునేవాడు. అందువల్ల సాఫ్ట్‌వేర్ సైడ్ వెళ్లాలని 'సేల్స్ ఫోర్స్' అనే కోర్స్ నేర్చుకున్నాడు. అయితే, ఆ కోర్స్ పూర్తయ్యాక తనకి సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలేమీ దొరకలేదు. చదివింది ఒకటి, వెళ్తున్న దారి ఒకటి అవడం వల్ల మాకు భయమేసింది. నేను బాబా దగ్గర, "బాబా! బాబుకి ఏది మంచో అది చేయండి" అని అడుగుతుండేదాన్ని. బాబా దయవల్ల తనకి ఎంబీఏ మార్కెటింగ్‍కి సంబంధించి బజాజ్ ఫైనాన్సులో SMగా ఉద్యోగం వచ్చింది. మొదట్లో ఆ ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోయినా ఇప్పుడు బాగానే చేసుకుంటున్నాడు. మొదటి నెల జీతం కూడా అందుకున్నాడు.
నేను నా గత అనుభవంలో నా తమ్ముడు, తన భార్య గొడవలు పడుతున్నారని చెప్పాను. ఆ విషయంలో నేను వాళ్ళిద్దరూ బాగుండాలని 11 వారాలు దివ్యపూజ చేశాను. బాబా దయవల్ల తొమ్మిది వారాలయ్యేసరికి వాళ్ళిద్దరూ బాగున్నారు.
అలాగే, నేను నా గత అనుభవంలో ఒకసారి నా గుండెల్లో నొప్పి వస్తే హాస్పిటల్‍కి వెళ్లామని, డాక్టరు, "గుండెకు గాలి సరఫరా అయ్యే పైపు వంగిందని, మందులు వాడితే తగ్గుతుంది" అన్నారని చెప్పాను. ఆ మందులు వాడాక మళ్ళీ హాస్పిటల్‍కి వెళ్లేముందు నేను, "బాబా! రిపోర్టులు నార్మల్‍గా ఉండేటట్లు చేయండి" అని బాబాను వేడుకున్నాను. బాబా దయవల్ల రిపోర్టులు నార్మల్‍గా వచ్చాయి. డాక్టరు మందులు వాడితే సరిపోతుందన్నారు. తర్వాత నా మెడ దగ్గర వాపు వచ్చి, నొప్పి కూడా చాలా ఉండేది. అప్పుడు నేను, "బాబా! మళ్లీ కొత్తగా ఈ నొప్పి ఏంటి? దీనికోసంగా డబ్బులు ఖర్చుపెట్టలేమయ్యా. నీ ఊదీ రాసుకుంటాను తండ్రీ" అని బాబాకి చెప్పుకొని ఊదీని మెడకి రాసుకొని, మరికొంత ఊదీని నీళ్లలో కలుపుకుని తాగాను. నాలుగు రోజుల్లో వాపు ఉన్నప్పటికీ నొప్పి తగ్గిపోయింది. మన సాయికి చెప్పుకుంటే తీరనిది ఏదీ ఉండదు. "సాయి పరమాత్మా! ఇప్పుడు అంతా బాగానే ఉంది తండ్రీ. ఇలాగే మమ్మల్ని ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి బయటపడేయండి సాయీ. నా పిల్లలందరికీ సద్బుద్ధిని, సత్ప్రవర్తనను, ఉజ్వలమైన భవిష్యత్తును ఇవ్వండి సాయీ. తల్లిగా ఇంతకుమించి నాకు కోరికలు ఏమీ లేవు తండ్రీ. నా అనుభవాలు పంచుకోవడంలో ఆలస్యమైనందుకు నన్ను క్షమించు సాయితండ్రీ. మీరు మాకు ఎంతో చేశారు. ఒక్క నమస్కరించడం తప్ప ఏమిచ్చి మీ ఋణం తీర్చుకోగలం బాబా?"
సర్వం సాయినాథార్పణమస్తు!!!
బాబా ఇచ్చే ప్రతి అనుభవంలోనూ ఏదో ఒక శిక్షణ అంతర్లీనంగా ఉంటుంది
సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు అనురాధ. 2023, మార్చి 16న మా అబ్బాయి ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రం మా ఇంటి నుండి 15 కిలోమీటర్ల దూరంలో వచ్చింది. ఆ ప్రాంతానికి మెట్రో రైలు సౌకర్యం ఉన్న కారణంగా త్వరగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవచ్చనే ధీమాతో ముందురోజు మా ఇంటినుండి పరీక్షా కేంద్రానికి వెళ్లి ప్రయాణానికి ఎంత సమయం పడుతుందో తెలుసుకోవడంలో మేము నిర్లక్ష్యం చేశాము. (గత ఏడాది(2022) ఒకరోజు ముందే పరీక్షా కేంద్రానికి వెళ్లి రావడం వల్ల బాబుకి ఏ ఇబ్బందీ కలగలేదు.) గూగుల్ ఆధారంగా ఉదయం 7:20కి ఇంటి దగ్గర నుంచి మావారు బాబుని తీసుకుని బయలుదేరారు. తరువాత నా మనసులో 'ఒకవేళ ట్రాఫిక్ సమస్య వల్ల ఆలస్యమై వాళ్ళు పరీక్షా కేంద్రానికి సమయానికి చేరుకోలేకపోతే పరిస్థితి ఏమిటని' ఒకటే టెన్షన్‍గా అనిపించి, "బాబా! బాబు పరీక్షా కేంద్రానికి సమయానికి చేరేలా దీవించు తండ్రీ" అని బాబాను ప్రార్థిస్తూ 8 గంటలకి ఒకసారి, మరల 8:30కి ఒకసారి మావారికి కాల్ చేశాను. ఆయన నా ఫోన్ ఆన్సర్ చేయలేదు. దాంతో, "బాబా! మావారు ఫోన్ ఆన్సర్ చేయడం లేదు. నాకు భయంగా ఉంది. మాది స్వయంకృతాపరాధం కదా బాబా! ముందే పరీక్షా కేంద్రానికి వెళ్లి అన్నీ చూసుకోవాల్సిందని నా మనసుకి తెలుస్తోంది. ఏదేమైనా మీ దయతో బాబు సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి తండ్రీ. ఇప్పుడు మావారు పరీక్షా కేంద్రానికి చేరుకున్నామని నాకు ఫోన్ చేయాలి. అలా అయితే మీ అనుగ్రహాన్ని తప్పనిసరిగా బ్లాగ్ ద్వారా సాయిబంధువులందరితో పంచుకుంటాను" అని అనుకున్నాను. అలా మనసులో బాబాని ప్రార్థించిన రెండు నిమిషాలలోనే మావారు నాకు ఫోన్ చేసి, "ఇప్పుడే బాబు పరీక్షా కేంద్రం లోపలికి వెళ్ళాడు. సమయం తక్కువగా ఉండటం వల్ల ఆటో తీసుకొని రావాల్సి వచ్చింది. లేకపోతే బాగా ఆలస్యమయ్యేది" అని అన్నారు. నేను మనసులోనే బాబాకు కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఈ అనుభవం ద్వారా, 'మనం క్రమశిక్షణతో జీవనం సాగించాలనీ, లేకుంటే ఇబ్బందులు తప్పవనీ, ఏ విషయంలోనూ నిర్లక్ష్యం కూడదనీ' బాబా నాకు తెలియచేశారనిపించింది. అలాగే, బాబా ఇచ్చే ప్రతి అనుభవంలోనూ ఏదో ఒక శిక్షణ అంతర్లీనంగా ఉంటుందని కూడా అనిపించింది. "థాంక్యూ సో మచ్ బాబా. మీరు ప్రసాదించే ప్రతి అనుభవంలోని అంతరార్థాన్ని తెలుసుకొనే జ్ఞానాన్ని మాకు ప్రసాదిస్తారని మనస్పూర్తిగా నమ్ముతున్నాను తండ్రీ".
సర్వం సాయినాథార్పణమస్తు!!!
శ్రీ sachidananda samardha sadguru Sainadh Maharaj ki jai 🙏
ReplyDeleteOm sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me