ఈ భాగంలో అనుభవాలు:
1. పిలిస్తే పలికే దైవం సాయి2. మూడోసారి శిరిడీ దర్శనాన్ని అనుగ్రహించిన బాబా
పిలిస్తే పలికే దైవం సాయి
పిలిస్తే పలికే దైవమైన సాయితల్లికి శతకోటి వందనాలు. సాయిభక్తులందరికీ నా నమస్కారం. 'నేను సాయిభక్తురాలిన'ని చెప్పుకోవడానికి ఎంతో అదృష్టం ఉండాలి. నేను బాబాకు భక్తురాలిని అవడం, అనుకోకుండా మహాపారాయణ గ్రూపులో చేరడం కేవలం ఆయన దయ. సాయిభక్తులకు ఈ బ్లాగ్ ఆ సాయినాథుడిచ్చిన వరం. సాయిభక్తులందరూ శిరిడీ వెళ్లి ఎలా తమ మొక్కులు సమర్పించుకుంటారో అలా ఈ బ్లాగ్ ద్వారా అందరూ మొక్కులు తీర్చుకుంటుంటే ఈ 'సాయి మహరాజ్ సన్నిధి' బ్లాగ్ నాకు మరో శిరిడీ అనిపిస్తుంది. నేను ఉదయం లేస్తూనే సాయిభక్తుల అనుభవాలు చదివి నా దినచర్యను ప్రారంభిస్తాను. నేనిప్పుడు బాబా నాకు ప్రసాదించిన కొన్ని అనుభవాలను మీతో పంచుకుంటున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది.
2023, ఫిబ్రవరిలో నాకు కంటి సమస్య వచ్చింది. కంటి నుండి నీరు కారుతూ, కన్ను ఎర్రగా, నొప్పిగా ఉండేది. హాస్పిటల్లో చూపించుకున్నా కూడా తగ్గలేదు. చివరికి నొప్పి భరించలేక సాయితల్లికి చెప్పుకొని ఊదీ పెట్టుకుని, ఊదీ కలిపిన నీళ్లు తాగాను. నేను ప్రతి గురువారం సాయికి అభిషేకం చేసి సాయిసచ్చరిత్ర చదువుతాను. అదేవిధంగా గురువారం పూజ చేస్తున్నప్పుడు సాయినాథుని కంటినుండి నీరు రావడం నేను గమనించాను. ఆ అద్భుతాన్ని చూసి నా కళ్ళనుండి ఆనందభాష్పాలు వచ్చాయి. ఆరోజు నుండి నా కంటి బాధపోయింది. మన బాధలను సాయి తీసుకుంటారని సచ్చరిత్రలో ఉన్నట్లు నాకు జరగడం నా అదృష్టం. సాయినాథునికి శతకోటి పాదాభివందనాలు.
నాకు ఇద్దరు పిల్లలు. ప్రతిరోజూ రాత్రి వాళ్ళు ఊదీ పెట్టుకొని నిద్రపోతారు. ఒకవేళ ఎప్పుడైనా నేను మర్చిపోయినా అడిగి మరీ పెట్టుకుంటారు. ఒకరోజు అర్ధరాత్రి మా చిన్నబాబుకి తిన్న అన్నం జీర్ణంకాక వాంతులు, విరోచనాలు అయ్యాయి. ఎటూ కాని సమయం కావడం వలన హాస్పిటల్‍కి వెళ్లలేని పరిస్థితి. ఇంట్లో ఉన్న మందులు వేసి పడుకోపెట్టాను. అయితే బాబుకి మళ్ళీ వాంతి అయింది. నాకు భయమేసి బాబుకి ఊదీ పెట్టి సాయి ఫోటో ముందు నిల్చొని, "బాబా! బాబు ఆరోగ్యం కుదుటపడితే, మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని వేడుకున్నాను. ఆ సాయినాథుడు తమకి, తమ ఫోటోకి భేదం లేదని మరోసారి నిరూపించారు. ఆయన కృపవలన తెల్లారేవరకు బాబుకి ఎలాంటి ఇబ్బందీ కలగలేదు, హాయిగా నిద్రపోయాడు. హాస్పిటల్‍కి వెళ్లాల్సిన పని లేకుండా చేశారు నా సాయితల్లి. ఇలాగే నా పిల్లలిద్దరికీ సాయి ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటున్నాను.
ఒకసారి మా మేనత్త కొడుకు వివాహానికి వెళ్లాల్సి ఉండగా నాకు, మావారికి మధ్య ఒక చిన్న గొడవ జరిగింది. దాంతో మావారు ఆ పెళ్ళికి వెళ్ళొద్దన్నారు. మరోపక్క మా బంధువులందరూ ఫోన్ చేసి పెళ్ళికి రెండు రోజులు ముందే రావాలని కోరారు. నాకు ఏం చేయాలో తోచక బాబా ముందు నిలబడి, "సాయీ! నా భర్త మనసు మారి మేమందరమూ పెళ్లికి వెళ్లేలా చేయండి. మీ అనుగ్రహాన్ని బ్లాగులో పంచుకుంటాను" అని మ్రొక్కుకున్నాను. ఆశ్చర్యంగా మరుసటిరోజు మావారు నా దగ్గరకొచ్చి తనంతట తానే నాతో మాట్లాడటం, పెళ్లికి కావాల్సిన బట్టలన్నీ తీసుకోవడం నాకు కలలా ఉంది. నిజంగా అది బాబా చేసిన అద్భుతం. ఎందుకంటే, మావారికి కోపం వస్తే పది రోజులు ఉంటుంది. అస్సలు మాట్లాడరు. అలాంటిది సాయినాథుడే ఆయనని అలా మార్చారని నేను సంతోషంగా సాయినాథునికి ధన్యవాదాలు చెప్పుకున్నాను. అంతకన్నా మనం ఏమి ఇవ్వగలం? సాయిభక్తులందరూ చేయాల్సింది ఒకటే, శ్రద్ధ, సబూరితో ఉండటం. అలా ఉంటే అంతా బాబా చూసుకుంటారు. 'సాయీ' అంటే 'ఓయీ' అని పలికే దైవం సాయినాథుడు. ఆయన ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై!!!
మూడోసారి శిరిడీ దర్శనాన్ని అనుగ్రహించిన బాబా
సాయిబంధువులందరికీ నమస్కారం. నా పేరు స్రవంతి. నేను ఇప్పుడు నా మూడో శిరిడీ దర్శనం గురించి మీతో పంచుకుంటున్నాను. నేను, "బాబా! మీరే మమ్మల్ని శిరిడీకి రప్పించుకుంటున్నారు. శిరిడీలో మాకు మీ అద్భుతం చూపించండి" అని వేడుకొని నా ఫ్రెండ్‌తో కలిసి 2023, మార్చ్ 30న శిరిడీ చేరుకున్నాను. బాబా కోసం పేడా(పాలకోవా) కొందామని షాపుకి వెళితే, అక్కడ రోడ్డు మీద నాకు ఒక ఊదీ ప్యాకెట్ దొరికింది. నేను చాలా సంతోషించాను. తరువాత మేము పేడా తీసుకొని ద్వారకామాయికి వెళ్ళాము. అక్కడ చాలా జనం ఉన్నారు. నేను నా మనసులో, "బాబా! దయచేసి నాకు ఒక సెకనుపాటైనా మీ మశీదు మెట్లపైన కూర్చునేలా అనుగ్రహించండి" అని బాబాను అడిగాను. ఆయన అలాగే అనుగ్రహించి నన్ను సంతోషపరిచారు. ఇంకా మేము అక్కడుంటుండగానే మధ్యాహ్న ఆరతి మొదలైంది. నేను మరింత ఆనందంగా బాబా హారతి పూర్తయ్యేవరకు లోపలే ఉండి ఆరతి అనంతరం బయటకు వచ్చాను. అప్పుడు బాబా భిక్ష చేసిన ఇళ్ళు అన్నీ చూశాము. ఆరోజు శ్రీరామనవమి కాబట్టి జనం చాలా ఎక్కువగా ఉన్నారు. సాయంత్రం సమాధిమందిరంలో బాబా దర్శనం కోసం లైన్‌లోకి వెళితే, రాత్రి 11 గంటలకి మాకు దర్శనమైంది. అంతసేపు లైన్లో ఉండిపోయినందున పల్లకీసేవ చూడలేకపోయాము. కానీ అర్థరాత్రి ఒంటిగంటికి మేము సమాధిమందిర దర్శనానికి మళ్ళీ వెళ్ళాము. బాబా మమ్మల్ని ఎంతో గొప్పగా అనుగ్రహించారు. మేము కాకడ ఆరతి సమయానికి సమాధిమందిరంలో ఉన్నాము. మొదటిసారి కాకడ ఆరతి వినడం, అది కూడా శిరిడీలో బాబా ముందు కూర్చొని ఉండటం నాకు మహదానందంగా అనిపించింది. బాబా మమల్ని క్షేమంగా తీసుకెళ్లి, అంతలా అనుగ్రహించి లాభంగా ఇంటికి చేర్చారు. "థాంక్యూ సో మచ్ బాబా. లవ్ యు బాబా. జీవితాంతం మీ పాదసేవ చేసుకునే భాగ్యాన్ని నాకు కల్పించండి బాబా. మా చేయి వదలక మాకు తోడుగా ఉంటూ సహాయం చేయండి బాబా".
Om sri sainathaya namaha
ReplyDeleteOm sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om sri sainathaya namaha
Om Sairam
ReplyDeleteSai always be with me
ఓం సాయిరామ్
ReplyDeleteOm sairam
ReplyDelete